లాక్‌డౌన్ 3.0 - పద్మావతి దివాకర్ల

lockdown 3.0

కృపాకర్ తన ఇంట్లో కూర్చొని తన మిత్రుడు శంభు కోసం ఎదురుచూస్తున్నాడు. శంభు వచ్చిన తర్వాత అతని కార్లో వెళ్ళి ఇంకో మిత్రుడైన విజయకుమార్‌ని కూడా పికప్ చేసుకొని తమ పని ప్రారంభించాలి. ఈ ముగ్గురే కాకుండా వాళ్ళకి ఇంకో ఐదుగురు మిత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా తమవంతు సమాజసేవ చేయడానికి ఉత్సాహం చూపారు. అందరూ కలసి ఆ పట్నం చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి అక్కడ బీద వాళ్ళకి బియ్యం, పప్పులు ఇతర నిత్యావసర వస్తువులతో పాటు కొద్దిగా డబ్బులు కూడా సహాయం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రేషన్ వస్తున్నా అది అందరికీ చేరడం లేదు, ప్రత్యేకించి రేషన్ కార్డులు లేనివాళ్ళూ, వలస కూలీలకు. అయినా పెద్ద కుటుంబాలలో ఆ రేషన్ ఏ మూలకి సరిపోతుంది? అందుకే కృపాకర్ తన స్నేహితులతో కలిసి ప్రతీరోజూ భోజనం పొట్లాలు, ఉచిత రేషన్ అందిస్తున్నాడు.

కృపాకార్ సిటీలో కాలేజి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మంచి అద్భుదయ భావాలగల వ్యక్తి. కృపాకర్ స్నేహితుడు శంభుకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. సిటీ శివార్లో స్థలం చవగ్గా కొని అపార్ట్మెంట్స్ కట్టి బాగా గడించాడు. అంతేకాక అతనికి సిటీలో మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు, అన్ని ప్రముఖ సెంటర్లలో ఫారిన్‌లిక్కర్ షాపులు ఉన్నాయి. అంతేకాక అతనికి తనవద్ద ఉన్న నల్లధనం తెల్లధనంగా మార్చుకొనే అవసరం కూడా ఉంది. పైగా ఈ మధ్యనే క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కృపాకర్‌కి ఇలాంటి విపత్కర స్థితిలో పేదలకు సమాజ సేవ చేయాలని ఆశయం ఉన్నా పెద్దగా అర్థిక బలంలేదు. అందుకే కృపాకర్ శంభుని కలసి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించాడు. మొదట్లో శంభు ఈ కార్యక్రమానికి పెద్దగా ఇష్టపడకపోయినా, ఆ తర్వాత ఉత్తరోత్తరా ఇది తన రాజకీయ భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుందని భావించి కృపాకర్‌కి తన మద్దతు తెలిపి ఆర్థికంగా వెన్నంటి నడిచాడు. పనిలో పని, తన నల్లధనంకూడా తెల్లధనంగా మార్చుకోవచ్చని అనుకున్నాడు శంభు. అందుకే కృపాకర్ మాటలకి ఒప్పుకున్నాడు. క్రమంగా సమాజసేవ చేయాలన్న ఆశయంగల అతని మిగతా స్నేహితులు కూడా కృపాకర్‌తో చేతులు కలిపారు. తమవంతు సహాయ సహకారాలు అందించారు.

కరోనా వైరస్‌వల్ల దేశంలోని అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. రైళ్ళు, బస్సుల రాకపోకలెలాగూ లేవు. కనీసం ఆటోలు కూడా వెళ్ళడానికి అనుమతించ బడటం లేదు. చిన్నపెద్ద పరిశ్రమలు, దుకాణాలూ సర్వం మూసివేతకు గురయ్యాయి. ప్రజలందరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఇప్పటికే రెండు దఫాలు లాక్‌డౌన్ ప్రకటించింది. అయినా కరోనా అదుపులోకి రాకపోవడంతో మూడోదఫా కూడా ప్రకటించింది. కొన్ని నిబంధనలు సడలించినా లాక్‌డౌన్ మూడోసారి కూడా యధాతధంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ 3.0 లో కూడా కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే నలభై రోజులుగా ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉండటం వలన ఆదాయ వనరులు కూడా మూసుకు పోయాయి. డబ్బులున్నవారికి తమ వద్ద డబ్బులున్నా వీధిలోకి వెళ్ళేందుకు, కావలసినవి తెచ్చుకొనేందుకు అనుమతి లేదు. కరోనాకి పేద, ధనిక, పెద్ద, చిన్న తేడా ఏమీ లేదు. అందర్నీ కబళించేస్తోంది. పేద ప్రజల పరిస్థితి అయితే మహా దారుణం. రోజు కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొనేవారు చేతిలో డబ్బులులేక అల్లాడిపోతున్నారు. యాచకుల సంగతి సరేసరి!

ఈ విపత్కర పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి సహాయ పడగలుగుతున్నందుకు కృపాకర్‌కి చాలా ఆనందంగా ఉంది. లాక్‌డౌన్‌లో ఏ ఒక్కరూ కూడా ఆకలితో చనిపోకూడదన్న లక్ష్యంతో ప్రతీరోజూ రెండుమూడు గ్రామాలకు వెళ్ళి తమ వంతు సహాయం అందజేయడానికి వెళ్తున్నారు ఆ మిత్ర బృందం.

మళ్ళీ వాచీ చూసుకున్నాడు కృపాకర్! సమయం పదిగంటలు దాటింది. సరిగ్గా అప్పుడే శంభు ఇంటిబయట కారు ఆపి హార్న్ మోగించాడు. అప్పటికే తయారుగా ఉన్న కృపాకర్ వెంటనే వీధిలోకి బయలుదేరాడు.

"ఏమిట్రా, ఇవాళ ఇంత ఆలస్యం చేసావు?" అడిగాడు కృపాకర్ కార్‌లో కూర్చుంటూ.

"ఇవాళనుండి కొన్ని నిబంధనలు సడలించారు కదా! వెచ్చాలు, కాయగూరల షాపులకు పన్నెండు గంటలవరకే అనుమతించారు కాని, కొత్తగా మద్యం దుకాణాలు మాత్రం సాయంకాలం ఏడుగంటలవరకూ అనుమతించారు. నా షాపింగ్ కాంప్లెక్స్, మిగతా వ్యాపారాలెలాగూ దెబ్బ తిన్నాయి. నా ముఖ్య వ్యాపారమైన రియల్ ఎస్టేట్ కూడా మూతబడింది కదా మరి! ఇలాగైతే ఎలా అని ఆలోచిస్తుండగా ఈ శుభవార్త వచ్చింది. మద్యం షాపులు ఇవాళనుండి ఇక తెరవవచ్చు. అందుకే సిటిలో ఉన్న నా లిక్కర్ షాపులన్నింటినీ తెరవడానికి తగిన ఏర్పాట్లు చేసి బయలుదేరాను, అందుకే కాస్త ఆలశ్యమైంది." అన్నాడు శంభు.

"అయినా ఇప్పుడు మద్యం షాపులు తెరిచి మాత్రం ఏం లాభం? ఈ లాక్‌డౌన్‌వల్ల ఎన్ని రోజులైంది అందరూ పనులకి వెళ్ళి, ఎవరివద్ద మాత్రం డబ్బులుంటాయి? ఎవరో మద్యంలేకపోతే జీవించలేని వాళ్ళు మాత్రం కొంటారేమో?" అన్నాడు కృపాకర్.

చిన్నగా నవ్వి ఊరుకున్నాడు శంభు.

ఇంకో గంటలో మిగతా మిత్రులు కూడా కలిసారు. అందరూ కలసి మూడు వాహనాల్లో తీసుకెళ్ళవలసిన వస్తువులు లోడ్‌చేసుకొని పక్కనున్న ఓ ఊరివైపు బయలుదేరారు.

