అష్టావధానం స్క్వేర్ సాఫ్ట్వేర్ - సౌదామిని. ఎస్.

ashtavadhanam square software

“మన ఇంట్లో కొన్ని రోజు ఇడ్లీ, టి బంద్” అని కిశోర్ వంట గది లో నుండి ఉత్తర్వులు జారీ చేశాడు. “ఇవి బాగా అట్ట గట్టుకు పోతున్నాయి” అని కారణం కూడా చెప్పాడు. పాపం కరొన మొదలైనప్పటి నుండి గిన్నెల డ్యూటి ఆయనదే కదా మరి.

“అది సరే గాని మీరు గోరు చిక్కుడు, బీన్స్ తేవద్దు. వొలవలేక నా ప్రయాణం పోతోంది, బోలెడు టైమ్ పేస్ట్ కూడాను ” అని నా గోడు నేను వెళ్లగక్కుకున్నాను.

ఇప్పుడు వంట ఆమె, పని ఆమె రాక వారి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న బాధలు మావి.

అంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎంతో ఎక్సైటింగ్ గా చెప్తోంది – నీకోక విషయం తెలుసా, నేను ఒక మాప్ ప్రయత్నించాను, అందులో మాప్ పిండక్కర్లేదు తెలుసా, నీకు కూడా ఒకటి ఆర్డర్ ఇస్తున్నాఅమేజోన్ లో.

సరే అని ఫోన్ పెట్టేశా. ఏమిటో ఒకప్పుడు నగలు బాగున్నాయి, డ్రస్ లు బాగున్నాయి అని ఫోన్ చేసే మా ఫ్రెండ్ ఇప్పుడు మాప్ బాగుంది, క్రొత్త క్లీనర్ బాగుంది అంటూ ఫోన్ లు చేస్తోంది. ఇప్పుడు ఇవే గా మా క్రొత్త ఆభరణాలు. చీపుళ్ళే ఆభరణాలు, తుడుపుడు గుడ్డ లే క్రొత్త వస్త్రాలు..

పిల్లల ఆన్లైన్ క్లాస్ కి ఇంకా కొద్ది నిమిషాలే టైమ్ ఉంది. వెళ్ళి మా అబ్బాయిని లేపాను. వాడు లేచి పది నిముషాలలో రెఢీ అయిపోతాడు. వాడేదో స్నానం త్వరగా చేయటం లో గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే చటుక్కున వెళ్ళి పుటుక్కున వస్తాడు. ఏదో ఒకటి స్నానం అయినా చేస్తున్నాడు.

ఇప్పుడిక బ్రేక్ఫాస్ట్ రెఢీ చేయాలి. రాత్రి మిగిలిపోయిన అన్నం లో కొంచెం పెరుగు, పండి పోయిన అరటి పళ్ళు వేసి కలిపేశా. ఆ పైన కాసిని జీడి పప్పులు చల్లి బౌల్ లో సర్ది పిల్లలు ఇద్దరికీ ఇచ్చేశా. “అమ్మా, ఇదేమిటి?” అని నా ఏడేళ్ళ పాప అమాయకం గా అడిగింది. “అది బనానా రైస్ పుడ్డింగ్” అని చెప్పి దాని వైపు వెను తిరిగి చూడకుండా వచ్చేశా. ఈ రోజు కూడా ఎలాగో క్రొత్త పేరు పెట్టి మేనేజ్ చేసేశా, శభాష్ అనుకుంటూ నా భుజాన్ని నేనే చరుచుకున్నాను.

కుక్కర్ లో పప్పు, మూకుడు లో కూర పెట్టి ఆఫీసు కి లాగిన్ అయ్యాను. మాడు వాసన వస్తే వంట గది లోకి, ల్యాప్టాప్ నుండి కాల్ నోటిఫికేషన్ వస్తే ల్యాప్టాప్ ముందుకు అలా అటు ఇటు గడియారం పెండ్యులం లా తిరుగుతూ మొత్తానికి వంట పూర్తి చేశాను.

ఇంత లో వేరే గదిలో ఆన్లైన్ క్లాస్ వింటున్న మా వాడు నన్ను చేయి పట్టుకు లాక్కెళ్తున్నాడు. “ఏమిటి రా విషయం?” అన్నాను. ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నాడు. “ఇప్పుడు ఏమిట్రా, నేను రెఢీ అవ్వలేదు, అసలు నేను నీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎప్పుడు అటండ్ అయ్యనని, నాకు నీ గురించి తెలియదా” అని తప్పించుకునే ప్రయత్నం చేశాను. “అమ్మా, ఇదివరకు అంటే స్కూల్ కెళ్లాలి అని తప్పించుకున్నావు. ఇప్పుడు ఇంట్లో ఉండి రాలేదేమని మా మేడమ్ అడుగుతారు” అని నన్ను బలవంతం గా వాడి ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టాడు. అసలే వీడియొ కాల్. జుట్టుకి రంగు లేక నెరిసిపోయిన నాలుగు తెల్ల వెంట్రుకలని వెనక్కి సర్దుకొని మీటింగ్ కి కూర్చున్నాను. మేడమ్ చెప్పిన విషయాలన్నిటికీ అలాగే అని తల ఊపి త్వరగా ముగించేశాను.

ఎలాగో అలాగ లంచ్ ముగించి ఒక నిమిషం కూర్చోగానే ఆఫీసు టీం మీటింగ్ ఉందని గుర్తొచ్చింది. గబుక్కున వెళ్ళి ఆల్రెడీ ఇస్త్రీ చేసి ఉన్న నాలుగు డ్రెస్సులలో ఒకటి తీసుకొని రెఢీ అయ్యాను. “ఏమోయ్, ఏమిటి స్పెషల్ ఈ రోజు ఇంత రెఢీ అవుతున్నావు” అని అడిగాడు కిశోర్. “ఈ రోజు మా టీం మీటింగ్, వీడియొ కాల్, ఎన్ని రోజులయ్యిందో కదా రెఢీ అయ్యి, అందుకే” అని చిన్న నవ్వు నవ్వాను. అలాగే వీడియొ కాల్ లో కనిపించ్చేంత మేర ఇల్లు సర్దేశాను.

టీం మీటింగ్ మొదలైంది. కాసేపు అందరూ ఏ క్రొత్త వ్యాపకాలు నేర్చుకున్నారో చెప్తున్నారు. తరువాత మా వీడియొ కాన్ఫరెన్సింగ్ ఆప్ లో ఏమి మార్పులు చేయాలో డిస్కస్ చేశాం. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ అమెరికా వాళ్ళకి సరిపోతుందని, ఇండియా కి రెఢీ చేయాలంటే కుక్కల అరుపులే కాకుండా పిల్లల ఏడుపులు, రైలు కూతలు, కుక్కర్ విజిల్ సౌండ్ లు వినిపించ కుండా ఆపాలని కొందరు, అలాగే మేకప్ లేకపోయినా కాల్ లో అందం గా కనపడాలి అని ఒకరు, ఇల్లు సర్దకపోయినా సర్దినట్లు ఉండాలని మరొకరు అలాగ ఎవరి గొంతెమ్మ కోరికలు వాళ్ళు విన్నవించుకున్నాం. వాటిని ఎలా పరిష్కరించాలో తరువాతి మీటింగ్ లో చర్చిద్దాం అని మీటింగ్ అప్పటితో ముగిసింది.

కాల్ అయిపోగానే హాల్ లోకి వచ్చి ఒక సారి షాక్ తిన్నాను – ఈ వ్యోమగామి ఎవరబ్బ అని. నెమ్మది గా అర్థం అయ్యింది అది సరుకుల కోసం బయటకు వెళ్ళటానికి రెఢీ అయిన కిశోర్ అని. మా పాప కూడా కూడా వెళ్తానని మారాం చేస్తే వద్దని గట్టిగా చెప్పాను. అందుకు అది ఒక మూల చేతులు కట్టుకొని దిగులు గా కూర్చుంది. అది చేతులు కట్టుకుందంటే ఏదో బాధ పడుతోందని అర్థం. కిశోర్ వెళ్ళిపోయాక ఏమయ్యింది అమ్మా అని దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను.

“అమ్మా మామూలుగా అయితే ఈ పాటికి సమ్మర్ సెలవులకి వేరే ఊరు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్ దాటి వెళ్లటానికే వీలు లేదు. నాకు ఈ కరొన నచ్చలేదమ్మా” అంది.

అప్పుడు మా పాప కి నేనెప్పుడో చిన్నప్పుడు చదివిన కధ చెప్పాను. నన్ను నేను రోజూ సమాధాన పరచుకుంటున్న కధ.

పూర్వం ఒకతను ఒక తన బాధ నుండి ఉపశమనం పొందటానికి ఒక స్వామీజీ ని వెళ్ళి కలిశాడుట.

“స్వామీ నా ఇల్లు చాలా ఇరుకు గా ఉంది, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి” అని అన్నాడుట.

“మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?” అని అడిగాడుట స్వామీ జీ. “మా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, తమ్ముడు, చెల్లెలు అందరం ఒక చిన్న గది లోనే ఉంటున్నాం” అన్నాడుట.

“నీ వద్ద ఇంకా ఏమైనా జంతువులు ఉన్నాయా?” అని అడిగాడుట స్వామీజీ

“4 గేదెలు, 5 గొర్రెలు, 10 కోళ్ళు ఉన్నాయి” అని చెప్పాడుట అతను.

“అయితే ఆ కోళ్లను ఇంట్లో కట్టేయి” అని చెప్పాడుట స్వామీజీ.

అతను భక్తి గా స్వామీజీ చెప్పిన మాట విన్నాడు. ఇల్లు ఇంకా ఇరుకు అయ్యింది .

మళ్ళీ స్వామీజీ దగ్గరకు వెళ్ళి చెప్పాడుట. ఈ సారి స్వామీజీ ఆ మేకలను కూడా ఇంట్లో కట్టేయమన్నారు.

“ఇదేమి స్వామీ జీ అమ్మా ఇలా చెప్తున్నారు. ఇల్లు ఇంకా ఇరుకు అయిపోదు” అన్నది పాప అసహనం గా.

పూర్తి గా విను , అతను గురువు గారి మాట మళ్ళీ విన్నాడు. ఇల్లు ఇంకా ఇరుకు అయ్యింది, ఇంట్లో అందరికీ పడుకోవటమే కష్టం అయ్యింది అని ఒక నిమిషం ఆగాను.

“ఆ తరువాత కధ నేను చెప్తాను ఆ స్వామి మిగిలిన గేదె లను కూడా ఇంట్లో కట్టేయమంటాడు ఇంకేముంది, ఈ అబ్బాయి వింటాడు, ఇల్లు ఇంకా ఇరుకు అయిపోతుంది.

సరే మరి తరువాత ఏమవుతుంది, ఇంక అతని దగ్గర జంతువులు ఏమి లేవు కదా” అంది పాప తొందరగా విషయం చెప్పమన్నట్లు గా.

అప్పుడు స్వామి అతన్ని ఇంట్లో ఉన్న గేదె లను, మేకలను, కోళ్లను అన్నింటినీ వదిలేయమని చెప్పారుట . అప్పుడు అతను ఆనందం గా ఇంటికి పరిగెత్తాడుట. అలా విప్పేశాక ఎంతో ఆనందంగా అనిపించిందిట, ఇల్లు విశాలం గా అనిపించిందిట అని నేను కధ ముగించాను.

“ఓ ఇప్పుడు అర్థంఅయ్యింది స్వామీ జీ క్రొత్త గా అతనికి జాగా ఇవ్వలేదు కానీ ఉన్నదే ఇప్పుడు పెద్ద గా అనిపింస్తోంది.” అంది పాప జ్ఞానోదయం అయినట్లు.

“అంతే, సరిగ్గా దేవుడు కూడా అంతే. మనకు ఉన్న జీవితం పట్ల సంతృప్తి లేనప్పుడు దేవుడు మధ్యలో ఇలా చిన్న చిన్న కష్టాలు ఇస్తాడు. అవి తీరిపోయాక మనకి ఉన్న జీవితం సంతోషం గా అనిపిస్తుంది” అని కధను పూర్తి చేశాను.

పాప సరే అని గెంతుకుంటూ వెళ్ళిపోయింది. నిజం గా కధలకు ఎంత శక్తి ఉంది, చిన్నప్పుడు ఎప్పుడో చదివిన కధ ఇప్పుడు ఉపయోగపడింది అనుకుంటూ

డైరీ ఓపెన్ చేసి కధ రాయటం మొదలు పెట్టాను - ..

కొద్ది సేపటికి మా పాప “అయిపోయింది” అన్న అరుపు బాత్రూమ్ నుండి వినిపించింది. ఇంకేముంది, ఈ కధ ఇంతటితో అయిపోయింది. నా అష్టావధానం సాఫ్ట్వేర్ మాత్రం పరిగెత్తుతూనే ఉంటుంది.

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల