కొత్త దుకాణం - నాగమణి తాళ్ళూరి

new shop

అయ్యో! అయ్యో! ఈ ఉపద్రవమేమిటంటా!
ఉన్నట్టుండీ ఉప్పెన లా పొంగిన ఆవేశమేందుకో అంట!

కలియుగం అంతం అయ్యే రోజులు దాపురించాయో ఏమిటో?

పొరపాటుగానైనా ఓ మాట నోరు జారి అనలేదే!

ఒకవేళ పని ఎక్కువై , ఓపిక నశించి కటువుగా ఏదైనా అనేసినా ఈ మొండి మనిషి నా మాట ఖాతరు చేసింది ఎప్పుడనీ! మారింది ఎన్నడనీ!

ఆయన గారు ఆఫీసు కెళ్ళే రోజుల్లోనైనా ఒకింత బధ్ధకం కనబరిచానేమో గానీ ,సెలవు నాడు తెల్లవారు జామునే నిద్ర లేచి జ్ఞానేంద్రియాలన్నీ కూసింత దగ్గరెట్టుకుని మరీ వండి వడ్డిస్తున్నానే!

ఈ దిక్కుమాలిన
కరోనా వైరస్ దాపురించి జనమంతా ఇళ్ళలో అఘోరించడం మొదలెట్టాక మరీ రెక్కలు ముక్కలు అయిపోయేలా చాకిరీ చేసి తగలడుతున్నానే!

సుష్టుగా ముక్కుల వరకూ దిట్టంగా పట్టిస్తూ " దోశలో ఉప్పు చాలి చావలేదు , చట్నీ కారంగా ఉంది , సాంబారులో పులుపు ఎక్కువైంది , తాలింపులో శనగపప్పు వేయాలనీ , పంటి కింద తగలాలి అని లక్ష సార్లు చెప్పినా లక్ష్యపెట్టి చావవు" మాటల తూటాలు చెవుల్ని చిల్లులు పెడుతున్నా" మౌనమే నీ భాష ఓ మూగ మనసా! " అని పాడుకున్నానే గానీ ఎదురు తిరిగే సాహసం ఏనాడూ చేయలేదే!
మరి ఈనాడు నాకెందుకీ శిక్ష? ఏల ఈ అగ్ని పరీక్ష?

ఎప్పటిలానే ఉదయాన్నే లేచి గ్లాసుడు కాఫీతో మేలుకొలుపు పాడానే!

గుండిగె తో వేడి నీళ్ళుతోడానే!
కండవాలు , సబ్బులు భక్తితో అందించానే!

అరగంటలో అరడజను ఉల్లి దోశల్లోకి గిన్నెడు కొబ్బరి చట్నీ నైవేద్యం సమర్పించానే!

టీ వీ ముందు సుఖాసీనుడై వార్తలు చూస్తూ, అర్ధ నిమీలిత నేత్రాలతో అటు నిద్ర , ఇటు మెలకువ కానీ అవస్ధలో ఊగిసలాడుతున్నాడని టీ వీ సౌండ్ తగ్గించి , ఫాన్ వేగం పెంచి బట్టలు ఉతుకుదామని ఓ అడుగు అటేసి వచ్చేసరికి యుధ్ధ రంగానికి బయల్దేరిన కార్యోన్ముఖుడైన సుశిక్షితుడైన సైనికుడి వలె పాంటూ షర్టూ ధరించి , బెల్టు బిర్రుగా బిగించి రెండు చేతి రుమాళ్ళు కలిపి మూతికి బిగించి , చేతులకు రెండు గ్లౌజులు అనబడు కవచాలు తొడిగి , నల్ల కళ్ళజోడు , శిరస్త్రాణం అనబడు హెల్మెట్ ధరించి బండి తీయబోతుంటే గుండె దడదడలాడదా! భయంతో నా కాళ్ళు వొణికిపోవా!

"అయ్యో అయ్యో ! ఇదేంటండీ , ఏం జరిగింది? ఎక్కడకు బయల్దేరారు? బయట అడుగైనా మోపరాదని రక్షక భటులు కావలి కాస్తూ దొరికిన వాడి పిర్రలు పచ్చడి చేస్తున్నారే! ఆగండి ఆగండి" అని ఆపే యత్నం ఎంత చేసినా వినకుండా కంగారు పడకు "మా పిన్నికి సిలెండర్ ఇచ్చి వస్తాను " అని గీత లో కృష్ణ పరమాత్మ అర్జునుడికి అభయం ఇచ్చిన లెవల్లో ధైర్య వచనాలు పలికి బండి స్టార్ట్ చేసుకు వెళ్ళబోతూ


"వచ్చేటప్పుడు సరుకులు తెస్తాను" అని నా చెవిలో శ్రీలంక బాంబు ఒకటి పేల్చారు.
ఇది ఖచ్చితంగా నా గుండె ఆగిపోయే వార్త. తట్టుకు నిలబడలేని నీరసం కమ్మేస్తున్నా ఆపద వేళ శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది కదా !

అలా తెచ్చేసుకుని అయ్యో, అయ్యో, సరుకులా! ఇదేంఉపద్రవం రా దేవుడా అంటూ , పైకే అనేసుకుంటూ "ఆగండి, ఆగండీ!" అంటూ బండి వెనక పరుగెత్తినా ప్రయోజనం లేకపోయింది.

ఒంటరిగా పది మైళ్ళ దూరంలో ఉండే ఆయన గారి పిన్నికి నిండు సిలెండర్ పంపి పట్టుమని ఇరవై రోజులైనా కాలేదు. ఆవిడకు భేషుగ్గా మరో రెండు నెలలు సిలెండర్ వస్తుంది.

చాదస్తపు మొగుడు చెబితే వినడు , గిల్లితే ఏడుస్తాడు అన్నట్లు ఇంట్లో ఉండేది నలుగురం.

బస్తాల్తో సరుకులు తెచ్చిపోస్తూ ఉంటే సర్దుకోవడానికి డబ్బాలు సరిపోక , గోతాంలో మూట కట్టి పెడితే ఎలుకల ధాటికి తట్టుకోలేక , నిలువ ఎక్కువై పురుగు పట్టిన సరుకులు బాగు చేసుకోలేక చచ్చిపోతున్నాను.

మొన్నటికి మొన్న మా పక్కింటికి వచ్చిన చుట్టం మనిషి అడగనే అడిగింది" వదిన గారూ... మీ అబ్బాయి పెళ్ళి కుదిరిందా , ఏమిటి? అన్నేసి సరుకులు, కూరగాయలు తెచ్చుకుంటున్నారు" అని.

"ఆవిడ అధృష్ట వంతురాలు. ఇంట్లో నుండి కాలు కదిపే పని లేకుండా అన్నీ తెచ్చి పడేస్తాడు వాళ్ళ ఆయన" దీర్ఘాలు తీసుకుంటూ మా పక్కింటి ఆవిడ సమాధానం. పక్కకు తిరిగి మూతి మూడు వంకర్లు తిప్పినట్లే ఉంది.

కడుపు మండిపోయింది.
ఆవిడకేం మాయరోగం వచ్చిందంటా!
బాగానే తెచ్చుకుంటోంది , వండుకు తింటోంది కదా మాపై ఏడుపు ఎందుకంటా!

కమ్మగా పెరుగన్నం తింటూ పక్కనోడి గంజికి ఏడ్చే బుధ్ధులు.
ఛీ..

అయినా మన బంగరం మంచిదైతే ఈ గోల ఉండదుగా!


సంక్రాంతికి తెచ్చిన సరుకులు ఉగాది వరకూ సరిపోయాయి.
మళ్ళీ ఉగాది నాడు తెచ్చుకుని పోసుకుంటిమి కదా!

అయినా బయటకు వెళ్ళిన మనిషి క్షేమంగా కొంప చేరతాడా!

నిత్యావసరాల కోసం పోతున్నా కనికరమన్నది లేకుండా కర్రలతో కళ్యాణం చేసి పంపుతున్నారీ రక్షక భటులు.
ఈయన అన్ని అవయవాలతో సక్రమంగా వస్తాడా!

గుండెలు గుబగుబ లాడుతునే ఉన్నా మధ్యాన్న భోజనాల పనులు చూస్తూ ముక్కోటి దేవుళ్ళకూ ముడుపులు కట్టుకుంటూ గుమ్మానికి చూపులు అతికించాను.

బర్రమని వచ్చింది బండి.
హమ్మయ్యా అని బయటకు పరుగెత్తాను.
యధావిధిగా దిగే సంచులు కావు అవి. మిరపకాయలు ఎత్తే "బోరాలు" అనబడే పెద్ద పెద్ద గోతాలు.

అందుకోబోయాను.
" ఆగు , ఆగు! ముట్టుకోకు. ఆవన్నీ శుభ్రం చేయాలంట. టీవీలో చెప్పారు. బయట నుండి వచ్చాను కదా! నేనే కడుగుతా దూరంగా ఉండు"

అనే మాటకు భయం వేసింది.

మొదటిసారి ఆ మాట విన్నానుగా ! వేయక చస్తుందా!

మొన్న లక్ష్మి ఫోన్ చేసి ఇంట్లో ఉంటే బోర్ కొడుతోందని మా ఆయన అంట్లు తోమి బట్టలు ఉతుకుతున్నాడే! అని పకపకా నవ్వింది.
దాని గొప్ప నా ముందు చాటుకోవడం కోసమే కాల్ చేసిందని తెలుస్తూనే ఉంది నాకు.

మీ ఆయన ఏం చేస్తున్నాడో ! అని ఆరా కూడా తీసింది.

అబధ్ధం ఆడే అలవాటు లేదుగా మనకు.

"భోజనంతో కడుపు నిండక నన్ను దోరగా కాల్చుకు తింటున్నాడు "అన్నాను కసిగా.
ఆ మాటలేమన్నా విన్నాడంటారా?

ఎందుకంత ఆవేశం వచ్చిందంటే ఓ రోజు ఉదయం పదిన్నరకు శోష వచ్చి పడిపోతానేమో అనే భయంతో గబగబా చేసే పని ఆపి పళ్ళు తోమి ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నానో లేదో " ఏమేయ్ వంట అయిందా! ఆకలేస్తోంది" అని పొలి కేక పెడితే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా!

సన్యాసుల్లో కలిసిపోదామా! అనిపించింది కానీ ఆడ సన్నాసులుంటారా అని అనుమానమొచ్చి ఆగాను.

చూపుడు వేలుకి దెబ్బ తగిలితే చిటికెడు పసుపు కూడా రాసుకోలేని మనిషి
లుంగీ పైకి ఎగకట్టాడు. చొక్కా చేతులు మోచేతుల వరకూ ముడిచాడు.

ఓ సంచి బయటకు తీసాడు. అందులో సర్ఫ్ పాకెట్ తీసి సగం ఓ గంగాళం నీళ్ళలో పోసాడు.

మరో గంగాళంలో ఓ డెట్టాల్ సీసా వంపాడు.
మరో గంగాళంలో మంచి నీరు నింపాడు.

సంచి లోంచి నిమ్మకాయలు బయటకు వచ్చి సర్ఫ్ లో జలకమాడి , డెట్టాల్ తో శుభ్రపడి , మంచి నీళ్ళలో శుధ్ధి కాబడి పక్కనే ఉన్న బొచ్చెలోకి దొర్లుతున్నాయి.

ఒకటో రెండో డజన్లు కాదు , ఏకంగా నూటా యాభై నిమ్మకాయలు.
నివ్వెరపోయాను. ఇన్ని ఎందుకంటా?

టీ వీలో చెప్పారంట . విటమిన్ సీ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోమని. ఉదయాన్నే తేనె , నిమ్మరసం కలిపి తీసుకోవాలని.

అయితే మాత్రం అన్ని కాయలా!
ఎక్కడ పెట్టాలి? ఫ్రిజ్ సరిపోదు.

ఓ యాభై కమలాలు , ఓ యాభై చక్కెర కేళీలు , తేనె సీసాలు స్నానం ముగించుకున్నాక నీళ్ళన్నీ ఒంపేసి మరో మారు మిశ్రమాలు తయారు చేసాడు.

టమోటాల రాశి , వంగ ,బెండ, దొండ ,మిర్చి ,దుంప నీళ్ళోసుకున్నాయి.

కొత్తిమీర ,కరివేపాకు, గోంగూర కట్టలు గేదెకు వేసే పచ్చి మేత అంత లావున ఉన్నాయి.
వాటిని ఒలవాలంటే ఓ రోజు పడుతుంది.

కోడిగుడ్లను బాగా రుద్ది కడిగాడేమో ! తెచ్చిన యాభై గుడ్లలో అరడజను చిట్లి కారుతూ పళ్ళాన్నీ తడుపుతున్నాయి. ఆ వాసన వదిలించాలంటే మరో కేజీ సర్ఫ్ అవసరం.

ఓ నూనె పాకెట్ మా ఆయన సుకుమారం తట్టుకోలేక నీళ్ళలోనే కన్నీళ్ళు వదిలేసింది. అదో దండగ.

చట్నీల కోసం కొబ్బరి కాయలు డజను.
ఎవరైనా చూస్తే మీకు సొంతంగా గుడి ఉందా! అని అడగడం ఖాయం.

ప్రోటీన్లు బాగా అవసరం అని చెప్పారంట .

అలసందలు , బొబ్బర్లు , శనగలు , పచ్చి బఠానీలు మూడేసి కిలోల పొట్లాలు తడిగుడ్డతో తుడిపించుకుని గోడ మూలన ఒణుకుతూ కూచున్నాయి.

పొట్లాలు తడిచి పగిలి కిందకు రాలిపోతుంటే ఏం చేయాలో తోచట్లేదు నాకు.
జీడిపప్పు , బాదం , పిస్తా పప్పులు గట్టి పాకెట్ లో ఉండి బతికిపోయాయి.

ఉదయాన్నే వేడినీళ్ళలో పసుపు ఉప్పు వేసుకుని పుక్కిలించమన్నారంట. ఐదు కేజీల ఉప్పు , కేజీ పసుపు అవసరమౌతుందా!

ఇంట్లో ధూపం వేయమన్నారంట. సాంబ్రాణి , గుగ్గిలం , శొంఠి పొట్లాలు ఎండలో కూచున్నాయి.

వాకింగ్ , యోగా చేయమంటామని అదే టీవీలో చెబుతున్నారు.
అవి వినపడవేమి ఈ మనిషికి?

రెండు డ్రమ్ముల నీళ్ళు ఖాళీ చేసి , కొంప అంతా రొచ్చు చేసి, బండి కడిగేసి , బట్టలు తడిపేసి తలస్నానం చేయడానికి వెళ్ళాడు.

గుండె మండిపోయి నేనేడుస్తుంటే కిసుక్కున నవ్వుతున్నాడు పెద్దోడు
నాన్న నిర్వాకం చూసి.

ఆయనకు సలహా కానీ నాకు సాయం కానీ చేయడు.


టపీమని ఒక్కటి పీకాను.

"నన్ను కొడతావేంటమ్మా! పెద్దమ్మా నవ్వుతోంది. ఆమెనూ కొడతావా ! "కోపంగా అంటున్నాడు.

అయ్యో ఆవిడను కొడితే ఎలాగ! అనుకుంటూ

"అక్కా ! నిమ్మకాయలు , కూరగాయలు రెండిళ్ళకు కలిపి తెచ్చాడంట. చెరిసగం చేసుకుందాం రావా!" సాధ్యమైనంత సౌమ్యంగా పిలుస్తూ వాళ్ళింట్లోకి వెళ్ళాను.

"మీ బావ ఇప్పుడే వెళ్ళాడమ్మాయ్ సరుకులకు" చావు కబురు చల్లగా చెప్పింది.

నెత్తిన గంప పెట్టుకుని ఊళ్ళో అమ్మమంటారా లేక తోపుడు బండి బెటర్ అంటారా! చెప్పండి ప్లీజ్....

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల