నువ్వు నువ్వులా - శింగరాజు శ్రీనివాసరావు

you as you

చిన్నతనం నుంచి నాది అదొక లోకం. బహుశా నేను పెరిగిన వాతావరణం అలాంటిది కావచ్చు. నాన్నగారు మా ఊరి పల్లెకు ఒక పెద్ద దిక్కు. ఊరిలో వాళ్ళకు మంచి, చెడు ఏదైనా సరే, మా నాన్న గారి సలహా కావలసిందే. మంచి రోజు దగ్గరనుంచి రాత్రి పురాణ పఠనం వరకు అన్నిటికీ మా నాన్నే అందరికీ. శుద్ధశ్రోత్రియ వంశం అంటారే అలాంటిదే మాదీను. మడి, ఆచారం, సంధ్య, జపం ఇలాంటివన్నీ మా నిత్యకృత్యంలో ఒక భాగంలా తయారయ్యాయి. మా ఇద్దరు అన్నదమ్ములలో మా తమ్ముడికి వంటబట్టలేదు గానీ, పెద్దవాడిని కావడం వలననేమో మా నాన్న లక్షణాలన్నీ నాకు అబ్బాయి. అలాగే ఊళ్ళో కూడ అవధానులు గారి పెద్దకొడుకు సుబ్బావధానులు అంటే తండ్రికి తగ్గ తనయుడు అన్న పేరు కూడ వచ్చింది. మారుతున్న కాలంతో పాటు పద్ధతులను మార్చుకోలేకపోయినా, చదువు బాగానే అబ్బింది నాకు. పదవ తరగతి వరకు మా ఊర్లో చదువుకున్నా, కందుకూరులో చేరి డిగ్రీ పూర్తి చేసి చిన్న ఉద్యోగం సంపాదించాను. ప్రవృత్తిగా పద్యాలు వ్రాయడం, పురాణ పఠనం అలవాటు చేసుకున్నాను. ఇది చాలవన్నట్టు మా పెదనాన్న గారి పుణ్యమా అని శెలవులలో ఊరికి వెళ్ళినపుడు నేర్చుకున్న జాతకాల లెక్కలు, ఒకరకంగా నాకు వ్యసనమే అయింది. ఉద్యోగంలో చేరిన కొత్తలో చెవి పోగు, నుదిటి మీద విబూది రేఖలు, చంకలో పంచాగపు సంచి విధిగా తీసుకెళ్ళే వాడిని. అదొక పిచ్చి. నా అవతారం, వ్యవహారం చూసి కొలీగ్స్ నవ్వుకునేవారని తరువాత, తరవాత తెలిసి గెటప్ మార్చాను. క్రమంగా కొత్తలోకంలోకి పడి, వివాహం గట్రా అయి పిల్లలు పుట్టినా, జాతకాలు చెప్పే అలవాటు మాత్రం పోలేదు. మొదట్లో వెటకారం చేసినవారే క్రమంగా నాకు గౌరవం ఇచ్చే స్థితికి వచ్చారు. అదేనేమో జాతక మహిమ.

నా పై అధికారులు కూడ నన్ను గౌరవించేవారు. ఏ ఊరికి బదిలీ అయినా నా గురించిన విషయమంతా ముందే అక్కడికి చేరేది. మొదటి నుంచి జాతకం చెప్పడాన్ని గాయత్రీ మాత ఉపాసనగా భావించి ఎవరి వద్దా ఒక్క రూపాయ తీసుకునేవాడిని కాదు, వారిచ్చిన పండు ఫలాలు తప్ప. బహుశా అందేనేమో నాకు గౌరవం పెరగడానికి ఒక కారణం. ఏదయితేనేం, కాలం అలా గడిచిపోయి, పిల్లలకు పెళ్ళిళ్ళయి, పదవీ విరమణ కూడ చేశాను. ఇప్పుడెందుకో నాలో ఏదో తెలియని మదన. నా తోటి వారంతా చాలా ఫాస్ట్ గా ఉంటుంటే, నేనెందుకు ఇంకా పాత ఛాందస భావాలతో మడి, మన్ను అంటూ పట్టుకు వేలాడుతున్నాను.

నాతో పాటి వారందరూ ఎంచక్కా తలకు రంగులేసుకుని కుర్రాళ్ళలా తిరుగుతుంటే, వయసుకు మించిన అవతారంతో తాతయ్యలాగ. ఛ...మారాలి అనుకుంటాను. కానీ మారలేక పోతున్నాను. రూపమే కాదు భావన కూడ మారడం లేదు. నాలుగేళ్ళ క్రితం పరిచయమైన వాడు చక్రి, నాకంటే ఒక్క సంవత్సరమే చిన్న. అతను తలకు రంగు అదీ వేసి నా కంటే పదేళ్ళు చిన్నలా అనిపిస్తాడు. పైగా అతను నాలా పాతచింతకాయ పద్యాలు కాకుండా వచన కవితలు వ్రాస్తాడు. చాలా బహుమతులు కూడ గెలుచుకున్నాడు. అవి చదువుతుంటే చాలా ఉద్వేగానికి లోనయేవాడిని. కానీ చందోబద్ధంగాని అదీ కవిత్వమేనా అనిపించేది. అదే అతనితో అనే వాడిని. కొంచెం సాధన చేసి పద్యాలు వ్రాయకూడదా అని. నాకు చేతనయింది అంతే అన్నా అనేవాడు.

అతను ముక్కుసూటి మనిషి. అతను బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ చేశాడు. నా చిన్ననాటి స్నేహితుడు రాజు, మరోక మిత్రుడు మూర్తి కూడ బ్యాంకు వారే. పదవీ విరమణ తరువాత అందరం ఒకే ఊరిలో స్థిరపడడంతో, ప్రతిరోజూ కలవడం, ఒక గంట పిచ్చాపాటి మాట్లాడుకోవడం జరుగుతుండేవి. మా మధ్య ఎన్నో సార్లు జాతకాల మీద, కవిత్వాల మీద చర్చలు జరుగుతుండేవి. కొన్నిటిని నిర్ద్వంద్వంగా ఖండించేవాడు. కానీ చాలా తెలివిగా చేసేవాడు. అప్పుడు నాకు ఆవేశం వచ్చినా, వాడి మాట తీరుతో అప్పుడే కొట్టుకుపోయేది .మేము నలుగురం బ్యాచ్ గా ఉండేవాళ్ళం. అందరం చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళం. నాలో అధిక ఆత్మవిశ్వాసమో లేక ఆత్మన్యూనతో తెలియదు గాని, నేను అందరిలా కాదు, కొంత తేడా అన్న భావన నాలో ఉండేది. అది బలహీనతో, ప్రత్యేకతో నాకే అర్థమయి చచ్చేది కాదు. ******* " చక్రీ. మీరంతా తలకు ఎంచక్కా రంగులేసుకుని, మంచి మంచి రంగుల చొక్కాలేసుకుని కుర్రకారులా ఫోజులిస్తుంటే, నాకు కుళ్ళుగా ఉంటోంది. నేను కూడ మీలా తయారవాలనిపిస్తున్నది" మనసులో మాట చెప్పాలనుకున్నాను, కానీ నోరు పెగలలేదు. అలా చెబితే చీప్ గా ఉండదూ. అందుకే మాటలు మింగేశాను. ఇంతలో రాజు కల్పించుకుని " ఏరా అవధానులూ, ఈ కరోనా గోల ఎప్పటిదాకా అంటావు. ఈ మధ్య ఎవరో చిన్న కుర్రాడు మే నెలాఖరుకల్లా ఖతం అన్నాడనీ, మరల ఆ కాలాన్ని జూన్ చివరిదాకా పొడిగించాడని, మా పక్కింటాయన చెబుతున్నాడు.

నేనిలాటివి నమ్మననుకో. ఇంతకూ నీకు తెలిసిన జ్యోతిష్యం ప్రకారం ఏదైనా చెప్పగలవా?" మామూలుగా అడిగాడు. " అలా ఇదమిద్ధంగా చెప్పడం కష్టం రాజు. ఏదో గ్రహస్థితులు బాగు లేవని, పైగా శార్వరి అంటే చీకటి కదా అందుకని ఈ సంవత్సరం కొంత ఒడుదుడుకులు తప్పవని అనుకున్నాం గాని, ఎవడో అక్కడ తింటే ఇక్కడ మనం వాసనకు గుడ్డ కట్టి, చేతులు కడుక్కుంటామనుకోలేదు. ఒరేయ్ అబ్బాయ్ ఏ జ్యోతిషమైనా, చిలక ప్రశ్నయినా ప్రకృతి ముందు తలవంచవలసినదే " నా పక్కీలో నేను చెప్పాను. ఇంతలో మూర్తి ఉండి " నిజమే సర్. కాని ఈ విషయం ముందుగా జ్యోతిష పండితులు పసికట్టాలికదా. ముందుగా అప్రమత్తం చేయాలి. తీరా వచ్చిన తరువాత ఆయన ఎప్పుడో చెప్పాడు, ఈయన ఎప్పుడో చెప్పాడు అనడమో, మరికొందరు ఈ వ్యాధి ఫలాన రోజుకు అంతమవుతుందని చెప్పడమో అంతా ఒక తంతులా అనిపిస్తుంది కదా" అన్నాడు. " నిజమే కాని. ఎందుకో ఈ సంవత్సరం ఉపద్రవం గురించి చెప్పలేదు పండితులెవరూ" అన్నాను. " అయినా అయిందేదో అయిపోయింది. రావలసినదేదో వచ్చిపడింది. ఇప్పుడు చర్చించుకున్నా వచ్చినది పోదు. టాపిక్ మార్చండిరా బాబు. ఇంటా బయటా, ఆఖరుకు ఫోను చెయ్యాలన్నా రింగ్ టోన్ ముందు చెప్పే కరోనా జాగ్రత్తలు వినలేక ఫోను చెయ్యటమే మానేశాను" కొంచెం విసుగ్గా అన్నాడు చక్రి. " సరే వదిలేద్దాం గాని తమ్ముడూ. నాకో చిన్న సలహా చెప్పు" అన్నాను. " మీకు నేను సలహా చెప్పండం. ఏంటన్నా వెటకారం. మా అందరిలోకి పెద్దవారు, మేథావులు మీకు నేను చెప్పడమా" " నీ వెటకారం చాలుగానీ చెప్పేది విను. అరచేతిలో ప్రపంచాన్ని అందరూ చూస్తున్న ఈ రోజులలో ఇంకా పురాణాలు చదువుతూ, పంచాగకట్టలు పట్టుకుని నేను లెక్కలు కడుతూ కూర్చుంటుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. మానేసి మీలా మారదామనుకుంటున్నాను. దీని వలన అందరూ నాకు లేని పెద్దరికాన్ని అంటగడుతున్నారు. మీతో మాట్లాడినంత స్వేచ్ఛగా నాతో మాట్లాడరు. నన్నేదో పైనుంచి ఊడిపడిన వాడిలా చూస్తూ, చాలా నమ్రతగా ఉంటారు. ఈ రోజు వరకు ఎవరూ నాతో చనువుగా ఉండరు. మీరు తప్ప. అప్పుడప్పుడూ మీరు కూడ అలాగే ఉంటారు. ఎన్నాళ్ళనుంచో ఈ బాధను మనసులో దాచుకున్నాను. వయసు పెరుగుతున్న కొలది ఆ బాధ అణచుకోలేనంతగా తయారయింది. తట్టుకోలేక ఇవాళ బయటపడుతున్నాను. మీరే చెప్పండి నా బాధ అంగీకారమైనదా..కాదా.." అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఇలాటి దిక్కుమాలిన ఆలోచన నా మనసులో ఉందని కూడ వారు ఊహించలేదేమో. దీనికి అసలైన కారణం నన్ను ఈ మధ్య కొందరు విమర్శించడం జరిగింది. "జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకుని పోజులు కొడుతున్నానని, అసలు నాకేమీ తెలియదని అంతా హంబక్ అని. మరి ఇన్ని తెలిసినవాడు కదా మా పిల్లకు పెళ్ళి వారంలో అవుతుందన్నాడు. సంవత్సరమయింది. ఇప్పటిదాకా అతీగతీ లేదని. అన్నది ఎవరో కాదు. రాజు కొలీగ్. అంతేకాదు. చాలామంది అభిప్రాయమిదేనని". ఆ నోట ఈ నోట పడి అది నా చెవిదాకా వచ్చింది. అందుకే వదిలేద్దామనుకుని, చివరి సలహాగా చక్రినడిగాను. ఇలా మాటలలో ఉండగానే ఒకతను మా దగ్గరకు వచ్చి " నమస్కారమండీ అనధానులు గారు. రాజు, మూర్తి మీరు ఇక్కడే ఉన్నారా?" అనగానే చూశాను. అతనే, ఎవరయితే నా గురించి అవాకులు చెవాకులు వాగారో అతనే. నవ్వి ప్రతి నమస్కారం చేశాను. " ఏమోయ్ వెంకట్రావ్. దారి తప్పినట్లున్నావు. మా ఛాదస్తపు బ్యాచ్ తో ఏం పనొచ్చింది" దట్టించిన వెటకారం రాజు మాటల్లో. " దెప్పకయ్యా బాబు. అవి మంచి వయసులో ఉన్న రోజులు కనుక అలా మాట్లాడాము. ఇప్పుడన్నీ చచ్చుబడి పోయాయి. సరే. అసలు విషయమేమిటంటే మా అమ్మాయి పెళ్ళి కుదిరింది, మన అవధానులు గారి పుణ్యమా అని. అయ్యగారు చెప్పినట్లు చేశాము. అంతా నల్లేరు మీద బండిలా అయిపోయింది. అందుకే అవధానులు గారి ఆశీర్వాదం మా పిల్లలకు కావాలని వచ్చాము. నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి పిలుస్తాను. ఇదిగో మీకు కార్డు పంపుతాను. అందరూ రావాలి" అని చెప్తుంటే, ఇంతలో ఎవరో కేక వేయడంతో మరల కలుస్తానని వెళ్ళిపోయాడతను. వళ్ళు మండింది నాకు. నిన్నటిదాక నా గురించి చెడు ప్రచారం చేశాడు. సంవత్సరం క్రితం మా ఇంటికి వచ్చి పిల్ల పెళ్ళి కుదరటం లేదు. జాతకం చూడమని ఏడ్చినంత పని చేస్తే పాపమని చూసి, దానికి విరుగుడు చెప్పి పంపాను. నెలలోపల అంతా సర్దుకుంటుదన్నాను. కానీ కుదరలేదని చాటుగా దుమ్మెత్తిపోశాడు. అదే ఇప్పుడు వచ్చి ఇలా.... తట్టుకోలేక విషయం మొత్తం కక్కాను మా వాళ్ళ దగ్గర. " వాడు పెద్ద బేవార్సు గాడని, బ్యాంకు అంతా తెలుసు. అలాటివాడి మాటలు పట్టించుకోవాలా అవధాని. నేను పొద్దునలేస్తే చాలు విబూది పూసుకుని, గుడి చుట్టూ తిరుగుతాననేవాడు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనపని మనదే" తేలికగా కొట్టి పారేశాడు రాజు. ఇంతలో అవధానులు ప్రియశిష్యుడు కోటంశెట్టి వచ్చాడు. " గురువుగారు నమస్తే. మీరు కొత్త నోట్లు కావాలన్నారుగా. పట్టుకొచ్చాను. రేపు ఉదయాన్నే ఇంటికొచ్చి ఇస్తాను" అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడు. నాకు గర్వంగా అనిపించింది. నా మాటంటే వీడికి ఎంత గురి. మరి అందరికీ ఎందుకు లేదు? ఎక్కడ లోపం? నా మనసు చదివాడేమో చక్రి చిరునవ్వు నవ్వాడు. " ఎందుకు చక్రి నవ్వుతున్నావు " అని అడిగాను. " అన్నా. నువ్విప్పుడు సందిగ్ధంలో ఉన్నావు. అవునా?" " ఏ విషయంలో" " ఇప్పటిదాకా నువ్వు ఎంచుకున్న మార్గం సరికాదేమోనని. ఇన్ని రోజులూ ఛాదస్తాన్ని మోసుకుని తిరిగి అందరిలా కాకుండా, ఏదో బందీలాగ బ్రతికానని బాధపడుతున్నావు. ఒకవైపు అందరూ గౌరవిస్తున్నా. ఏదో వెలితి మీలో...అవునా" ఖంగుతిన్నాను. " అలాంటిదేమీ లేదు. సంప్రదాయం అంటూ కొంత ఎంజాయ్ మెంట్ కోల్పోయామేమోనని అనిపిస్తున్నది. అది నిజం కాకపోవచ్చేమో కూడ" " ఆనందం, సంతోషం అనే పదాలకు కొలబద్ద లేదు. ఒకరికి ఆనందాన్ని కలిగించింది మరొకరికి కలిగించక పోవచ్చు. కాకపోతే ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. మనకంటే ఎదుటి వాడు బాగున్నాడని, పదిమందిలో అతనికేదో గుర్తింపువుందని. అదే ఆత్మన్యూనత. దీనికి ఎవరూ అతీతులు కారు. మన విషయమే తీసుకుందాం. మా దృష్టిలో మీరు చాలా గొప్పవారు. అంతేకాదు మన సర్కిల్ లో మీకిచ్చే గౌరవం మాకివ్వరని. కానీ మీ మనసులో నేను మిగతా వాళ్ళలాగ జీవితాన్ని స్వేచ్ఛగా, కోరుకున్న రీతిలో గడపలేక పోతున్నానని. నిజమా... కాదా" మౌనంగా వింటున్నాను. చక్రి మాటలలో నిజం ఉంది. " మీలో ఘర్షణ అనవసరం. ఇప్పుడు చూడండి. మీ అలవాట్లే మంచివని సమాజం మొత్తం అనుసరిస్తున్నది. మా అందరికంటే మీలో ఏదో ప్రత్యేకత వున్నది. అదే జ్యోతిష పరిజ్ఞానం. ఇందాక వచ్చాడు చూడు వెంకట్రావు. అతనిలో ఎంత మార్పు వచ్చిందో చూశారుగా. ఎటువంటి వారైనా చివరకు మీ దారికి రావలసిందే. తప్పదు. మీలోని ప్రతిభే మీ గౌరవానికి కారణం. తాత్కాలిక సంతోషాలేవి ఆ సంతోషానికి సమానం కావు. మీ వేష భాషలు పెద్దరికాన్ని కట్టబెట్టినా, మిమ్మల్ని ఒక ఆత్మీయుడుగా జనాలలో గుర్తింపును తెచ్చింది. అది మాకుందా..లేదు. మీలా మేము ఉండలేక పోతున్నామని మేమనుకుంటున్నాము. భలే తమాషా కదూ. అన్నా.. మావి సాదాసీదా బ్రతుకులు. నీది భగవదత్తమైన జీవితం. సరస్వతీ కటాక్షమున్న వాడివి నీవు. నిస్వార్థసేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న అదృష్టవంతుడివి. ఇది ముఖస్తుతిగా చెబుతున్న మాటగాదు. నిజమన్నా. మీరు మీలా ఉండండి. ఎవరిలాగానో ఉండాలనుకోవద్దు. మీకు చెప్పదగినంత వాడిని కాదు." అని చిన్న సైజు క్లాసే పీకాడు చక్రి. " అవధానులు నీకు గుర్తుందా. నీ పదవీ విరమణ సభలో నిన్ను మీ అధికారి గారు చాగంటి వారితో పోల్చారు. నీలో అంత నిస్వార్థ సేవా తత్పరత వుంది. నీలా లేమే అని మేమనుకుంటుంటే.. నువ్వెందుకిలా.." చక్రిని సమర్థించాడు రాజు " గురువు గారు. మీతో తిరగడం వలన మాకు గౌరవం పెరిగింది. మీరు రాజు చిన్ననాటి స్నేహితులు, మేము ఉద్యోగస్తులమైనా మీ అంత గుర్తింపు మాకు లేదు. దైవత్వం ఉట్టి పడే మీరే మాకు గురుదేవులు. మీరు మీరులా ఉండండి. అదే మాకు ఆనందం కలిగిస్తుంది" మూర్తి కూడ జత కలిశాడు. నాలో ఏదో తెలియని కొత్త శక్తి వచ్చింది. నా ఆలోచనలు తప్పు. అవును. ఒకరిలా ఎందుకుండాలి. నాలా నేను ఉంటాను. అవును చక్రి చెప్పింది నిజం. ఎవరిలానో ఉండాలనుకోకూడదు. మన సంప్రదాయం మనదే, మన పద్ధతులు మనవే. " సారీ. వయసు మీద పడడం వలననేమో మనసు కొంత వశం తప్పినట్టుంది. దాని ప్రభావమేమో. ఏ పేరుకోసమో, గుర్తింపు కోసమో కాదు. నా వ్యక్తిత్వం నాది. నా ఆహార్యం నాది. మీ అందరికీ చాలా ఋణపడి వుంటాను. నన్ను నేను తెలుసుకునేలా చేశారు" చాలా సంతోషంగా చెప్పాను. అందరి ముఖాలలో సంతృప్తి. చీకటి పడడంతో లేచి టీ తాగుదామని బయలుదేరాము తేలికైన మనసులతో.... **** అయిపోయింది*****

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి