హ్యాపీడేస్ - శింగరాజు శ్రీనివాసరావు

happy days

అప్పుడే వాకింగ్ ముగించుకుని వచ్చి పేపర్ చూస్తున్న నా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది నా మనుమరాలు స్నిగ్ధ " తాతయ్యా.. నీకు ఫోన్" అంటూ

ఎవరా అని చూశాను. రమేష్, తిరుపతిలో నా కొలీగ్

" హలో రమేష్ ఎలా ఉన్నారు? చాలా రోజుల తరువాత గుర్తొచ్చాను"

" నమస్తే అన్నా. ఎక్కడన్నా నన్ను తీసుకెళ్ళి సికిందరాబాద్ వేశారు. ఫ్యామిలీ తిరుపతి, నేను సికిందరాబాద్. చచ్చిపోతున్నాను. సారీ అన్నా"

" భలేవాడివే దానికి సారీ ఎందుకు. ఎలా ఉన్నారు మన మిత్రబృందం? అంతా కుశలమేనా?"

" అంతా హ్యాపీ అన్నా. మూర్తి నీతో ఒక విషయం మాట్లాడాలట. సాయంత్రం ఫోను చేస్తానన్నాడు. మీరు ఏ సమయంలో ఖాళీగా ఉంటారో చెప్పమన్నాడు"

" అంతా ఖాళీనేగా. బయటకు వెళ్ళడానికి కూడ లేదు కదా అంతా లాక్ డౌన్. ఎప్పుడైనా ఓకె. ఇంకా ఏమిటి విశేషాలు. మన హ్యపీడేస్ టీమ్ అంతా బాగున్నారా"

" అంతా క్షేమమేనన్నా. మొన్న మన బెనిఫిట్ ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని రమేష్ బాబు మోకాలి ఆపరేషన్ కు ఇచ్చాము. ఆపరేషన్ విజయవంతమైందని అతను సంతోషంగా చెప్పాడు. మీ ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తున్నది. థాంక్స్"

" అది మనందరి ఆలోచన. నా ఒక్కడిది కాదు. ఏదో మనకు చేతనైనంత. మొన్ననే చిన్నమ్మాయి, మనవరాలు వచ్చారు, బెంగుళూరు నుంచి. ఈ హడావుడి సద్దుమణిగిందాక ఉంటారు"

" అవునా. సరే అన్నా ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు. సాయంత్రం కాల్ చేస్తాము" అని పెట్టేశాడు రమేష్.

మనసు నాలుగేళ్ళ వెనక్కు వెళ్ళింది.
****
చెన్నైలో పదవీ విరమణ చేసి ప్రకాశం జిల్లాలో మా స్వంత ఊరికి పది రోజుల క్రితం తట్టా బుట్టా సర్దుకుని వచ్చాను. పిల్లలకు పెళ్ళిళ్ళయిపోయిన తరువాత మేమిద్దరమే అయిపోయాము. కాలక్షేపానికి గ్రంథాలయం బాటపట్టాను నడుచుకుంటూ. జేబులో చరవాణి శబ్దం చేయడంతో తీశాను. రమేష్ నుంచి ఫోను

" హలో రమేష్. ఎలా ఉన్నావు? ఆఫీసునుంచేనా?"

" అవునన్నా బాగున్నాను. మీరెలా ఉన్నారు?"

" అంతా ఓకె. ఏమిటి ఈ టైమ్ లో కాల్ చేశావు"

" ఏమి లేదన్నా. వచ్చే ఆదివారం మన శెట్టిపల్లి శాఖలో 1990 నుంచి 2000 వరకు పనిచేసిన క్లరికల్ స్టాఫంతా కలసి చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము. ఇది మన మూర్తి ఆలోచన. ఎందుకంటే ఆ పదేళ్ళు మనమంతా ఎంత సంతోషంగా గడిపామో చెప్పలేము. ఒక రకంగా అది స్వర్ణయుగం. అందుకని " హ్యాపీడేస్" పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి అందరినీ లింక్ చేశాము. ఒకసారి అందుబాటులో ఉన్న అందరమూ కలిస్తే మనసుకు బూస్ట్ ఇచ్చినట్టవుతుందని ఆలోచన. మీతో మాట్లాడి ఫైనలైజ్ చేద్దామన్నాడు మూర్తి. ఏమంటారు?"

" గుడ్ ఐడియా. ఇప్పటిదాకా పాఠశాల, కళాశాలలలో చదివిన పాత విద్యార్థులే సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇప్పుడు మీరు ఉద్యోగస్థులకు కూడా. ఇదోక సెన్సేషన్ కదా. అలాగే చేద్దాం. మూర్తి చెప్తే ఇక తిరుగుంటుందా. అది అప్ డేటెడ్ బుర్ర. అందరికీ చెప్పండి తేదీని నిర్ణయం చేసి. నేనూ వస్తాను"
మనసులో చాలా ఆనందంగా వుంది. అయిదేళ్ళు కలిసి పనిచేసిన వారిని మరల కలవబోతానని.

" సరే అన్నా. అలాగే చెప్తాను. ఆ రోజు అందరం కలిసి మాట్లాడుకుందాం. ప్రణాళికలేమైనా అమలు చేయడానికి వీలవుతుందేమోనని. థాంక్స్ అన్నా" అని పెట్టేశాడు రమేష్.

మనసుకు ఎక్కడలేని హుషారు వచ్చింది.
*******

తిరుపతిలోని ఒక మూడు నక్షత్రాల హోటల్ లో సుమారు పాతిక మంది వరకు కలిశాము. ఆ రోజుల్లో సహజంగా గుమాస్తాగా ఒక శాఖలో చేరితే కనీసం ఒక పది సంవత్సరాల పాటు బదిలీ లేకుండా అక్కడే ఉండేవాళ్ళం. అందువలన ఒక అయిదారుగురు తప్ప అందరూ నాకు పరిచయమున్నవారే ఉన్నారు. అలాటి కొత్తముఖాలను పరిచయం చేసే విధంగా అందరం ఎవరికి వాళ్ళం లేచి పరిచయాలు చేసుకున్నాం. ఎంతయినా ఒకే జాతి పక్షులం కదా ఇట్టే కలిసిపోయాం. మీటింగ్ మొదలు పెట్టారు

ముందుగా కన్వీనర్ మూర్తి మాట్లాడరు.
" ఫ్రెండ్స్. నేను పన్నెండు సంవత్సరాలనుంచి ఇదే బ్రాంచిలో పనిచేస్తున్నాను. నాతో పాటు అటుయిటుగా రమేష్, హరి, సాగర్, సుబ్బు ఇలా ఒక పదిమంది వరకు ఇక్కడే పనిచేస్తున్నాము. మిగిలిన వారు కూడా కనీసం అయిదేళ్ళు తగ్గకుండా పనిచేసే ఉంటారు. మా పదిమంది మాత్రం అందరితో కలిసి పనిచేశాం. మన మధ్య ఎలాటి భేషజాలు లేకుండా ఒక కుటుంబంలాగా కలసిపోయాం. విచిత్రమేమిటంటే మనలో చాలా మంది అధికారులై బయటకు వెళ్ళినా ఈ రోజుకు కూడా వాళ్ళు మన రమేష్ తోనో, నాతోనో, సాగర్ తోనో, ఎవరితో ఒకరితో టచ్ లోనే ఉన్నారు. కుశలాలు అడుగుతూనే ఉన్నారు. కాకపోతే కలవడం జరగడం లేదు. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. మనం పనిచేసిన ఆ రోజులు స్వర్ణయుగమే మనకు. పనిలోగాని, సందడిలోగాని, కష్టాల్లోగాని, బాస్ లతో గొడవపడడంలో గాని, విడిపోయింది లేదు. రెండు గ్రూపులు లేవు. అందుకని ఆ రోజులు గుర్తు చేసుకోవడానికి ఒక సమ్మేళనం ఏర్పాటు చేద్దామని మాకు ఆలోచన వచ్చింది. ఇదొక కొత్త ట్రెండు సెట్టింగ్ అవుతుందనిపించింది. ఫోను చేసి చెప్పగానే అందరూ స్పందించారు. రఘు, రమణ తప్ప అందరం వచ్చినట్లే. వ్యక్తిగత కారణాల వలన వారు రాలేకపోయారు. ఇప్పుడు మనం మన అనుభవాలను ఒకసారి నెమరు వేసుకుందాం" అని చెప్పి అందరినీ చెప్పవలసినదిగా కోరాడు.

ఒక్కొక్కరు చెప్పడం ఆరంభించారు. అందరినోళ్ళలోను ఎక్కువగా కదలిన పేరు రమేష్. కారణం అతను ఆ పది సంవత్సరాలు తిరుగులేని నాయకుడు. ఆ బ్రాంచి లోకల్ సెక్రటరి. తలలోని నాల్కలా ఉండేవాడు. అందరినీ వరుసలు పెట్టి పలకరిస్తూ, ఎవరి సమస్యనైనా తన సమస్యగా తీసుకుని దానిని పరిష్కరించే వరకు నిద్రపోయేవాడు కాదు. మరీ కొందరైతే కుటుంబ సమస్యలను కూడ అతనితో పంచుకుని సలహాలు కూడా తీసుకునే వారని వారి మాటలలో తెలిసింది. నాకు కూడ రమేష్ చాలా సహాయం చేశాడు. నేను బదిలీ మీద అక్కడికి వెళ్ళినపుడు ఇల్లు చూడడం, పిల్లలకు అడ్మిషన్ లో సహాయడటం, ఒకటేమిటి అక్కడినుంచి నా బదిలీ విషయంలో కూడ అతని పాత్ర చెప్పలేనంత. ఇంకొందరి మాటలలో అర్థమయింది ఆర్థిక అవసరాలను కూడ తీర్చాడని. అంత మంచి మనిషి రమేష్. అందుకే ఇప్పటికీ అందరికీ అతని తోటి అనుబంధం కొనసాగుతూనే ఉంది.

మా బ్యాచ్ మొత్తంలోకి విదూషకుడు సుబ్బు. ఎంత సీరియస్ టాపిక్ జరుగుతున్నా, దాన్ని తన సహజ శైలిలో నవ్వు కింద మార్చి సందర్భాన్ని తేలిక చేసి, అందరి ముఖాలలో నవ్వులు పూయిస్తాడు. అతను చెప్పే ఒక మాట నాకు బాగా నచ్చుతుంది.

" సమస్య అనేది ప్రతి మనిషి జీవితంలో సాధారణం. చేతనైతే పరిష్కారం ఆలోచించాలి. లేదంటే అలా వదిలేయాలి. కాలక్రమంలో అదే పరిష్కారమవుతుంది సమస్య అని ఏడుస్తూ ఉంటే నీకు శాంతి ఉండదు, సమస్యకు పరిష్కారమూ దొరకదు. జీవితం చిన్నది భయ్యా. లెట్ అజ్ ఎంజాయ్"

అందులో ఎంతో జీవితసత్యముంది. అతను ఎంత పని ఒత్తిడి ఉన్నా చెదరని చిరునవ్వుతో ఉంటాడు

ఒకరోజు హరి అడిగాడు

" ఒరే సుబ్బు. కౌంటరు ముందు అంతమంది జనం ఉన్నా, నువ్వు జోకులేస్తూ ఉంటావే గానీ, ఒక్కసారి కూడ పని ఎక్కువని అనిపించదా నీకు"

" పని ఎక్కువని ఏడిస్తే, మేనేజర్ ఏమన్నా జాలి చూపించి ఇంకో కౌంటర్ పెట్టడు కదా. అయినా ఇదంతా మొదటివారం వరకే కదా. నా పాలసీ ఒకటే హరీ. పని చేయడం తప్పదని తెలిసినపుడు, ఆ చేసే పనిని నవ్వుతూ చేయాలి. ఏడుస్తూ చేయకూడదు. దాని వలన నీరసం, రక్తపోటు తప్ప ఏమీ రాదు. పనిని ఎంజాయ్ చేస్తూ చేయాలి బ్రో" అని సమాధానమిచ్చేవాడు.

ఆలోచనలో పడ్డ నన్ను ఈ లోకంలోకి పడేశాడు సుబ్బు.

" ఏరా శీనయ్యా. కృష్ణవేణి గుర్తొచ్చిందా. ఎంతమంది వున్నా వెతుక్కుంటూ నీ దగ్గిరికొచ్చేది. నువ్వు లేకుంటే సాగర్ గాడు. ఆ పిల్ల కంటికి మేమెవరమూ ఆనకపోతిమి. మూర్తి గుర్తుందా నీకు" అన్న సుబ్బు మాటలతో ఉలిక్కిపడ్డాను.

" శీను బ్రాంచికి వచ్చిన రోజే చెప్పా. నువ్వూ, సాగర్ కలిస్తే కొంప కొల్లేరేనని"

అంతా ఘొల్లున నవ్వారు.

" అసలు చేసే గోలంతా మీదే బ్రాంచిలో, పాపం నోరు లేని వాళ్ళ మీదనా నిందలు. మాకు తెలుసేలే మూర్తి సార్. సుబ్రహ్మణ్యం సార్ ఆడుకోనిది ఎవరితోటి. అందరినీ ఆట పట్టిస్తాడు కదా" మాకు సపోర్ట్ వచ్చింది సునంద.

" అంతేలే మేడమ్. ఆడపిల్లల సపోర్టంతా వాళ్ళకే"
అన్నాడు రమేష్.

అందరం హాయిగా నవ్వుకున్నాము.

ఇంతలో టీ రావడంతో అందరం టీ తాగే పనిలో పడ్డాం. తరువాత లేడి స్టాఫ్ మాట్లాడుతూ ఆ రోజుల్లో వాళ్ళనుభవించిన స్వేచ్ఛ తరువాత ఏ బ్రాంచిలో దొరకలేదని, మా అన్నదమ్ములతో ఉంటే ఎంత జాలీగా వుండేదో మీతో అంత సంతోషంగా ఉండేదని సంబరంగా చెప్పారు. రమేష్ వంటి నాయకుడు మాకు ఎక్కడా తారసపడలేదని చెప్పారు.

అందరూ కలసి చివరగా రమేష్ కు మైకు ఇచ్చారు.

" అందరికీ పేరు పేరునా ధన్యవాదములు. మా ఆలోచనలకు ఊతమిచ్చి, మా పిలుపును మన్నించి వచ్చిన ఆత్మీయులందరికీ మరొకసారి స్వాగతం. నన్ను మీరు ఇంతగా గుర్తు పెట్టుకోవడం మీ సంస్కారమే గాని, నా గొప్పతనం కాదు. నేను మీ కుటుంబంలో ఒకడిని అన్న భావనతోనే చేశాను. మీరు కూడ నన్నంతలా ఆదరించారు. ఉదాహరణకు శ్రీనివాస్ గారిని తీసుకుందాం. . మనమంతా ఈ చుట్టు పక్కల వాళ్ళమే. ఆయన వేరే జిల్లా నుంచి వచ్చారు. ఆయనకు ఇల్లు కూడ మా ఇంటికి దగ్గరలో దొరికింది. మా ఆవిడకు సుస్తీ చేసి మూడు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్నపుడు, మాకు ఆ కుటుంబం చేసిన సహాయం ఇప్పటికీ మర్చిపోలేము. సొంత తోడబుట్టిన వాడిలా ఆదుకున్నాడు. అలాగే మూర్తి, నాయుడు, హరి, ఒకరని కాదు అందరమూ ఒకరికి ఇబ్బంది వస్తే ఇంకోకరు ఆ కష్టాన్ని పంచుకునేవారు. మేడమ్ చెప్పినట్లు అంతా ఒక కుటుంబంలాగ కలిసిపోయాం. అందుకనే ఈ రోజుకూ ఆ రోజులను మర్చిపోలేక పోతున్నాం. ఇప్పుడు వచ్చే వారిలో ఆ ఐకమత్యం లేదు. అంతా చుట్టూ గోడలు కట్టుకుని ఐసొలేటెడ్ గా ఉండిపోతున్నారు. దానికితోడు సెల్ ఫోనొకటి. వెలుపలే కాదు లోపల కూడ ఎటువంటి అనుబంధాలు లేవు. అంతా మెకానికల్. అందుకే మనం ఇలాటి సమ్మేళనాలను కనీసం సంవత్సరానికి ఒకసారైనా జరుపుకుంటే, మన మనసులు కాస్త రీఛార్జ్ అవుతాయని నా నమ్మకం. ఈ సందర్భంగా మరొక విషయం ప్రస్తావించాలనుకున్నాము. మొన్న మన దగ్గర మెసెంజర్ గా పనిచేసిన శేషయ్యకు కాలొకటి తొలగించారు. అతను తెలుసుకోలేక పోవడమో, నిర్లక్ష్యమో గాని డయాబెటిస్ విపరీతంగా పెరిగి, విధిలేని పరిస్థితులలో అలా చేయవలసి వచ్చింది. మొత్తం మూడు లక్షలు ఖర్చయితే, అందులో బ్యాంకు రెండు లక్షలు ఇచ్చింది. మిగిలిన సొమ్ముకు ఇబ్బంది పడుతుంటే, మూర్తి మనకు దగ్గరగా ఉన్న కొంతమంది స్టాఫ్ దగ్గర కలెక్ట్ చేసి సర్దుబాటు చేశాము. ఇది మన కుటుంబంలోని వ్యక్తికి మనం చేసే కనీస సాయమనిపించింది. ఇలాటి సంఘటనలు భవిష్యత్తులో తారసిల్లితే, అది మనలో ఎవరికైనా కావచ్చు, మన దగ్గర పనిచేసిన వారికెవరికైనా కావచ్చు, కొంత రిజర్వ్ ఫండ్ ఉంటే బాగుండుననిపించింది. దానికని ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. అసలు ఈ ఆలోచన సరైనదేనా? ఆ విషయం కూడ చెప్పండి. ఇది నాకు, మూర్తికి వచ్చిన ఆలోచన. మీరెలా నిర్ణయిస్తే అలా?" అని చెప్పి కొంచెంసేపు మౌనం వహించాడు.

అందరినుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాని ఫండ్స ఎలా వసూలు అనేదానిలో కొంత అయోమయం కనిపించింది. దానికి పరిష్కారాన్ని నేను సూచించాను.

" ఒక పని చేద్దాం. బెనిఫిట్ ఫండ్ ఖాతా ఒకటి తెరిచి మనకు జీతాలు రాగానే, నెలకు ఇంత అనుకుని ఆ ఖాతాకు బదిలీ చేద్దాం. దానికి ఎవరో ఇద్దరిని జాయింట్ ఆపరేషన్ క్రింద గుర్తించి, అవసరమైనపుడు వాటిని తీసి అవసరానికి వాడేటట్లు ప్లాన్ చేద్దాం. ఏమంటారు?"

అందరూ ఆమోదించారు. సర్వీసులో ఉన్నవారు నెలకు వెయ్యి రూపాయలు, రిటైరయినవారు అయిదు వందలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించాము. హరి మరొక సలహా ఇచ్చాడు. ఏదైనా ప్రకృతి విపరీతాలు సంభవించినపుడు కూడా, దీనిలో కనుక సొమ్ము అదనంగా ఉంటే మన హ్యాపీడేస్ తరుఫున కొంత ఆర్థికసహాయం ప్రజలకు చేద్దాం. అది సామాజిక సేవ చేసినట్లు కూడ అవుతుంది అన్నాడు.

ఆ ఆలోచన కూడ అందరికీ బాగా నచ్చింది.

అందరికీ కృతజ్ఞతలు చెప్పి నాయుడు సమావేశాన్ని ముగించాడు.

భోజనాలు కాగానే అందరం వెనుదిరిగాము మనసులో కించిత్తు బాధతో.

****
భోజనాలు చేసి వరండాలో కూర్చున్నాను. ఇంతలో ఫోను మ్రోగింది.

" హలో "

" శీనూ, నేను మూర్తిని. ఎలా ఉన్నావు? ఫోను చేద్దామంటే తీరిక దొరకడం లేదు. బ్రాంచి మేనేజరుగా కడప వేశారు. బాగా బిజీ. ఫ్యామిలీ షిఫ్ట్ చెయ్యలేదు. వారం వారం వచ్చిపోతున్నా. అందుకే కుదరలేదు. ఇప్పుడు ఈ కరోన వచ్చింది, టోటల్ బంద్. మీ పరిస్థితి ఏమిటి"

" ఏముంది మూర్తి. మాది అదే పరిస్థితి. అంతా ఓకె. ఉదయం రమేష్ ఫోను చేశాడు. ఏమిటి ఏదో అడగాలన్నావట"

" ఏం లేదబ్బా. ఈ కరోన సమయంలో పేదవారికి ప్రధానమంత్రి సహాయనిధికి మనవంతుగా కొంత మన బెనిఫిట్ ఫండు నుంచి ఇద్దామని ఇక్కడ ఉన్నవారు అంటున్నారు. ఇది కూడ అనుకోని విపత్కర పరిస్థితే కదా. మనవైపు నుంచి ఒక యాభైవేలు ఇస్తే ఎలా ఉంటుంది అని. అలా ఇచ్చినా కూడా మూడు లక్షలు బ్యాలెన్స్ మిగిలే ఉంటుంది ఖాతాలో. మీతో కూడ ఒక మాట చెప్పి చేద్దామని. మాలో కాస్త పెద్ద తలకాయ నువ్వే కదా. మిగిలిన వారికి కూడ ఫోను చేస్తున్నాను. మన ఆలోచన కరెక్టేనా అని"

" భలేవాడివే మూర్తి. ఇది చాలా అవసరమైన సమయం. యాభై కాదు, వీలుంటే లక్ష రూపాయలు పంపండి. నా వైపు నుంచి నో అబ్జెక్షన్. బహుశా ఎవరూ కాదనరు. ఇది సామాజిక బాధ్యత. ప్రొసీడ్ అయిపోండి"

"థాంక్స్ శీను. మిగిలిన వారిని సంప్రదించి యాభైవేలు కానీ, లక్ష గాని నిర్ణయించి పంపుతాము. ఈ లాక్ డౌన్ అంతా పూర్తయిన తరువాత మరల మనమంతా ఒకసారి కలుద్దాం. గుడ్ నైట్" ఫోను పెట్టేశాడు మూర్తి.

మా మధ్య జరిగే అవాంఛనీయ సంఘటనల కోసమే కాకుండా దేశంలో ఏర్పడే అవాంతరాల వల్ల తిండి తిప్పలకు బాధపడే పేద జనానికి మా ఫండు ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందమేసింది.

పది గంటల వార్తలు వినేసి పడుకుందామని టెలివిజన్ దగ్గరికి చేరాను. వార్తల మధ్యలో వచ్చిన వార్త విని చలించిపోయాను.

" తిరువణ్ణామలైలో దేవాలయం ముందు యాచన చేసే ఒక యాభై సంవత్సరాల బిచ్చగత్తె, అప్పటి వరకు తను సంపాదించిన సుమారు అరవై వేల రూపాయలను, లాక్ డౌన్ కారణంగా దేవాలయాలు మూతబడినందు వలన, తినడానికి తిండి లేక ఇబ్బందిపడే ఆ ఊరిలోని సాటి యాచకులకు భోజన వసతి కల్పించమని, ఆ సొమ్మును కలెక్టరు గారికి అందించిందని ఇప్పుడే తెలిసింది. ఆమె విశాలమైన హృదయానికి కలెక్టరు గారు అచ్చెరువంది, ఆమెను కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడ తన వంతు బాధ్యతగా తన రెండు నెలల జీతాన్ని ముఖ్రమంత్రి రిలీఫ్ ఫండుకు ఇస్తున్నట్లు ప్రకటించారు"

మానవత్వమంటే అది. కోట్లు మూలుగుతున్నా పైసా రాల్చని సెలబ్రిటీలు, కష్టకాలంలో కూడ ప్రజల సొమ్మును దోచుకోవాలనే రాజకీయ నాయకులు, అవసరాన్ని ఆసరా చేసుకుని లాభాలు దండుకునే వ్యాపారులు ఉన్న దేశంలో అటువంటి మహాతల్లి కూడా పుట్టింది. అవును, ఆమెతో పోల్చుకుంటే మేము చేసేది ఎంతపాటి. ఇటువంటి ధర్మాత్ములు ఇంకా ఉండబట్టే నా దేశం నాశనం కాకుండా కాపాడబడుతూ ఉంది. ఇప్పుడనిపించింది నాకు మా ఫండు మంచి పనికే ఉపయోగించబడుతున్నదని, మా స్నేహితుల నిర్ణయం సరియైనదేనని. మాకు మేము సంతోషంగా ఉండడం కాదు. మా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా సంతోషంగా ఉండేలా చేయడం మా హ్యపీడేస్ టీమ్ విధి అనుకుంటూ లేచి ప్రక్క మీదకు చేరాను.

******* అయిపోయింది ********

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి