పెద్ద గీత - గంగాధర్ వడ్లమన్నాటి

large line

"లక్ష్మి, లక్ష్మీ" అంటూ బిగ్గరగా పిలిచాడు శేఖరం. "అబ్బా,చేతిలో డబ్బా వదిలేసాను మీ అరుపుకి. ఏవిటండీ మీరు.ఏదో కొంపలు తేలిపోతున్నట్టు.ఎవయ్యిందనిపుడు" అడిగిందామె. "ఎవయ్యిందా.ఈరోజు కూడా ఇడ్లీ చేసావేంటి. వరుసగా ఇడ్లీ తినడం ఇది మూడో రోజు. నాకు ఇడ్లీ నచ్చదు అని తెలిసి కూడా నువ్విలా వరసగా మూడో రోజు కూడా ఇడ్లీ ఎందుకు చేసినట్టు" అడిగాడు అసహనంగా. "రోజూ దోసెలు,పూరీలూ,పెసరట్లు తింటే నూనె వాడకం పెరిగిపోతోంది.నూనె పోతే పొనీండి. కొలెస్ట్రాల్ అంటూ ఒకటుంది కదా.పైగా మీకు ఈ మధ్య దగ్గు వస్తోంది కూడానూ.ఇపుడు కూడా ఫ్రిడ్జ్ లో దోసల పిండి కొంత మిగిలే ఉంది.వేయమంటే చెప్పండి వేస్తాను" చెప్పిందామె. "ఆ..వద్దులే.నూనె తక్కువ వాడటమే మంచిది" చెప్పాడాయన.తినేస్తూ. ఆ మాటలు విన్న పనిమనిషి,నెమ్మదిగా చెవిలో "అదేటమ్మా!ఉదయం ప్రిజ్జి సద్దింది నేనే కదా.దోసల పిండి లేదే" అందామె గుసగుసగా. "ఆ మాట మీ అయ్యగారితో అంటే ఇహ నా పని అంతే. ముందు చూసుకోవడం తెలీదా అని కాకెక్కిపోయి కేకలేస్తారు అందుకే అలా అన్నాను" "ఒక వేళ దోసలే వేయమంటే ఏంచేద్దురు." "ఏం చేస్తాం.గుంజిళ్ళు తీసి సారీ చెప్పేయడమే."చెప్పిందామె నవ్వుతూ. ఇంతలో ఆమె ఫోను మోగడంతో, ఆన్ చేసి "లలితా చెప్పమ్మా" అంది. "ఏవిటీ చెప్పేది.నిన్న చెప్పిందే.మీ డాక్టర్ అల్లుడు తినేస్తున్నాడు.అందుకే నేను ఇంజినీర్ ని పెళ్లి చేసుకుంటా అన్నది.వేగలేకపోతున్నాను"చెప్పింది లలిత. "ఇవన్నీ పెళ్ళైన కొత్తలో కొంత సహజం.కనుక కొంత సహనం కావాలి లలితా.రాను,రాను అన్నీ సర్దుకుంటాయి.అన్నీ భూతద్దంలో చూడటం మొదలెడితే,తల ఇలానే భూచక్రం లా తిరుగుతుంది మరి." చెప్పింది లక్ష్మమ్మ. "అదేవిటమ్మా !కూతురు,కుక్కర్లా కూత పెడుతూ కష్టం చెప్పుకుంటే, అంత తేలిగ్గా వింటున్నావు.నువ్వేదో నాకు వత్తాసు పలికి ఓదారుస్తావనుకుంటేనూ"… "భలే దానివే లలితా...పెళ్లై ఆరు నెలలు కాలేదు.అప్పుడే ఇంత అసహనవా.టూకీగా ఇపుడు ఏవంటావ్. నీకొచ్చిన కష్టం వివరంగా చెప్పు.అపుడు ఆలోచిద్దాం" చెప్పింది లక్ష్మమ్మ. "అయినా తప్పంతా మీదే.నేను అప్పటికీ ఒత్తి మరీ మొత్తుకున్నాను.నాకు డాక్టర్ వద్దూ,వద్దూ అంటే విన్నారా.నా బుర్ర తిన్నారు.పట్టుబట్టారు.నన్ను చుట్టుముట్టి ఒప్పించి మరీ కట్టబెట్టారు.ఇపుడు ఆయన నా ఆరోగ్యం పై అతి శ్రద్ద పెట్టి నాకు వైరాగ్యం తెప్పిస్తున్నారు." "అలాగా! అయినా నీ ఆరోగ్యం పై అల్లుడుగారు అంత శ్రద్ద చూపుతుంటే, నువ్వెందుకు వైరాగ్యం తెచ్చుకోవడం..కనుక నువ్వు కూడా పిల్ల చేష్టలకు పోకు.పిదప బుద్ధులు ప్రదర్శించకు.కాస్త ఓపిక పట్టు." "నీకలాగే ఉంటుంది.నాకు సరదా సన్నగిల్లిపోయింది.కార్బోహైడ్రేట్లు ఎక్కువుంటాయి అని గుడ్డులో చందమామ తినొద్దనేశారు.అదంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసుగా.ఒక్కపూట భోజనవే మంచిది అనీ, రాత్రి పూటకి టిఫిన్ చేసేయ్ అంటున్నారు.అసలే నాకు రోకలి మింగేంత ఆకలి.చెబితే సిగ్గుచేటు, మొన్న మా పని మనిషికి ఇచ్చేద్దాం అని ఫ్రిడ్జ్ లో పెట్టిన అన్నం, ఆవకాయ్ కలుపుకుని అర్ధరాత్రి ఆవురావురంటూ తినేసాను.పొద్దున లేవగానే యోగా అని ఆయన చేస్తూ నన్నూ ప్రయత్నించమంటున్నారు. అప్పటికీ పద్మాశనం, శవాసనం కష్టపడి వేస్తున్నా ఆయనికి తృప్తి లేదు.బయటికి వెళితే,పాని పూరీలో నీరు మంచిది కాదంటారు.చాట్ తో ఆరోగ్యానికి చేటంటారు.మురీ మిక్చర్ ససేమిరా వద్దంటారు.ఇలా ఆయన తినక,నన్నూ తిన్నివ్వక, మూతి కట్టేస్తున్నారు.మొన్న బీచ్లో ఎంతో బతిమాలితే, సరే అని మొక్కజొన్న పొత్తులు కొన్నారు.కాల్చుకు తింటున్నారనుకో." "పొత్తులనా?" "కాదు నన్ను.అందుకే అన్నాను. ఆ ఇచ్చాపురం ఇంజినీర్ ని చేసుకుంటా అని.అపుడు ఎంచక్కా జాలీ గా ఉండేదాన్ని.నువ్వు డాక్టర్, డాక్టర్ అని ఇలా చేశావ్." "బావుంది నీ వరస. గీత అని మన" అంటూ లక్ష్మమ్మ మరేదో చెప్పేంతలో- "ఆ తెల్సు.మన వీధిలో పదవతరగతి చదువుతోంది.సుబ్బారావుగారమ్మాయి" చెప్పింది లలిత. "తను చిన్న గీత.ఈమె పెద్ద గీత.నా స్నేహితురాలు, వనజ వాళ్ళ అమ్మాయి.మొన్న పెళ్లిలో కలిసిందిలే. నీలానే అనుకుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని పెళ్ళి చేసుకుందట.మొదట, అతని సాఫ్ట్ వేర్ కంపెనీ వాళ్ళు అమెరికా పంపుతాం అన్నారట.తరువాత కొంత కాలం ఇక్కడ చేస్తే అపుడు పంపుతాం అన్నారట.సరే అంటే, ఆ తర్వాత కరోనా పేరు చెప్పి, ఇంటి నుండి లాప్టాప్ లో పనిచేయమన్నారట.దాంతో వర్క్ ఫ్రo హోమ్ అని రోజంతా కంప్యూటర్ ముందే కూర్చునేవాడట.ఇంట్లో ఉన్నా,కంట్లో నలుసులా తయారయ్యాడట.పని ఒత్తిడి ఎక్కువైతే, ఈమెపై ఉత్తినే కత్తులు నూరేవాడట.తర్వాత ఆ కంపెనీ వారు, ప్రస్తుతం ఇంత స్టాఫ్ అవసరం లేదని ఇతన్ని ఉద్యోగం లోంచి తీసేసారట. దాంతో ఇప్పడు ఫ్రస్ట్రేషన్ తో నిప్పులా మండిపోతున్నాడట.పప్పులా ఉడికిపోతున్నాడట.డాక్టర్ని చేసుకున్నా బావుండేది అని ఆ అమ్మాయి తెగ బాధ పడింది" చెప్పింది లక్ష్మమ్మ. "అంటే అంతో ,ఇంతో నేనే నయం అన్నమాట," అంది లలిత. "అంతేగా మరి" అంటూ వంత పాడేసి ఫోన్ పెట్టేసింది లక్ష్మమ్మ. అదంతా విన్న, శేఖరం గారు,"అవును లక్ష్మీ, ఆ పెళ్లికి నేనూ వచ్చాను కదా! నీ స్నేహితురాలి కూతురు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని చేసుకుని హాయిగా ఉన్నానని చెప్పింది కదా."బుర్ర గోక్కున్నాడు. "అలా అని చెబితే బ్యాగ్ సర్దుకుని వచ్చేస్తుంది.అయినా డాక్టర్లు అందరూ అల్లుడుగారిలా ఉంటారా?ఎక్కడో ఒకటీ అరా ఇలా ఉంటారు.అలానే ఇంజినీర్లు కూడా అచ్చం మన అమ్మాయి ఊహించినట్టు ఉండరు.అందుకే ఇలా చెప్పాను." "చిన్న సమస్య పక్కన పెద్ద గీత గీశావ్.త్వరలో అల్లుడిగారితో మరీ చాదస్తం వద్దని సున్నితంగా చెప్పాలి" అంటూ చిన్నగా నవ్వేసాడాయన.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి