అదృష్టం - పోడూరి వెంకటరమణ శర్మ

luck

స్నానం చేసి, బీరువాలోంచి బట్టలు తీసుకోవడానికి వచ్చిన జానకి, వరద ఇంకా ముసుగుతన్ని పడుకోవడం చూసి, "వరదా లేమ్మా ఏడవుతోంది. పొద్దెక్కినతరవాత పడుకోవడం దరిద్రానికి దారి తీస్తుంది లే లే . రాత్రి ఎక్కువసేపు ఆ సెల్ ఫోన్ లో సీరియల్స్ చూడవద్దంటే మానటం లేదు " అంది బీరువా తలుపు మూస్తూ

"శనివారం కూడా ఏమిటమ్మా కాసేపు పాడుకోనివ్వవు " అంది విసుక్కుంటూ లేస్తూ వరద.

" స్కూల్ లేకపోతే ఎం ? చేయవలసినవి ఎన్ని పనులున్నాయి? బ్రష్ చేసుకుని వచ్చి పాలు తాగి నాకు బట్టలు వాషింగ్ మెషిన్ లో వెయ్యడానికి సహాయం చేయి " అంటూ జానకి వంట ఇంట్లోకి వెళ్లి పోయింది.

"డాడీ కాంప్ కి వెడితే ఇంక అమ్మని పట్టుకోలేం. ఒకటి తరవాత ఒకటి పనులు చెబుతూనే ఉంటుంది" అనుకుంటూ లేచి బాత్ రూమ్ లోకి వెళ్ళింది వరద

బ్రష్ చేసుకుని వంట ఇంట్లోకి వచ్చిన కూతురు కి పాల గ్లాసు అందించి " పక్క మీదనుంచి లేచిన తరువాత, దుప్పటి మడత పెట్టి, పక్క నీట్ గా సద్ది వచ్చావా ? రోజూ చెప్పాలి నీకు"

" అన్నీ చేశాను. లేకపోతే నువ్వు ఊరుకోవు కదా?" అంది పాల గ్లాసు అందుకుంటూ

పాలు తాగి, తాత గారు లేచారేమో చూసి రా. వచ్చి నాకు కొంచం ఉల్లి పాయలు, టొమాటోలు తరిగి ఇయ్యి " అంది బ్రేక్ఫాస్ట్ కు రెడీ చేసుకుంటూ

" అబ్బ ఒకటి తరవాత, ఒకటి పనులు చెబుతూనే ఉంటావమ్మా " అంది వరద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పాలు తాగుతూ

" నీకంటే ఒక్క ఏడాదే పెద్దది జలజ. పన్నెండేళ్ళకే ఎన్ని పనులు చేసిపెడుతుందో చూశావా కాంతం ఆంటీ కి "

" మా క్లాస్ మేట్స్ ఎవరితో మాట్లాడినా, వాళ్ళు అసలు ఇంట్లో పనులు చేయమని చెబుతారు . "పెళ్ళయ్యాకా అది ఎలాగా కష్ట పడాలి. ఇప్పటినుంచీ దానికి పనులు చెప్పకు " అంటారుట వాళ్ళ డాడీలు

" సరేలే తమ్ముడు లేచాడేమో చూడు . వాడికి ఇవాళ నువ్వు స్నానం చేయించు . ఎలా చేయిస్తావో చూస్తాను " వాడంటే వరద కి ఇష్టం అని ఆవిడకి తెలుసు

" చేయిస్తా కానీ, వాడు నాకు లొంగడేమో " అంది లేచి తమ్ముడు వాసు పడుకున్న గదిలోకి వెడుతూ.

తమ్ముడు పక్కనే పడుకున్న తాత గారిని చూసి " అమ్మా ఇంకా తాత గారు లేవలేదు " అంది గుమ్మంలోకి వచ్చి

" అదేమిటే ఎప్పుడూ ఇంత సేపు పడుకోరే అంటూ ఆయన పడుకున్న గది లోకి వచ్చి చూసింది. దగ్గరకి వెళ్లి " మావయ్య గారూ" అంది మెల్లిగా

భూషణం గారు కళ్ళు తెరిచి " రాత్రి దగ్గు వచ్చి నిద్ర సరిగ్గా పట్టలేదమ్మా" అన్నారు అయన లేస్తూ

" అయితే కొంచం సేపు పడుకోండి" అని వాసుని తీసుకుని ఇవతలికి వచ్చింది

" వరదా ! , తాత గారి తలుపు దగ్గరగా వేసి వచ్చేయి, కాసేపు ఆయన్ని డిస్టర్బ్ చేయకు. వీడిని తెసుకెళ్ళి స్నానం చేయించు" అంది వంట ఇంట్లోకి తిరిగి వెడుతూ

మిగతా పనులు చెప్పినప్పుడు వరద చాలా విసుక్కున్నా ,దాని తమ్ముడు కి సంబంధించి ఏపని చెప్పినా విసుక్కోకుండా హుషారుగా చేస్తుంది. జానకి కి ఆనందం కలిగించే విషయాలలో అది ఒకటి

బ్రేక్ ఫాస్ట్ తయారు చేసి జానకి డైనింగ్ టేబుల్ మీద పెట్టే టప్పటికీ వరద తమ్ముడుకి స్నానం చేసి రెడీ చేసి వాడిని కూడా తీసుకు వచ్చింది. భూషణం గారు కూడా బ్రష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు

. ఈ మధ్యన రాత్రిళ్లు దగ్గు రావట్లేదు కదా ? నిన్న రాత్రి ఎందుకు వచ్చిందో! డాక్టర్ దగ్గరికి వెడతారా ఇవాళ ?అంది జానకి ఆయన ముందు టిఫిన్ ప్లేట్ పెడుతూ.

" అక్ఖర లేదమ్మా. ఈ వేళకూడా వస్తే రేపు వెడదాము లే" అన్నాడు ఆయన

ఇంకో ప్లేట్ లో టిఫిన్ వరద కి పెట్టి, " కొంచం తమ్ముడికి కూడా తినిపించు, పచ్చడి పెట్టకు వాడికి . కారం తినలేడు " అంది వంట ఇంట్లోకి వెడుతూ.

ఫోన్ రింగ్ అయితే వంట ఇంట్లోంచే " వరదా ఎవరో చూడమ్మా" అంది భర్త మోహన్, ఫ్లయిట్ ఎన్నింటికి లాండ్ అవుతుందో చెప్పడానికి చేసి ఉంటాడని అనుకుంది

" డాడీ అనుకుంటా" అంటూ లేచి వెళ్లి ఫోన్ ఎత్తింది వరద హుషారుగా . తండ్రి మోహన్ క్యాంపు వెళ్లి రెండు రోజులయ్యింది.

" అమ్మా రత్తాలు ఇవాళ రాదుట. దాని కొడుకుని డాక్టర్ దగ్గరకు తీసుకు వెడుతోంది ట" అంది ఫోన్ పెట్టేసి

" సరే నువ్వు త్వరగా టిఫిన్ పూర్తి చేసి కాస్త గదులు అన్నీ తుడు. నేను హాలు తుడిచి మాపు చేస్తాను " అని " నువ్వు తుడిచినట్టు రత్తాలు కూడా తుడవదే " అంది

" అలాగేనమ్మా, మాపుకూడా నేనే చేస్తాలే" అంది వరద లేచి వెడుతూ

దానిచేత పనులు చేయించేటప్పుడు, అది హుషారుగా చేయాలంటే ఏమి చేయాలోభూషణం గారు కోడలికి గతంలోనే చిన్న చిట్కా చెప్పారు. "నువ్వు చేసినట్టు ఎవరూ చేయలేరే" అని కాస్త దానిని పొగడ మని సలహా ఇచ్చారు. స్కూలు ఉన్న రోజులలో మరీ ఎక్కువ పనులు కూడా చెప్పవద్దని చెప్పారు. అలిసిపోతే చదువు సాగదని.

గదులు తుడిచి మాపు చేయమని చెప్పింది కానీ, వరద ఒక రూమ్ పూర్తి చేయగానే, ఆ పని అందుకుని

" అప్పుడే ఒక రూము తుడిచేశావే , వెరీ గుడ్! ఇక చాల్లే, నేను పూర్తి చేస్తాను నువ్వు వెళ్లి చదువుకో" అంది కూతురు ఎక్కువ కష్టపడటం ఇష్ఠం లేక

పని మనిషి రాక పోవడం వల్ల, పనులు అన్నీ చేసుకుని వంట పనిలో ఉండి పోయింది జానకి.

పదకొండు అవగానే వరదని పిలిచి తాత గారికి టీ పెట్టి ఇమ్మంది. మిగతా పనులకి విసుక్కున్నా, తాత గారి పనులు ఏవి చెప్పినా వెంఠనే చేస్తుంది వరద. తాత గారి పనులలో ఎ మాత్రం తేడా వచ్చినా, ఆయన ఎప్పుడూ కోప్పడక పోయినా, తల్లికి మాత్రం చాలా కోపం రావడం చాలా మాట్లు అనుభవం అయింది వరదకి. తల్లి, తాత గారిపట్ల అంత గౌరవం కనపర్చడం, ఆ పిల్లకి ఎప్పుడూ ఆశ్చర్యమే. అందుకే, హ్యారీపోట్టర్ చూస్తున్నా, అమ్మ చెప్పిన టైం కి తాత గారికి టీ పెట్టి ఇచ్చింది. టీ ఇవ్వగానే ఒక సిప్ తాగి " అద్భుతం గా పెట్టావే.మీ అమ్మకంటే నువ్వే బాగా పెడుతున్నావే " అన్నారు ఆయన

****

భూషణం గారు లోకల్ కాలేజీ లో ప్రిన్సిపాల్ గ రిటైర్ అయి, కొడుకు మోహన్ తోటే ఉంటున్నారు. ఆయన భార్య గతించి నాలుగేళ్ళు అయింది.

కొడుక్కి కూడా అదే ఊళ్ళో ఉద్యోగం కాబట్టి, మోహన్ పెళ్లి అయినప్పటినుంచీ కూడా అందరూ కలిసే ఉంటున్నారు. ఇంకో కొడుకు విశ్వం

చదువు అవగానే, స్నేహితులతో కలిసి కెనడా వెళ్లి అక్కడ వ్యాపారం లో సెటిల్ అయ్యాడు.

******

భోజనాలు అయిన తరువాత, టేబుల్ సద్ధమని వరద కి చెప్పి, ఓ కునుకు తీయడానికి మంచం మీద వాలింది జానకి. నిద్రలోకి జారుకుంటూ ఉండగా

" అమ్మా జానకీ " అని మామగారు బెడ్ రూమ్ గుమ్మలోంచి పిలవగానే ఉలిక్కి పడి లేచింది

" ఏమిటి మావయ్య గారు " అంటూ ఇవతలికి వచ్చింది

" సారీ నిద్ర లో లేపానేమో " అన్నారు నొచ్చుకుంటూ

" లేదండి ఇంకా నిద్ర పట్టలేదు " అంది లేచి వస్తూ

" నా స్నేహితుడు కృపానందం తేలుసుగా వాడు వైజాగ్ నుంచి ఫోన్ చేశాడు . వాడి కూతురు సుధ , పిల్లలతో విజయవాడ నుంచి సాయంత్రం ట్రైన్ లో

వస్తోంది. రేపు ఒక పెళ్లికి వెళ్లి, ఎల్లుండి చెవి ని ఎవరో స్పెషలిస్ట్ కి చూపించుకుని వెడుతుందిట . రెండు రోజులు ఉంటారు. ఒక్కత్తి వస్తోందని నన్ను రిసీవ్

చేసుకోమన్నాడు. ముందు గా అనుకోని ప్రయాణం ట. నేను స్టేషన్ కి వెడుతున్నాను. ఆ గెస్ట్ రూమ్ కాస్త రెడీ చేస్తావా? " అన్నారు

"అలాగే రెడీ చేస్తాను మీరు వెళ్లి రండి " అని వరదని పిలి చింది రూమ్ సద్దడానికి

వరద స్టడీ రూం గా ఏర్పాటుచేసిన గదినే, ఎవరయినా అతిధులు వస్తే గెస్ట్ రూమ్ గా ఇస్తారు

రత్తాలు లేకపోవడంతో, వరద సహాయంతో, బెడ్ షీట్లు అవీ మార్చి రూమ్ సిద్ధం చేసింది.

**--***

పనులు పూర్తి చేసుకొని, జానకి, వరద చేత హోంవర్క్ చేయిస్తుండగా భూషణం గారు, అయన స్నేహితుడు కూతురు సుధ ఇద్దరు పిల్లల తోటి టాక్సీ లోంచి దిగారు. వాళ్ళని దింపి, ఆయన వాకింగ్ కి వెళ్లి పోయారు

సుధ ఇద్దరి కొడుకులు, ఒకడికి 9 ఇంకొకడికి 7 వయసు ఉంటాయి అనుకుంది జానకి. వాళ్ళకి రూమ్ చూపించి, పిల్లలకి పాలు తెద్దామని కిచన్ లోకి వెళ్ళింది.

ఈ లోపులో సుధ పెద్దకొడుకు అక్కడే టేబుల్ మీద ఉన్న రిమోట్ తీస్కుని టీవీ ఆన్ చేసి ఏదో కార్టూన్ ఛానల్ పెట్టేశాడు. టీవీ అం అవగానే రెండోవాడు అన్న దగ్గరికి వచ్చి రిమోట్ లాక్కుని ఇంకో ఛానల్ మార్చేశాడు. దాంతో ఒకళ్ళ దగ్గరనుంచి ఇంకొకళ్ళు రిమోట్ లాక్కోవడానికి యుద్ధం ప్రారంభం అయి కింద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గుద్దు కోవడం మొదలు పెట్టారు. సరిగ్గా అదే టైం లో ఊరినుంచి వచ్చిన మోహన్ లోపలికి అడుగు పెట్టి, సీన్ చూసి స్టన్ అయిపోయాడు. పిల్లల లో పెద్దవాడు, చిన్నవాడి మీద కూర్చుని గుద్ద బోతోంటే, వెంఠనే వెళ్లి వాడి నడ్డి మీద చిన్న దెబ్బ వేసి ఇద్దరినీ వేరు చేశాడు. ఇదంతా కొద్దీ క్షణాలు లో జరిగి పోయింది. మోహన్ ఒక చిన్న దెబ్బ వేయగానే, వాడు పెద్దగా ఏడుచుకుంటూ క్రింద పడి డొల్లడం మొదలు పెట్టాడు. మోహన్ తెల్లబోయాడు అసలు ఎవరు వీళ్లు అని.

అరుపులు విని జానకి కిచెన్ లోంచి, సుధ బెడ్ రూం లోంచి ఒకే మాటు వచ్చారు

వాళ్ళ అమ్మని చూసి ఇంకా గొంతు పెంచాడు సుధ కొడుకు. "చిన్న పిల్ల వాడికి ప్రమాదం అని, వాడిని తప్పించడానికి ఒకటి వేశాను " అన్నాడు మోహన్ అపోలజెటిక్ గా. ఎవరన్నట్టు భార్య కేసి చూస్తూ.

"వెధవా దెబ్బలు తినే యోగం ఉంటే ఎవరు తప్పించ గలరు? " అంటూ వాడిని లోపలికి లాక్కు పోయింది సుధ.

తోడి కోడళ్ళు సినిమా లో సూర్య కాంతం కొడుకు సీన్ గుర్తుకు వచ్చింది మోహన్ కి.

సామాను లోపల పెడుతూ భర్తకు వాళ్లెవరో చెప్పింది జానకి.

సుధ ప్రవర్తన కి ఇద్దరూ కొంచం తెల్లబోయి తేరుకున్నారు

ఈ గొడవలో, అక్కడికి వచ్చిన వరద, తండ్రి వచ్చినప్పుడు వెళ్లి మీద పడి " ఏమి తెచ్చావని " చేసే హడావిడి మరిచిపోయి తెల్లబోయి నుంచుంది.

"వరదా, ఈ పాలు పట్టుకు వెళ్లి వాళ్ళ కి ఇచ్చి రామ్మా అని వంట ఇంట్లోంచి జానకి పిలిస్తే వెళ్ళింది వరద.

ట్రే లో రెండు గ్లాసులలో పాలు పోసి, పిల్లలికి ఇచ్చి రమ్మంది.

వరద సుధ వాళ్ళ గది లోకి పట్టుకు వెళ్ళింది. వరద వెళ్లిన ఒక్క రెండు నిమిషాలకి భళ్ళున గ్లాసు కింద పడిన చప్పుడవం, వరద పరిగెత్తుకుని జానకి దగ్గరికి రావడం జరిగి పోయింది.

ఏడుపు ముఖం తో వచ్చిన వరద ని దగ్గరకు తీసుకుని " ఏమైందే, అ చప్పుడేమిటి? " అని అడిగింది.

"పెద్దవాడు గ్లాసు తీసుకుని గడ గడా తాగేశాడు. చిన్నాడు, నోటిదగ్గర పెట్టుకుని ఒక్క మాటు నేలకేసి కొట్టాడు " అంది వరద

" మరి సుధా ఆంటీ ఏమీ అనలేదా?? అడిగింది. ఆవిడ మేకప్ చేసుకుంటూ " వాడు పాలల్లో బూస్ట్ వేయక పోతే తాగడు అంది " జరిగింది చెబుతూ

కొద్ది నిమిషాల క్రితం అక్కడికి వచ్చి అంతా విన్న మోహన్ " వింత గా ఉందే. పిల్లలలికి ఏమి కావాలో ముందు ఆవిడ చెప్పవద్దూ? అన్నాడు చిరాకుగా

జానకి నోటి దగ్గర వేలు పెట్టు కుని, "గట్టిగా మాట్లాడకండి. ఆవిడ వింటుంది "

డైనింగ్ టేబుల్ దగ్గర ఏదయినా జరిగితే మోహన్ చిరాకు పడతాడని భోజనాలు సుధ కీ

వాళ్లకి ముందే పెట్టేసింది. అది మంచిదే అయింది. అన్నదమ్ములు ఇద్దరూ, కొట్టుకుంటూ, ఒకళ్ళ కంచం లోవి ఇంకొకళ్ళు విసురు కుంటూ నానా గొడవ చేసి ముగించారు. సాయంత్రం జరిగింది గుర్తుకు వచ్చి జానకి ఏమీ కల్పించు కోలేదు. సుధ కూడా ఏదో మాటవరసకు అన్నట్టు అల్లరి చేయకుండా తినండి రా అని ఊరుకుంది. వరద ఇదంతా వింత గా చూసింది.

*****

మరునాడు ప్రొద్దుటే రత్తాలు రావడం తో కొంత ఊపిరి పీల్చుకుంది జానకి. రత్తాలు రాగానే సుధ వాళ్ళు వచ్చిన సంగతి చెప్పి, "వాళ్లు పెళ్ళికి వెడతారు. వెళ్లిన ఆ తరవాత వాళ్ళ గది శుభ్రం చేద్దువు గాని. ఈ లోపులో మిగతా వి పూర్తి చేయమంది.

తాను తయారయి, బయటికి వచ్చి, "పిల్లలిని ఉంచి వెడతాను " అంది సుధ

జానకి గుండె గుభేలు మంది. వెంఠనే " వాళ్లు నాకు లొంగరేమో నువ్వు తీసుకు వెళ్ళమ్మా " అంది

అప్పుడు వాళ్ళ ని త్వర త్వరగా తయారు చేసి తీసుకు వెడితే " హమ్మయ్యా " అనుకుంది.

మోహన్ బ్రేక్ ఫాస్ట్ చేసి టెన్నిస్ క్లబ్ కి వెళ్ళిపోయాడు . ఆదివారం లంచ్ కూడా అతను అక్కడే చేస్తాడు

లంచ్ టైం అవగానే వరద ని పిలిచి ముగ్గురికి కంచాలు పెట్టమని, వంటలు డైనింగ్ టేబుల్ మీదకి చేర్చింది జానకి. కొడుక్కి ముందే పెట్టేసి పడుకో పెట్టింది

" తాత గారిని పిలుచుకు రా" అని వరదని పంపి తమ ముగ్గురికి వడ్డన చేసింది.

అన్ని పనులూ పూర్తి చేసుకుని రత్తాలు చేతులు తుడుచు కుంటూ వచ్చి, " సాయంత్రం వస్తానమ్మా " అని కాస్త ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చిది

" ఏమిటే ?" అంది జానకి , రత్తాలు ఎదో చెప్పాలనుకుంటోందని అని పించి

" ఏమిటమ్మా ఆవిడ, ఎక్కడ తడి గుడ్డలు అక్కడే, ఎక్కడ విడిచిన గుడ్డలు అక్కడే, పడుకున్న పక్కలు సరే సరి, ఆ టేబుల్ అతా మేకప్ డబ్బాలు, ట్యూబ్లు మూతలు తీసి అలానే పడి ఉన్నాయి . అవి మట్టుకు నేను ముట్టుకో లేదు. ఏ యమ్మ పెంచిందమ్మా ఈవిడని ?కనపడితే పట్టుకు దులిపేయాల నిపించిది" అంది ఒక్క గుక్క లో.

వరద తో సహా ముగ్గురూ తెల్లబోయారు . రత్తాలు మాటలకి

జానకి తేరుకుని " ఎదో రెండు పూటలు సద్దుకో రేపు వెళ్లి పోతుంది " అంది

" మీ స్నేహితుడి కూతురు -" అని జానకి ఏదో చెప్ప బోతోంటే, తల వంచు కుని అన్నం తిటున్న వరద కేసి కళ్ల తోనె చూపించి సంజ్ఞ చేశారు భూషణం గారు

జానకికి అర్థం అయింది. సుధ గురించి నెగటివ్ గా మాట్లాడ బోతోందని గ్రహించి వరద ఉందన్న విషయం గుర్తు చేశారని గ్రహించి ఆగిపోయింది.

ఆమెకి మామ గారు ఇచ్చిన అనేక సలహాల లో ముఖ్య మయినది.పిల్లల ముందు ఎవరి గురించీ నెగటివ్ గా మాట్లాడకూదన్నది. వాళ్లంత వాళ్ళు గ్రహించి అభిప్రాయాలు ఏర్పరుచు కుంటే తప్ప, మనం మాట్లాడిన మాటలు వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకునే వయసు లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయని చాలా మాట్లు హెచ్చరించారు. అలాగే ఇతర కులాల వాళ్లు, అలాగ, ఇలాగా అని లూజ్ గా మాట్లాడటం ఆయన అసలు ఇష్టపడరు. అదీ పిల్లల ముందు మాటలాడటం పూర్తి నిషిద్ధం. అందుకే ఆ విషయం అక్కడ వదిలేసింది. స్వకులాభి మానం చూపడం కానీ, ఇతర కులాల గురించి చులకనగా మాట్లాడటం గానీ మోహన్ ఎప్పుడూ చేయగా ఆమె చూడ లేదు.

మధ్యాహ్నం కునుకు తీసి లేచి, టీ కప్పుతో భూషణం గారి గదికి వెళ్ళింది జానకి

" వచ్చినప్పటి నుంచీ వంట ఇంట్లోకి తొంగి చూడకుండా, హోటల్ లో ఉన్నట్టు ఉంటోంది సుధ. అవునా? " అన్నారు భూషణం గారు, స్నేహితుడి కూతురు ప్రవర్తన తలుచుకుంటూ.

" పెద్ద పనేమీ లేదు కదా మావయ్య గారూ " అంది జానకి. ఆయన చెప్పినది మనసులో నిన్ననే మెదిలినా, ఆది ఒక కంప్లైంట్ లా తాను మాట్లాడడం ఆయన కి ఇష్టం ఉండదని ఆమెకు తెలుసు.

" కృపానందాన్ని తలుచుకుంటే జాలేస్తుంది నాకు. సుధ ప్రవర్తన పిల్లల ప్రవర్తన చూస్తే ఎవరికయినా కోపం రాక పోదు. కానీ ఒక విధంగా గా ఆమెను తప్పు పట్టలేము. ఏది మంచి ప్రవర్తన అనేది తెలుసు కునే అవకాశం కానీ, చెప్పేవాళ్ళు కానీ లేకపోవడం దురదృష్టం. "

" అదేమిటి మీ ఫ్రెండు, ఆయన భార్య చెప్పలేదా? " అడిగింది జానకి అర్ధం కాక

" అక్కడే ఉంది సమస్య. బందర్ లో నేను లెక్చరర్ గా చేసేటప్పుడు, నేను వాడు ఒకే ఇంట్లో రెండు వాటాలలో ఉండేవాళ్ళం. సుధ, దాని తమ్ముడు చిన్న పిల్లలు. మీ అత్త గారి ద్వారా వాళ్ళ కబుర్లు తెలిసేవి. సుధ వాళ్ళమ్మ ఝాన్సీ అదోరకం మనిషి. వాళ్ళ అమ్మ ఎలా ఉండేదో ఈవిడ బట్టి ఊహించు కోవచ్చు. భర్త తరపు వాళ్లు ఎవరూ ఇంటికి రాకూడదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ మీద పిల్లలికి చాలా నెగటివ్ గా చెప్పేది. వాళ్లనే కాదు, ప్రతి వ్యక్తి లోనూ నెగటివ్ విషయాలు ఊహించు కుని, అవే పిల్లలికి చెప్పేది. పిల్లల మాట్లాడే పధ్ధతి బట్టి అవన్నీ మాకు తెలిసేవి.

నేను ఒక మాటు వాడితో చెప్పడానికి ప్రయత్నించాను. ఆది వట్టి అమాయకురాలు రా అని నవ్వి ఊరుకున్నాడు. ఎవరయినా భార్య ప్రవర్తన లో తప్పు చూడడం అంత సులువు కాదు. భార్య మీద ప్రేమ ఆలా మనుషుల్ని చేస్తుందన్న దానికి వాడే ఉదాహరణ.

ఝాన్సీ తల్లి, ఆమెని వేరే మనస్త్వాల వాళ్ళని చూడడానికి కానీ, తెలియడానికి కానీ అవకాశం కల్పించ లేదు అనుకోవాలి " అన్నారు నిట్టూరుస్తూ.

నాకు కల్గిన అదృష్టం ఝాన్సీ కి కలగ లేదు అని మనసులో అనుకుని, మావగారి దగ్గర కప్పు తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది.

జానకి

****

వరద లంచ్ టేబుల్ దగ్గర నుంచి తన గది లోకి వచ్చి హోమ్ వర్క్ చేసుకుందామని కూర్చుంది.

కాని ఆ అమ్మాయి మనసు రత్తాలు అన్నమాటల మీదకే పదే పదే పోయాయి. సుధ ఆంటీ శుభ్రత లేకుండా అన్నీ గలీజు చేసినందుకు రత్తాలు, సుధ ఆంటీ తల్లిని తిట్టి పోయడం ఆశ్చర్య పరిచింది. ఎందుకో రత్తాలు మాటలు ఆ పిల్ల మనసులో రోజంతా మెదులు తూనే ఉన్నాయి. ఆరోజు, మరునాడు సుధ పిల్లలు వెళ్లిపోయేదాకా వాళ్లని గమనిస్తూనే ఉంది

సుధ వెళ్లిన మరునాడు, స్కూల్ నుంచి వచ్చిన తరువాత, తల్లి పెట్టిన స్నాక్ తిని, తల్లి ఏదో పుస్తకం చదువుతోంటే ఎదురుగ కూర్చుంది.

జానకి పుస్తకం లోంచి తల ఎత్తి, వరద తన కేసి చూస్తూ ఉండడం చూసి " ఏమిటే ఆలా చూస్తన్నావు? ఏమన్నా కావాలా? " అంది

" అన్నిపనులు చేసుకోవడం, ఇంట్లో ఎలావుండాలో అన్నీ నీకు అమ్మమ్మ నేర్పిందా? " అనడిగింది

ఒక్క క్షణం జానకి ఆశ్చర్య పోయినా, ఆమెకు వెంఠనే తట్టింది. రత్తాలు మాటల మీద వరద ఇంకా ఆలోచిస్తోందని. అవకాశం వదులు కో దలుచు కో లేదు.

'" నీకు తెలుసు గా, అమ్మమ్మ, నరసాపురం తాత గారు ఇద్దరూ డాక్టర్లు కదా. నేను ఒక్కత్తినే. వాళ్ళు ఇద్దరూ ఎప్పుడూ నర్సింగ్ హోమ్ పని తో బిజీ గా ఉండేవారు. ఇంట్లో వంట దగ్గర నుంచి అన్నింటికి పని వాళ్ళు. ఏ పనీ పెద్దగా చేతకాలేదు " అంది

" మరి వంట, మిగతా పనులూ ఎప్పుడు నేర్చుకున్నావు? "

" అవన్నీ పెళ్లి అయేదాకా నాకు ఏమీ రావు. నరసాపురం తాత గారు, ఈ తాత గారు చిన్నప్పటి స్నేహితులు. ఒక మాటు తాత గారు నరసాపురం వచ్చినప్పుడు, కలిసి మాట్లాడుకోవడం తో ప్రారంభం అయి ఆరు నెలల లో పెళ్లి అయిపొయింది "

" మరి నీకు అన్నీ బామ్మ నేర్పిందా? " అంది

" పెళ్లి అయిన తరవాత వచ్చిన రెండో రోజునే, పెదతాతగారు అంటే బామ్మ వాళ్ళ నాన్నగారికి అర్జన్ట్ గా హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి ఆవిడ కాకినాడ వెళ్లిపోయారు. ఆవిడ వెళ్లిన వెంఠనే అన్ని పనులు నా మీద పడ్డాయి. నాన్న గారు ఆఫీసు పని మీద అనుకోకుండా బొంబాయి వెళ్లారు. నేను తాత గారు మిగిలాం. మొదటి రోజు నేను వంట చేస్తోంటే, కాఫీ కోసం వంట ఇంట్లోకి వచ్చి చూసి నాకేమీ రాదనీ గ్రహించేశారు. నన్ను కంగారు పడవద్దని చెప్పి, నాన్నగారు బొంబాయి నుంచి వచ్చే లోపు అన్నీ నేర్పారు. తప్పులు చేసినా కోపం తెచ్చుకోకుండా అన్నీ ఓపికగా నేర్పారు. ఆయన చూపిన ఆప్యాయత తో నేను కూడా అన్నీ శ్రద్ధ గా నేర్చుకున్నాను. ఆయన ఉద్యోగంలో చేరిన కొత్తలో పెళ్ళికి ముందు, హోటల్ భోజనం పడక, ఆయనే చేసుకునేవారట ఇంట్లో పనులే కాదు, ఎవరింటికి వెళ్లినా ఎలా ఉండాలో చెప్పేవారు. ఎంత కొత్త వాళ్ళయినా, హాలులో మగ వాళ్ళ తో కూర్చోకుండా, చొరవగా ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్లి అన్నీ పనుల్లోనూ సహాయం చేయాలనే వారు. మనం ఏదో మర్యాద కి అన్నట్టు కాకుండా ఒక దాని తరవాత ఒకటి చేతి లో పని అందు కోవాలని చెప్పారు. ఎక్కడయినా ఇంటికి అతిధులు వస్తే, ఆడవాళ్ళకి ఎంత పని పెరుగుతుందో ఆయన చెప్పినప్పుడు నేను ఆశ్చర్య పోయాను. ఆయన సలహా పాటించడం వల్ల , బంధువులు, స్నేహితులలో నాకు మంచి పేరు వచ్చేసింది. బామ్మ గారు తిరిగి వచ్చేటప్పటికి అన్ని పనులలోనూ నన్ను ఎక్స్పర్ట్ ని చేసేశారు " అన్నీ వివరంగా చెప్పింది కూతురుకి జానకి.

తాగారంటే తల్లి కి అంత గౌరవం ఎందుకొ వరద కి అర్ధం అయింది

"సుధ ఆంటీ కి గానీ, వాళ్ళ అమ్మగారు ఝాన్సీ గారికి గాని, తాత గారి లాంటి వారు తారస పడక పోవడం దురదృష్టం " అంది జానకి లేచి లోపలికి వెడుతూ.

సుధ, పిల్లలూ వచ్చి వెళ్లిన తరవాత చెప్పిన పనులన్నీ విసుక్కోకుండా వరద చేస్తూ ఉండడం, జానకికి ఆశ్చర్యం కలిగించలేదు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి