అనుకున్నదొక్కటి.. - తిమ్మరాజు రామ్ మోహన్

think another

ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, అలారం మోగలేదు. అయినా రాత్రంతా కలత నిద్రతో గడిపిన నేను మాత్రం "ఎన్నాళ్ళో వేచిన హృదయం" అని పాడుకుంటూ ఉషారుగా నిద్ర లేచేసాను . లేడికి లేచిందే పరుగుగా చక చకా తయారవడం కూడా మొదలుపట్టాను . నా ఈ హడావుడికి కారణం తెలుసుకోవాలంటే సరిగ్గా ఒక్క రోజు ముందుకు వెళ్దాం. నిన్న ఇదే సమయానికి నిదానంగా పేపర్ చదువుకుంటునప్పుడు నా ఏకైక పుత్రారత్నం కేశవ్ "నాన్న , నీకు ఫేసుబుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది" అని దాదాపుగా అరిచాడు, నాకేదో నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు. మిగతా విషయాలలోనే అంతంత పరిజ్ఞానమున్న నాకు ఫోన్ విషయంలో తెలివితేటలు దాదాపు సున్నా. ఫోన్ కేవలం మాట్లాడానికి మాత్రమే వినియోగించే వింత మనిషిని నేను. కేశవ్ మాత్రం ఇది ఒక అవమానంగా భావిస్తాడు. ఎందుకంటే వాళ్ళ స్నేహితుల తండ్రులందరు ఫోన్ వాడకంలో దాదాపు డాక్టరేట్లు సంపాదించేసారు. అందుకే మావాడు నా పేరు మీదకూడా పేస్ బుక్, వాట్సాప్ అకౌంట్లు తెరవడమే కాకుండా నా ఆట కూడా తానే ఆడేస్తుంటాడు. ఇన్ని రోజుల తరువాత నా అకౌంట్లో ఈ కదలిక (అదేనండి, ఫ్రెండ్ రిక్వెస్ట్) సంతోషంతో వాడిని , ఆశర్యంతో నన్ను ముంచేసేంది.

ఈ ఫ్రెండెంటి , రిక్వెస్ట్ ఏంటి అని ఆలోచిస్తున్న నాకు, మా కేశవ్ "ఎవరో మీ బిఎస్సి క్లాసుమేట్ నిత్యానందట, మీరు తాను అనుకున్న సత్యారావు అయితే వెంటనే ఫేసుబుక్ లో రిక్వెస్ట్ ఆక్సిప్ట్ చేసి థంబ్ అప్ పెట్టమన్నాడు.". నేను వెంటనే "ఓహ్ నిత్యానందమా, ఎంత సంతోషమైన వార్త. కేశవ్, ఆ గోలేదో నువ్వు పడు. వాడిని వెంటనే ఫోన్ నెంబర్ ఇమ్మను. నేను వాడిని చూసి దాదాపు నలభై ఏళ్ళు అవుతోంది. ఈ ఉర్లోనే ఉంటె వెంటనే మాట్లాడాలి, కాదు కలవాలి" అన్నాను. మా కేశవ్ ఏ మాయ చేసాడో (నా ఫోన్ తో) కాని ఒక్కరోజులో, అదే ఈ రోజు వాడి ఇంటికి వెళ్లే ఏర్పాటు చేసాడు. అందుకే నా ఈ అనందం. తొందర తొందరగా తయారయ్యి , మా కేశవ్ ని తీసుకుని వాళ్ళింటికి చెప్పిన సమయానికి కాస్త ముందుగానే చేరాను ఎన్నో ఊహలతో, ఆలోచనలతో. ఇంక చూడండి, అదే చదవండి నా వింత అనుభవం గురించి.

కాలింగ్ బెల్ కొట్టిన కాసెపటకి, ఒక ఆవిడ వచ్చి తలుపు తీసి ఫోన్లో చూస్తూ ఎవరు కావాలి అని అడిగింది. నేను నిత్యానందం చిన్నప్పటి స్నేహితుడిని , కలవడానికి వచ్చాను అన్నాడు. ఆవిడ ఇంకా ఫోన్ వైపే చూస్తూ లోపలికి రండి అని వెళ్ళిపోయింది. హాల్లో కూర్చున్న మా నిత్యానందం "రా కూర్చో" అన్నాడు, మోహంలో ఎటువంటి భావం లేకుండా (ఎందుకంటే వాడి చూపు కుడా ఒక పెద్ద ఫోన్ వైపే ఉంది). నేనే మెల్లగా తేరుకుని "ఎలా ఉన్నావు, చాలా సంవత్సరాలు అయింది మనం కలసి" అన్నాను.

వాడు బుర్ర ఊపుతూ, ఫోన్లో చూస్తూ "ఒక్క నిమిషం ఈ ఆట అయిపోతుంది" అన్నాడు. మా వాడు నా చెవిలో "నాన్న, అంకుల్ చూస్తున్నదాన్ని దాని టాబ్ అంటారు, అందులో చాల ఆటలు ఉంటాయి" అన్నాడు, ఇదంతా మనం కోల్పోయాం అన్నట్టుగా. ఇలా పది నిముషాలు గడిచిపోయాయి గాని నిత్యానందం మాత్రం ఫోను లోంచి తలెత్తలేదు. మెల్లగా నేనే "కాస్త, మంచినీళ్లు ఇప్పిస్తావా" అన్నాను. దానికి వాడు ఇప్పుడే మా ఆవిడకి మెసేజ్ పెడతాను మంచినీళ్లు తీసుకు రమ్మని" అన్నాడు. నాకెందుకో చాలా ఆశర్యం వేసింది పక్క గదిలో ఉన్న ఆవిడకి మెస్సేజా అని.

ఇంతలో అందాకా తలుపు తీసినావిడ మంచినీళ్ల గ్లాసులతో వచ్చారు. మా నిత్యానందం కాస్త తలెత్తి "మా ఆవిడ కళ్యాణి" అని పరిచయం చేసాడు. నేను కుడా నా గురించి పరిచయం చేసుకుంటుండగానే ఆవిడ నా వైపు చూస్తూ టీవీ పెట్టేసారు. నిత్యానందం "మా ఆవిడకి రోజు ఈ టైంకి ఈ సీరియల్ చూడటం అలవాటు, ఒక్కఅరగంట సేపే వస్తుందిలే " అన్నాడు భరించక తప్పదు అన్నట్టుగా. నేను మొహమాటానికి "పరవాలేదులే" అని వాడితో మా చిన్నప్పటి రోజుల గురించి మాట్లాడం మొదలు పెట్టాను. నా మాటల శబ్దము విని, ఆవిడ టీవీ సౌండ్ పెంచుకుంటూ టీవీకి దగ్గరగా కుర్చీనీ జరిపేసుకున్నారు. ఈ సందులో మా నిత్యానందం మళ్ళి ఫోన్లోకి , అదే టాబ్ లోకే వెళ్ళిపోయాడు, ఈ సారి చెవిలో ఇయర్ ఫోన్ కూడా పెట్టుకున్నాడు. నేను మనసులో "భగవంతుడా ఏమిటీ పరిస్థితి, వీడు ఎప్పుడు మాట్లాడతాడు, అసలు మాట్లాడతాడా" అనుకుంటూ జరుగుతున్న విచిత్రాన్ని చూస్తూ, వింటూ కూర్చున్నాను. మా నిత్యానందం మాత్రం వాడిలో వాడు నవ్వు కోవడం, అరవటం లాంటి విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు. వాళ్ళావిడ కూడా అస్సలు సమయం వృధా చేయకుండా టీవీ సీరియల్ విరామంలో ఫోన్ చూడడం లాంటివి చేస్తున్నారు. వాళ్లిదరికి ఇక్కడో మానవుడు ఉన్నట్టు కూడా పట్టట్లేదు.

ఎలా అయితేనేం టీవీ సీరియల్ అవ్వడం, ఆవిడ ఇంకో సీరియల్ పెట్టకుండా టీవీ ఆపేసి నా వైపు దయతో చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. మా నిత్యానందం కూడా ఫోన్ లోంచి బయటకు వచ్చి "ఇంకెంటిరా విశేషాలు" అన్నాడు, అప్పటికే బోల్డన్ని విషయాలు చెప్పుకున్నట్టుగా. అమ్మయ్య అని కాస్త ఆనందపడేలోపే , లోపలనించి ఐదారేళ్ళ లోపల ఉన్న ఒక పాప , బాబు వారి వెంటే పరిగెడుతూ ఒక అమ్మాయి వచ్చారు. ఆ పిల్లలిద్దరి చేతిలో ఉన్న ఫోన్లని ఇచ్చేమని ఆ అమ్మాయి , ఇవ్వమని వాళ్ళు గొడవ పడుతున్నారు. అప్పడు నిత్యానందం "మా అమ్మాయి దీప వాళ్ళ పిల్లలు చైతన్య, చిత్ర" అని పరిచయం చేసాడు. ఆ అమ్మాయి నాతొ హలో అంకుల్ అని, వాళ్ళ పిల్లలతో "తాతకు పాటలు, డాన్స్ ఇష్టంట మీ కొచ్చిన పాటలన్ని డాన్స్ చేసి చూపించండి" అంది. నిత్యానందం కూడా "వీళ్ళు చాల బాగా డాన్స్ చేస్తారు" అని చూసి తరించు అన్నట్టుగా చూసాడు.

ఇంక ఆ పిల్లలు (కాదు పిడుగులు) అందుకుని పాటకి అర్థం తెలీకపోయినా, డాన్స్ భంగిమలకి అర్థం తెలికపోయినా పూర్తిగా లీనమైపోయి పాట , డాన్స్ మొదలు పెట్టారు. అంత చిన్నపిల్లల నోట అటువంటి మాటలు, చేష్టలు చూడడానికి బయటవాడిని నాకే ఇంత ఇబ్బందిగా ఉంటె, వాళ్ళ తల్లి, తాత ,అమ్మమ్మలకెలా ఉంటుందో అనుకున్నా. కాని వాళ్ల మొహాల్లో అటువంటి ఛాయలేవీ లేకపోగా పూర్తిగా ఆనందిస్తూ నా వైపు మెచ్చుకోవెంటనట్టు చూస్తున్నారు. నేను ముఖానికి నవ్వు పులుముకుని "చాలా బాగా పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు" అన్నాను. దీన్ని నిజమనుకొని వాళ్లు "పిల్లలు ఇంకో డాన్స్ చెయ్యండి, తాతకి బాగా నచ్చింది" అన్నారు. ఇలా ఒక అరగంట గడిచాక, నా అదృష్టం బాగుంది వాళ్ళకి ఆకలి వేయడంతో భోజనము పెట్టడానికి లోపలికి తీసుకెళ్లారు.

నా మానసిక అవస్థను అప్పటనుండి చూస్తున్న నా కొడుకు కేశవ్ "నాన్న, ఇంటికి వెళ్దామా టైం అవుతోంది" అన్నాడు. నేను వెంటనే అవును వెళ్దాం పద అన్నాను. నిత్యానందం ఒక్క నిమిషం ఆగమని, ఫోన్ తీసి ఇద్దరం కలసి సెల్ఫీ తీసుకుందాం, ఫేస్ బుక్ లో పెట్టడానికి అన్నాడు. అంతే కాకుండా మండే పుండు మీద కారం చల్లినట్టు "చాలా బాగుంది, నిన్ను కలవడం, ఇంత సేపు మాట్లాడుకోవడం" అన్నాడు. నేను ఏమనాలో తేలిక "నాకు అంతే , చాలా సంతోషంగా ఉంది" అని బయటపడ్డాను.

బయటకొచ్చి కారెక్కాక మా వాడితో "వీళ్ళందరూ ఫోన్, ఇంటర్నెట్, టీవీ అనే రకరకాల వ్యసనాలకి బానిసలుగా అయిపోయి సాటి మనుషులతో ఎలా ప్రవర్తిసున్నారో వారికే తెలియటంలేదు. ఇంక ముందు ముందు తరాలని , వాళ్ళ మానవ సంబంధాలని తలుచుకొంటే భయం వేస్తోంది. నిన్న ఆ ఫేస్ బుక్ రిక్వెస్ట్ చూడకపోతే ఎంత బాగుండేది. నేను వీడిని కలిసేవాడిని కాను, నామనసులో మా బాల్య స్మృతులు అలానే నిలిచిపోయేవి" అన్నాను. మా వాడు "నీవు చెప్పింది అక్షరాలా నిజం నాన్న. నీతో ఇవాళ ఇక్కడకి రావడం నాలో కూడా మంచి మార్పుకి పునాది వేసింది. వీటన్నిటిని మన సౌకర్యానికి ఉపయోగించుకోవాలి కానీ వాటికీ మనం బానిసలూ అవకూడదు. ఈ సూత్రం ఆచరణలో పెట్టడం కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదు" అన్నాడు. వాడి మాటలు నాకు ఏంతో తృప్తిని, సంతోషాన్నిచ్చాయి. కారు రేడియోలో "అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి ." అనే పాత పాట వస్తోంది ఈ రోజు నా అనుభవానికి తగ్గట్టుగా.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి