ఆరోగ్యమే మహా భాగ్యం - బొందల నాగేశ్వరరావు

health is wealth

సిటీ నుంచి  వచ్చిన కూతురి పిల్లలకు తను చేసి వుంచిన పిండి వంటల్లో రెండేసి అరిశెలు రెండేసి లడ్డూలు, చక్రాలను రెండు గిన్నెల్లో, కొద్దిగా చక్రాలను ఇంకో గిన్నెలో తీసుకొని వచ్చి వరాండాలో ఆడుకొంటున్న మనవడు,మనవరాలికి చెరో గిన్నె, వాలుకుర్చీలో కూర్చొని రోడ్డు వేపు చూస్తూ సమయాన్ని కరగదీస్తున్న భర్త రామారావుకు  చక్రాలు మాత్రమే వున్న మూడో గిన్నెను ఇచ్చి తినమని చెప్పి రివ్వున వంటింట్లోకి వెళ్ళి పోయింది భార్య రాజ్యం,.
అరవై ఏళ్ళ రామారావు మనవడు, మనవరాలి గిన్నెల్లో వున్న అరిశెలను,లడ్డూలను చూసి తన గిన్నెలో వున్న చక్రాలను చూసుకొని బాధపడుతూ " రాజ్యం"అని పిలిచాడు భార్యను. 
 "ఏంటండీ?" పరిగెత్తినట్టు వచ్చి అడిగింది భార్య రాజ్యం.
"ఏమిటిది?వాళ్ళకు అరిశెలు ,లడ్డూలు,చక్రాలు. నాకు ఒఠ్ఠి చక్రాలానా!?
"అవునండి.మిమ్మల్ని డాక్టరు షుగర్ను కంట్రోల్లో వుంచుకోమన్నారు. స్వీట్లు,కేకులు,కూల్ డ్రింక్సు తీసుకోవద్దన్నారు .అందుకే మీకు స్వీటు పెట్టలేదు.." అంది భార్య,
"భలేదానవే రాజ్యం!నేను కంట్రోల్లోనేగా వున్నాను. రెండొందల షుగరు నన్నేం చేయదు.ప్లీజ్ ఓ లడ్డు,ఓ అరిశె మాత్రం పెట్టు.పిల్లలు తింటుంటే నాకు నోట నీళ్ళూరుతున్నాయే!" బ్రతిమాలాడు. భార్య రాజ్యానికి పాపమనిపించిందేమో ఓ లడ్డు,ఓ అరిశెను తెచ్చి గిన్నెలో పెట్టి వెళ్ళింది. అప్పటికే నాలుగు సార్లు గుటకలు మింగిన రామారావు అరిశెను తుంచి నోట్లో పెట్టుకోబో తుండగా పరిగెత్తిట్టు తండ్రి వద్దకు వచ్చిన కూతురు సుమ "షుగర్ టూహండ్రెడ్ వుందంటే అది కంట్రోలా...కాదు. ఎక్కువే! ఆ చక్రాలను మాత్రం  తినండి చాలు."అంటూ తండ్రి గిన్నెలో వున్న అరిశెను, లడ్డూను  తీసుకోని తన గదికి వెళ్ళి పోయింది కూతురు.అవి తనే తింటుందని వేరే చెప్పనఖ్ఖరలేదు.
చేసేదిలేక పిల్లల వంక చూశాడు రామారావు.మెల్లగా"పిల్లలూ! మీ వద్దున్న ఆ గిన్నెలతోపాటు శబ్దంచేయకుండా మెల్లగా నా వద్దకు రండి" పిలిచాడు.
"ఎందుకు తాతయ్యా"అంటూ ఇద్దరు దగ్గరకు వచ్చారు.
"ఇదిగో!చెరో యాభై రూపాయలిస్తాను.సాయంత్రం బజారుకెళ్ళి కాడ్బరీజ్  చాక్ లెట్లు కొనుక్కొండి . ఇప్పుడు చెరో లడ్డూ,అరిశెను నాకివ్వండి"అంటూ వాళ్ళ జేబుల్లో చెరో యాభై రూపాయల నోటును కుక్కి  గిన్నెల్లో వున్న  లడ్డూ,అరిశెను తీసి తనగిన్నలో వేసుకున్నాడు.
"ఓకే తాతయ్యా"అంటూ సంతోషంగా అక్కడినుంచి వెళ్ళబోతుంటే "ఆగండి! ఇక్కడే నా వద్ద కూర్చొని తిని మరి వెళ్ళండి. నేనూ త్వరత్వరగా తింటాను.మీ అమ్మో,అమ్మమ్మో అడిగితే మీకు పెట్టినవి మీరే తిన్నట్టు చెప్పండి.ఇలా  రోజూ స్వీటు పెట్టినా,కేకులు పెట్టినా అందులో భాగం నాకూ ఇవ్వండి.నేను మీకు ఇలాగే డబ్బులిస్తూ వుంటాను.ఓకే!"అన్నాడు రామారావు.
"అలాగే తాతయ్యా"అంటూ అక్కడే కూర్చొని తిన్నారుపిల్లలు.రామారావు కూడా హాప్పీ ఫీలవుతూ గబగబ తినేసి నీళ్ళు తాగాడు.ఈ తతంగం వరుసగా నాలుగు రోజులు జరిగింది. 
అయిదవ రోజు సాయంత్రం రామారావు ఒక్కడే ఎవ్వరికీ తెలీకుండ దొంగ చాటుగా పెరట్లో చెట్ల చాటున నిలబడి మామిడిపండు తింటూ...తింటూ దభీమని క్రింద పడ్డాడు. అది గమనించిన పిల్లలు  పరిగెత్తు కొంటూ వెళ్ళి అమ్మమ్మకు చెప్పారు.ఆమె కుయ్యో మొర్రో అని ఏడ్చుకొంటూ ఆటోలో ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది రామారావుని.ఆసుపత్రిలో అన్ని టెస్టులు జరిపిన డాక్టరు ఐ.స.యూ లో వుంచి అక్కడున్న స్టాండుకు సెలైన్ బాటిల్స్ తగిలించి అందులోని మందు శరీరంలోకి వెళ్ళటానికి చేతులకు,కాళ్ళకు రెండు ట్యూబులు తగిలించి గది బయటికి వచ్చాడు.అందాకా అద్దంలోంచి లోనికి చూస్తున్న రామారావు భార్య,కూతురు,మనవడు మనవరాలు ఏడ్పును టపీమని ఆపి డాక్టరు ముఖంలోకి చూశారు 'ఏమి చెపుతాడా' అన్న వుద్దేశ్యంతో
డాక్టరుగారు"చూడండీ!ఆయనకు హై బి.పి, ఇక షుగరు నాలుగు వందలకు దగ్గరుంది.అవి తగ్గటానికి  బోలెడు సెలైన్ బాటిళ్ళను, మందుల్ని  ట్యూబుల ద్వారా శరీరంలోకి పంపు తున్నాం. ప్రాణ భయంలేదు. అయినా ఇరవై నాలుగు గంటలు ఆబ్జర్వేషన్లో వుంచాలి,వెళ్ళి కౌంటర్లో ఓ ముప్పై వేలు కట్టి కూర్చొండి"అని చెప్పి చకచక వెళ్ళిపోయాడు డాక్టరు. వెనుక నుంచి దణ్ణం పెట్టుకున్నారు వాళ్ళు ముఫ్ఫై వేలు పోయినా మనిషి 'దక్కుతాడులే' అని అనుకొంటూ.
మరుసటి రోజు సాధారణ వార్డుకు తెచ్చారు రామారావుని. "ఏమండీ...ఏమండీ"అని  భార్య రాజ్యం."నాన్నా నాన్నా"అని కూతురు,"తాతయ్యా"తాతయ్యా" అని పిల్లలు పిలవటంతో మెల్లగా కళ్ళు తెరచి చూశాడు రామారావు, 
"ఎలా వుందండీ"రామారావు తల నిమురుతూ అడిగింది భార్య రాజ్యం.
"పర్వాలేదు రాజ్యం"అని కూతురు,పిల్లల వంక చూశాడు,రామారావు.
అప్పుడు' పర్వాలేదా నాన్నా'అని కూతురు,"తాతయ్యా!మీరు మాకిచ్చిన డబ్బులు  నాలుగు వందలైయ్యాయి.ఇవిగో! తీసుకొండి.డాక్టరుగారు తినమనే పళ్ళను మాత్రం తెప్పించుకొని తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొండి" అంటూ డబ్బులు ఆయన చేతిలో పెట్టారు పిల్లలు. కళ్ళు చమర్చాయి రామారావుకి.
అంతలో డాక్టరుగారొచ్చి పరీక్షించి "ఓకే రామారావుగారూ!అన్నీ కంట్రోల్లో వున్నాయి.ఇకపైనైనా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొండి.దొంగ చాటుగా స్వీట్లు.కేకులు, షుగరును తెప్పించేవి ఏవీ  తినకండి.వాకింగ్ అని చెప్పి పార్కు వద్ద వున్న టీ కొట్లో నాలుగు చంచాలు చెక్కర వేయించు కొని కాఫీ తాగి ఆ  పార్కులో వున్న బల్లమీద పడుకొని నిద్రపోయి వాకింగ్ చేసి వస్తున్నట్టు నటించకండి.ఆ తతంగాన్ని ఓ రోజు స్వయాన నేనే చూశాను.ఖచ్చితంగా రోజూ గంట పాటు నడవండి.చెప్పిన డైటు చెప్పిన మోతాదులో తీసుకొండి ..క్రమం తప్పకుండా మందులు వాడుకొండి. ఆరోగ్యమే మహా భాగ్యం అని గుర్తెరిగి మెలగండి.మిమ్మల్ని డిశ్చార్జి చేస్తున్నాను.జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి"అంటూ డాక్టరు వెళ్ళిపోతుంటే...
"మీరు చెప్పినట్టే నడచుకొంటాను డాక్టరుగారూ !"అని అటు తిరిగి"ఆసుపత్రి ఖర్చు ఎంతైందమ్మా"అని కూతుర్ని అడిగాడు రామారావు.
"ముఫ్ఫై వేలు నాన్నా! నిన్నే సెటిల్ చేశాను. షర్టు వేసుకొండి. ఇంటికి వెళదాం"అంది కూతురు.
'నాలుగు స్వీట్లు,నాలుగు కేకులు,నాలుగు మామిడి పళ్ళకు ముఫ్ఫై వేలు బొక్కా' మనసులోనే అనుకొంటూ షర్టును తొడుక్కొన్నాడు రామారావు.
©©©©©©©                     ©©©©©©©                     ©©©©©©©

మరిన్ని కథలు

hidden money
గుప్తధనం
- పద్మావతి దివాకర్ల
wedding invitation
పెళ్ళిపిలుపు
- డాక్టర్ చివుకుల పద్మజ
grand sari from mother house
పుట్టింటి పట్టుచీర
- మీగడ.వీరభద్రస్వామి
ashadam sales
ఆషాఢం సేల్స్
- పద్మావతి దివాకర్ల
large line
పెద్ద గీత
- గంగాధర్ వడ్లమన్నాటి
hard working old woman
శ్రమించే ముసలమ్మ
- కృష్ణ చైతన్య ధర్మాన
crow interest
కాకి కుతూహలం
- కృష్ణ చైతన్య ధర్మాన