పెళ్లి చూపులు - పోడూరి వెంకటరమణ శర్మ

pellichoopulu

కార్తీక్ గత నాలుగు సంవత్సరాల నుంచీ బెంగళూరు లో సిట్రిక్స్ లో పని చేస్తున్నాడు. ఒక వారం రోజులు శలవు పెట్టి అతను విశాఖ పట్నం చేరుకున్నాడు. అతను వచ్చిన పని, అక్క బావల సహాయంతో పెళ్లిచూపులు చూసి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళడానికి . అతని తల్లి, తండ్రి వీరవాసరం లో ఉంటారు. వాళ్లకున్న పది ఎకరాల భూమిని, వ్యవసాయం చేస్తూనే ఇరవై ఎకరాలు చేశాడు తండ్రి నారాయణ గారు. వ్యవసాయ ఆదాయం తోనే కూతురు సుగుణ పెళ్లి, కొడుకుకు ఎం టెక్ దాకా చదువు చెప్పించాడు ఆయన . కూతురు భర్త సుధాకర్ తో విశాఖ పట్నం లో ఉంటుంది. సుధాకర్ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్.

తల్లీ తండ్రీ, తరుచు పెళ్లి గురించి ఫోన్లు చేస్తోంటే, తనకి కావలసిన ముఖ్య విషయాలు చెప్పి వాళ్లనే షార్ట్ లిస్ట్ చేసి చెప్పమన్నాడు. తనకి వీలయినప్పుడు వచ్చి చూసి ఫైనలైజ్ చేస్తానన్నాడు. నలుగురిని ఫైనలైజ్ చేసి ఫోటోలు పంపారు వాళ్ళ నాన్నగారు. ఇద్దరు కాకినాడ లోనూ ఇద్దరు వైజాగ్ లోనూ ఉన్నారు. తనకి ఆరోగ్యం అంత బాగోనందున సుధాకర్ తో వెళ్లి చూసి రమ్మన్నారు.

సుగుణ పెళ్లి, కార్తిక్ చిన్నతనం లోనే జరగడం వల్ల సుధాకర్ తో సన్నిహితం ఎక్కువే. అందు చేత తండ్రి చెప్పగానే అక్క బావల దగ్గరికి వచ్చాడు. కార్తిక్ ఆలోచనా సరళి లో అతని బావ ప్రభావం లేకపోలేదు. అతను ఎప్పుడో వేళాకోళం గా అన్నవయినా కొన్ని మాటలు కార్తిక్ లో ముద్రపడిపోయాయి. "మీ అక్క నాకంటే ఏడేళ్లు చిన్నదయ్యా. అయినా నన్ను ఎంత కంట్రోల్ చేస్తోందో చూశావా? అందు చేత క్లాస్ మేట్స్ తో ప్రేమలో పడకు. వాళ్ళు నీ వయసు వాళ్ళే అవుతారు కాబట్టి, వాళ్ళని పెళ్లి చేసుకుంటే అంతా కంట్రోల్ వాళ్లదే అవుతుంది" అనేవాడు. ఇటువంటి మాటలు అతనికి తెలియకుండానే మనసులో ముద్ర వేసుకుని అతని క్లాస్ మేట్స్ తో ప్రేమ లో పడడం జరగ లేదు.

అతని ఈడు అందరి యువకుల లాగే, తాను పెళ్లి చేసుకుంటే, అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయం మీద అస్పష్టమయిన అభిప్రాయం రూపు దిద్దుకుంటూనే ఉంది. చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తున్నాడు కాబట్టి వాటి ప్రభావం కూడా అతని మీద లేక పోలేదు. సినిమాలో హీరోయిన్స్ ప్రవర్తనతో తన క్లాసులో ఉండే ఆడపిల్లల ప్రవర్తన తో పోల్చడం అతని కి ఒక హాబీ గా ఉండేది . సినిమాలలో హీరోయిన్స్ చేసేది ఏక్షన్ అని తెలిసినా, వాళ్ళు చూపించేది కూడా జీవితం లోనివే కాబట్టి అలా ఎవరయినా ఉంటారా అని అతనికి అనిపించేది. అతను ముఖ్యంగా ఒక విషయాన్ని పరిశీలించే వాడు. సినిమాలలో మొదట, హీరోయిన్ హీరో తో దెబ్బలాడుతుంది. వాళ్ళ మధ్య ఎటువంటి కెమిస్ట్రీ ప్రారంభం కానప్పుడు హీరోయిన్ చూపులు ఎలా ఉంటాయి? సడన్ గా వాళ్ళ మధ్య దెబ్బలాట తగ్గి హీరో చేసిన ఏదో పని వల్ల హీరోయిన్ ఇంప్రెస్ అయినప్పుడు, హీరోయిన్, పెదవుల మీద కొంచెం చిరునవ్వుతో, కళ్ళలో అదో రకమయిన ఆరాధన చూపిస్తూ హీరో కేసి చూస్తుంది. ఆ ఎక్సప్రెషన్ చూసినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ మొదలయిందని ఆడియన్స్ కి అర్థమయిపోతుంది. అలాంటి సన్నివేశం అతని కి నిజ జీవితం లో ఒక సందర్భం లో తారస పడింది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో చేరినపుడు మొదటి రెండు నెలలు మైసూరులో ట్రైనింగ్ క్యాంపు ఒకటి నిర్వహించారు. అప్పుడు రాజేష్, భవానీ, నీరజ లను తన తో పాటు ఒక ప్రోజక్ట్ లో జత చేశారు ట్రైనింగ్ హెడ్ . నీరజ కంటే భవాని కొంచం ఎక్కువ కలుపుగోలు తనం గా ఉండేది. ఆమె, రాజేష్ తరుచు కబుర్లలో పడడం మిగతా ఇద్దరూ గమనించారు .

ఆ వేళ మధ్యాహ్నం నలుగురూ కాంటీన్లో ఓ మూల కూర్చున్నారు. ఆ రోజు భావాని చీర కట్టుకుని, చెవులకి దుద్ధులు కాకుండా కొచెం పెద్దగా ఉన్న రింగులు పెట్టుకుని ప్రత్యేకమయిన మేకప్ తో వచ్చింది. ఆమె చాలా అందంగా ఉందని కార్తిక్, నీరజా గమనించినా పైకి ఏమీ అనలేదు. రాజేష్ మాత్రం ఆమె చీర కట్టుకుంటే చాలా బాగుందని, మిగతా అలంకరణ అంతా ఆమెకి నప్పి చాలా అందంగా ఉందని పైకి చెప్పటంతో, భవాని కొంచెం సిగ్గుపడి, చిరునవ్వుతో రాజేష్ కళ్ళల్లోకి చూసింది. అది గమనించిన కార్తిక్ 'ఓహో సినిమా లో సీన్లు నిజజీవితంలో కూడా ఉంటాయన్నమాట' అనుకున్నాడు కార్తిక్. ట్రైనింగ్ పూర్తి అవగానే, వాళ్ళ పెళ్లి కార్డు అందరికీ అందింది. ఆ తరువాత వాళ్లిద్దరూ హైదరాబాద్ యూనిట్ కి వెళ్లి పోయారు

××××

రాజేష్ భవానీల మధ్య జరిగిన సన్నివేశాల వంటివి మనసులో మెదలుతుండగా పెళ్లి చూపులు కార్యక్రమం ప్రారంభించాడు కార్తిక్
మొదట వైజాగ్ లోనే ఓ అమ్మాయిని చూశారు. అమ్మాయి బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. బాగానే ఉంది కానీ, అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు అతను ఒక్క మాటేనా తాను ఆశించిన విధంగా తన కేసి చూస్తుందేమోనని అనుకున్నాడు. చిన్నగా నవ్వుతూ, కళ్ళల్లో కాస్త ప్రేమ ఒలికిస్తూ సినీమాల్లోలా కాకపోయినా, దానికి కాస్త దగ్గరగా అయినా చూస్తుందేమోనని ఆశించాడు. అడిగిన ప్రశ్నలకి జవాబు బాగానే చెప్పింది, తాను కూడా ఏవో అడిగింది. ఎందుకో కార్తీక్ కి ముందుకు వెళ్లాలనిపించలేదు.

తరువాత రెండు సంబంధాలూ ఇంచుమించు అలాగే అయి,నిర్ణయమేమీ జరగలేదు.

సుగుణ సుధాకర్ ని అడిగింది. " వాడు ఎందుకు వద్దన్నాడో ఏమన్నా కనుకున్నారా? " అని

" అదే నాకూ అర్థం కావటం లేదు. అమ్మాయిలలో ఏమీ వంక పెట్టడానికి లేదు. వీడికి ఏమి కావాలో తెలియటం లేదు"

"వాడు నిర్ణయం చేసుకోలేకపోతున్నాడేమో. మీరేమన్నా సలహా ఇవ్వకపోయారా?"

" బలే దానివే, పెళ్లిచేసుకునేవాడు వాడా నేనా? మిగతా కుటుంబ వ్యవహారాలూ అవీ నేను చూడచ్చు కానీ, అసలు విషయం వాడే నిర్ణయించుకోవాలి.

నాలుగో మ్యాచ్ కాకినాడలో చూడడానికి వెళ్ళినప్పుడు. సుగుణ కూడా వాళ్ళతో వెళ్ళింది. అక్కడే ఊళ్లోనే ఉన్న సుగుణ స్నేహితురాలు కల్యాణి ద్వారా వాకబు చేస్తే మంచి ఫామిలీ అనీ, పిల్ల చాలా బుద్ధిమంతురాలని చెప్పింది కల్యాణి . సుగుణ, సుధాకర్ ఇద్దరూ కలిసి కార్తీక్ మైండ్ ముందే కొంచెం ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించారు . ఇప్పటి వరకూ చూసిన అమ్మాయిలలో కంటే ఫొటోలో ఈ అమ్మాయి బాగుంద నీ, కల్యాణీ వాళ్ళకీ బాగా తెలుసుట అనీ, ఈ మేచ్ అన్ని విధాలా బాగుందనీ మొదలయినవి చెబుతూ వచ్చారు

పెళ్లికూతురు సునంద , రిటైర్డ్ లెక్చర్ రామారావు గారి కూతురు. కాకినాడలోనే బి.టెక్ మూడో సంవత్సరం చదువుతోంది. రామారావు పేటలో వాళ్ళ స్వంత ఇంట్లోనే పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. కావలిస్తే ఏదయినా హోటల్ లో అరెంజ్ చేస్తానని ఆయన అన్నా, సుగుణ, సుధాకర్ వద్దని చెప్పారు. అంతక్రితం హోటళ్లలో చూశారు. హొటల్స్ లోవాతావరణం సుధాకర్ కి నచ్చలేదు.

పరిచయాలు అవీ అయిన తరువాత పెళ్లికూతురు సునందని వచ్చి కూర్చోమన్నారు. అందరి దృష్టీ వాళ్ళమీదే ఉంటే చూసుకోవడానికి సిగ్గుపడతారని, సుధాకర్ మిగతా వాళ్ళని కబుర్లలో పెట్టాడు. కార్తీక్ సునందని చూసి ఫోటో లో కంటే చాలా బాగుందని అనుకున్నాడు .
ఫలహారాలు అయినతరువాత మీరిద్దరూ మాట్లాడుకోండి అని వాళ్ళిద్దరినీ పక్కనే ఉన్న రూం లోకి పంపించారు. ముందే ప్లాన్ చేసి నట్టున్నారు రెండు కుర్చీలు వేసి ఉన్నాయి.

కూర్చున్న తరువాత సునందని పరిశీలన గా చూశాడు కార్తీక్. సునంద చీర కట్టుకుని, చెవులకి పెద్ద రింగులు పెట్టుకుంది.పెద్దగా పచ్చ గా లేకపోయినా కళ గా ఉందనిపించింది.

"ఫొటోలో డ్రెస్సులో కంటే చీరలో బాగున్నారు అన్నాడు నవ్వుతూ" పైకి అనేసినతరువాత అలా మాట్లాడవచ్చో లేదో అనిపించింది అతనికి
చిన్నగా తల ఊపి ఊరుకుంది. , " కళ్ళల్లో చిలిపితనంతో కూడిన కొంచెం ప్రేమ, పెదవులమీద చిరునవ్వు" ఇటువంటివేమీ లేవు

బహుశా తనను చూస్తే అమ్మాయిలకి అటువంటి ఎక్సప్రెషన్ ఇవ్వాలని అనిపించదేమో అనుకున్నాడు కాసేపు మిగతా చదువు, ఉద్యోగం విషయాలు అవీ కాసేపు మాట్లాడుకున్నారు. రాజారామ్ పిలవడం తో సునందకు బై చెప్పి లేచి వెళ్ళాడు కార్తీక్ .

*****

పెద్దగా అబ్జెక్షన్ చెప్పడానికి ఏమీ లేకపోవడం, సుగుణ, సుధాకర్ లు ఈ సంబంధమే నిశ్చయించాలనే కృత నిశ్చయంతో ఉండడంతో కార్తీక్, సునందల వివాహం పెద్దలు నిశ్చయించడం, ఆ తరువాత ఆరునెలలలోపే వాళ్ళ పెళ్లి జరగడం అయింది. ఈ మధ్యలో ఆమెతో ఫోన్ లో అప్పుడప్పుడు మాట్లాడినా ఏవో చదువు విషయాలూ మిగతా కుటుంబ విషయాలూ తప్ప పెద్ద రొమాంటిక్ సంభాషణలకి సునంద అవకాశం ఇవ్వలేదు. ఇరు కుటుంబాల సాంప్రదాయక పద్ధతుల వల్లా కలిసి తిరగడం అనే ప్రశ్నఉదయించేలేదు.

పెళ్లి అయిన మరునాడే ఫస్ట్ నైట్ ఆరెంజ్ చేశారు.పురోహితుల తతంగం అయిన తరువాత, నిర్ణయించిన గదిలో కూర్చుని, ఈ పద్ధతులు ఎప్పటికి మారతాయో అని ఆలోచిస్తూన్న కార్తీక్, పాల గ్లాస్ తో సునంద లోపలికి వచ్చిన చప్పుడుకి వెనక్కి తిరిగిఆమెకేసి చూశాడు
అంతే స్టన్ అయిపోయాడు. చేతిలో పాల గ్లాసుతో, సునంద అతని కళ్ళల్లోకి ఒకరకమయిన ప్రేమతో పెదవుల మీద చిరునవ్వుతో చూస్తోంది" ఇదే ఇదే తానుకావాలనుకున్నాడు

వెంఠనే ఆమె దగ్గరికి వెళ్లి పాలగ్లాసు తీసుకుని పక్కన పెట్టి ఆమెని కుర్చీలో కూర్చో పెట్టి తాను కూడా ఇంకో కుర్చీలో కూర్చున్నాడు.
" అవును అంత సేపు కూర్చుని పెళ్లి చూపుల రోజు మాట్లాడుకున్నాము కదా, కాస్త ఇవాళ చూసినట్టు చూడవచ్చుకదా? అన్నాడు
సునంద అతని కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ " మీరు కాకుండా అంతకు ముందు నలుగురు చూశారు నన్ను" అంది

ఒక్క క్షణం బ్లాంక్ అయి, వెంఠనే ముఖం మీద బాంబు పేలి నట్టయింది కార్తీక్ కి. తన సునంద వాళ్లందరినీ ఇలా చూడడమా? ఇంక ఊహించ లేక పోయాడు.

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