ఉపాయం - పద్మావతి దివాకర్ల

idea

"నిన్న గాంధీనగర్‌లో గల ప్రముఖ జ్యూయలరీ షాపైన 'ఓం జ్యూయలరీ'లో దుండగులు జొరబడి కోట్ల విలువగల బంగారు ఆభరణాలు పట్టపగలు దోచుకున్న సంగతి విదితమే! అయితే ఇంతవరకూ ఎవరూ పట్టబడలేదు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యంపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు." అని టివిలో వార్త ప్రసారమవుతోంది. అదివిని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు నిట్టూర్చాడు.

లాక్‌డౌన్ 5.00 తో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దేశాన్ని ప్రగతి పథంపై ముందుకు సాగించటం కొరకు ఈ మధ్య చాలా సడలింపులు జరిగాయి. కంటైన్‌మెంట్ జోన్ తప్పించి మిగతా అన్ని చోట్లా పలు ఆంక్షలు ప్రభుత్వం ఎత్తివేసింది. ఒకరకంగా చెప్పాలంటే, లాక్‌డౌన్ ప్రక్రియకి వ్యతిరేకంగా ప్రస్తుతం అన్‌లాక్ పద్ధతి మొదలైయింది. రైళ్ళ రాకపోకలు, బస్సుల రాకపోకలు మితంగానైనా ప్రారంభమయ్యాయి. దేవాలయాలు కూడా తెరుచుకున్నాయి. మాల్స్, హోటల్స్ కూడా తెరుకోబోతున్నాయి. ఒక్క విద్యా సంస్థలు తప్పించి మిగతా అన్నీ మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి.

కరోనా మహమ్మారికన్నా ఆర్థికపరమైన ఇబ్బందులే ప్రజలని ఎక్కువగా పీడిస్తున్నాయి. వలస కార్మికులు, రోజువారి పనివారేకాదు, చిన్నచిన్న వ్యాపారస్తులు కూడా ఈ కరోనావల్ల ఆదాయం లేక బాగా ఇక్కట్లు పాలైయ్యారు. ఇప్పుడిప్పుడే ఒకొక్కటి తెరుచుకోవడంతో మళ్ళీ అందరూ తమ తమ పనుల్లో చేరారు. వ్యాపారాలు జోరందుకున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న రహదారులు మళ్ళీ పూర్వపు రద్దితో సందడిగా ఉన్నాయి. ఇన్నాళ్ళూ ప్రశాంతంగా ఉన్న ప్రపంచం ఒక్కసారి ఊపందుకొంది.

ఇన్నాళ్ళూ కరోనా, లాక్‌డౌన్ కారణంగా ప్రశాంతంగా ఉన్న ఊళ్ళు, పట్టణ్ణాలు, నగరాలు అన్నీ మళ్ళీ రకరకాల నేరాలతో అట్టుడికిపోతున్నాయి. నేరగాళ్ళూ మళ్ళీ రెచ్చిపోతున్నారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలూ లాంటి నేరాలు మళ్ళీ మొదలై పోలీసుల కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్ళుగా లాక్‌డౌన్ అమలు చేయడానికి శ్రమించిన రక్షకభటులకు ఈ పెరిగిన నేరాలు తీవ్రమైన తలనొప్పికు కారణమవుతున్నాయి.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావుకి ఈ మధ్య పట్టణంలో జరుగుతున్న నేరాలవల్ల కంటిమీద కునుకు లేకుండా ఉంది. నేరాలు అదుపుతప్పడం వల్ల పై అధికారులతో చీవాట్లు తినవలసి వస్తోంది.

గత వారంరోజుల్లో పట్టణంలో నాలుగు హత్యలు జరిగాయి. మొదట ఈ హత్యలకి ఏ విధమైన ఆధారాలు లభించలేదు. పాత కక్షలుకానీ, అధిపత్య పోరుగానీ కారణం కావచ్చని మీడియా కోడై కూసింది. ఎంతో కష్టంమీద హంతకులను పట్టుకున్నాడు ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు. పాత కక్షలవల్ల హత్య జరగడంవల్ల హంతకులను త్వరలోనే పట్టుకోగలిగాడు. దొంగతనాలు లాక్‌డౌన్ ముందుకన్న కూడా ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవే కాక రకరకాల కొత్త నేరాలు కూడా మొదలయ్యాయి సైబర్ నేరాలతో సహా. రౌడిగ్యాంగ్ హల్‌చల్ సరే సరి! వీటన్నింటితో సతమతమవుతూ ఉన్నాడు. ఇన్నాళ్ళూ కరోనాని అదుపులో పెట్టడానికి రోజంతా శ్రమించవలసి వచ్చింది. ఇప్పుడు ఈ అన్‌లాక్ మొదలవగానే కొత్తగా ఈ నేరగాళ్ళ బెడద ఆరంభమైయింది. అయితే అన్నింటికన్నా ఎక్కువ తలనొప్పికి కారణమైంది ఈ మధ్యే ప్రముఖ జ్యూయలరీలో పట్టపగలు జరిగిన దోపిడీ.

సడలించిన నిబంధనలవల్ల ఈ మధ్యనే జ్యూయలరీ షాపులు తెరుచుకున్నాయి. ఆ షాపు తెరుచుకున్న మొదటి రోజే పకడ్బందీ అయిన ప్లాన్ వేసుకొని ఈ దురాగతానికి పాల్పడ్డారు ఓ నలుగురు దుండగులు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అందుకే షాపులోకి అడుగు పెట్టినప్పుడు వాళ్ళని మొదట అనుమానించలేదు సిబ్బంది. పట్టపగలే షాపులోకి జొరబడి యజమానిని, సిబ్బందిని తుపాకితో బెదిరించి కోట్లు విలువచేసే ఆభరణాలు దోచుకున్నారు. సిసిటీవి ఫుటేజీ వలన ఏమాత్రం ఆధారం లభించలేదు. అందరూ మాస్కులు వేసుకొని పోల్చుకోలేని విధంగా ఉన్నారు. కరోనా వల్ల ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి కావడంవల్ల ఈ చిక్కొచ్చి పడింది. ఆ షాపు యజమాని చాలా పలుకుబడి కలవాడేకాక స్థానిక రాజకీయ నాయకులకి బాగా కావలసినవాడు. అందుకే ఆ దోపిడీ దారులని పట్టుకోవడంపై ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ రాజేస్వరరావు పైన తీవ్రమైన ఒత్తిడి పడింది. ఎంత పరిశీలించి చూసినా ఏమాత్రం క్లూ కూడా లభించలేదు. కాకపోతే దుండగులి వేలిముద్రలు మాత్రం కొన్ని లభించాయి.

పాత నేరస్థుల వేలిముద్రలతో పోల్చి చూసాడు. కానీ అవి వేటితో కూడా సరిపోలేదు, అంటే దానర్థం ఈ దోపిడీలో కొత్త నేరస్థులు, అంతరాష్ట్ర నేరస్థులు ఎవరైనా పాల్గొని ఉండవచ్చని భావించాడు. పాత నేరస్థులు ఈ దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొనక పరోక్ష సహాయమందించి ఉండవచ్చు. రాజేశ్వరరావుకి ఈ కేసు ఓ జటిల సమస్యగా తయారైంది. ఆధారాలు సరిగ్గా దొరకకపోయినా పాతకక్షల వల్ల జరిగిన హత్యా నేరాలను సులభంగానే ఛేదించగలిగినా, ఈ దోపిడీ విషయంలో మాత్రం తన పరిశోధన ఏ మాత్రం పురోగతి సాధించలేదు. ఇంట్లో ఉన్నా, స్టేషన్‌లో ఉన్నా, ఆఖరికి రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఆ దోపిడీ గురించి ఆలోచనలే మనసులో పరిభ్రమిస్తున్నాయి. పై నుండి వస్తోన్న వత్తిడి భరించరానిదైంది. పైగా మీడియా పోలీసుల వైఫల్యం ఎత్తి చూపుతూ వివిధ కథనాలు ప్రసారం చేస్తూ అత్యుత్సాహం చూపిస్తోంది. ఆలోచనలతో రాత్రి నిద్ర కూడా కరువైంది.

అన్యమనస్కంగా టివి చూస్తూ కూర్చున్నాడు రాజేస్వరరావు భార్య అనిత ఇచ్చిన టీ తాగుతూ. న్యూస్ ఛానల్లో కోవిడ్ అప్డేట్ వస్తోంది. ప్రపంచం నలుమూలల ఏ దేశంలో ఎంతమందికి కరోనా వైరస్ సోకింది, ఎంతమంది మరణించారు వగైరా వివరాలు, భారత దేశ వ్యాప్తంగా వివరాలు చూపుతున్నారు ఆ న్యూస్‌లో. ఆ తర్వాత కరోనా సోకినవాళ్ళు తీసుకోవలసిన జగ్రత్తలు వివరిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవాళ్ళ కంటాక్ట్‌లిస్ట్‌లో ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా చెపుతున్నాడు. అది చూస్తూనే హఠాత్తుగా రాజేశ్వరరావు మదిలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. మూడు రోజులుగా తనని వేధిస్తున్న సమస్యకి పరిష్కారం లభించిందన్న ఉత్సాహంతో సోఫాలోంచి లేచాడు.

**** **** **** ****

సరిగ్గా రెండురోజుల అనంతరం జ్యూయలరీ షాపు దోపిడీలో పాల్గొన్నవాళ్ళు నలుగురూ కూడా పట్టుబడ్డారు. చాలా చాకచక్యంగా దుండగులను పట్టుకొన్న ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు ప్రతిభకి పొంగిపోయి పై అధికారులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు. మీడియా కూడా అతన్ని ఆకాశానికెత్తేసి వార్తలు ప్రసారం చేసింది. ఇంతకుముందు పోలీసుల చేతకానితనాన్ని దుమ్మెత్తి పోసిన నోటితోనే ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటివి ఇంతకుముందు చాలాసార్లు జరిగినందువల్ల ఆ ప్రశంసలకి పొంగిపోలేదు ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు.

అయితే అతను ఈ కేస్‌ని ఎలా ఛేదించి దుండగుల్ని పట్టుకున్నాడో అతని అసిస్టెంట్ అయిన సబ్ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామికి ఏ మాత్రం అంతుబట్టలేదు. మొన్నటివరకూ ఏ మాత్రం ఆధారం చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతున్న ఈ కేస్ ఇలా సులభంగా విడిపోవడంతో చాలా ఆశ్చర్యపోయాడు. చివరికి ఉండబట్టలేక ఆ విషయమే అడిగాడు రాజేశ్వరరావుని.

అతను చిరునవ్వు నవ్వి, "మొన్న టివిలో కరోనా సంబంధితమైన వార్తలు చూడగానే నా మనసులో ఓ ప్లాన్ తట్టింది. దాని ప్రకారం నాకు తెలిసిన అధికార్లు, మీడియావాళ్ళ సహకారంతో ఓ చిన్న నాటకం నడిపించాను. దాని ప్రకారం ఆ జ్యూయలరీ షాపు యజమానికి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకి ప్రాణాంతకంగా ఉందని ప్రచారం చేయించాను. వాళ్ళు హాస్పిటల్లో చేరి ప్రమాద స్థితిలో ఉన్నట్లు కూడా ప్రచారం చేయించాను. అయితే దీనికి పైఅధికారుల అనుమతి, ఆ షాపు యజమాని అనుమతి కూడా తీసుకున్నాలే! ఈ వార్త విస్తృతంగా ప్రచారమవడంతో ఆ దుండగులు కూడా తమకెక్కడ కరోనా సోకిందోనని ఆందోళనచెంది టెస్ట్‌లు చేయించుకున్నారు. ఆ తర్వాత వేలిముద్రల ఆధారంగా సులభంగా పట్టుబడ్డారు! అంతే!" అని చెప్పాడు రాజేశ్వరరావు.

అతని తెలివికి ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టాడు వెంకటస్వామి.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి