కన్నమ్మకే వాపిరి..తిన్నమ్మకే వాపిరి - ఎం బిందుమాధవి

kannamake vaapiri- tinnammake vaapiri

[వాపిరి అంటే తీరని కోరిక. ఈ సామెత ప్రధమ భాగం ఈ రోజులకి వర్తించకపోవచ్చు! రెండో భాగం మాత్రం ఇప్పుడు దొరికేవెరైటీ తిళ్ళ మూలాన బాగా అన్వయం అవుతుంది.

పూర్వం రోజుల్లో.....పిల్లలు కన్న తల్లికి..అబ్బ ఇక పిల్లలు చాలు..కనలేక, పెంచలేక ఇబ్బంది పడుతున్నానుఅనిపించేదికాదుట! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఉండేదిట. పిల్లలు చాలు..

వద్దు అనుకుంటే భగవంతుడికిఅపచారం చేసినట్లు భావించేవారుట. బహుశ పల్లెటూరి కాపురాల్లో పెద్ద పెద్ద ఇళ్ళు.. పనిపాటలకి పాలేళ్ళు ఉండటం... చదువులు తప్పనిసరి అనే పరిస్థితి లేకపోవటంతో...ఎందరు పిల్లలున్నా తిండి-బట్ట ఖర్చు తప్ప పోషణ పెద్ద సమస్యకాకపోవటం కారణం కావచ్చు!]

ఇప్పుడు కధలోకి వెళదాం....

ఉదయం అల్పాహారం లోకి పార్వతి మసాలా దోశ..అందులోకి అనుపానంగా వేరుశనగ పప్పు పచ్చడి,

కొత్తిమేర..అల్లంపచ్చి మిర్చి వేసి జారుగా గ్రీన్ చట్నీ చేసింది.

పరమేశ్వర్రావు తృప్తిగా బ్రేక్ ఫాస్ట్ ముగించి..చిక్కటి ఫిల్టర్ కాఫీ ఓ గ్లాసెడు సేవించి..బాల్కనీలోకెళ్ళాడు.

క్రింద కూరలవాడొచ్చాడు.

వాడి బండి నిండా....మంచి బిగువుగా నిగ నిగలాడుతున్న మామిడి కాయలు కనిపించాయి. "ఏమోయ్ మధ్యాహ్నంభోజనంలోకి ఏం వండుతున్నావ్? కింద కూరలవాడొచ్చాడు. మామిడి కాయలు బాగున్నాయ్.

ఓ డజన్ తెస్తాను! పప్పులోకి, మెంతిబద్దలకి పనికొస్తాయ్. రేపు మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు!"

అంటూ ఓ ఐదువందలరూపాయలు, చేతి సంచి పుచ్చుకుని గబగబా మెట్లు దిగి కిందికెళ్ళాడు.

బండి మీద మామిడి కాయలతో పాటు మూరెడు పొడుగున్న అరటికాయలు కూడా కనిపిస్తే ఒక అర డజను

అవి కూడాతెచ్చాడు.

"మధ్యాహ్నం కూరకి పనస పొట్టు ఉన్నది. మళ్ళీ అరిటి కాయలెందుకు తెచ్చారు? మొన్న రైతు బజార్ నించి అరిటి దూటకూడా తెస్తిరి!

అన్నీ ఒకే సారి తెస్తే పాడవుతాయ్!" అన్నది.

"కూరలు వేస్ట్ ఏమిటి? సాయంత్రం అరిటి దూట తో పెరుగు పచ్చడి చెయ్యి."

"రేపు అరిటి కాయ ఆవ పెట్టి వండు. గుమ్మడికాయ..ములక్కాడ ముక్కలు వేసి ధప్పళం పెట్టు."

"తాజా కూరలు ఉన్నప్పుడు చక్కగా వండుకుని...కూరలే ఎక్కువ తింటే సరి! మన అబ్బాయి వాళ్ళకి చూడు..

ఆ ఫ్రోజెన్కూరలు..రుచి పచి లేకుండా! ఉన్నప్పుడు అనుభవించటమే! లేని వారికి కర్మ...మనమేం చేస్తాం" అన్నాడు.

"మధ్యలో వాడి గొడవెందుకు లెండి? ఇంతకీ ఆవకాయ..మాగాయ ప్యాకెట్లు కొరియర్ చేశారా..లేదా?" అన్నది కొడుకు మీదప్రేమ కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండగా!

"ఆ(: మొన్నే చేశాను. నీకు చెప్పటం మరిచాను..పచ్చళ్ళతో పాటు..బుజ్జిగాడికిష్టమని

మిల్క్ మైసూర్ పాక్, తొక్కుడు లడ్డు, ఆకు పకోడీలు...అన్నీ తలో అర కిలో కూడా పంపాను" అన్నాడు.

"మాటల్లో పడి వంట ఆలశ్యమౌతుంది! పనసపొట్టు కూర, మామిడి కాయ పప్పు, కొబ్బరి-మామిడి కాయ పచ్చడి, మజ్జిగపులుసు చెయ్యి. ఊరు మిరపకాయలు వేయించటం మరిచి పోయేవు సుమా!" అన్నాడు.

పార్వతి వంట చేస్తున్నంత సేపు..పక్కనే నిల్చుని.."మొన్న ఆ మధ్య భీమవరం నించి తెచ్చిన గోరుమీటీలు,

వేరుశనగఉండలు, పెసర బూరెలు భలే కమ్మగా ఉన్నాయ్ కదా! ఏమైనా ఆవిడ చేతి స్వీట్స్ బాగుంటాయ్.

మనింట్లో ఆ స్వీట్స్ తిన్నమీ ఫ్రెండ్ రమ కూడా మెచ్చుకుందన్నావు" అని తిండి పదార్ధాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు.

"మీరు..మీ తిండి గోల చస్తున్నాను! రోజుకి 36 గం.ల టైము... నాలుగు చేతులు నాకు పెడితే బాగుండు ఆ భగవంతుడు! పనిలో పని... ఆ విశ్వామిత్రుడు కూడా వచ్చి నాకు అలసట తెలియకుండా "బల-అతిబల" మంత్రాలు కూడాఉపదేశించాడంటే...'ఇస్సు'..'ఉస్సు' అనకుండా మీ తిండి వాపిరి తనం తీరుస్తా" అన్నది పార్వతి విసుక్కుంటూ.

పరమేశ్వర్రావు సర్వీసంతా ఊరికి నలభై మైళ్ళ దూరంలో ఉన్న ఫ్యాక్టరీ లోనే గడిచింది. అందుకే రిటైర్ అయ్యాక చిన్న చిన్నఆఫర్లు వచ్చినా విశ్రాంతి తీసుకోవటానికే నిశ్చయించుకున్నాడు. సర్వీసులో ఉండగా...

.క్యారేజీల్లో తీసుకెళ్ళి చప్పగా చల్లారాకతినటం..క్యారేజ్ తీసుకెళ్ళని నాడు క్యాంటీన్లో నీళ్ళ సాంబారు...

ఇక్కడేస్తే అక్కడికి పారిపోయే కూరలు! నోరుచవిచచ్చినట్టుండేది.

అందులోను తిండి ప్రియుడాయే! వండిన పదార్ధాల గురించి నోటినిండా మాట్లాడుతూ.

రుచిని ఆస్వాదిస్తూ తింటాడు.

కావలసినవన్నీ వండించుకుని తిని కాసేపు నడుం వాల్చాడు.

"ఈ పూట ఇంకా యాదమ్మ రాలేదెంచేతనో? నాలుగు రోజులు వరసగా వస్తే ఐదో రోజు మానెయ్యాల్సిందే కదా!

ఎటూ రేపుఫస్ట్ నించి పురుడని ఓ నెల రాదు!"అని గొణుక్కోవటమే అయినా గట్టిగా అనుకుంటూ ఉండగా పరమేశ్వర్రావుకి నిద్రమెలకువ వచ్చింది.

"పురుడా...ఎవరికీ?" అన్నాడు.

"పనమ్మాయండీ!" అన్నది.

"అదేమిటి..ఈ మధ్యనేగా ఆ అమ్మాయి రాలేదని రెణ్ణెల్లు వేరెవరినో పెట్టుకున్నావు. ఈ కొత్త మనిషి పని సరిగాచెయ్యలేదనీ...కాస్త చెయ్యివాటిదనం ఉన్నదనీ విసుక్కున్నావు!" అని తన జ్ఞాపక శక్తికి తనే పొంగిపోతూ ఒకింతసానుభూతితో మాట్లాడాడు.

"ఈ మధ్య ఎక్కడ? అది జరిగి ఏణ్ణర్ధం అయింది. కానీ మీరన్నట్టు దానికిది ఐదో కానుపు. కొడుకు కోసం ఎదురు చూస్తూ ... నలుగురు కూతుళ్ళని కన్నది. అంతమందిని ఎలా పోషిస్తావే అంటే...ఎలాగో 5-6 సం లు సాకితే ...

నాలుగిళ్ళల్లో పనులుచేసి పది రూపాయలు సంపాదించి... వాళ్ళే చేతికి ఆసరా అవుతారమ్మా" అన్నది.

"అదేం ఆర్ధిక సూత్రమో నాకర్ధంకాదు"!

"దీని లాంటి ఆవిడే...చిన్నప్పుడు మా అమ్ముమ్మగారి పక్కింట్లో ఉండేది. ఆవిడకి ఆరుగురు కొడుకులు.

అప్పట్లో సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో 4-5 గురు పిల్లలు ఉండేవారు. వాళ్ళింట్లో ఆరుగురు కొడుకులుండగా...ఆవిడ మళ్ళీ గర్భవతిగాఉన్నదని తెలిసి మా అమ్ముమ్మ ఆవిడతో .."మళ్ళీ ఈ సారి కడుపొస్తే ప్రమాదం అని డాక్టర్ చెప్పారంటివి కదే లక్ష్మీ...

రేపుఅనుకోకుండా నీకేమైనా అయితే..ఈ పిల్లలందరూ దిక్కు లేని వారౌతారు కదా" అన్నది.

"అందరూ మగ పిల్లలే కదక్కయ్యా! ఈ సారైనా ఆడపిల్ల పుడితే..ఇంటికి లక్ష్మి వచ్చినట్టే! నారు పోసిన వాడే నీరుపోస్తాడు! ఎంతలోకి ఎదుగుతారు...ఆ ఆడపిల్లే వారికి తోడౌతుందక్కయ్యా" అంటే మాకు అప్పుడు చిన్నతనం వల్లతెలియలేదు అన్నది పార్వతి.

"కన్నమ్మకే వాపిరి..తిన్నమ్మకే వాపిరి" అనే సామెత ఎందుకు వాడతారో మీ తిండి యావకి...మా అమ్ముమ్మగారి పక్కింటిలక్ష్మి, యాదమ్మ పిల్లల్ని కనటానికి ఉన్న ధైర్యాన్ని బట్టి తెలుస్తున్నది అన్నది పార్వతి.

"నువ్వేమో నీ ఆరోగ్యానికి సరిపడదని.. ఏదీ ఇష్టంగా తినవు. అందుకే నా తిండి నీకు అతిశయోక్తిగా కనిపిస్తుంది"

అన్నాడు పరమేశ్వర్రావు.

"ఆ(: మహలావు చెప్పొచ్చారు..తినే వాడికేం తెలుస్తుంది వండే వారి కష్టం? ఇదిగో...మంచి నీళ్ళు" అని కాఫీ గ్లాస్ ఒకచేతిలో, మంచి నీళ్ళ గ్లాస్ ఒక చేతిలో పెట్టింది.

"సరే రేపు నేను వంట చేసి..నా నలభీమపాకం నీకు రుచి చూపిస్తా..కాచుకో" అన్నాడు.

"అట్లు వండే అమ్మకి అరవయ్యారు అందింపులని...నేను ఎన్ని అందిస్తే మీ వంట అవ్వాలి?" అని "అయినా రేపటి దాకాఈ మాట మీదే ఉండండి" అన్నది.

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల