ఆశయం - పద్మావతి దివాకర్ల

aim

సాయంకాలం ఆరు గంటలైంది. శీతాకాలం సాయంకాలం అవడంవల్ల అప్పటికే చీకట్లు అలుముకున్నాయి. చీకటి పారదోలడానికి ఆ పార్కులో అక్కడక్కడా వెలిగే దీపాలు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. చలి మరీ ఎక్కువుగా లేకపోయినా జనం అంతగా లేరు. అయినా ఇవాళా రేపు పబ్‌లకి, బార్లకి, మాల్స్‌కి కాలక్షేపం కోసం వెళ్ళేవాళ్ళే ఎక్కువ, మరి పార్కులకి ఎవరొస్తారు? ప్రేమ పక్షులకి, ఇంట్లో ఆడుకోవటానికి స్థలంలేని పిల్లలకి, రిటైరైన వృద్ధులకి మాత్రమే నిలయమయ్యాయి అవిప్పుడు. అలాంటివాళ్ళలో పరంధాం ఒకడు. పరంధాం స్కూల్ టీచర్‌గా పనిచేసి ఈ మధ్యే ఉద్యోగ విరమణ చేసాడు.

పరంధాం తన మిత్రుడు శాంతారాం కోసం ఎదురు చూస్తూ ఓ బెంచీపై కూర్చున్నాడు. దూరంగా చిన్నపిల్లలు జారుడుబల్లపై ఆడుకోవడం చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు. ముప్ఫై అయిదేళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఈ మధ్యే ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. తన జీవితంలో ఇప్పటివరకూ ఎన్నెన్నో మలుపులు చూసాడు. ఈ అరవైఏళ్ళ జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు అటు సంసారపరంగా ఇటు ఉద్యోగపరంగా కూడా. ఉద్యోగవిరమణ తర్వాత అతనిలో అంతర్మధనం మొదలైంది. ఇన్నేళ్ళ జీవితంలో తను ఏమి సాధించాడో ఎంత ఆలోచించినా అంతుచిక్క లేదు. ‘జీవితంలో తనేమీ సాధించలేకపోయాడా? తన జీవితం అంత వ్యర్థమా! ‘ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. ఇటువంటి ఆలోచనలతో చాలా రోజులనుండి పరంధాం మనసంతా అల్లకల్లోలంగా తయారవుతోంది.

"ఏమిట్రా పరంధాం! ఏమిటా పరధ్యానం? చాలా దీర్ఘంగా ఆలోచనల్లో పడ్డావు, ఏమిటి సంగతి?" అని పలకరించాడు అప్పుడే అక్కడికి వచ్చిన శాంతారాం.

శాంతారాం పలకరింపుకి ఆలోచనల్లోంచి బయటపడ్డాడు పరంధాం. "ఏమీ లేదురా! ఇలా ఒంటరిగా కూర్చుంటే రకరకాల పనికిమాలిన ఆలోచనలు చుట్టుముడుతున్నాయి." అన్నాడు.

"అవేంటో చెప్పు! అవి పనికొచ్చేవో, పనికిరానివో నేను చెప్తాను." చలోక్తి విసిరాడు శాంతారాం తనూ కూర్చుంటూ.

అతని చలోక్తికి నవ్వువచ్చింది పరంధాంకి. కొద్దిసేపు మౌనం వహించాడు. రెండు నిమిషాల అనంతరం, "నీకు స్కూల్లో చదివే రోజులు గుర్తున్నాయా?" అని హఠాత్తుగా అడిగాడు ఏదో ప్రస్తావనకి నాందిగా.

"ఎందుకు లేవు? అవేం మర్చిపోయే సంగతులా ఏమైనా! రాయడుగారి మామిడితోటలో జొరబడి తోటమాలికి తెలియకుండా మామిడి కాయలు కోయడం, పెద్దవాళ్ళు వద్దని వారించినా వినకుండా ఏట్లో స్నానానికి దిగడం, చెరువులో ఈత కొట్టడం, హోంవర్క్ ఎగ్గొట్టి సినిమాకి చెక్కేసి ఆనక రామారావు మాష్టర్‌గారి చేతులో దెబ్బలు తినడం, ఇలాంటి ఙాపకాలన్నీ ఇప్పటికీ తాజాగానే మదిలో నిక్షిప్తమై ఉన్నాయి." అన్నాడు ఆ స్మృతులన్నీ మనసులో మెదలగా.

“అవన్నీ మధుర స్మృతులు మరి! ఎలా మర్చిపోతాం? అయితే ఒకసారి మన హెడ్‌మాష్టర్ క్లాస్‌కి వచ్చి మన జీవితాశయం గురించి అడిగారు. పెద్దయ్యాక ఏమి అవుదామని అనుకుంటున్నారని ప్రతి ఒక్కరినీ అడిగారు, గుర్తుందా?"

"గుర్తుంది. నేనేమో పెద్దయి ఇంజినీరవుతానని చెప్పాను. క్లాస్‌లో ఒకొక్కరు ఒక్కోలా చెప్పారు. కొంతమంది డాక్టర్లమవుతామని, కొంతమంది నాలా ఇంజినీర్ అవుతామని, కొంతమంది కలెక్టరని, మరికొంతమంది పోలీస్ ఆఫీసరని, సైంటిస్టని ఇలా ప్రతీ ఒక్కరూ తమ జీవితాశయాలు వెలిబుచ్చారు. అవునూ, ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? మరి నువ్వు...అఁ...గుర్తుకు వచ్చింది. నువ్వేమో పెద్దైతే ప్రఖ్యాత గాయకుడివి అవుతానని చెప్పావు, అవునా?" అని పెద్దగా నవ్వి, " గాయకుడివైతే కాలేదు కాని, చివరికి బడిపంతులయ్యావు." అన్నాడు శాంతారాం.

"గుర్తుంది కదా! మరి నువ్వో!...నువ్వు కూడా ఇంజినీర్ అవ్వలేదు కదా, నువ్వు కూడా ఆ బడిపంతులే అయ్యావు మరి!" శాంతారాం నవ్వుతో శ్రుతి కలిపాడు పరంధాం.

నవ్వు ఆపి ఒక్క క్షణం మౌనం వహించాడు శాంతారాం.

"అవును. అప్పటి మా ఇంటి పరిస్థితులు అలాంటివి మరి! నీకు తెలుసుకదా, నేను పదవ తరగతి పూర్తి చేయకుండానే మా నాన్న గతించారు. అమ్మ ఎలాగో కష్టపడి డిగ్రీ వరకూ చదివించింది. నా జీవితాశయం నెరవేరే మార్గమే కనపడలేదు. ఆ తర్వాత పార్ట్‌టైం జాబ్ చేస్తూ ఎలాగో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయగలిగాను. ఆ తర్వాత టీచర్‌గా ఉద్యోగంలో చేరాను. అంతే! చిన్నప్పుడు అనుకున్నవి ఏవి జరగవని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మరి నీ సంగతో?" అన్నాడు పరంధాం వైపు తిరిగి.

"నేనూ నీలాగే ఎన్నో సాధించాలని కలలు కన్నాను. నాకు చిన్నప్పటి నుండీ సంగీతమంటే ఎనలేని మక్కువ అని నీకు తెలుసు కదా! స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ, పాటల పోటీల్లోనూ పాటలు పాడే వాడిని. పెద్ద గాయకుడ్ని కావాలన్నది నా చిరకాల వాంఛ. సంగీతంపై మక్కువతో నేను చదువులో కూడా వెనకబడ్డాను. ఘంటసాలలా, బాల సుబ్రహ్మణ్యంలా ప్రఖ్యాత గాయకుడ్ని కావాలన్న నా ఆశయం మాత్రం నెరవేరలేదు. చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టమని ఇంట్లో వత్తిడి ఎక్కువైంది. సంగీత సాధన చేయాలన్న నా కోరికని మొగ్గలోనే తుంచేసారు మా నాన్న. నేను బాగా చదివి ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ అవ్వాలని మా నాన్న ఆశయం. నాకేమో సంగీతంపై ఉన్న శ్రద్ధ చదువుపై లేదు. నా ఆశయం ఎలాగూ నెరవేర్చుకోలేక పోయాను, మా నాన్న ఆశయం కూడా నెరవేరలేదు. నా ఆశయాన్ని మా నాన్న ఆ నాడు ప్రోత్సహించి ఉంటే మాత్రం నన్ను నేను తప్పకుండా నిరూపించుకోగలిగి ఉండేవాణ్ణి. ఆఖరికి ఇలా బడిపంతులు ఉద్యోగంలో స్థిరపడ్డాను." చిన్నగా నిట్టూర్చి అన్నాడు పరంధాం.

"నువ్వూ నేనే కాదు, ఆ రోజు మన క్లాసులో ఉన్నవాళ్ళలో దాదాపు అందరూ తమ ఆశయం నెరవేర్చుకొని ఉండరు. టీచర్ అవుదామని అనుకున్నవాళ్ళు డాక్టర్లైయ్యారు కూడా. అందుకే మనం అనుకున్నవేవీ జరగవు. భవిష్యత్తు మన చేతిలో లేదు, అందుకే ఈ విషయం లైట్ తీసుకో!" సలహా ఇచ్చాడు శాంతారాం.

"నిజమే, మనం అనుకున్నవన్నీ జరగవు. అప్పుడే గాయకుడ్ని అవాలన్న నా ఆశయం వదులుకున్నా! అయితే, ఆ తర్వాత కాలేజీలో చదువుతున్న రోజుల్లో నా జీవితాశయం మారింది." అన్నాడు పరంధాం.

"ఆఁ!...అప్పుడు ఏమి అవుదామనుకున్నావేమిటి?" కుతూహలంగా అడిగాడు శాంతారాం.

"ఈ సారి రచయిత అవుదామనుకున్నా! ఎలాగూ గాయకుడ్ని కాలేనన్న నిరాశలో ఉండగా నాలో ఈ కొత్త కోరిక పుట్టింది. నేను అప్పుడు రాసిన కథలు కొన్ని కాలేజీ మాగజైన్‌లో కూడా ప్రచురితం అయ్యాయి. ఆ స్ఫూర్తితో నేను కొన్ని కథలు, నవలలు రాసి వివిధ పత్రికలకి పంపాను."

"ఆఁ!...నీలో ఈ కోణం కూడా ఉందా! నాకు తెలియదే! నీ కథలు ఏ పత్రికలోనూ చదవలేదే?" అన్నాడు శాంతారాం విస్మయంగా.

"నువ్వు చదవడానికి నా కథలుగానీ, నవలలు గానీ ఏ పత్రికలోనైనా ప్రచురితమైతే కదా! అన్నీ తిరుగుటపాలోనే మళ్ళీ నా వద్దకు సురక్షితంగా చేరుకునేవి." అన్నాడు పరంధాం.

"ఓహ్! అయితే నువ్వు తిరిగొచ్చిన కథల రచయితవన్నమాట!" నవ్వుతూ అన్నాడు శాంతారాం.

అతను అలా అన్నందుకు నొచ్చుకోలేదు పరంధాం. తను కూడా నవ్వుతూ, "అలాగే అనుకో! చాలాసార్లు అలా ప్రయత్నించిన మీదట అది మన ఆరోగ్యానికి సరిపడదని విడిచిపెట్టేసాను. అలా ఆ ఆశయం కూడా నెరవేరలేదు." అన్నాడు పరంధాం.

కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్యా నిశ్శబ్దం రాజ్యమేలింది. నిశ్శబ్దాన్ని ముందు భంగపరిచాడు శాంతారాం.

"నేను మాత్రం ఉపాధ్యాయ వృత్తి స్వీకరించినందుకు ఏ మాత్రం బాధపడలేదు. హాయిగా, సుఖంగానే బతికాను. ఉపాధ్యాయుడిగా చాలా మందికి మంచి భవిష్యత్తు అందజేసి, దేశంకోసం ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దానన్న తృప్తికూడా మిగిలింది. అంతేకాక నేను టీచర్‌గా ఉన్నందువల్ల సరైన మార్గదర్శనం చేసి ఇద్దరబ్బాయిల్నీ బాగానే చదివించాను కదా. నేను అనుకున్నట్లు ఇంజినీర్ని కాలేకపోయాను కాని, మా అబ్బాయిలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లై విదేశాల్లో మంచి ఉద్యోగంలోనే ఉన్నారు కదా! నా జీవితాశయం వాళ్ళద్వారా తీర్చుకోగలిగాను నేను. మరి నువ్వు?...నువ్వు మాత్రం సంతోషంగా లేవూ? నీ పిల్లలు కూడా బాగానే పైకొచ్చారు కదా!"

"నాకుకూడా నీలానే ఉపాధ్యాయ వృత్తి బాగానే తృప్తినిచ్చింది. నా పిల్లలు కూడా బాగానే పైకొచ్చారు. అయితే, నా జీవితాశయం ఏ మాత్రం నెరవేరలేదు. నాకు సంగీతమన్నా, సాహిత్యమన్నా కూడా ప్రాణం. అయితే, మా అబ్బాయి, అమ్మాయి ఎవరికీ కూడా సంగీతంపై కానీ, సాహిత్యంపై కానీ అభిలాష లేదు. వాళ్ళ మీద నా అభిప్రాయం రుద్దే ఇష్టం కూడా నాకు లేదు. ఆ ఆశయం స్వతహాగా రావాలి కదా! కాకపోతే వాళ్ళిద్దరూ కూడా బాగానే చదువుకొని పైకొచ్చారు. అయితే నా చిరకాల ఆశయం మాత్రం తీరనే లేదు. అందుకే ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ జీవితంలో నేనేమీ సాధించలేకపోయానని ఓ చిన్న బాధ మనసులో ఉండిపోతోంది." మిత్రుడికి తన మదిలోని బాధ వెల్లడించాడు పరంధాం.

"నువ్వన్నది నిజమే!" అని ఒక్క క్షణం ఆలోచించి, "నువ్వు గాయకుడివి అవలేక పోయావన్నది నిజం! కానీ నువ్వు నీకు ఆదర్శంగా నిలిచిన మహామహుల గానాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావు. గాయకుడివి కాలేకపోయినా వాళ్ళ అభిమానివయ్యావు కదా! అలాగే రచయితవి కాలేకపోయావుగానీ, పేరుపొందిన రచయితల రచనలు చదివి, ఆస్వాదించి వాళ్ళ అభిమానివి కూడా అయ్యావు. నువ్వన్నట్లుగానే సంగీతం, సాహిత్యం అంటే నీకు ఇప్పటికీ ప్రాణమే కదా! ఆ రెండూ కూడా బాగానే ఆస్వాదిస్తున్నావు. అందుకే నువ్వు ఆ విషయమై కలత చెందకు." అనునయించాడు శాంతారాం.

కొద్దిసేపటికి శాంతారాం అనదలచుకున్నది పూర్తిగా అర్ధమైంది పరంధాంకి. దాంతో అతని మదిలోని అప్పటివరకూ గూడు కట్టుకున్న గుబులు దూదిపిజలా ఎగిరిపోయి మనసు తేలికయింది.

"శాంతారాం! నువ్వు చెప్పింది నిజం. నువ్వు చెప్పినది విన్న తర్వాత ఇప్పుడు నా మనసులో ఏ కోశానా వెలితి లేదు. ఇంక పద, చీకటి పడింది ఇంటికివెళ్దాం." అన్నాడు పరంధాం లేస్తూ.

శాంతారాం కూడా లేచి నిలబడ్డాడు.

"పరంధాం! మరొక్కమాట! ఈ వయసులో ప్రయత్నించినా మరి గాయకుడివి కాలేవు కానీ, సాహిత్యాభిలాష ఉన్న నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా మంచి రచయితవి కాగలవని నాకు అనిపిస్తోందిరా! దానికి వయసు పరిమితి లేదు కదా! నువ్వు అప్పుడు రచనలు చేసే సమయానికి నీకింకా అనుభవంలేదు, కానీ ఇప్పుడు ఇన్నేళ్ళలో జీవితం బాగా కాసి వడబోసావు కదా! అనుభవంలో బాగా పండిపోయావు కూడా! నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించు. తప్పక మంచి రచయితవై నీ ఆశయం నెరవేర్చుకో గలవని నా ప్రగాఢ విశ్వాసం." అని చెప్పాడు.

శాంతారాం మాటలు వినగానే పరంధాం ముఖం వికసించింది.

"చాలా చక్కగా చెప్పావురా! నీ మాటలతో ఇప్పుడు నాకు చాలా ఉత్సాహం వచ్చింది. ఇవాళ్టినుండే ఆ పనిలో ఉంటాను. మళ్ళీ కలం పడతాను. నువ్వు చెప్పిన తర్వాత నేను ఈ సారి తప్పక విజయం సాధిస్తానని గట్టి నమ్మకం ఏర్పడుతోంది." అన్నాడు పరంధాం సంతోషంగా.

నిజంగానే ఆ తర్వాత కొద్దిరోజులలోనే పరంధాం చిరకాల ఆశయం నెరవేరింది. తనకి చక్కని స్ఫూర్తినిచ్చిన శాంతారాంకి తన కృతఙతలు తెలియపర్చాడు.

మరిన్ని కథలు

Bhojaraju Kathalu - Four Gems
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Cow and Tigers
ఆవు - పులులు
- యు.విజయశేఖర రెడ్డి
Trikala Vedi - Bhojaraju Kathalu
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
laziness is a sin
సోమరితనం అరిష్టం
- సరికొండ శ్రీనివాసరాజు‌
Toy Stories - Sadgunavathi
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- బెల్లంకొండ నాగేశ్వరరావు.
Laughing Club
నవ్వుల లోకం
- భాస్కర్ కాంటేకార్
Toy Stories - Rudra Bhavani
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.