తాము తెచ్చిన వస్తువులు పంచడానికి బయటకు తీసారు. ప్రతీరోజూ అయితే, వాళ్ళ వాహనం చూడగానే తగిన దూరం కూడా పాటించకుండా గుమిగూడిపోయే వాళ్ళందరూ ఇవాళ ఏమైందో మాత్రం అరగంట కావస్తున్నా ఏ ఒక్కరూ కానరాలేదు. అరగంట అక్కడే వేచి చూసి, బహుశా ఎండవలన రాలేక పోయారేమోనని ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి బయలుదేరారు మిత్రబృందం.

అయితే ఆశ్చర్యంగా, ఆ ఊళ్ళో మహిళలు, వృద్ధులు చిన్నపిల్లలు తప్పించి మగవాళ్ళెవరూ కానరాలేదు. ఏమోమరి, పొలంపనులకు గాని, ఇంకే పనులకుగాని వెళ్ళి ఉంటారని అనుకున్నారు. అయితే పొలం పనులకు మాత్రమే అనుమతి ఉందికదా అనికూడా తలచారు.

అయితే వాళ్ళు వెళ్ళిన మూడు గ్రామాల్లోని పరిస్థితి కూడా అంతే, ఎక్కడా మగవాళ్ళు మాత్రం కానరాలేదు. అందరూ పొలం పనులకే వెళ్ళుంటారా అన్నది నమ్మశక్యంగాలేదు కృపాకర్‌కి.

ఆఖరికి ఉండబట్టలేక ఒకళ్ళింట్లో అడిగాడు కృపాకర్, "ఏమమ్మా! ఊళ్ళో మగవాళ్ళెవరూ కనబడటం లేదు? అందరూ పొలంపనుల్లోకి వెళ్ళారా ఏమిటి?"

"లేదు బాబూ! ఏం చేస్తాం! ఇదంతా మా ఖర్మ! ఇన్నాళ్ళనుండి ఇంట్లోనే ఉండేవాళ్ళు అందరు మగవాళ్ళూ, ఇప్పుడు మద్యం షాపులు తెరిచారు కదా. అందుకే, వాళ్ళందరూ పొద్దు పొడవకముందే పట్నం వెళ్ళారు." అందామె తనకిచ్చిన వస్తువులు తీసుకుంటూ.

నివ్వెరపోయారు మితృలందరూ. ఎవర్ని ఆదుకోవడానికి తాము శ్రమిస్తున్నారో వాళ్ళందరూ బార్లముందు బారులు తీసి మద్యంకోసం నిలబడ్డారన్న సత్యం మింగుడుపడలేదు కృపాకర్‌కి. అయితే సిటీకి తిరిగివచ్చిన తర్వాత శంభుకి సంబంధించిన మద్యం షాపులముందు రెండు కిలోమీటర్లు పొడుగునా నిలబడ్డ వాళ్ళని చూస్తూనే యదార్ధం గ్రహించాడు కృపాకర్. అయితే ఇదంతా ముందే ఊహించిన శంభు మాత్రం చిద్విలాశంగా చిరునవ్వు నవ్వుతున్నాడు. లాక్‌డౌన్ 3.0 లో సడలించిన నిబంధనలవల్ల, నెలరోజులపైగా అతను ఖర్చుపెట్టిన డబ్బులు వడ్డితో సహా తిరిగి అతని వద్దకే చేరుతోంది. పైగా అతని నల్లధనం తెల్లగా మారింది కూడా. శంభు మాత్రం తన పెట్టుబడి రాబెట్టుకోవడంతో పాటు ఆ ఊళ్ళల్లో కొద్దో గొప్పో పేరు కూడా సంపాదించుకున్నాడు. అది అతనికి రాజకీయంగా భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. అప్పటికి విషయం గ్రహించిన కృపాకర్ బుర్ర గిర్రున తిరిగింది. తను చేస్తున్నదంతా వృధా ప్రయాసా అని అనిపించిందో క్షణం. 'ఈ కారణంగా తమలాంటి వాళ్ళుగాని, స్వఛంద సంస్థలు గానీ సహాయం అందించడం మానేస్తే, నిజంగా అన్నార్తులైనవారి పరిస్థితి ఏమిటి?' అని మనసులో అనుకొని మరి ఇక ఆలోచించలేకపోయాడు కృపాకర్.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి