బధిరుడు - శింగరాజు శ్రీనివాసరావు

Deaf

" ఆ దరిద్రం వదిలింది. ఈ శనేశ్వరం ఎప్పుడు పోతుందో. ఆ మహాతల్లి నాలుగేళ్ళు ప్రాణం తోడింది. ఈ దేవదేవుడు ఎన్నాళ్ళు పీక్కుతింటాడో" కంచం బల్లమీద పెట్టి భర్త వైపు తిరిగి " లేపండి మీ జనకుడిని. తిని మరల మంచం విరగదొక్కుతాడు" కడుపులో కసినంతా వెళ్ళగక్కింది వనజ. తండ్రికి చెవుడు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎంత బాధపడేవాడో, తండ్రిని లేపి కూర్చోబెట్టి కంచం చేతికిచ్చాడు నాగరాజు నాగరాజు తండ్రి కమలాకర రావు, రెవిన్యూ అధికారిగా చేరి రెండు చేతులా బాగా సంపాదించాడు. దయ, జాలి అనే రెండు పదాలను దూరంగా పెట్టి దోచిన సొమ్ముతో నాలుగు ఇళ్ళు, పాతిక లక్షల ఆస్తి పోగేశాడు. ఆయనకున్న ఇద్దరు సంతానం నాగరాజు, శారద. సంపాదనే తప్ప ఇంటి ధ్యాసే లేని కమలాకర రావు పిల్లల బాధ్యత భార్య సరస్వతికి వదిలేశాడు. అవసరానికి మించి డబ్బు అందుబాటులో ఉండడం, తల్లిప్రేమ దానికి తోడవడంతో పిల్లలు దారి తప్పారు. ప్రేమ వలలో పడి శారద కులాంతర వివాహం చేసుకుని దూరంగా వెళ్ళిపోయింది. పట్టుదలకు పోయి కమలాకర రావు కూతురిని వదిలేశాడు. ఒక్క ఏడుపు ఏడ్చి ఊరుకుందామనుకుంటే, పుండు మీద కారం చల్లినట్టు ఆస్తికోసం తండ్రి మీద దావా వేసింది సరస్వతి. కోర్టు గడప తొక్కలేక రెండు ఇళ్ళను కూతురు పేరున వ్రాసి బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాడు కమలాకరరావు. చదువు సరిగా వంటపట్టని నాగరాజును తన పలుకుబడితో ప్రైవేటు కాలేజిలో గుమాస్తాగా చేర్పించాడు. అక్కడ నెలకు పదిహేను వేలు సంపాదన. భార్యను, పిల్లను పోషించుకోను ఆ సంపాదన చాలదని, పై ఎత్తున సాయం చేస్తూ వచ్చాడు కమలాకర రావు. పాపమే పండింతో, తలరాతే మారిందో గాని తిరిగే తిరిగే సరస్వతికి అకారణంగా పక్షవాతం వచ్చింది. దాంతో కొడుకు పంచన చేరక తప్పలేదు కమలాకర రావుకు. కోడలి ప్రోద్బలంతో కోడుకు నసపెట్టిపెట్టి మొత్తం ఆస్తిని తన పేర వ్రాయించుకున్నాడు. అవసరమనో, బిడ్డ మీద మమకారం చేతనో, కూతురు మరలా ఎక్కడ పీడిస్తుందనో గాని కమలాకర రావు ఆస్తి మొత్తం కొడుకు పేర వ్రాశాడు. అప్పటి దాకా చుట్టూ చుట్టూ తిరిగిన కొడుకు, కోడలులో క్రమంగా మార్పు రావడం గమనించింది సరస్వతి. పదివేలు ఇచ్చి పనిమనిషిని పెట్టుకున్నా, అంత ముద్ద వండి పెట్టడమే గగనంగా మారింది వాళ్ళకు. అజమాయిషీ చేసి ఇంతకాలం బ్రతికిన కమలాకర రావు దంపతులకు, అసలు బ్రతుకంటే ఏమిటో తెలియరాసాగింది. మంచాలు పంచలోకి మారాయి. వేళకు అంత ముద్ద విసరివేయడం తప్ప, పలకరించే దిక్కు లేకుండా తయారయింది బ్రతుకు. డబ్బు అహంతో విర్రవీగి నా అనుకున్న వాళ్ళను దూరం చేసుకున్నారు. ఫలితం ఒంటరితనం. ఆ దిగులుతోనే పోయిన సంవత్సరం కమలాకర రావును ఒంటరిని చేసిపోయింది సరస్వతి. ఆ రోజు నుంచి మరీ పిచ్చివాడయిపోయాడు. వాకింగ్ కూడ మానివేశాడు. ఏదో పోగొట్టుకున్న బాధ. తండ్రి బాధ చూడలేక నాగరాజు పలకరించబోయినా, అతని భార్య వనజ ఏదో పని చెప్పి భర్తను అక్కడి నుంచి లేపేది. 'అయినా ఆ చెవిటి మొత్తుకోలుతో నీకు ముచ్చటేంది' అని కసురుకునేది కూడ. కొద్దికొద్దిగా ఇబ్బంది పెట్టే మోకాళ్ళనొప్పులు కదలికలు లేని కారణంగా అసలుకే మోసం చేశాయి. తన పని తను చేసుకోవడమే కష్టంగా మారింది కమలాకర రావుకు. మంచం పట్టినట్టేనని అర్థంచేసుకున్న అతను కుంగిపోయాడు. అతని కళ్ళు నీరు కారుతున్నాయి. ఎంతమంది దగ్గర బలవంతంగా లంచం తీసుకున్నాడో, ఎన్ని పేద గుండెలలో చిచ్చు రగిల్చాడో గానీ, ఆ పాపం శాపమయింది.

మనోవ్యథకు ఫలితంగా రక్తపోటు తారాస్థాయికి చేరింది. ఉన్నట్టుండి ఒక రోజు రాత్రి మంచం మీద నుంచి లేవబోతూ కళ్ళు తిరిగి కిందపడ్డాడు. శబ్దం విని వచ్చి కొడుకు, కోడలు శతమానం పెట్టి లేపబోయారు. కానీ అతనిలో కదలిక లేదు. " వనజా. నాన్న తట్టినా లేవడం లేదే" " చచ్చాడేమో ముసలాడు. కాస్త గుండె దగ్గర చెవు పెట్టు" " లేదే. గుండె కొట్టుకుంటోంది. ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళదాం. అవయితే ఇప్పుడు తీసి ఉంటారు" " దేనికి. అదొక డబ్బు దండగ. ఎలాగోలా లేపి పడుకోబెడదాం. తెల్లారేసరికి బ్రతికుంటే, ఏదైనా చిన్న ఆసుపత్రికి తీసుకెళదాం. బ్రతికే బ్రతుకుతాడు. పోతే పోతాడు" కమలాకర రావు కొంచెం కదిలాడు. నాగరాజు అది గమనించి ఆయనకు మంచినీళ్ళు తెచ్చి తాగించాడు. మెల్లిగా కొడుకు సాయంతో లేచి మంచం మీద కూర్చున్నాడు. " ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయిరా. అంతే" సంజాయిషి ఇచ్చుకున్నాడు. " వయసు పైబడిన తరువాత కూడ రెండు పూటలా మెక్కితే ఇలాగే ఉంటుంది" కస్సుమన్నది వనజ " వనజా. ఆయన మా నాన్నే. ఇప్పుడు మనం అనుభవించే ఆస్తంతా ఆయనదేనే. ఆయన తిండి ఆయనకు పెట్టడానికి అంత బాధేమిటే నీకు" " పెట్టడానికి కాదు. రేపు మీ అమ్మలాగ కాలో, చెయ్యో పడితే మీ ఛావుకు వస్తుంది. మీ అమ్మకు పెట్టినట్టు పదివేలు పారేసి మనిషిని పెడతాననుకోకండి" " ఒరేయ్. అమ్మాయి కోపంగా ఉన్నదేమో. నావల్ల మీకు నిద్రచెడింది. సారీరా. వెళ్ళండి" అని మంచం మీద వాలాడు కమలాకర రావు. " ఈయనొక సౌండు ఇంజనీరు. వినబడితే బాగుండు మాటలన్నీ.

ఆత్మహత్య చేసుకుని చచ్చేవాడు. పీడా విరగడయేది" అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తలబాదుకుంటూ ఆమెతో పాటు లోనికి వెళ్ళాడు నాగరాజు.

*******

వారం రోజులు అలా దొర్లిపోయాయి. కమలాకర రావు కొంచెం కోలుకున్నాడు. కాలింగ్ బెల్ మోత విని వెళ్ళి తలుపు తీశాడు నాగరాజు. ఎవరో అపరిచిత వ్యక్తి ఎదురుగా. " ఎవరు మీరు?" అడిగాడు నాగరాజు. " ముందు ఒక కుర్చీ ఇటు తీసుకురండి. మీ నాన్న గారితో మాట్లాడాలి" అన్నాడతను. కుర్చీలు తెచ్చి వాకిట్లో వేశాడు. " ఏరా కమలాకర్. సరస్వతి చనిపోయిందని మాట మాత్రం నాకు చెప్పాలనిపించలేదా. మనిద్దరి మధ్య మనస్పర్దలు రావచ్చు. కానీ తను నాకు చెల్లెల్లాంటిదని తెలియదా. నాకు నీ కొలీగ్ వేణు చెప్పిందాక మీ విషయాలేవి తెలియలేదు. అతని దగ్గర నీ నెంబరు తీసుకుని ఫోను చేశాను." నిష్టురంగా అన్నాడు ఆ వ్యక్తి. మౌనంగా ఉన్నాడు కమలాకర రావు. " మీరు మామూలుగా చెబితే ఆయనకు వినబడదు అంకుల్. చెముడు కదా నాన్నకు.

ఇంతకూ మీరెవరు? మా నాన్న మీకెలా తెలుసు" ఉండబట్టలేక మరల అడిగాడు నాగరాజు " నేనా. మీ నాన్న కున్న అతి తక్కువ మంది బాల్య స్నేహితులలో నేనొకడిని. కాదు చాలా ముఖ్యుడిని. నా పేరు శ్రీనివాసరావు. పది సంవత్సరాల క్రితం, మీ నాన్న లంచావతారాలు తెలిసి, వాటిని మాన్పించాలని వచ్చి, మాట మాట పెరిగి అవమానపడి పోయాను. మీ అమ్మ దేవత. భర్త తప్పు చేస్తున్నాడని తెలిసినా ఎదురు చెప్ప సాహసించలేనిది. విషయం తెలిసి రాత్రి ఫోను చేశాను. మీ పంచ చేరినప్పటి నుంచి జరిగినది మొత్తం చెప్పి వలవల ఏడ్చాడు. బాల్య స్నేహితుడి బాధ, పంతాన్ని పక్కకు తోసింది. బయలుదేరి వచ్చాను. వాడు నాతో ఫోనులో బాగానే మాట్లాడాడు.

నువ్వేమిటి వాడికి చెముడు అంటున్నావు" " లేదంకుల్. నిజం" " కాదు. నేనే అలా చెవిటివాడిలా ఇన్నాళ్ళూ నటించానురా. నాకోసం కాదు. మీ అమ్మకోసం. దానికి పిల్లలంటే ప్రాణం. ఎక్కడ మీ సూటిపోటి మాటలకు నేను ఆవేశపడి, దాన్ని తీసుకుని వెళ్ళిపోతానని భయం. మీరేమి అన్నా తలవంచుకు పొమ్మని, చేతిలో చేయి వేయించుకుంది. ఏనాడూ దాని మాట వినని నేను, పక్షవాతమొచ్చి మాట పడిపోయిన దాని మాట కాదనలేక పోయాను. మాటలేక అది, చెముడు నటిస్తూ నేను మీ ఈసడింపులు, ఛీత్కారాలు భరిస్తూ ఉండిపోయాము. దానికి కారణం దాని అవసానదశ మీ చేతులమీదుగా సాగిపోవాలని. అంతేకాదు తల్లిదండ్రులను వెళ్ళగొట్టాడనే అపకీర్తి మీకు రాకూడదని. నా ఓర్పు నశించపోయిందిరా. నాకై నేనే ఇల్లు విడిచి పోదామనుకున్నాను. దేవుడు పంపినట్లుగా వీడు రాత్రి ఫోను చేశాడు. మీ ఆస్తులు మీకిచ్చాను. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి" అశ్రుధారలు కనుల వెంట వరదలా కారుతున్నాయి కమలాకర రావుకు. " విన్నావుగా. మీ నాన్న బధిరుడు కాదు, మందభాగ్యుడు. మీ కోసం, పది తరాల ఆస్తి కోసం అడ్డదారులు తొక్కి, తనకు తనే దారులు మూసుకున్నాడు. మీ నాన్నను నేను తీసుకెళుతున్నాను. నేనూ ఒంటరివాడినే. నాలాటి వాళ్ళం ఒక అయిదుగురం చేరి పర్ణశాలలాటి ఇల్లు మా ఊరి చివర కట్టుకున్నాం.

మాకు లేని వసతి లేదు. ఇకనుంచి మీ నాన్న మాతో పాటే. మోకాలి ఆపరేషన్ చేయిస్తాము. మరల మామూలు మనిషిని చేసుకుంటాము. వాడు నా బాల్య స్నేహితుడు. అన్ని బంధాలలోకి స్నేహబంధం గొప్పదంటారు. నిజమేనేమో మరి. వాడి బాధ వినగానే నా మనసు ఆగలేదు. వచ్చేశాను. వీడి బట్టలు సర్ది బ్యాగు పారేస్తే మా దారి మేము చూసుకుంటాము" తేల్చి చెప్పాడు శ్రీనివాస్. " అది కాదు అంకుల్. మాది తప్పే. నన్ను క్షమించండి." ఏదో చెప్పబోయాడు నాగరాజు " ఎందుకండీ భయపడతారు. వెళ్ళే వాళ్ళను వెళ్ళనివ్వండి. ఆగమంటే ఆగుతారా. అయినా ఈ నాటకాలరాయుడి భరించడం నా వల్ల కాదు. చెవిటివాడిగా నాటకమాడి, అదేదో మనలను ఉద్ధరించడానికని మాట్లాడుతున్నారు" రుసరుసలాడింది వనజ. ఏదో నిర్ణయానికి వచ్చి లోపలికి వెళ్ళాడు నాగరాజు.

" వెళతానమ్మా. చేసిన పాపాలను కడుగుకోవడానికైనా వెళతాను. నా పెన్షను కూడ పెరిగిందట. నెలకు అరవై వేలు. మీకు చెప్పకుండా దాచిన వంద గదుల స్థలం రేటు పెరిగి యాభై లక్షలకు పోయిందట. ఆ రెండూ నాకు చాలు. మీతో నాకు పట్టింపులు లేవు. మీ బ్రతుకులు మీవి. నా బ్రతుకు నాది. మిగిలిన ఆస్తిని నా తదనంతరం ఏ ట్రస్టుకో ఇచ్చి చేసిన పాపం కొంతైనా కడుక్కుంటాను. పదరా శీను వెళదాం" అంటూ శ్రీనివాస్ చేయి పట్టుకుని లేచాడు కమలాకర రావు. మౌనంగా బ్యాగు తెచ్చి తండ్రి చేతికిచ్చి, అలాగే తండ్రి కాళ్ళ మీద పడ్డాడు నాగరాజు. తను ఎంత తప్పు చేశాడో తెలిసింది. కానీ పరిస్థితి చేయిదాటి పోయింది. " దేన్నైనా తెగిందాకా లాగకూడదు బాబు.

తల్లిదండ్రులను పూజించక్కరలేదు. కనీసం మనుషులుగా చూడండి. చూడమ్మా నీ పేరేమిటో నాకు తెలియదు. కానీ ఒక్కమాట ఈ రోజు నీ మామగారి స్థానంలో నీ తండ్రి ఉండి, మీ వదిన ఆయన్ను ఇలాగే నీచంగా చూస్తే నీ మనసుకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. మా వయసు మీకు వచ్చి, మీ బిడ్డలు మీలా ప్రవర్తించిన రోజు, గతంలో మీ తప్పు గుర్తు వచ్చి వగచినా ఫలితం ఉండదు. చివరిగా ఒక్కమాట మీకు. పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం, ఈ రోజు మీ ప్రవర్తనే మీ పిల్లలకు మార్గదర్శమవుతుంది. వస్తాము" శపించాడో, మందలించాడో గానీ శ్రీనివాస్ మాటలు నాగరాజు గుండెకు సూటిగా తాకాయి. " తీసుకెళ్ళండి అంకుల్.

ఈ నరకంలో కంటే అక్కడే ఆయనకు ప్రశాంతం" నాగరాజు మాటల్లో బాధ తొంగిచూసింది. అనుకోని పరిణామానికి మ్రాన్పడిపోయింది వనజ. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. చేతులారా పాడికుండను కాలితో తన్నుకుంది. ఆయన వెళ్ళిపోతే సంసారాన్ని నడపడం కష్టం. ఎలాగైనా ఆయన్ను ఆపాలి. " వెళ్ళండి. మామయ్య గారిని ఆపండి. తప్పులు మన్నించమని అడగండి. ఇంకెపుడూ ఇలాంటి పొరపాటు జరగదని చెప్పండి" లోపలికి నడవబోతున్న నాగరాజును కుదిపింది. మాట్లాడలేదు నాగరాజు. తమదారిన తాము బయలుదేరారు శ్రీనివాసరావు, కమలాకర రావు. భర్తకు ఎదురు నిలబడి ఆపింది వనజ " మాట్లాడరేం" రెట్టించింది. " నాకు చెముడు వచ్చింది వనజా. నాన్న నాకు వారసత్వంగా ఇచ్చాడు. " అంటూ వనజను తోసుకుని వెళ్ళిపోయాడు నాగరాజు అదుపులేని నోరు తెచ్చిన అనర్థాన్ని ఆలస్యంగా గుర్తించి కూలబడిపోయింది వనజ. 

మరిన్ని కథలు

bad or good
శాపమా! వరమా!!
- పద్మావతి దివాకర్ల
role village
ఆదర్శ గ్రామం
- చెన్నూరి సుదర్శన్
aim
ఆశయం
- పద్మావతి దివాకర్ల
heaven in our hand
అరచేతిలో స్వర్గం
- పద్మజారాణి అవసరాల
mother word
అమ్మ మాట
- శ్రీమతి దినవహి సత్యవతి
hidden money
గుప్తధనం
- పద్మావతి దివాకర్ల
wedding invitation
పెళ్ళిపిలుపు
- డాక్టర్ చివుకుల పద్మజ