ముక్కు పుడక - డా: పేరం ఇందిరా దేవి

Mukkupudaka Telugu Story

సంయుక్త బాధతో మెలికలు తిరిగింది... కడుపులోంచి వస్తున్న కేకని తన చేత్తో నోటిపై పెట్టి ఆపేసింది. దగ్గర్లోవున్న బాటిల్ను అందుకుంది. అందులో నీళ్ళు లేవు... రాత్రే తాగేసింది. ఆమె శారీరక బాధను అధిగమిస్తూ మనసు బాధతో మూల్గింది. కష్టసమయంలో తనకెవరూ లేరన్న వేదన ఆమెను కన్నీళ్ళ పర్యంతం చేసింది. ఇంకెన్నాళ్ళు భరించాలి? ఇంకా ఎంతుంది జీవితం? ఎప్పుడు ముగుస్తుంది ఈ పోరాటం? ఈ ఒంటరితనం, ఈ నిస్సహాయత... ఈ ఆర్తి...! కళ్ళ కొనలనుండి కన్నీరు ధారాపాతంగా జారిపోయాయి.

ఆది నుండి ఎన్నోవేల, లక్షల, కోట్ల స్త్రీల ఆత్మ ఘోషలు ఆమెకు వినపడసాగాయి. ప్రేమ, ఆదరణ, ఆనందం, తృప్తి, గౌరవం కోసం స్త్రీలు సాగించిన మౌన పోరాటంలో విజేతలు లేరా? ఆమె ఆత్మ కూడా ఆమె శరీరం నుండి విడివడి విముక్తి పొందాలని కోరుతోంది బంధనాల నుండి, బంధాల నుండి; కనపడని సంకెళ్ళ లో బందీగా, స్వేచ్చ వున్నా తీసుకోలేని, రెక్కలున్నా ఎగరలేని, చదువున్నా చైతన్యం లేని, అందం వున్నా ఆనందించలేని, ఆమె, అనంత సముద్రం ముందు ఎండిన గొంతుకతో కొట్టు మిట్టాడుతోంది. ఆమెకు తెలుసు సముద్రం నీళ్ళు దాహం తీర్చవని అవి త్రాగితే మరింత దాహం ఆవరిస్తుందని, ఆమెకు కావాల్సింది చల్లని నీరిచ్చే చెలిమ. అదెక్కడుంది?.

ప్రశాంతమైన ఆ రాత్రి అల్లకల్లోలంగా వున్న ఆత్మల విన్యాసం ఆమెకు తోచ సాగింది. ఓల్గా నుండి గంగ వరకు ప్రయాణించిన ఆదిమజాతి స్త్రీ, కసిగా శత్రు వర్గపు పసిబిడ్డను రాతి కేసి బాది చంపినప్పుడు ఆమెలో కల్గిన వేదన నుండి ఈనాటి ఆసిడ్ పడ్డ ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు భయపడే అమ్మాయి వరకు, ఆక్రందనలు, అశ్రు సంగీతాలు, మౌన రోదనలు అదిమి పట్టిన కన్నీళ్లు. ఎందుకు శపించరు నీచులైన మానవజాతినంతా ఈ అభాగ్యులు? ఎందుకు ఉపయోగించరు స్త్రీలు తమ తపశ్శక్తిని మృగాన్ని మరిపించే మగజాతిని నిర్వీర్యం చేయడానికి? ఎందుకు ముంచరు తమ కన్నీటి వరద లో మోసంనేర్చిన మగ అహంకారులను? ఎందుకు భస్మం చేయరు తమ కోపాగ్నిలో? ఎందుకు ద్రోహం చేసే ఈ జాతికి ప్రేమనే పంచుతారు, విధేయులై తలలు వంచుతారు? తమ మాతృత్వాన్ని, సౌభాత్రుత్వాన్ని, ఆడతనాన్ని ఎగతాళి చేసే మగవారి పట్ల ఎందుకు కనికరం చూపుతారు? ఆమె ప్రశ్నించుకుంది. ఆమెకు తెలియదు తనేమి చేసిందో! స్త్రీ అస్తిత్వమే ప్రేమ పంచడం! సహజమైన ఆ గుణం నుండి ఆమె తనను తాను వేరు చేసుకోలేదు. అదే శక్తి ఆమె కుంటే, ఎందుకు ఎన్ని భగ్నమైన జీవితాలు చూసినా తన ప్రేమ సత్యమని, నిత్యమని నమ్ముతుంది? ప్రతి స్త్రీకి మోసపోయేంత వరకు ప్రియుడు అమర ప్రేమికుడే! ఎవరికీ జరిగినా తనకు అలాగా జరగదని... తనకున్న ప్రత్యేకతలు తమ ప్రేమను జీవితం కడవరకు జీవింప చేస్తాయని అనుకుంటుంది. ఆమెకు తన కూతురు గుర్తు వచ్చింది... పాము పడగ నీడ పడకుండా పాపని కాపాడడానికి కన్న ప్రేమను కూడా చంపుకుంది ఎక్కడో దూరంగా తల్లి దండ్రుల దగ్గర ఉంచింది. తాను లక్ష్మణ రేఖ దాటిన ఫలితాన్ని అనుభవించింది. తల్లి దండ్రులకు తెలియకుండా ప్రేమ మత్తులో తప్పు దారి నడిచింది. ప్రేమించిన వాడు మోజు తీరగానే యముడైనాడు... త్రాగుడు, జూదం, వ్యభిచారం అతన్నినిత్యం పెనవేసుకుని వుంటాయి. అతను కట్టిన తాళి, చేసిన ప్రమాణాలు అన్నీ బూటకాలు. అతి తొందరలోనే అతని దుర్వసనాలకు సంయుక్త వంటి పై బంగారం ఆవిరయింది. ఆమెకు మోసపోయానని అర్థమయింది. సరైన ఆహరం, పోషణ లేక ఆమె శరీరం రోగ గ్రస్తమయింది. ఇలాగే వుంటే మరణం అతి చేరువలో ఉందని అర్థమయింది. చివరిసారిగా తన పాపని చూడాలనుకుంది. దాదాపు ఐదేళ్ళ క్రిందట తన పరిస్థితి మెరుగు పడదనుకున్న తర్వాత పాపని తీసుకుని అమ్మానాన్న దగ్గరకు వెళ్ళింది. శిథిలమైన ఆమె జీవితాన్ని,సౌందర్యాన్ని, శరీరాన్ని చూసిన తల్లితండ్రులు ఏడ్చారు. ఒక్కగానొక్క కూతురెందుకలా చేసిందో, అడిగినా ఆమె నుండి జవాబు లేదు. సంవత్సరం బిడ్డను వాళ్ళకు అప్పగించి చెప్పకుండా వచ్చేసింది. బిడ్డ ఏమయ్యింది అని కూడా అతను ప్రశ్నించలేదు.

డిగ్రీ చదివినా సర్టిఫికేట్ లేని కారణంగా ఏ ఉద్యోగ ప్రయత్నం చేయలేకపోయింది. అతని వుద్యోగం కూడా పోయాక ఇంక ప్రత్యక్ష నరకం మొదలయ్యింది. అతనింట్లో కూడా వుండడం లేదు. ఎక్కడికి వెళతాడో ఏమిచేస్తాడో, ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. నెమ్మదిగా లేచింది. శక్తినంతా కూడగట్టుకుని ఇల్లంతా వెతికింది. వూరికి వెళ్ళడానికి కావలిసిన డబ్బు కోసం అమ్మదగిన వస్తువు ఏదీ కనపడలేదు. వంటి పైనున్న బంగారం అంతా అతను హరించాడు. నిరాశగా కూలబడుతూ ఎదురుగా వున్న అద్డం లోకి చూసింది. ముక్కు పై మిలమిల మెరుస్తూ ముక్కు పుడక కన పడింది. అంత విలువైనది కాదని అతను పట్టించుకోకపోవడం వల్ల అది మిగిలింది. పరీక్షగా అద్దంలో తన మొహాన్ని చూసుకుంది."నీ ముఖంలోని అందమంతా నీ ముక్కులో ఉందోయ్, షార్ప్ గా ఎంత బాగుంటుందో! దానికి తోడు ఆ ముక్కుపుడక మరీ బాగుంటుంది" అనేది తన స్నేహితురాలు వందన. నిజమే తన ముక్కు చాలా బాగుంటుంది ఇప్పటికి బాగుంది... కానీ బుగ్గలే జారిపోయాయి. ముప్పై ఏళ్లకే తన సౌందర్యం మాసిపోయింది. వందన మాటలు ఆమెకు పదే పదే గుర్తుకొచ్చాయి. ఒక్క సారి చిరునవ్వు మెరిసింది ఆమె పెదాలపై. అద్డంలో మరొక్కసారి చూసుకుంది ఆమె వదనాన్ని. పొడుగ్గా వున్న ముక్కుని, ధగ దగా మెరిసే వజ్రం ముక్కు పుడకని, మళ్ళీ మళ్ళీ పెదవులపై చిరునవ్వు రాసాగింది. రోజుకు ఒక్కసారైనా నవ్వలేకపోవడం ఎంత దురదృష్టకరం ? వందన తన ముక్కు అందాన్ని గురించి అన్న మాటలు గుర్తొచ్చి, ఆమె లో కొత్త ఉత్సాహాన్ని... జీవితం పై ఆశని నింపాయి. కడుపు నొప్పి తో రాత్రి పడ్డ నరకయాతన కూడా ఆమెకు గుర్తు రాలా!

పదేళ్ళ క్రిందట తను వూరు విడిచి వచ్చేప్పటికి వందన మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతోంది, అంటే ఇప్పుడు ప్రాక్టీసు చేస్తూ వుంటుంది. వందన దగ్గరికి వెళ్ళాలి. వందన ఎక్కడుందో కనుక్కోవాలి. ముందు వందనతో మాట్లాడాలి... చెడి స్నేహితుల ఇంటికే వెళ్ళ మన్నారు. దగ్గరలో వున్న ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళింది. పక్కింటి అమ్మాయి సుమతి అక్కడ పనిచేస్తుంది.

"సుమతీ ఇంటర్నెట్ ద్వారా నా క్లాస్మేట్ డాక్టర్ అంకిరెడ్డి వందన గురించి తెలుసుకోవడం సాధ్యమా!" అని అడిగింది.

"గంటలో కనుక్కోవచ్చు లెండి నేను ప్రయత్నిస్తాను కూర్చోండి"అంది.

వందన చదివిన మెడికల్ కాలేజి వివరాలు, మిగతా వివరాలు చెప్పింది. అర్దగంటలో వందన ఫోన్ నంబరు, హైదరాబాదులో క్లినిక్ వివరాలు, లాండ్ లైన్ నంబరు, సుమతి కనుక్కుంది. తన సెల్ నుండి వందనకు కాల్ చేసి ఇచ్చింది. రింగ్ అవుతున్నా, రెండు మూడు సార్లు చేసినా తీయలేదు. మళ్ళీ మళ్ళీ చేసి నిరాశగా "తీయడం లేదక్కా"అంది.

"పర్లేదులేమ్మా... నంబరు మారిందో లేక వాళ్ళది కాదో... మళ్ళీ ప్రయత్నం చేద్దాం లే " అని ఇంటికి వచ్చేసింది.

కానీ ఎందుకో సంయుక్త కు నిరాశగా లేదు. ఏదో ఆశ ఆమెలో మొలకెత్తింది. వున్న బట్టల్లో మంచివి తీసి సర్దుకుంది. కడుపులో నొప్పి మొదలైంది ఎప్పుడో డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్లు కొనుక్కుని వేసుకుంది. సుమతి దగ్గరకు వచ్చి "సుమతి చిన్న సాయం కావాలి" అంది. "చెప్పక్కా..." అంది. సుమతి. రెండేళ్లుగా ఆమె ఎవర్ని ఏమీ అడగడం చూడలేదు అతను తాగి వచ్చి గొడవ చేసినా ఆమె బయటికి వచ్చేది కాదు. చుట్టు ప్రక్కల వాళ్లకి ఆమెంటే ఎంతో గౌరవం సానుభూతి వున్నాయి.

"ఈ ముక్కుపుడక అమ్మి వద్దామా... నాకు ఎక్కడ అమ్మాలో తెలియదు" అంది. "మీకు... ఆ ముక్కుపడక చాలా బాగుంది అయినా దానికెంత వస్తుంది? చెప్పండక్కా... నేనేమైనా సహాయంచేయగలనా?"అంది

"లేదమ్మా... నేను మా వూరు వెళతాను... డబ్బు కావాలి, ఇది వజ్రం." అంది.

"సరే అక్కా సాయంత్రం వెళదాం లే" అంది సుమతి.

సాయంత్రం అడిగితే సుమతి ని "రేపు వెళదాం అక్కా పనుంది" అంది. ఆమె మళ్ళీ ఆలోచించింది... ఎంతలేదన్నా ముక్కు పుడక్కి పదివేలు వస్తాయి. అప్పుడెప్పుడో పదిహేనేళ్ళక్రిందట అది మూడువేలు అయింది. ఈ ఊరిని, నరకాన్ని గుర్తు చేసే అతన్ని విడిచి వెళ్లి పోతే... ముందు డాక్టర్ కు చూపించుకుంటే... ఆరోగ్యం కుదుట పడితే... ఏ పని చేసుకోరాదు? అమ్మానాన్న దగ్గరికి వెళితే తప్పేంటి? తప్పు చేసినవాళ్ళు ఎప్పటికి ఇలా శిక్ష అనుభవిస్తూనే ఉండాలా! అమ్మా నాన్నా... పాప... గుర్తొచ్చారు. ఆమె కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి దుఃఖంతో కాదు. ఒక రకమైన ఉద్వేగంతో!

ఎవరో మోసం చేస్తే దురదృష్టాన్ని తిట్టుకుంటూ... కృంగిపోవాల్సిందేనా! ఎవరి తోటి చెప్పుకోక, ఎవరి సహాయం తీసుకోక ఈ నరకం లోనే మ్రగ్గి పోయింది చాలు... ఇంక క్రొత్త గా ఆలోచించాలి. భయంకరమైన గతాన్ని సమాధి చేయాలి. సంయుక్త ప్రశాంతంగా నిద్రపోయింది.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి