తిరిగి రాని రోజు - నాగమణి తాళ్ళూరి

the day that willn't come back

ఒకరి చేతులు ఒకరు పట్టుకుని , బుడి బుడి నడకలతో వస్తూ , ఆగి నేల మీద ఒంగి ఏదో చూస్తూ ఉన్న ఆ బుడతలిద్దరినీ చూస్తుంటే చిట్టి లవకుశుల్లా అనిపించారు.
చేస్తున్న పని ఆపి చూస్తూ ఉండిపోయాను. 
ఓ మూడు నాలుగేళ్ళ వయసు పిల్లలిద్దరూనూ.

నేరుగా మా వాకిట్లోకి వచ్చారు. జారుతున్న నిక్కరు ఎగలాక్కుంటూ , కారుతున్న ముక్కుల్ని చొక్కాకు తుడుచుకుంటూ " మీ సాయన్న ఉన్నాడా" అన్నాడు వాళ్ళలో పెద్దోడు.
బహుశా అంగన్ వాడీలో పరిచయం కాబోలు.
నవ్వొచ్చింది వాడు అడిగిన పధ్ధతికి.
ఇంట్లోంచి అప్పుడే బయటకు వచ్చారు మా బావగారి మనవళ్ళు.

వాళ్ళ అమ్మ చేసిన ఇడ్లీ నచ్చలేదని , పొద్దున్నే నా కొంప మీదకు దండయాత్ర చేసి , "నేను పిండి కలుపుతా , నేను ఉల్లిపాయలు కోస్తా "అని నన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి నాచేత చపాతీ చేయుంచుకుని దానితో పాటే నన్ను నంజుకు తిని ఇదిగో ఇప్పుడే తృప్తిగా త్రేన్చుతూ బయటకు వచ్చారు.

ఆదివారం కొంపకు తాళం  వేసుకుని ఎటైనా పారిపోవాలనే ఆశ బలంగా వస్తూ ఉంటది కాని ఎటెళ్ళాలో తెలీక , ఎటెళ్ళినా మళ్ళీ సాయంకాలానికి ఈ గూడుకే చేరాలని సత్యం గుర్తొచ్చి మిన్నకుండిపోతాను.

"ఒరేయ్ సాయన్నా, ఆడుకుందామా! "అంటూ సంబరంగా ఇంట్లోకి వచ్చేసారిద్దరూ...

"వూరేయ్.... మీ ఇంట్లో రైలు బొమ్మ ఉందిగా....రా...సాగదీసుకుంటూ అంటున్నాడు పెద్దోడు.
నోట్లో వేలేసుకుని చీకుతూ , మౌనంగా అన్నీ గమనిస్తున్నాడు చిన్నోడు.
ముద్దుగా ఉన్నారు కానీ కాస్త మురికిగా కూడా ఉన్నారు.

"ఎవరి పిల్లలురా వీళ్ళు? ఎప్పుడూ చూడలేదు?" అడిగాను మా వెధవల్ని.

"నీకు తెలీదులే " నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు మా కమల్.
వీడి పొగరు చూస్తుంటే అట్లకాడ ఎర్రగా కాల్చి వాతలు పెట్టాలనిపిస్తుంది నాకు.
"నాకు తెలీదు కానీ  , నీకు మహ బాగా తెలుసు " అన్నాను పళ్ళు కొరుక్కుంటూ.
చిన్నగా ఓ దెబ్బ వేసినా సరే మోర ఎత్తి రంకెలేసుకుంటూ మరీ ఏడుస్తాడు.
వాళ్ళ అమ్మా , నానమ్మల మొహాల్లోని క్రోధాన్ని చూసి తట్టుకోలేను.
అందుకే ఆ సాహసం చేసి ఏడవలేను
"తూరుపు బజారు మిషను సోమయ్య మనవళ్ళు .అదే  పెద్దకూతురు పిల్లలు.
అల్లుడు తాగి పనికి పోకుండా తిరుగుతున్నాడని తెచ్చి ఊళ్ళోనే  పెట్టుకున్నాడు." మా తోటి కోడలు సమాధానమిచ్చింది.

"నాగలక్ష్మి పిల్లలా " అనుకున్నాను.

తను నాకు తెలుసు.

చిన్నప్పుడు నా దగ్గరకు ట్యూషన్ కి వచ్చేది.కొద్దిగా మొండితనం ఉండేది.
మూడ్  బాగుంటే గలగలలాడుతూ కబుర్లు చెప్పేది. కాస్త చదివేది.
లేదంటే ముభావంగా ఓ మూల కూచునేది ఉలుకూ , పలుకూ లేకుండా! ఏంటమ్మా అనో , లేక చదువమ్మా అంటేనో , రోషంగా పుస్తకాల్లో పేజీలు చించి పోగులు పెడుతూ , పెన్సిల్ విరగ్గొడుతూ ఉండేది.
చదువబ్బలేదని పదహారేళ్ళకే పెళ్ళి చేసాడు వాళ్ళ నాన్న.అప్పుడే ఇద్దరు పిల్లలు
అనుకున్నాను నిట్టూర్పు విడుస్తూ...

పెద్దోడు మణి , చిన్నోడు చందూ అంట.

నా పేరు పెట్టుకున్నాడనేమో వాడిపై నాక్కొంచెం అభిమానం కలిగింది.

మా గాడిదలు తినగా మిగిలిన  టిఫిన్ పెట్టాను.
ఇంట్లో వీళ్ళ వల్ల జీవితానికి విరక్తి వచ్చేస్తున్నా చిన్న  పిల్లలు కనపడగానే   ప్రేమ పొంగుతూనే ఉంటుంది నాకు అదేంటో గాని!

ఆదివారం కదా! మా సింహాలు జూలు విదులుస్తూ వేటకు బయల్దేరాయి.

వాటి ధృష్టి అంతా నా కొంప పైనే.

సాధ్యమైనంత వరకూ అందకుండా సర్దేసుకుని , మిగతావి ముట్టకుండా ఉండేందుకు బజ్జీల నైవేద్యం పెడతానని ఒప్పందం చేసుకున్నాను కానీ ఏనాడూ పాటించనే లేదు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని అస్తమానూ అతిక్రమించే పాకిస్తానీయుల్లా   వీళ్ళూ ప్రవర్తిస్తూనే  ఉంటారు.

"మీ ఇంట్లో భోజనాలా!" అన్నాడు చందూ , నోట్లోని వేలుకి ఓ క్షణం విరామం ప్రకటిస్తూ..

వాడి చూపు మా వరండా లోని  టెంట్లు , కుర్చీల మీద ఉంది.
మా వ్యాపారం అది.
"మా ఇంట్లో కాదు , భోజనాలు పెట్టే ఇంట్లో టెంటు వేస్తాడు తాత " వాడి సందేహం తీరుస్తూ , పకపకా నవ్వుకున్నాను నేను.

.....     .......      ......     ......

"సరోజిని పిన్ని చనిపోయిందట అమ్మాయ్ "అంది మా తోటి కోడలు కంగారుగా ఓ రోజు ఉదయాన్నే.
"అయ్యో! మొన్న బానే ఉందక్కా , నన్ను పలకరించింది కూడానూ" అన్నాను ఆందోళనగా.

"మొన్నేందీ? పొద్దున కూడా బానే ఉంది . నేను పాల కేంద్రంలో  పాలు  పోయడానికి వెళితే , వాకిట్లో కూచుని చిక్కుడు కాయలు వలుస్తోంది. సడెన్ గా గుండె పట్టుకుని ఒరిగిపోయిందట. డాక్టరు దగ్గరకు వెళ్ళే సమయం కూడా లేదంట"  మా తోటి కోడలి విచారం.

గబగబా వెళ్ళాం .
ఎండు గడ్డి పరచి చాప వేసి పడుకోబెట్టేసారు. మనసు పిండినట్లుగా అనిపించింది.
ఇప్పటి వరకూ మనతో కబుర్లు చెబుతూ కలిసి ఉన్న మనిషి హఠాత్తుగా వెళ్ళిపోతే ఎంత నిర్వేదం ఆవహించేస్తుందో కదా!

కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నామంతా!

"ఒరీయ్ , ఈడ టెంటు కట్టారురా భోజనాలు పెడతారు రాండిరా!" అంటూ పరుగెత్తుకు వచ్చేసారు మణి చందూ.
ఒరేయ్ , నువ్వు ఈ కుర్చీలో కూచో , నేను దీంటో కూచుంటా అంటూ హడావిడిగా అటుదిటూ సర్ధుతూ హంగామా చేస్తూ వాళ్ళదైన ప్రపంచంలో ఆటలాడుకుంటున్నారు.

  ఆ ఇద్దరు అన్నదమ్ముల మాటలకు నవ్వొచ్చినా తమాయించుకున్నారంతా.

పరమాత్మునికి ప్రతిరూపాలైన
పసి హృదయాలు అవి , కల్మషం లేనివి.

మరో సెలవు రోజూ ఆటల కోసం వచ్చేసారు.కాస్త నలతగా ఉండి నడుం వాల్చి పట్టించుకోలేదు నేను.

ఓ గంట గడిచాక వచ్చి చూస్తే ఏముంది?
ఇల్లు కాదు , రావణ లంక.

నా అరకేజీ సర్ఫు డబ్బా తొట్టి నీళ్ళకు సమర్పించారు.ఆకులు , పువ్వులు తెంపి , మట్టి ఇసుకతో రంగరించి గోడల్ని అలికేసారు.
జగ్గులతో నీళ్ళు విసురుకున్నారేమో ! టెంట్లు ముద్దగా తడిపేసారు.
అది శుభ్రం చేయాలంటేనే ఏడుపు వచ్చేసింది.

ఒళ్ళు మండి కర్ర పుచ్చుకుని వెంట బడ్డాను. కాళ్ళలో సత్తువ ఉన్నోడు లగెత్తాడు. లేని మణి గాడు దొరికి తన్నులు తిన్నాడు.
సచ్చినోళ్ళారా , ఎంతసేపు నా కొంప మీదనే ధృష్టి అంతా! ఇళ్ళకి చావండీ అనేసి ఆయాసం తీర్చుకున్నాను.
ఏడుస్తూ మణి గాడు వెనక్కి తిరిగి ఓ చూపు ఓరగా , కోరగా చూసాడు.
మండిపోయింది నాకు." గుడ్లు పీకి చేతిలో పెడతా , ఇంకోసారి మా బజార్లో కనపడితే!" ఆవేశం హద్దులు దాటింది నాకు.
వాడు మళ్ళీ మా బజారు వైపు రానే లేదు.
ఎంత విసిగించినా , ఎంత కోపం తెప్పించినా ఓ అరగంటకే మామూలు అయిపోతాను నేను.
ఆ రోజు సాయంత్రం కృష్ణుడి చిలిపి చెష్టల గురించి నాతో చెప్పించుకుని వినేటప్పుడు "చిమ్మామ్మా సర్ఫ్ పారబోసింది కమల్ గాడు , గోడమీద మట్టి పూసింది చందూ . నువ్వేమో మణి గాడిని కొట్టావ్ " మా సాయి నిజం బయట పెట్టేసాడు.


ఏరా అని నేను గదిమితే "మరి  ఏం పెట్టి ఆడుకోవాలమ్మా , మా ఇంట్లో ఆగం చేస్తే మా అమ్మ తొడపాశం పెడుతోంది , అందుకేగా ఇక్కడ ఆడుకుంది" అమాయకంగా సమాధానం ఇచ్చాడు మా కమల్.

కోపం తగ్గి ఆలోచన మొదలైంది.
పాపం  మణి గాడు చిన్నోడు . వాడికేం తెలుసు? నా ఇంటి గాడిదలకే బుధ్ధి లేనప్పుడు ! అనుకున్నాను. ఈసారి వస్తే సారీ చెప్పి , తినడానికి ఏ బిస్కెట్టో , చాక్లెట్టో ఇచ్చేద్దాంలే అనుకున్నాను.
ఓ నాలుగు రోజులు గడిచాయి.

హఠాత్తుగా ఊరెళ్ళే పని పడింది. ఉదయం వెళ్ళి బాగా పొద్దుపోయాక ఇంటికొచ్చాను.
"అమ్మాయ్, మణి గాడు చచ్చిపోయాడు" అంది మా తోటి కోడలు.
నా  నెత్తిన పిడుగు పడినట్లు అనిపించింది.

గుండెలు పగిలినంత బాధ , వేదన. ఆ ఆవేదన చెప్పనలవి కానిదీ , చెప్పుకున్నా తీరనిదీనూ.
రెండు రోజులు జ్వరం కాసిందంట , మూడోరోజు ఆసుపత్రి తీసుకెళ్దామనుకునే లోపే ప్రాణం విడిచాడంట.
ఆఖరు చూపు కూడా దక్కలేదు నాకు.
వాడు వెనక్కి తిరిగి కోపంగా , కాదు నిరసనగా , ఒకింత అసహ్యంగా నావైపు చూసిన చూపు ఇంకా గుండెల్ని మెలిబెడుతూ , చెంప చెళ్ళుమనిపిస్తూనే ఉంది.
భూమి రెండుగా చీలి నేను అందులో కూరుకు పోతే బావుండు అనిపిస్తోంది.
తల ఎత్తుకు తిరగలేకున్నాను.


డబ్బా నిండా బిస్కెట్లు ఉన్నాయి. క్షమించమని అడిగే మనసు నాకుంది కానీ వాడేడి?
ఎటు వెళ్ళాడు?
ఎప్పుడొస్తాడు?
నన్ను తినేస్తున్న ఈ అపరాధ భావం పోయేదెలా?ఈ తప్పుకు శిక్ష ఏది?

మరిన్ని కథలు

unknown persons
అపరిచితులు
- పద్మావతి దివాకర్ల
diary solved families
డైరీ దిద్దిన కాపురాలు
- మీగడ.వీరభద్రస్వామి
great artist
గొప్ప చిత్రకారిణి
- భాగ్యలక్ష్మి అప్పికొండ
perfect decision
సరైన నిర్ణయం
- పద్మావతి దివాకర్ల
name and fame
పేరు ప్రతిష్ఠలు (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
story told by time
*కాలం చెక్కిన కథ*
- భాగవతుల భారతి
health is wealth
ఆరోగ్యమే మహా భాగ్యం
- బొందల నాగేశ్వరరావు