పని ‘మనీషి’ - చామర్తి భానులింగమూర్తి

pani maneeshi

అప్పటికే పిల్లలకి స్కూల్ కి , ఆయన కి ఆఫీస్ కి సమయం అవుతుండడం తో వాళ్లకి లంచ్ బాక్సులు సర్దుతూ , బ్రేక్ ఫాస్ట్ కి టిఫిన్ తయారు చేస్తూ వంటింటిలో క్షీరసాగర మధనం చేస్తున్నాను. ఇంతలో పని మనిషి 'రంగి ' వస్తూ

''అమ్మ గోరూ !.. తోవడానికి ఇంకా గిన్నెలుంటే ఒడేయ్యండమ్మా.. " అంటూ రాత్రి ఉండి పోయిన అంట్ల గిన్నెలు తీసుకొని పెరటి లోకి వెళ్ళి పోయింది.

పిల్లలు ,ఆయన టిఫిన్ తినేసి ఎవరికి వారు వెళ్ళిపోయిన తరువాత , తిన్న ప్లేట్స్ 'రంగి ' కి పడేసి దానికి గ్లాస్ తో టీ ఇచ్చి , వంటిల్లు సర్దడం లో మునిగిపోయాను .

రంగి ని మూడు నెలల క్రితమే పని లో పెట్టుకున్నాము . మనిషి నమ్మకస్తురాలని , కష్టపడి పనిచేస్తుందని ఎదురింటి అనురాధ గారు తమ ఇంట్లో పని చేస్తున్న 'రంగి ' గురించి చెప్పడం తో , నేను ఒక్కర్తినే ఇంట్లో పనులన్నీ చేసుకోలేక తనని పనిమనిషి గా పెట్టుకొన్నాను .
వంటిల్లు సర్దుకొని , టిఫిన్ తిని ,టీ .వీ . ముందు కూర్చోనేసరికి 'రంగి ' తోమిన గిన్నెలు వంటింటిలో పెట్టి చీరచెంగు కు చేతులు తుడుచుకొంటూ వస్తూ "అమ్మగోరూ !.. మీ పాప యేసుకొన్న బంగారు గొలుసు సానా బాగుందమ్మా .. అట్టాటిది సేయించడానికి ఎంత వుద్దమ్మా? ..మా పాప కు కూడా సేయీద్దా రనుకోంతన్నాను . " అంది.

అప్పుడప్పుడు ఏవైనా పండగలు , ఫంక్షన్స్ అప్పుడు 'సాహితీ ' కి మెడ లో బంగారు గొలుసు వేస్తూ వుంటాను. మామూలు రోజులలో వెయ్యం , స్కూల్ కి వేసుకొని వెళ్లకూడదని. అప్పుడు చూసి ఉంటుంది. ఒక్కసారి నాలో అహంకారం పురి విప్పింది .'ఏంటీ ? మేం కొన్నలాంటిదే తను కూడా కొంటుందా ? దానికంత స్థోమతుందా ? 'అనుకుంటూ

" అబ్బో ! .. చాలా ఖరీదులే ! సిటీ లో పెద్ద నగల దుకాణం లో కొన్నాం . దాని ధర చెప్తే నీ గుండాగి పోతుంది. " అన్నాను దర్పంగా . ఆ మాటకి " ఆ!.. అంత ఖరీదుంటాదా .. ఐతే మా లాంటోళ్ళవల్ల ఏతవుద్ది . ఏదో బాగుందని ముచ్చట పడి సెయిద్దారను కొన్నా , అంత ఖరీదైతే మావెక్కడ బరిత్తం" అంటూ అవీ .. ఇవీ.. మాట్లేడేసి వెళ్ళిపోయింది.

*** *** ***

ఒక రోజు 'సాహితి' ని స్కూల్ కి తయారుచేస్తూ , ముందు రోజు వేసిన గొలుసు తీసేద్దామని చూస్తే గొలుసు కనిపించలేదు. ఒక్కసారి గుండె ఆగినంత పనయ్యింది . ముందు రోజే ,ప్రక్కవాళ్ళ పాప పుట్టిన రోజు వేడుకలైతే , 'సాహితి 'కి మెడలో గొలుసు వేసి పంపించాను. మళ్ళీ రాత్రి తీసి దాయడం మర్చిపోయాను .

'ఎక్కడ పారేసేవే ? ' అని అడిగితె .. 'ఏమోనమ్మా ! నిన్నంతా ఉంది . ఇప్పుడు కనిపించట్లేదు. ఎక్కడైనా పడిపోయిందేమో ' అంది. ఒక్కసారి నా కోపం తారాస్థాయికి చేరుకొంది.

"ఎక్కడ పారేసేవే ? ఎంతో ముచ్చట పడి ,బోల్డంత డబ్బులు పెట్టి కొన్నాం .. '' అంటూ గట్టిగా రెండు దెబ్బలు వేసాను.ఏడుపు మొదలెట్టింది. ఈ హడావిడికి పేపర్ చదువుతున్న ఆయన ‘ఏమైందంటూ ?.. ' వచ్చారు . జరిగినదంతా చెప్తూ " చూడండి ఎంత పనిచేసిందో " అంటూ కోపం గా అన్నాను. "ఊరుకో లావణ్యా ! .. దానంతట అది ఎందుకు పారేస్తుంది ? చిన్నపిల్ల.. దాన్నెందుకు కొడతావు ? ఆడుకొంటున్నప్పుడు ఎక్కడో పడిపోయి ఉంటుంది.వెతుకుదాం " అంటూ సాహితి ని ఊరుకో పెడుతూ వెతకడం ప్రారంభించారు . నేను కూడా ఆయనతో పాటు వెతకడం మొదలెట్టాను . ఇంతలో ఎప్పటిలాగే 'రంగి ' పనిలోకి వస్తూ కంగారు పడుతున్న మమ్మల్ని చూసి "ఏటైనాదండీ ?.. అట్టా ఎతుకుతున్నారు ? " అని అడిగింది. జరిగింది చెప్పాను. 'అయ్యో ! ఎంత పనైపోనాది . శానా ఖరీదని కూడా సెప్పారు .. జాగరత్తగా ఎతకండంటూ ' తను కూడా మాతో పాటే వెతకడం మొదలెట్టింది. అన్నిచోట్లా ఎంత వెదికినా ఎక్కడా దొరకలేదు. అప్పటికే ఆయనకు ఆఫీస్ కి సమయమైపోవడంతో .. వెతకడం ఆపివేసాము. అది ఇంక దొరకదని , ఎక్కడో పోయిందని అనుకొన్నాము.

'రంగి ' కూడా వెతకడం ఆపి పనులన్నీ చేసి వెళ్లిపోయింది. నాకు మనసంతా బాధ తో నిండి పోయింది. అన్యమనస్కంగా నే అన్ని పనులు చేసి టీ . వీ . ముందర కూర్చున్నాను. కానీ మనసంతా ఆ గొలుసు మీదే వుంది. టీ .వీ లో దృశ్యాలు పరిగెడుతున్నట్టే , ఆలోచనలు పరి విధాలుగా పరిగెడుతున్నాయి .

ఒక్కసారి గా అనుమానం 'రంగి ' మీదకు వెళ్ళింది. 'తను కానీ తీసేయలేదు కదా ?.. వెతికినప్పుడు దొరికి ఉంటుంది.ఏమి తెలియని నంగనాచిలా దాచేసి వుంటుంది. మొన్ననే అలాంటి గొలుసు తన కూతురి కి కొనాలన్నాది.' అని అనుకొన్నాను.

నా అనుమానం మరింత పెరిగింది. ఒకసారి అనుమాన బీజమంటూ పుడితే .. అది పెద్ద వృక్షమై పోతుంది.

'ఎంత నంగనాచి మాటలు చెప్పింది . అక్కడ వెతకండి.. ఇక్కడ వెతకండంటూ .. మాతో పాటే వెతికింది. ఎక్కడో దొరికే ఉంటుంది .. ఏమి ఎరగనట్టు నాటకం ఆడి వెళ్లిపోయింది ' అనుకొంటూ .. ఇక ఉండపట్టక ఆయనికి ఫోన్ చేసి నా అనుమానాన్ని చెప్పాను.

ఆయన 'ఛ !.. అది తీసుండదేమో .దానిని చూస్తే అలాంటిదనిపించదు ' అన్నారు. నేను '' మీకేమి తెలీదు. అందరూ మంచి వారనుకొంటారు మీరు. ఈ 'అలగా ' వాళ్ళని నమ్మలేం . వాళ్ళ బుద్దులే అంత '' అన్నాను. ''సర్లే ! సాయంత్రం నేను వచ్చిన తరువాత మాట్లాడదాం " అంటూ ఫోన్ పెట్టేసారు.

మరునాడు రంగి పని లోకి వచ్చిన తర్వాత , ఆయనని అడగమని పోరు పెట్టడం తో ఆయన రంగి ని 'నువ్వేమైనా తీసావా ' అని అడిగారు. దాంతో అది ' మేము కూటి కి పేదోళ్ళమే కానీ .. గుణానికి కాదని , కొనాలనుకొంటే ఏదో అప్పో సప్పో చేసి, కాయ కష్టం చేసి కొంటాము కానీ .. ఇలా దొంగతనం చేయనవసరం లేదని ' అనడం తో .. నాకు కోపం వచ్చి దొంగని దొంగ అని అనక ఇంకేం అనాలి అంటూ, నానా తిట్లు తిట్టి రేపటి నుండి పని లోకి రావద్దని చెప్పడం తో , కోపం తో ఏడుస్తూ బాధ పడుతూ వెళ్లిపోయింది.

పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్న నా ఆవేశాన్నిఆయన 'పోన్లెద్దూ .మనకి నిజం తెలియనప్పుడు ... అంత దాకా ఎందుకు ' అంటూ నొక్కేశారు. నేను ముచ్చటపడి కొన్న ఆ గొలుసు మీద పూర్తిగా ఆశలు వదిలేసుకొన్నాను.

*** *** ***

రంగి ని పని లో నుండి తీసేసిన మూడు రోజులకు, మరునాడు శ్రావణ శుక్రవారం అవ్వడం తో . ఇల్లంతా శుభ్రం చేస్తూ .. చెత్త పెరటిలో పారవేసి వస్తుంటే .. జామ చెట్టుకింద ఎండిన ఆకుల్లోంచి ఏదో మెరుస్తూ కనిపించింది. గబ గబా .. దగ్గరికి వెళ్లి ఆకులు తీసి చూస్తే .. పోయిందనుకొన్న బంగారు గొలుసు. ఒక్కసారి ఆశ్చర్యం తో కూడిన ఆనందం. పోయిందనుకొన్న గొలుసు తిరిగి కనిపించేసరికి పట్టరాని ఆనందం కలిగింది. ఆప్యాయంగా చేతి లోకి తీసుకొని చూసాను. గొలుసుని జాయింట్ చేస్తూ కలిపిన లింక్ తెగిపోయి ఉంది . అందుకే మెడ లోంచి ఊడిపోయి ఉంటుందనుకొన్నాను .

సాహితి రోజూ పిల్లలతో ఈ చెట్టుకిందే ఆడుకుంటూ ఉంటుంది. ఆ రోజు కూడా ఇక్కడే ఆడింది. అప్పుడే పడిపోయి ఉంటుంది . ఆకులు , చెత్తలో కలిసిపోయి వెతికినప్పుడు సరిగా కనపడలేదు. అనుకొన్నాను . ఒక్కసారి రంగి గుర్తుకు వచ్చింది . 'ఆరోజు ఎంతేసి మాటలన్నాను . దొంగ ను చేసి మాట్లాడాను . ఛ !వెంటనే ఆయనికి ఫోన్ చేసి చెప్పాలి , ఇద్దరమూ రంగి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలి ' అనుకొన్నాను.
అప్పటికే సాయంత్రం స్కూల్ వదిలే సమయం అయ్యింది .అయినా ఇంకా సాహితి రాలేదు. ఇంటికి స్కూల్ దగ్గరే అవ్వడం వల్ల తనే నడిచి వెళ్లి వస్తూ వుంటుంది . ఆందోళనతో ఎదురుచూస్తున్నాను .ఇంతలో తన స్నేహితురాలు పక్కింటి మానస ఏడుస్తూ వచ్చి " ఆంటీ ! సాహితి ని బైకు గుద్దేసింది . దెబ్బలు అవీ తగిలాయి . అప్పుడు అక్కడే ఉన్న రంగి చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లింది . మిమ్మల్ని త్వరగా హాస్పిటల్ కి రమ్మనమని మీతో చెప్పమని నన్ను పంపింది '' అంటూ చెప్పింది. నాకు ఒక్కసారి షాక్ తగిలినట్టు అయిపొయింది. 'దెబ్బలవి బాగా తగిలాయా ? పరవాలేదుకదా ? ' అని మానస ని అడుగుతూ , ఆయనకి ఫోన్ చేసి విషయమంతా చెప్పాను . ఆయన 'గాభరా పడకు .. ఏమీ కాదులే . నేను తిన్నంగా హాస్పిటల్ కి వస్తాను . నువ్వు అక్కడికి వెంటనే వెళ్ళు ' అంటూ అన్నారు.

నేను ఏడుస్తూ .. సాహితి కి ఏమీ అవ్వకూడదని దేవునికి వేయి దండాలు పెట్టుకొంటూ వెంటనే హాస్పిటల్ వెళ్ళాను. అప్పటికే ఆయన వచ్చేసినట్టున్నారు. డాక్టర్ తో మాట్లాడుతూ కనిపించారు. బెడ్ పై సాహితి తలకి , చేతులకి కట్టులతో నీరసంగా పడుకొని ఉంది. డాక్టర్ తో మాట్లాడి వస్తున్నఆయనను ఏడుస్తూ అడిగాను " ఏమైందండీ ? .. దెబ్బలు బాగా తగిలాయా ?.. ప్రమాదమేమీ లేదు కదా '' అంటూ ...
"ఏమీ పరవాలేదు . కుడి చేతికి , తలకి దెబ్బలు తగిలాయి. అదృష్టం బాగుండి ఫ్రాక్చర్స్ అవ్వలేదు. డాక్టర్ మరేం పరవాలేదన్నారు. కొంత బెడ్ రెస్ట్ తీసుకొంటే తగ్గిపోతాయన్నారు '' అని ఏడుస్తున్న నన్ను ఓదార్చారు. .

అప్పుడే చేతిలో టాబ్లెట్స్ తోనూ, సంచిలో పళ్లు పట్టుకొని 'రంగి ' డాక్టర్ తో పాటూ వస్తూ కనిపించింది. ఈ కంగారులో దొరికిన గొలుసు సంగతే మర్చిపోయాను . రంగి ని ఎన్నెన్ని మాటలన్నాను. డాక్టర్ గారు మాదగ్గరకు వచ్చి

“ మీ పనిమనిషే కానీ సమయానికి అక్కడ లేకపోతే , మీ పాప కి బాగా రక్తం పోయేది . ఆక్సిడెంట్ అవ్వగానే చూసి వెంటనే ఇక్కడి కి తీసుకువచ్చింది. మీకు వెంటనే కబురుపంపి , తన కన్నకూతురి కి ప్రమాదం జరిగినంత బాధపడుతూ మమ్మల్ని హడావుడి పెట్టింది. అవసరమైన మందులు అవీ తానే తెచ్చింది. తను లక్కీ గా అటు వైపు వెళ్తూ ఆక్సిడెంట్ చూసింది కాబట్టి సరిపోయింది. మీకు తెలుసుగా ఈ రోజుల్లో ఆక్సిడెంట్ జరిగితే అందరూ చూస్తారే తప్పా .. ఎవరూ పట్టించుకోరు. రంగి ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి పారి పోబోతుంటే పట్టుకొని పోలీస్ లకి కూడా అప్పగించింది.'' అని చెప్పారు .

డాక్టర్ గారి మాటలతో నా మనసంతా ఒక్కసారి పశ్చాత్తాపం తో నిండి పోయింది. పని లో నుండి తీసేసినా మా ఇంటి పనిమనిషినని చెప్పి దగ్గరుండి అన్నీ చూసుకుంది. 'దొంగ 'ని ముద్ర వేసిన ఆ 'అలగా' దే నా కూతుర్ని రక్షించింది. ఒకవేళ తానే కానీ మేము అన్న మాటలను మనసు లో పెట్టుకొని ఆక్సిడెంట్ చూసికూడా పట్టించుకోకుండా వెళిపోతే .. ఊహించడానికే భయం వేసింది. తను అన్నట్లు ' కూటికి పేదవాళ్లే .. కానీ గుణానికి కాదని 'అనుకొన్న నాకు కళ్లన్నీ కన్నీటితో కృతజ్ఞతా భావం తో నిండి పోయాయి.

తనకి క్షమాపణ చెప్పి మళ్ళీ పనిలోకి రమ్మనమని చెప్పాలి అనుకుంటూ .. తడి కళ్ళతో 'రంగి ' ని చూస్తే .. రంగి పనిమనిషి లా కాక పని’మనీషి ' లా కనిపించింది.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల