ఆరు జిల్లాల అందగాడు - కృష్ణ చైతన్య ధర్మాన

handsome among six districts

చిన్ను చినమామయ్య పేరు బాలచంద్ర. అతను ఎప్పటిలాగానే ఈ సెలవులకు కూడా పిల్లల్ని పట్టుకుని ఊరు వచ్చాడు. చిన్నుకి చినమామయ్య అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అతను కలిసినా, అతనికి తోకలా వెంట వెళ్తుంటాడు. ఆ ఊరిలో చినమామయ్యకు ఒక బ్రాహ్మణ స్నేహితుడు ఉన్నాడు. అతడి పేరు వీరేంద్ర. బాలచంద్ర ఎప్పుడూ నిజమే మాట్లాడతాడనేది వీరేంద్ర నమ్మకం. ఒక సాయంత్రం వీరేంద్రని కలవటానికి అతడి ఇంటికి వెళ్తాడు బాలచంద్ర. అతడితో పాటు చిన్ను కూడా వెంట వెళ్లాడు. "ఆహ్ మిత్రమా! ఏంటీ కుసలమా? వెదవది!" అడిగాడు వీరేంద్ర పాత స్నేహితున్ని చూడగానే ఆనందంతో మురిసిపోతూ. "బాగున్నాను రా! నువ్వెంటీ చిక్కిపోయావ్? మా చెల్లమ్మ పప్పుబువ్వ సరిగా పెట్టట్లేదా?" "ఊరుకోరా, కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు, నీ కొంటె నేత్రాలకి నేనెప్పుడూ బక్కచిక్కినట్లే కనిపిస్తుంటాను, వెదవది! ఇప్పటికే బోండాంలా తయారయ్యాను, వెదవది!" "ఆ 'వెదవది' అనే పదము మాత్రమ్ ఎంత చెప్పినా వదలవురా బాబు!" అన్నాడు బాలచంద్ర. "ఆ వెధవ పదం ఎంత ప్రయత్నించినా వదలనంటుందిరా, వెదవది!" అన్నాడు వీరేంద్ర. "ఇంకేంటి సంగతులు?" ఇంతలో వంటింట్లోంచి వీరేంద్ర భార్య వచ్చింది. పలకరింపులు పూర్తయ్యాయి. "నిజానికి నేనే ఇప్పుడు నీకు ఫొన్ చేసి ఒక విషయాన్ని గురించి మాట్లాడదామనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావురా, వెదవది!" అన్నాడు వీరేంద్ర. "దేని గురించి?" అడిగాడు బాలచంద్ర. "కాకినాడ కనకారావు గారి మూడోభార్య రెండో తమ్ముడి నాల్గవ కొడుకుని నా చెల్లెలు భానుమతికి ఇచ్చి పెళ్లిచేస్తే బాగుంటుందని మన పక్కూరి నరేంద్రగాడు మొన్న నాతో చెప్పాడు, వెదవది. అబ్బాయి గురించి అడిగితే ఫారెన్లో ఉద్యోగం, మంచి సాలరీ, చూడ్డానికి బాగుంటాడు అన్నాడు, వెదవది. ఏమైనా డౌట్ ఉంటే ఆ అబ్బాయి నీకు పరిచయమున్నవాడని చెప్పాడు, వెదవది!" "ఓ, సురేష్ గురించి అడుగుతున్నావా! ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు!" చెప్పాడు బాలచంద్ర. "అబ్బాయి ఎలా ఉంటాడు, వెదవది?" "మా వాడు ఆరు జిల్లాల అందగాడు!" చెప్పాడు బాలచంద్ర. తరువాత, వీరేంద్ర భార్య ఇచ్చిన కాఫీతాగి, తాపీగా ఇంటికిపోయాడు. బాలచంద్ర ఎప్పుడూ నిజమే చెప్తాడన్న విషయం తెలిసి పెళ్ళిచూపులకు ఒప్పుకున్నాడు వీరేంద్ర. పెళ్ళిచూపులకు అమ్మాయిని చూడటానికి అబ్బాయివారు వచ్చారు. కారు దిగినవెంటనే పెళ్ళికొడుకు సురేష్ ని చూపించి పరిచయం చేసాడు నరేంద్ర. సురేష్ ని చూసి వీరేంద్రకు నోట మాటరాలేదు. అతను చూడటానికి అందవికారంగా ఉన్నాడు. ఎలాగోలా పెళ్లిచూపులు పూర్తయ్యాయి. అనుకున్నట్టే అమ్మాయికి అబ్బాయి నచ్చలేదు. మరుసటి రోజు సాయంత్రం వీరేంద్ర ఇంటికి బాలచంద్ర వచ్చాడు. "మామా పెళ్లిచూపులు ఎలా జరిగాయి?" ఇంటిలోపలికి వస్తూనే అడిగాడు బాలచంద్ర. "పెళ్ళిచూపులేమిటిరా నీ పిండాకూడు!" "అరేయ్ ఏమయ్యిందిరా?" "ఏమయ్యిందంటావేమిట్రా? అయినా నువ్వు కూడా అబద్దాలు నేర్చేశావు సుమీ!" "నేను అబద్ధాలేమిటీ?" "మరి ఆ అబ్బాయి ఎలా ఉంటాడంటే, 'ఆరు జిల్లాల అందగాడు' అన్నావ్?" "ఔను రా. మళ్లీ అదే అంటా, వాడు ఆరు జిల్లాల అందగాడు. కాకపోతే ఆ ఆరు జిల్లాలూ ఆఫ్రికాలో ఉన్నాయి. వాడు అక్కడే కాంగోలో పనిచేస్తున్నాడు," బాంబు పేల్చినట్టు చెప్పాడు బాలచంద్ర. "అవునా! ఫారనంటే యూరోప్ అనుకున్నానురా!" "ఆఫ్రికా కూడా మనకి ఫారనే కదరా!" "మరి నువ్వు ముందే తెలిసి ఇదంతా ఎందుకు చేశావురా శుంఠ? నిన్ను శపించేద్దామనుకున్నాను, కానీ ప్రాణస్నేహితుడివని అలా చెయ్యలేకపోయాను!" అన్నాడు వీరేంద్ర కోపంగా. "భానుమతి నాకు మొన్న కలిసిందిరా! అంతా చెప్పింది. ఆమెకు ఫారెన్ వెళ్లాలని లేకపోయినా నువ్వు పంపించేయాలనుకుంటున్నావని, తనకి ఇష్టమైన బ్యాంక్ ఉద్యోగం మాన్పించెయ్యాలనుకుంటున్నావని చెప్పింది. అందుకే అలా చేసాను. ఇప్పటికైనా ఆమెను అర్ధం చేసుకుని, ఆమెకు కొంచం నచ్చినట్టు చేద్దాం!" అన్నాడు బాలచంద్ర. "సర్లే, ఏదో ఒకటి తగళాడండి!" అన్నాడు. ఇదంతా చాటుగా వింటున్న భానుమతి పరిగెత్తుకుంటూ వచ్చి, "థాంక్స్ అన్నయ్య!" అంటూ వీరేంద్రని కౌగిలించుకుంది. మొత్తం ఎపిసోడ్ వీక్షించిన చిన్ను చివర్లో, "చినమామయ్యా, వీరేంద్ర అంకుల్ ఎన్నిరోజులు ప్రయత్నించినా విడిచిపెట్టలేని 'వెదవది' అనే పదం, ఆ పెళ్లిచూపులు రోజునుంచి పోయింది. అంటే ఆరోజు పెళ్ళిచూపులకు వచ్చిన అంకుల్ ఏ రేంజులో ఉన్నాడో మరి!" అన్నాడు. అందరూ తనివితీరా నవ్వుకున్నారు.

మరిన్ని కథలు

Samayaspoorthy
సమయస్ఫూర్తి
- కందర్ప మూర్తి
Bhadrakali
భద్రకాళి
- BHADRIRAJU THATAVARTHI
Daivam manusha rupena
దైవం మానుష రూపేణ
- శింగరాజు శ్రీనివాసరావు
Aadavaalaa majaakaa
ఆడవాళ్ళా.. మజాకా..!
- చెన్నూరి సుదర్శన్
The critical match
ద క్రిటికల్ మ్యాచ్
- చింతపెంట వెంకట సత్య సాయి పుల్లంరాజు,
Yenkatalachimi sana manchidi
"ఎంకటలచ్చిమి   సానా   మంచిది"
- నల్లబాటి రాఘవేంద్రరావు