పులుపెక్కిన వలపు - గంగాధర్ వడ్లమన్నాటి

hot romance

కొద్ది రోజులుగా శేఖరాన్ని భీకరంగా గమనిస్తున్న లక్ష్మమ్మ గారికి అంతా ఎంతో వింతగా, చాలా చిత్రంగా అనిపిస్తోంది. కారణం, ఆయన గత కొద్ది రోజులుగా చాలా చిత్రాది చిత్రంగా ప్రవర్తించడమే.ఇది వరకులా కాకుండా కొత్త పోకడలు పోవడమే ఆమెలో ఈ భయానికి కారణం.ఇది వరలో లాల్చీ పైజమా వేసుకుని నెమ్మదిగా బొమ్మలా ఉండేవాడు కాస్తా, కొత్తగా టీ షర్ట్స్,జీన్స్ వేసుకు తిరగడం.ముగ్గు పుట్టలా ఉండే జుట్టుని బొగ్గు గుట్టలా కనబడేట్టు రంగు వేసుకోవడం.హవాయి చెప్పులు,లెధర్ చెప్పులు వేసుకుని తిరిగేవాడు కాస్తా క్యాసువల్ షూస్ వేసుకుని స్టైల్ గా తిరగడం.గదమాయించినా ఉదయం నిద్ర లేవడం తెలియని మనిషి ,ఇపుడు లేవడమే కాక,లేచి వాకింగ్ లూ,జాగింగ్ లూ కూడా చేసేయడం,దద్దోజనం తిని మూతి కడుక్కునే వాడు కాస్తా ఇపుడు పిజ్జాలు, పాస్తాలు, బర్గర్లు,బ్రెడ్ ముక్కలు తెగ తినేయడం, ఖాళీ సమయాల్లో భక్తి చానెల్ చూసేవాడు కాస్తా ఇప్పుడు ఇంగ్లిష్ సినిమాలని కళ్ళప్పగించుకుని మరీ చూసేయడం, కళ్ళజోడు తీసేసి కాంటాక్ట్ లెన్స్ వేయించుకోవడం,జుత్తుకి నూనె రాసుకుని ఒబ్బిడిగా పాపిడి తీసుకోవడం మానేసి, తల మీద పీచు లేచినట్టుగా జుత్తు క్రాఫ్ చేయించడం లాంటివి చేసాడాయన.అలాగే, ఎవరైనా అతని ఇంటి గుమ్మం తొక్కడం పాపం అన్నట్టు,వారిని పలకరించినట్టే పలకరించి,ఓ నాలుగు మాటలయ్యాక,"నాలో మీకు ఏమైనా మార్పు తెలుస్తోందా. అప్పటికీ, ఇప్పటికీ నేను కొంత వయసు తగ్గినట్టు అనిపిస్తోందా.ఇంకా నేను కాస్త వయసు తక్కువ అనిపించేలా కనబడాలంటే,ఏవేం చేయొచ్చో చెప్పండి" అని అడిగి వారి బుర్రని తినేయడం.ఇలా అడగ్గా అడగ్గా, ఒకతను,"అబ్బే శేఖరం గారూ, వయసు తగ్గాలంటే బట్టలు, అలవాట్లు మారిస్తే చాలదండీ.వ్యాయామం కావాలి.అప్పుడే వయసు వెనక్కి నడుస్తుంది" చెప్పాడాయన. దాంతో ,మరుసటి రోజు రన్నింగ్ కి వెళ్ళాడు.వెళ్లడం వెళ్లినా తిరిగి రావడానికి ఓపిక చచ్చింది.దాంతో లిఫ్ట్ లు అడుక్కుని ఇల్లు చేరాడు. జిమ్ మెంబర్ షిప్ తీసుకుని జాయిన్ అయినా,ఒక్కరోజు చేసినందుకే, రెండు రోజులు నెప్పి బిళ్ళలు వాడవలసి వచ్చింది.ఇలా కాదని తన బైక్ వాడటం మానేసి,దగ్గర పనులన్నింటికీ నడిచి వెళ్లిపోవడం అలవాటు చేసుకున్నాడు. అయితే,ఇన్ని మార్పులపై అంత మక్కువ ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యం.అసలు ఏం జరిగి ఉంటుందీ అని లక్ష్మమ్మ నిత్యం రక్తం మరగబెట్టుకుంటూ, బుర్ర బద్దలు కొట్టుకుంటూ,కొన్నిసార్లు తనకి తానే సర్దిచెప్పుకుంటూ ఆలోచించ సాగింది.కానీ వివరం చిక్కక బిక్క మొహం వేస్తోంది.కానీ ఒక రోజు మధ్యాహ్నం ఆమె టీ.వి చూస్తున్నపుడు ,కాలేజీ నుండి వచ్చిన వాళ్ళబ్బాయి ,"అమ్మా వసుంధర అత్తయ్య అమెరికా నుండి ఈ శనివారం వస్తోందట. బాబాయి ఫోన్ చేసి చెప్పాడు.నాన్న వెళ్ళి రిసీవ్ చేసుకుంటా అన్నాట్ట.మరిచిపోకుండా మరో సారి గుర్తుచేయమని నాకు చెప్పారు" అని అతను చెప్పగానే, లక్ష్మమ్మ కళ్ళలో లక్ష్మి బాంబులు కనిపించాయి.ఆమె మొహం అంతా లిప్ స్టిక్ వేసినట్టు ఎర్రగా తయారైంది.ఆమె కోపంతో కదిలిపోతోంది.ఇప్పుడు లక్ష్మమ్మకి విషయం అంతా పూస గుచ్చినట్టూ,కోడి పొదిగినట్టూ,గుడ్డు పగిలనట్టూ,పిల్ల వచ్చినట్టూ,అంతా స్పష్టంగా అర్ధమైందామెకి."అంటే అతను ఇన్నాళ్లూ ఇవన్నీ చేసింది ఆ సుందరి, అదే ఆ వసుంధర కోసం అన్నమాట.ఆవిడ పెళ్లి చేసుకోలేదని ఓ సారి చెప్పారు.దానికి కారణం ఇతన్ని పెళ్లి చేసుకోలేకపోవడమే అని కూడా ఓ సారి ఈయన దూరపు చుట్టం ఒకాయన నా దగ్గరకొచ్చి అన్నారు.అయినా పెళ్ళైన ఇన్నాళ్ళకి మళ్ళీ ఆవిడ రావడం ఎందుకు.పోనీ ఆవిడ బుద్ధి బురదలో కలిసిందనుకుందాం.ఈయనకి ఏమైంది.ఇలా లేకి సోకులతో మైసూర్ పాక్ ముక్కలా చక్కగా తయారు కావాలా ఏవిటి.బుద్ధి ఉండొద్దూ.పిదప కాలం,మిడత బుద్దులూ.ఈ మాట నేను ఆయన వద్ద అంటే, మైదాముద్దలా చుట్టుకుపోతారు. ఆధారాల్లేకుండా నిందలు వేస్తావా అని నన్ను గోదార్లో తోసేస్తారు" అని కళ్ళు ఒత్తుకుంది.తర్వాత ఆత్రంగా ఎదురు చూసిన ఆ శనివారం రానే వచ్చింది.పొద్దునే చక్కగా తయారైన శేఖరం,లక్ష్మమ్మ గారిని చూస్తూ,"ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను".చెప్పాడాయన అది విన్న ఆమె గుండెల్లో బండరాయి పడింది.ఆమె మళ్ళీ కళ్ళు తుడుచుకుంది. "అసలు ఈరోజు నీకు చెబుదావనుకున్న విషయం ఏవిటoటే,నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే,ఇలా ఫిట్ గా మారిపోయానని.ఎందుకంటే, మన కాలనీ లో కొందరు,నీకన్నా నేను చాలా పేద్ద వయసు వాడిలా కనబడుతున్నానని అంటున్నారు.అందుకే, ఇలా వయసు తగ్గించుకుని నీకు సరి జోడిలా కనబడాలనే ఇలా" చెప్పాడు చిరునవ్వుతో. ఆ మాటలకి కొంచెం సిగ్గుపడి,తరువాత కాస్త అనుమానంగా చూసింది.క్షణం తరువాత,"మీరు మీ మరదలు వసుంధరని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారా".అడిగిందామె. "భలే దానివే.నేనెందుకు వెళ్తాను.అది మా తమ్ముడికి అప్పజెప్పాను.అలానే ఆమె మనింట్లో ఉండటం కూడా కుదరదన్నాను.పాతవి తవ్వడం ఎందుకూ అని" .చెప్పాడాయన నేల చూపులు చూస్తూ. ఆ మాటలు విన్న ఆమెకి ఏనుగు ఎక్కినంత సంబరం కలిగింది."మీరు ఇలా ఉంటే చాలా బావున్నారు.వయసు చాలా తగ్గిపోయినట్టు అనిపిస్తోంది".చెప్పిందామె. "థాంక్యూ" అని ఆమెతో అనేసి, .."ప్చ్… వసుంధర కోసం పడ్డ శ్రమంతా వృధా అయిపోయింది.నువ్వు ఆకారంలోనూ,అలవాట్లలోనూ ఈ కాలం కుర్రాడిలా కనిపించాలని ఆమె ఓ మెసేజ్ పెట్టింది. ఛాలెంజ్ ఏక్సెప్టెడ్ అని పెట్టాను.తీరా అంతా అయ్యాక ,లక్ష్మికి అనుమానం వచ్చిందని గ్రహించాను.ఇందాక ఆమె ,మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్తారా అన్నపుడు నాకు పూర్తిగా అర్ధమైంది.వెళ్ళననగానే ఆమె కళ్ళలో ఆనందం చూసి నిర్దారించుకున్నాను.ఈ నాల్రోజులు వసుంధరని ఇంటిలో పెట్టుకుంటే,మిగిలిన నా జీవితం మంటలో పెట్టుకున్నట్టే.అందుకే నిన్నే ఈ నిర్ణయం తీసుకున్నాను.తప్పలేదు మరి" అనుకున్నాడు మనసులో కాస్త భారంగా. "పాపిష్టి దాన్ని.మిమ్మల్ని అనవసరంగా అపార్ధం చేసుకున్నాను" అని మరోసారి కళ్ళొత్తుకుంది లక్ష్మమ్మ.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి