క్రీ.శ. 2420 - పద్మావతి దివాకర్ల

a.c.2420

అది క్రీ. శ. 2420.

అప్పుడే సూర్యుడు తూర్పున ఉదయించాడు. లేతభానుని కిరణాలు నలువైపులా ప్రసరించి వింత కాంతితో మెరిసిపోతున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. ప్రకృతి మనోహరంగా ఉంది. ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా రకరకాల పూల చెట్లు, పళ్ళచెట్లతోనూ చాలా అందంగా ఉంది. వివిధ పక్షుల కిలకిలా రావాలతో ప్రకృతి పరవశించి పోతోంది.

సరిగ్గా అప్పుడే అక్కడకి దగ్గరలోనున్న ఒక కొండగుహల్లోంచి దాదాపు ఓ వందమంది మనుషులు బయటికి వచ్చారు. వాళ్ళల్లో వృధ్ధులున్నారు, పురుషులు, స్త్రీలు, యువతీ యువకులు, చిన్నపిల్లలూ కూడా ఉన్నారు. అందరూ నాగరికతకు చాలా దూరంగా ఉన్నారు. ప్రమాదకరమైన జంతువులను ఎదుర్కొనేందుకు అందరూ తమ చేతుల్లో కర్రలను ఆయుధాలుగా ధరించారు. ఎండ, చలి నుండి రక్షణకి, మాన రక్షణకి శరీరానికి చెట్ల ఆకులు కట్టుకున్నారు.

చుట్టూ ప్రకృతిని చూసి పరవశించిపోయి కేరింతలు కొట్టారు అందులో ఉన్న యువతీ యువకులు, చిన్నపిల్లలూను. పెద్దవాళ్ళ కళ్ళల్లో కూడా వెలుగు నిండింది. ప్రకృతి మనోహర దృశ్యాలు చూసి పులకరించిపోతూ ముందుకు అడుగులు వేసారు చిన్నవాళ్ళు. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళూ వాళ్ళని మందలిస్తున్నారు.

"జాగ్రత్త! జాగ్రత్త!! ఎక్కువ దూరం వెళ్ళకండి. ఇంకా మనం పూర్తిగా ఆపదనుండి బయట పడ్డామో లేదో కూడా సరిగ్గా తెలియదు. ఎందుకైనా మంచిది ముఖానికి చెట్ల ఆకులు అడ్డం పెట్టుకొని వెళ్ళండి." అంటూ పెద్ద వాళ్ళు ఒకవంక హెచ్చరిస్తున్నా వినకుండా ప్రకృతి సౌందర్యం తిలకించడానికి తలో ఒకవైపు పరుగులు తీసారు వాళ్ళందరూ.

ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో ఓ పాడుబడిన పట్టణం ఉంది. ఎప్పుడో వందల ఏళ్ళక్రితం అవి నివాసయోగ్యంగా ఉండిఉంటుంది, కాని ఇప్పుడు అక్కడ ఉన్నవన్నీ పాడుబడిన ఇళ్ళే. చాలా మట్టుకు చిన్నాపెద్దా భవంతులన్నీ కూలిపోయి నేలమట్టమయ్యాయి. వాతావరణ ఆటుపోట్లని తట్టుకొని ఏ ఒకటో రెండో కాస్త నిలిచిఉన్నాయి. అవికూడా నేడో, రేపో అన్నట్లున్నాయి. అయితే ఎక్కపడితే అక్కడ దట్టంగా పిచ్చిమొక్కలు, చెట్లుచేమలు పెరగడంతో అదికూడా ఓ కీకారణ్యంలా మారిపోయింది. ఒకప్పుడు జనారణ్యంగా వెలుగొందిన ఆ పట్టణ ప్రస్తుత పరిస్థితి అది!

ఆ గుంపులోంచి కొందరు పిల్లలు పెద్దల మాట వినకుండా అటువైపు దారితీసి అక్కడ వింతలు చూడసాగారు. అక్కడ పాడుబడిన ఇళ్ళవైపు వింతగా చూస్తున్నారు వాళ్ళు. తమ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వాళ్ళకి.

అందులో చింటూ అనేవాడు, "అదిగో, మా తాత చెబుతూ ఉంటాడు, అలాంటి గూళ్ళలోనే ఒకప్పుడు మనుషులు ఉండేవారట! ఒకప్పుడు మన పూర్వీకులు ఆ పాడుబడిన పట్టణంలోనే ఉండేవారట. ఇప్పుడు మనమున్న గుహల్లో ఎవరూ ఉండేవారు కాదుట! వాళ్ళ దగ్గర ఎన్నో అద్భుతమైన వస్తువులు ఉండేవట. ఒక చోట నుండి మరో చోటుకు ఏ వాహన సహాయంతోనో సునాయాసంగా వెళ్ళేవారట. దూరప్రాంతాల నివశించే వారితో చేతిలో ఇమిడే ఓ చిన్న యంత్రంద్వారా మాట్లాడగలిగేవారట." అని తనకి తెలిసిన విషయాలు తన స్నేహితులతో చెప్పాడు చింటూ.

"అవునవును, నేను కూడా విన్నాను. అప్పుడు మనలాగ వెలుతురు కోసం సూర్య చంద్రుల కోసం వేచి ఉండేవారు కాదుట. వారికి కావలసినప్పుడల్లా వెలుతురు, గాలి సృష్టించుకొనేవారుట. వినడానికి ఆశ్చర్యంగా లేదూ? అలాగే అవసరమైనప్పుడు నిప్పు కూడా చాలా సులభంగానే సృష్టించుకోగలిగేవారుట. మనలాగ చెకుముకి రాళ్ళు వాడేవారు కాదట." అన్నాడు బంటూ.

"అవును! అవన్నీ వింటూంటే ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? బహుశా వాళ్ళందరికీ ఎవో మంత్ర శక్తులు ఉండేవేమో? లేక వాళ్ళ తెలివితేటలతో అలాంటి సాధనాలు కనిపెట్టేవారేమో?" అన్నాడు చింటూ.

ఇలా మాట్లాడుకుంటూ ముందుకి నడుస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఒకచోట బాగా పాడుబడిన వింత వాహనాలు కనిపించాయి.

"అయితే తాత చెప్పిన వాహనాలు ఇవే అయిఉంటాయి బహుశా, వీటి ద్వారా ఆ తరం వాళ్ళు ఒకచోటనుండి మరో చోటకి ఎలా వెళ్ళేవారో?" అన్నాడు చింటు.

అలా నడుస్తూ ఉండగా వాళ్ళకొక డబ్బా ఒకటి దొరికింది. అశ్చర్యంగా దానిని చూసి చేట్ట్లో ఎత్తి పట్టుకున్నాడు చింటూ. దాన్ని చుట్టూ తిప్పి పరిశీలనగా చూసారు మిత్రులిద్దరు. అయినా అదేమిటో వాళ్ళిద్దరికీ అర్ధం కాలేదు.

"తాత ఎన్నో విషయాలు చెప్పాడుగాని దీనిగురించి మాత్రం చెప్పలేదు, ఏమిటో ఇది? దీని ఉపయోగమేమిటో?" అన్నాడు చింటూ.

"దాన్ని పట్టుకొని పద. ఎక్కువదూరం వెళ్ళద్దని మన పెద్దవాళ్ళు చెప్పారు కద. ఇంక తిరిగి వెళ్ళిపోదాం. ఇది చూపించి తాత నడిగితే ఏమైనా చెప్పగలడు." అన్నాడు బంటి వెనుదిరుగుతూ. చింటూ కూడా వాడ్ని అనుసరించాడు.

"తాతా! ఇదేంటి? ఎదో డబ్బాలా ఉంది!" అంటూ తను పట్టుకొచ్చిన పెట్టిని తాతకి చూపించాడు చింటూ.

తాత మనవడు తెచ్చిన వస్తువుని నలువైవులా తిప్పి పరిశీలనగా చూసి, "ఇది నాలుగు వందల సంవత్సరాల కిందటి వస్తువురా! నీకెక్కడ దొరికింది?' అని ఆశ్చర్యంగా అడిగాడు.

మనవడు చెప్పిన తర్వాత దాన్ని మరింత పరిశీలనగా చూసి, "ఈ పెట్టిని చూస్తే ఇప్పుడు గుర్తుకు వస్తోంది మా తాత దీన్ని గురించి చెప్పిన సంగతి. మన పూర్వీకులు ఈ ప్రపంచం నలుమూలల, అంటే ఈ భూమిపై ఎక్కడ జరిగే సంఘటనలైనా ఇందులోనే చూసేవారని మా తాత నా చిన్నప్పుడు చెప్తూండేవారు. అంతేకాక రకరకాల వినోద కార్యక్రమాలు కూడా ఇందులోనే చూసేవారట. ఆ తరంవాళ్ళకి వినోద కార్యక్రమాలంటే అంతటి మోజు ఉండేదట. దీన్ని చూస్తూ చాలా సమయం గడిపేవారట.” అన్నాడు.

"నిజమా తాతా! మరి ఇప్పుడెందుకు ఈ పెట్టి ఏమీ చూపటం లేదు? అసలు ఈ భూమిమీద మనమే కాక ఇంకా మనలాంటి మనుష్యులు ఉన్నారంటావా? ఉంటే, ఎవరూ ఎందుకు మనకి కనబడరూ?..." మనవడి సందేహం.

మనవడి సందేహం తీర్చే స్థితిలో లేడు తాత. ఓ క్షణం గడ్డం నిమురుకున్నాడు తాత. కష్టపడి గుర్తు తెచ్చుకొని చెప్పాడు, "నాయనా! దీనిగురించి నేను సరిగ్గా వివరాలు చెప్పలేను. అయినా మా తాత నుండి విన్నవిషయాలు నీకు కొన్ని చెప్పగలను. మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు, వినోద కార్యక్రమాలు ప్రదర్శించేదని మా తాత చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు దానికి ఆ శక్తి ఎందుకులేదో నేను మాత్రం చెప్పలేను. ఈ పెట్టికి అవి చూపించే శక్తి అప్పుడే నశించిపోయిందేమో? అలాగే మనమిప్పుడు ఇక్కడ కొద్దిమందే ఉన్నాంకాని, ఒక్కప్పుడు ఈ భూప్రపంచం మీదా కోటాను కోట్లు అంటే... చాలా మంది ఉండేవారట. ప్రపంచమంతా మనుష్యులతో నిండి చాలా దేశాలే ఉండేవట. నాగరికత కూడా బాగా విస్తరించి ఉండేది. మనలాగ ఆకులు కాక పత్తితో చేసిన వస్త్రాలు ధరించే వారట ఆ కాలం మనుష్యులు. ఆ కాలంలో పుట్టిన కొందరు మేధావులు చాలా కొత్త వస్తువులు కనుగొన్నారట. యంత్రం సహాయంతో ఒకచోట నుండి మరో చోటకు వెళ్ళేవారట. ఆకాశంలో విహరించేవారట. ఇంట్లోనే కూర్చుని దూరంగా ఉన్నవాళ్ళతో సైతం మాట్లాడగలిగే శక్తి కలిగి ఉండేవాడు. ఒకప్పుడు మనిషి పంచభూతాలనూ జయించాడు, అంతరిక్షాన్నీ జయించాడు. రాత్రివేళ ఆకాశంలో కనపడే చంద్రుడిపై కూడా కాలుమోపాడు. కుజగ్రహంపై నివాసం ఏర్పరచుకుంటానని కలలు కన్నాడు.” ఆయాసం తీర్చుకోవడానికి ఆగాడు తాత.

"మరైతే అప్పుడు కనుగొన్న వస్తువులన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? మరి మనవద్ద అలాంటివేవి లేవే? ఆ మేధావులు, మిగిలిన మనుష్యులు ఏమయ్యారు? ఆ నాగరికత అంతా ఏమైంది?" అడిగాడు మనవడు.

"అదే! అక్కడికే వస్తున్నాను! సరిగ్గా నాలుగు వందలేళ్ళక్రితం ఓ మహమ్మారి, పేరు కరోనా అని ప్రపంచమంతటా విస్తరించిందట. ఆ వ్యాధికి మందుల్లేకపోవడం వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. మానవుడి తప్పిదమో లేక ప్రకృతి ప్రతీకారమో తెలియదుగాని ఆ కరోనా మానవాళి మనుగడమీద తీవ్రమైన ప్రభావం చూపించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఆ మహమ్మారి ప్రాణాంతకంగా పరిణమించింది. ఒకరినుండి మరొకరికి సులభంగా వ్యాపించడంతో త్వరలో దేశదేశాలకి పాకి అందర్నీ తన గుప్పెట్లో పెట్టుకొని గడగడలాడించింది. ఆ వ్యాధి ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంవల్ల ప్రపంచం మొత్తం నాశనమై పోయింది. ఏ కొద్దిమంది మిగిలివాళ్ళూ చెట్టుకొకరూ, పుట్ట కొకరు ఉండిపోయారు. నాగరికత అంతా అంతరించిపోయింది. వాళ్ళ అలక్ష్యం, నిర్లక్ష్యం వల్ల మానవజాతి నశించిపోయింది. ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితికి ఒకవిధంగా వాళ్ళే, అంటే మన పూర్వీకులే బాధ్యులు కూడా. వైఙానికంగా, సాంకేతికంగా ఎదిగి ప్రకృతిని జయించానని విర్రవీగిన మనిషి ఆఖరికి అధఃపాతాళానికి వెళ్ళిపోయాడు. ఒక్క ప్రాణంతకమైన కరోనా వ్యాధే కాదు, మానవుడి వల్ల వాయు కాలుష్యం కూడా బాగా పెరిగి ప్రకృతి ఉపద్రవాలు కూడా చాలా సంభవించాయి. ఆఖరికి మానవుడు ఓడిపోయి ప్రకృతిముందు తలవంచాడు. అంతకుముందు రెండు ప్రపంచ యుద్ధాలు చేసి అంతులేని ప్రాణనష్టం జరిగాక కూడా బుద్ధి తెచ్చుకోక రకరకాలా మారణాయుధాలు, మనకేమాత్రం తెలియని అణ్వాయుధాలు, జీవరసాయన అస్త్రాలు కూడా శత్రుదేశాల్ని జడిపించడానికి తమవద్ద ఉంచుకునేవారట. మహమ్మారి కరోనా అయితే అతి ప్రాణంతకమై, ప్రజలతోనే చివరివరకూ మానవుడు అంతమయ్యేవరకూ సహజీవనం చేసింది. దానికి తగిన ఔషధం కనిపెట్టడానికి దేశదేశాల వాళ్ళూ అష్టకష్టాలు పడి ఏళ్ళతరబడి ప్రయోగాలు చేసి కూడా ఫలితం సాధించలేకపోయారు. ఆ వ్యాధి పర్యవసానంగా అంతవరకూ వివిధ రకాలుగా జీవనోపాధి కలిగిన వారంతా తమ పనులుపోగొట్టుకొని పస్తులుండి ఆకలికి మాడసాగారు. ఆహరధాన్యాలు లేక ఆకలితో అలమటించారు. వ్యాధిబారిన పడి మరణించినవారు చాలామందైతే, ఆకలి వల్ల కూడా చాలామంది చనిపోయారు. ఇలా ప్రపంచం మొత్తం నాశనం అవుతున్న తరుణంలో ఇంకక్కడ ఉంటే ఈ వ్యాధి తమకెక్కడ సోకుతుందోనని మా తాతగారు వాళ్ళు, అతని కొద్దిమంది స్నేహితులు కూడా ఇదిగో ఈ అడవుల్లో, ఈ కొండగుహల్లో తలదాచుకున్నారు. వాళ్ళు అలా ఆలోచించి ఇక్కడ తలదాచుకోవడం మంచిదయింది. అందువల్లే ఇప్పటికి ఈ మాత్రమైనా మనం మిగిలాము. అలాగే మనలాగే ఈ భుప్రపంచం నలుమూలలా కూడా ఉండవచ్చు. కొంతమంది మేధావుల అంచనా ప్రకారం ఆ మహమ్మారి ప్రభావం కొన్ని వందల ఏళ్ళు ఈ భూమి మీద ఉంటుంది. అందుకే మనమందరం ఇక్కడ తలదాచుకున్నాం. మన పూర్వీకులు లెక్కలు కట్టి చెప్పినదాని బట్టి ఆ మహమ్మారి ప్రభావం ఈ పాటికి పూర్తిగా పోయి ఉండవచ్చు. అందుకే, ఇన్నాళ్ళూ మనం మనం నివశించిన గుహ దాటి బయటకు రాలేదు. కేవలం కొద్ది మంది మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని ఆహారం సేకరించటానికి మాత్రమే వెలుపలికి వచ్చేవాళ్ళం కదా. ఇది జరిగి సరిగ్గా నాలుగువందల ఏళ్ళు ఈ మధ్యనే పూర్తైయ్యాయి. మన పూర్వీకుల నుండి ఏళ్ళు లెక్కబెట్టగా ఇప్పుడే ఆ సమయం పూర్తైంది. అందుకే ఇప్పుడు మనమందరమూ మన స్థావరాల్లోంచి బయటకు వచ్చాం. ఇప్పుడు బహుశా ఆ మహమ్మారి నుండి మనకేమీ ఆపద లేకపోవచ్చు. మనం ఇక ఈ స్థావరం నుండి బయటపడి ఈ విశాల భూప్రపంచంలో ఎక్కడైనా నివశించవచ్చు. ఆపద మాత్రం వస్తే మనం మళ్ళీ అన్నీ మరిచి మన పాత స్థావరానికి తిరిగి వెళ్ళి ఇంకా కొన్నేళ్ళు తలదాచుకోవాలి.” మనవలకి వివరించాడు తాత.

"అవును తాతా! అది మనిషి చేజేతులా తెచ్చుకున్న వినాశనం. మరి నా మరో ప్రశ్నకు జవాబివ్వలేదు. మనమందరమూ ఈ భూమ్మీద ఒంటరి వాళ్ళమా లేక మనలాగే ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నట్లు?" అడిగాడు బంటూ.

"చెప్పానుకదా! మనలాగే మరికొంతమంది కూడా తమ ప్రాణాలు కాపాడుకొని ఎక్కడైనా దాగి ఉండవచ్చునని భావిస్తున్నాను, కాని సరిగ్గా చెప్పలేను. ఈ సందర్భంగా మా తాత చెప్పిన ఓ విషయం గుర్తుకు వస్తోంది. ఆ సమయంలో కూడా ఈ విశాల విశ్వంలో మనిషి ఒంటరివాడా అన్న ఆలోచనతో మనిషి ఈ భూమి కాక ఇంకేవైనా గ్రహాలపై జీవం ఉందా అన్న అంశం మీద పరిశోధన జరిపేవాడట. అలా కొన్ని గ్రహాలపై జీవం ఉన్న జాడలుకూడా కనుగొన్నాడట. ఆ గ్రహాల్లో తన ఉనికి చాటుకోవడానికి ఉవ్విళ్ళూరాడు మానవుడు. కాకపోతే ఆ పరిశోధనలు ప్రారంభ దశలో ఉండగానే తను నివశించిన ఈ భూమి మీదే తన ఉనికి కోల్పోయాడు మనిషి." నిట్టూర్చుతూ అన్నాడు తాత.

"తాతా! అయితే మన పూర్వీకులు సాధించిన ప్రగతి, విఙానం, కనిపెట్టిన వస్తువులు అన్నీ ఇప్పుడు అస్సలు ఎందుకు కొరగావా?" సందేహం వెలిబుచ్చాడు మనవడు.

"అవును మనవడా! ఒక్కప్పుడు మన పూర్వీకులు సాధించినవన్నీ వారితోనే అంతమైపోయాయి, అలాగే ఆ నాగరికత కూడా. మనిషి కన్నూమిన్నూ కానక తనగోతి తనే తవ్వుకున్నాడు. వివిధ జీవాయుధాలు, రసాయనాయుధాలతో తన వినాశనం తానే కొని తెచ్చుకున్నాడు. మనిషి ఆ నాడు కనిపెట్టినవన్నీ ఇప్పుడు కేవలం కొద్ది పుస్తకాలకే పరిమితమయ్యాయి, అవీ మేము జాగ్రత్త చేయబట్టి. ఆ విఙానం ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకెవరికీ తెలియదు. ఆ విఙానానికి సంబంధించిన వివరాలు ఉన్నా అవి చదవి అర్ధం చేసుకొనే వాళ్ళే లేరు. ఇప్పుడు మీరంతా పెద్దయి యువకులు అవబోతున్నారు. మీరైనా ఇవి చదివి ఏమైనా తెలుసుకోగలరేమో ప్రయత్నించండి. మళ్ళీ నాగరికత మొదలవ్వాలి. మనం రాతి యుగం నుండి బయటపడి మానవుడు గొప్పవాడని రుజువు చేయాలి. పూర్వం మేధావులవల్లే అన్నీ సాధ్యమయ్యాయి, అలాగే ఈ తరం వాళ్ళైన మీలాంటి వాళ్ళ వల్లే మళ్ళీ అవన్నీ సాధ్యమవ్వాలి. " అన్నాడు తాత.

"తాతా! మేమందరం తప్పకుండా సాధిస్తాం తాతా! ఆ నాటి నాగరికత తిరిగి మొలకెత్తేట్లు చేస్తాం. వాళ్ళు కనిపెట్టిన వస్తువులు, యంత్రాలు అన్నీ మేము తిరిగి కనిపెడతాం. మా ఆశయసిద్ధి కోసం నీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు, ప్రోత్సాహం, అండదండలు మాకు చాలా అవసరం." అన్నాడు చింటూ.

"అవును తాతా! నిజంగానే మనమందరం కలసి సాధిద్దాం. ఈ రాతి యుగం నుండి బయటపడి మానవుడు మహనీయుడని చాటుదాం." అన్నాడు బంటూ వంతపాడుతూ.

వాళ్ళ పట్టుదల చూసిన తాతకి కూడా హుషారొచ్చింది.

"శభాష్" అన్నాడు గట్టిగా వాళ్ళ వెన్నుతట్టి.

**** **** **** ****

"శభాష్!...శభాష్!!..." అని నిద్రలో గట్టిగా పలవరిస్తున్న ప్రభాకర్‌ని పల్లవి కుదిపి లేపింది. కళ్ళునులుపుకొని నిద్రనుండి మేల్కొన్న ప్రభాకర్ వెర్రిగా చుట్టూ చూసాడు. అడవి, కొండగుహలు, మనోహరమైన ప్రకృతి, పాడుబడిన పట్టణం, బంటూ, చింటూ ఎవరూ కనబడలేదు. కలగన్నాడా తను? ఎంత భయంకరమైన కల! కరోనావల్ల ప్రపంచం మొత్తం నాశనం అవడం, మానవుడి నాగరికత రాతియుగానికి తిరోగమించడం అంతా కూడా కలా? నిజం కాదు కదా! ఒక్కసారి తను కన్న భయంకరమైన కలనుండి బయటపడి వాస్తవ ప్రపంచానికి వచ్చాడు.

మధ్యహ్నం భోజనం చేసి ఇంక లాక్ డౌన్ 4.00 ప్రకటిస్తారన్న వార్త విని పడుకున్నాడు తను. ఆ విషయమే ఆలోచిస్తూ నిద్రపోవడంవల్లనేమో తనకు ఏకంగా నాలుగువందల ఏళ్ళ లాక్ డౌన్ (లాక్‌డౌన్ 400) కల వచ్చింది. ఇప్పటికైనా అందరూ సరైన జాగ్రత్తలు తీసుకోపోతే ఆ కలే నిజమవుతుందేమో మరి! ఎవరు చెప్పొచ్చారు?

ఆ కల గురించి పల్లవికి చెప్పేసరికి పడిపడి నవ్విందామె.

"ఏమిటండీ, ఇలాంటి భయంకరమైన కలగన్నారా! ఈ లాక్‌డౌన్ వేళ మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోవద్దండీ మహాశయా అంటే విన్నారా? చూడండి, అడ్డమైన కలలు కంటూ మతి చెడగొట్టుకుంటున్నారు. లేవండి, లేవండి సాయంకాలం అయిదైంది. లేచి త్వరగా మొహంకడుక్కొని కాఫీ తాగి కూర్చుంటే ఆరుగంటకల్లా 'భక్తి ' చానెల్లో హనుమాన్ చాలీసా పారాయణం ఉంది." అంది పల్లవి.

తను కన్న కలను తలచుకుంటూ బాత్‌రూమువైపు నడిచాడు ప్రభాకర్.

- పద్మావతి దివాకర్ల

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి