annamarati - Anil Prasad Lingam

అన్నమారతి

ఏం చేయాల్నో ఏందో నాకైతే సామజ్కాట్లేదు. గుండంతా మస్తు కొట్టుకుంటాఉండింది. పన్జేస్కు పోతావుంటే ఏం తెలిసెడిది గాదు గానీ ఇయాల గాపనే లేక పోయే. అసలదే నా దిగులంతా. నిన్నటేల జరిగింది యాదికొస్తే దిల్లు బేజారైపోతాంది.

హైదరాబాద్ల హైటెక్కు సిటీల చానా కంపనీలుండబట్టే అక్కడ పంజేసెటోల్లకి, ఏదైనా పని మింద అటేపు అచ్చేటోళ్ళకి టయానికి అన్నం పెట్టేందుకు, టిపినీలు అమ్మెందుకు ప్రతీ సందులో చానా మంది రోడ్లంబడి చిన్న చిన్న పరదాలు యేసుకొని ఉంటా ఉండ బట్టిరి.

దినాములాగే గిన్నెలల్లా వంటలొండుకొని కొడుకాటోలో పోయి ఇనప టేబుళ్ల మింద ఆ అమేరికోళ్ళ కంపెనీ పక్కన్నే, చుట్టూ కట్టున్నా ఎత్తు గోడ మీదగా లాగిన దుప్పటి కింద పేర్చి పెట్టినాం. మా పిల్లోడు పొద్దుగాల అక్కడ్నే టిఫినీలు పెడ్తాడు. అదయ్యాక ఇంటికొచ్చి అప్పటికే నేనొండి, గిన్నెల్ల సర్దిన వంటలతో పాటు ఆటోలో నన్నుగూడా దీస్కొచ్చి దించుతడు. మద్దెన్నాం మూడు కల్లా అన్నం అయిపోతుండే - పప్పూ, కూర, ఫ్రైయ్యి, పచ్చడి, పెరుగుతో అన్నం పిలేటు యాభైకి, అడిగినోళ్ళకి గుడ్డు, కోడి కూర ఎక్వ డబ్బులకీ పెడతాఉంటిమి. 5 కేజీల అన్నం గిన్నె తెస్తే చానా వరకూ అయ్యిపోతుండే, ఏ కొంచెమొ ఆఖిరికి కిందుంటే నేనూ, మా ఆయనా, పక్కన్నే సిగిరెట్టు బడ్డీ లచ్చమనూ తలా ముద్దా తినెడిది. పప్పూ రోజూ వండాలే, 6 గుడ్డులు ఉడక బెట్టితే రెండుదినాలల్లో అయిపోతయి, కోడి కూర కేజీ తెచ్చి వండితే ఓ నాలుగైదు దినాలు సరిపోయెడిది. అంటే రెండు బర్నర్ల పొయ్యి మింద అన్నం గిన్నె పెద్ద మంట మింద, చిన్న పొయ్యి మింద పప్పు ఉడక బెట్టి - టమోటా కలిపి రుబ్బేసి, రోజు మార్చి రోజు గుడ్డులుడక బెట్టి వేరుగా వండిన ఉల్లి, టమోటా గుజ్జులో పడేస్తుంటిమి, 3-4 రోజులకోసారి చికెనొండుతా వుండే. ఆ యాదగిరి నర్సిమ్మ చల్లంగా చూడబట్టే, పోయిన నాలుగేళ్ల సంది యాపారం బాగాన్నే సాగుతుండే. నాలుగు పైసలు చేతుల్లో ఆడ బట్టే, హైటెక్కు సిటీకి దగ్గర్లనే మంచి మిద్దెల అద్దెకు దిగినాం, ఇంట్లకి ప్యాను, టీవీలు తెచ్చుకొంటిమి, ఈ ఏడాది పోరడికి లగ్గం చెయ్యాలని గూడా జూస్తుంటిమి.

గింతలా భగవంతుండికేం బుద్దిపుట్టిందో, నిన్నటేలా మా మీద పిడుగుపడ్డట్ట్లాయే. మద్దెన్నాం రోజూలాగే పోతిమాయె అన్నం అమ్మనీకి, బెంచీలు యేసీ ఆటిపైని గిన్నెలు వెట్టి పేతీ దినము లాగాన్నే ముందుగాల మూడు అన్నం ముద్దలు సుట్టి, ఓ కాగితం మీద పెట్టి పసుపు కుంకం బొట్టులు వెట్టి, అగరుబత్తి ముట్టించి దండమెట్టుకొని, పిలేట్లు, మంచినీళ్లు సర్దుకో బడ్తిమి. ఒక్కొళ్ళు రా బడ్తిరి తిననీకి, మా పని షురువాయే. ఇంతలా పక్కన అమేరికోళ్ల కంపెనీల నుండీ ఏదో గొల ఇనపడబట్టే. ముందుగాల దవాఖాన బండి 108, ఆఎనకే పోలీసోల్లు రాబట్టిరి. గీ మద్దెనా ఆడ పన్జేసే పోరీలు, పోరలు పనిలా ఇబ్బందని మీదికెళ్లి దూకి పాణాలు దీసుకోబట్టిరి, మళ్ళాట్లా ఎవుళ్ళన్నా చచిన్రనుకున్నా. ఒక్క బిల్డింగుల మొదలైన సందడి మెల్లంగా ఈదంతా పాకిపోయే, మందిమొత్తం రోడ్డుమీదికి రాబట్టిరి. ఇద్దరు ముగ్గురు అన్నం తింటాంటే నాకు, మా ఆయనికీ కదలనీకి లేకపోయే. పక్కన లచమాను ఎల్లి సంగతి తెల్సుకొచ్చే, గా కంపెనీల పన్జేసేటోడు ఈ మద్దెన్నే పారిను పోయొచుండంట అక్కడ ఆనికేదో రోగమంటుకుందంట, అది గాడు దగ్గిన్నా తుమ్మిన్నా పక్కనోళ్ళకు అంటుకున్టాదంట. మునిసిపాలిటోళ్లు వచ్చి మెషినీతో మందుకొట్టబడ్తిరి, గాలంతా ఘాటు వాసనెయ్యబట్టే, మేము ముక్కులకు గుడ్డ గట్టుకొని, గిన్నెల మీద మూతలు పెడ్తిమి. కాసేపటికి సర్దుకుంటాదనుకొంటిమి, గానీ మెల్లంగ జనాలందరూ ఇళ్ళకి పోబట్టిరి - మేమింగా కాసేపుజూద్దామని కూసుంటిమి. ఇంతలా ఇంకొందరు మునిసిపాలిటోళ్లొచ్చి రోడ్డంతా తెల్ల పొడిజల్లబట్టిరి, మేం అడ్డుచెప్పినం, ఆళ్ళ ఆఫీసర్లొచ్చి గాపారెను పోయొచ్చినాయన యేడేడ తిరిగిండో ఆడంతా గా జబ్బు అంటుకుంటాదని - గాడు ఈ ఈదిలో తిరిగిండుగాబట్టి ఇక్కడంతా శుభ్రంచెయ్యాలన్జెప్పి మమ్మల్ని పొమ్మనిరి.

పది పిలేటులుగూడా గాకపోయే, కొడుక్కి పోన్జేసి రమ్మని పక్క గల్లిలోని దోస్తాన్ల కాడికి పోయొచ్చే మా ఇంటాయన, ఆళ్లూ బందు జేత్తనారంట. సామాను సర్దేసి ఆటోరాంగానే ఎక్కి, కొడుక్కి సంగతంతా చెప్పితే, ఏరే గల్లీల అమ్ముదమని తీసుకుపోయాడు. ఎన్నిరోడ్డులు తిరిగినా మంది లేకపాయ, ఉన్నాకాడ కొందరమ్ముతుండే, ఆళ్ళ కడుపుకొట్టుడెందుకని ముందుకు పోతావుంటిమి. పోనీ మా గిన్నెల్ల సరకు తీసుకోమని అడిగినా ఎవళ్ళూ తీసుకోపోతిరాయే, ఒగాయన నాలుగు గుడ్లు మాత్రం తీసుకొనే. ఇంత వంట ఏంచేయాల్రా బగమంతుడా అని నెత్తి కొట్టుకుంటా ఇంటికొచ్చినాం. జరిగిందానికి తలనొస్తాందని కల్లు కాంపౌండుకు పోయి రెండేసి కాయలు తాగొచ్చి, కొంచెం తిని గారాతిరి పండినం.

ఇగో తెల్లారినంక అసలు పరేషానీ షురువయ్యింది. పప్పు చల్లగాయే - మళ్ళీ వండాలే, నిన్నజేసిన బెండకాయ బాగానుండే, క్యాబేజీ ఫ్రయ్యి నడుస్తది, పెరుగు పారబోసి నిన్న తోడుబెట్టింది తియ్యాలి, నాలుగు గుడ్డులు ఉడకబెట్టితే - ఉల్లి గుజ్జు సరిపోతాది, రేతిరి తాగొచ్చి కోడి కూర తినేసినం - ఓ కేజీ తీస్కోచి వండితే సరిపోతాది. అంతా సరేగానీ గిన్నెడన్నం ఏంజెయ్యాల్నో తెలవడం లేదు. నిద్దర లేచిన కాడినుంచి ఇదే దిగులు - మల్లోండాలంటే బువ్వ మొత్తం తీసేసి ఆ గిన్నె కడిగి బియ్యం నానబెట్టాలి. అంతన్నం మోరీల పడెయ్యనికి చేతులు రాడంలేదు, మరి తీస్కపొయి పెట్టేదామంటే ఎట్టుంటాదోనని దిగులు. మంచిగ లేకుంటే మొగానుత్తరు తినేటోళ్లు, మరిగందుకే ఏంజెయ్యాల్నోతెలవకపాయే. మొగోడిని అడిగితే, ఇంకో గిన్నెలో వండమని చెప్పే, నా కొడుక్కి ఫోన్జేసి అడిగితే ఆపీసులకు జనాలు తక్కువొచిన్రని నిన్నటి గిన్నెల అన్నం సరిపొద్దని చెప్పబట్కె అట్నే బయలుదేరినం.

జాగాల నీళ్లు జల్లి, టేబుళ్ళేసి, గిన్నెలు సర్దినంక దేవునికి పెట్టనికి అన్నం ముద్దలు చెయ్యబడితి - మెతుకు బాగానేఉందిగానీ దేవునికెప్పుడూ నిండుకుండల్ల అన్నమే పెట్టుడలవాటు, పొద్దుగాల సంది ఆ ఇషయమే యాదిలేదు నాకు, ఏదో గిన్నెల గుప్పెడు గింజలు ఉడకేస్తే అయిపోవు. ఏంటనే లెంపలేసుకొని, ఆ అన్నంతోనే మూడు ముద్దలు వెట్టి - దండమెట్టుకొని నా తప్పుకాయమని యాదాద్రి నర్సిమ్మసామికి మొక్కి పనిలోకి దిగినా. నా బిడ్డ జెప్పినట్టు, రోజుకన్నా జనాలు తక్కువొచిన్రుగానీ గిరాకీ బాగానుండే, పప్పూ - గుడ్లు అయిపాయే, ఎవళ్ళూ చికెనడగలేదు. నాలుగింటికి మిగిలిన అన్నం నేనూ మా ఆయాన తినేసి - గిన్నెలు కడిగేసి, దేముడికి మళ్ళీ దండమెట్టుకొని ఇంటికొచ్చేసినాం.

ఆ రాతిరి, తెల్లారి వంట కోసం కూరలు కొస్తుంటిమి నేనూ మా ఆయన, ఎడనుంచో లగెత్తుకొచ్చి నా కొడుకు టీవీ పెట్టిండు. గా రేతిరి నుంచీ మొత్తం దేశమంతా బందంట. అప్పటిసంది కొన్ని లచ్చల సార్లు లెంపలేసుకొంటి - గా దినం నిండుకుండ అన్నం దేవుడికి వెట్టలేదని, గిప్పుడు పూట పూటకీ వండిన ఎంటనే ముందుగాల దేవుడికో ముద్ద నైవేద్యం పెడుతున్నా అయినా ఆయన దయ చూపీలేదు. పొయ్యి పొర్లుదండాలు వెడదామంటే గుళ్ళకి పోయే దారికూడా లేకపాయే. నా పాపానికి ఇమోచనమెప్పుడో మరి.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల