ఆదర్శ గ్రామం - చెన్నూరి సుదర్శన్

role village

రామాలయంలో జేగంటల మధ్య రాముల వారికి హారతి ఇవ్వడం పూర్తికాగానే, రాముని మీద శ్లోకం చదువసాగింది ఓ చిన్నారి.

“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే || “

మధురమైన గొంతు. భక్తులంతా భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. ఆలయ పూజారి ఆ పాపను చూసి విస్తుపోయాడు. ఆమె పాడిన శ్లోక వాక్సుద్ధికి ఆనందపరవశుడయ్యాడు. ఇంత అనుభావమున్నా.. ఒక్కో సారి తన పద ఉచ్చారణలో తడబాటును తడుముకోవాల్సి వస్తుంది.

“నీ పేరేంటమ్మా.. ఎవరమ్మాయివి” అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగాడు పూజారి.

“నా పేరు భారతి పూజారి గారూ.. ఈ మధ్యనే వచ్చాం. మా నాన్న గారు ప్రైమరీ స్కూల్లో హెడ్మాస్టర్” అంటూ ఎంతో వినయంగా సమాధానమిచ్చింది.

“ఓ!.. రాఘవులు గారి అమ్మాయివా.. చాలా సంతోషమమ్మా.. ఏం చదువుతున్నావ్..” అంటూ హారతి పళ్ళెం ముందుంచాడు పూజారి.

“ఆరో తరగతి” అంటూ తన చేతిలోని చిల్లర నాణాన్ని పళ్ళెంలో వేసి హారతి కళ్ళకద్దుకుంది. పూజారి చిరునవ్వుతో శఠగోపం పెడ్తూ..

“సకల విద్యలు ప్రాప్తిరస్తు” అంటూ దీవించాడు. తీర్థప్రసాదాలు కళ్ళకద్దుకుని ఆస్వాదించింది భారతి.

“బడికి టైం అయ్యింది పూజారి గారు వెళ్ళొస్తాను” అంటూ జింక పిల్లలా ఎగురుకుంటూ వెళ్ళింది. భారతి వినయవిధేయతలు.. భక్తిశ్రద్ధలు చూసి భక్తులంతా ఆశ్చర్య పోయారు. ‘మా ఇంటా ఇలాంటి పాప ఉంటే ఎంత బాగుండు’ అని ఎవరికీ వారే మనసులో అనుకోసాగారు.

“పాపం.. భారతి చిన్నతనంలో తల్లిని కోల్పోయిందట” అంటూ ఖిన్నుడయ్యాడు పూజారి. వాతావరణం ఒక్క సారిగా హృదయవిదారకంగా మారిపోయింది.

పూజా సమయంలో భారతి రావడం.. ఒక శ్లోకం చదవడం.. భక్తులంతా పరవశం చెందడం నిత్యకృత్యంగా మారింది. శ్లోకం చదివి దాని అర్థం సహితం చెప్పసాగింది భారతి. అందులోని కొన్ని పదాల అర్థాలను పూజారిని అడిగి తెలుసుకునేది. మనసులో ఏదైనా ధర్మసందేహం కలిగినా నిర్మోహహమాటంగా అడిగి నివృతి చేసుకునేది. గుళ్ళో కొత్త వాతావరణ మేర్పడింది.. క్రమేణా భక్తుల సంఖ్యా పెరిగింది.

ఒక రోజు ”పూజారి గారూ.. గుళ్ళో ఉన్న ప్రశాంతత మన ఊళ్ళో లేదు ఎందుకు? నేను ప్రతీ రోజు చూస్తున్నాను. ఎదో ఒక వాడలో తగువులాడుకోవడం, కీచులాడుకోవడం, అకారణంగా దూషించుకోవడం.. ఎందుకలా” అంటూ అమాయకంగా అడిగింది. అంత చిన్న వయసులో ఆమె ఆలోచనా ధోరణికి ఆశ్చర్యపోయాడు పూజారి. ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కొద్ది క్షణాలు ఆలోచించాడు.

“అమ్మా భారతీ.. దేవాలయంలో చూస్తున్నావు కదా..! చుట్టూ చెట్లు, వాని కొమ్మల్లో నృత్యం చేసే పూలు.. పూలు విరజిమ్మే సుగంధాలు.. వాటికి తోడు గుళ్ళో వెలిగించే కర్పూర హారతులు.. అగర వత్తుల సువాసనలు మన హృదయ కల్మషాలను కడిగి వేస్తాయి. మన మదిలో రగిలే ఆవేశాలన్నీ ఇక్కడి వాతావరణంలో కొట్టుకు పోతాయి. మనసుకు సాంత్వన చేకూరుతుంది” అంటూ భారతి తలపై తన అరచేతితో నిమిరుతూ ”ఇలాంటి వాతావరణం.. మన వాడల్లో ఇళ్ళల్లో ఏది తల్లీ..! ఎటు జూసినా దుర్ఘంధపు వాసనలు. మురికి నీటి ప్రవాహాలు. వాటితో నిర్మలమైన మనసులు సైతం కల్మష భారిన పడుతున్నాయి. దాంతో అకారణంగా ఆవేశాలు.. అనర్థాలూనూ..”

“మరి గుళ్ళోని వాతావరణంలాగా ఊళ్ళో వాతావరణం మారిస్తే.. సత్ఫలితాలుంటాయా..” అంటూ మరింత అమాయకంగా అడిగింది భారతి.

“గుడ్డి కంటే మెల్ల నయమన్నట్లు.. కొంత వరకు మనుషుల్లో మార్పు రావచ్చు. కాని ఊరిని మార్చే నాయకులేరి? కుట్రలూ.. కుతంత్రాలు తప్ప ఊరిని పట్టించుకునే నాధులేరి?” అంటూ నిస్సహాయంగా రాముల వారి

గర్భగుడిలోకి దృష్టి సారించాడు.

భారతి మస్తిష్కంలో ఒక వెలుగు పుంజం అంకురించింది.

***

ఆ రోజు పాఠశాల ప్రార్థన అనంతరం హెడ్మాస్టర్ గారి అనుమతి తీసుకొని వేదికనెక్కింది భారతి.

మొదట గురువులను, నమస్సులతో సంబోధించి తన మనసులోని మాటలు చెప్పసాగింది.

“ప్రియమైన నాతోటి విద్యార్థినీ విద్యార్థులారా.. మన బడిలో, గుడిలో ఉన్న వాతావరణం మన ఊళ్ళో లేదు. ఒకప్పుడు పల్లెటూళ్ళు స్వర్గానికి గవాక్షాలు అనేవారు. నేడు పట్నాలకు మేమేం తీసిపోము అన్నట్లు కల్మష వాతావరణం నింపి ప్రజలను నేరస్తులను చేస్తున్నాయి. మనం గుడిలోని వాతావరణాన్ని మన ఊళ్ళోకి తీసుకు రావాలి. అప్పుడు గుళ్ళో ఎలా నేరాలు ఘోరాలు జరుగవో.. అలాగే మన ఊళ్లోనూ జరగవు” అంటూ అందరినీ కలియజూసింది. అధ్యాపక బృందం సైతం ఎలా? అన్నట్లుగా విస్మయంగా చూడ్డం భారతిలో మరింత ఉత్సాహం పెరిగింది. “మనం ముందుగా మురికి కాల్వలు కనబడకుండా చేయాలి. మన వాడల్లో రోడ్డు కిరువైపులా సుగంధ పూల చెట్లు నాటాలి. దీంతో మనం ప్రకృతిమాతను సంరక్షించుకున్న వాళ్ళ మవుతాం.. లేకుంటే మున్ముందు మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇది మన ప్రథమ ప్రణాళిక. దీనిని దిగ్విజయం చేయడానికి మనమంతా ప్రమాణం చేద్దాం” అంటూ తాను ముందుగా వ్రాసుకున్న ప్రమాణ పత్రాన్ని చదువుతూ అందరిచే వల్లె వేయించింది.

అనంతరం హెడ్ మాస్టర్ మాట్లాడుతూ.. తన అధ్యాపక బృందం తరఫున ఒక రోజు జీతం విరాళంగా ప్రకటించాడు. విద్యార్థుల్లో ఉత్సాహం పెల్లుబికింది.

భారతి కేవలం ఉపన్యాసానికే పరిమితమం గాకుండా తన వాడలో తన ఇంటి ముందు నుండి పూల మొక్కలు నాటడం ఆరంభించింది.

రాఘవులు తన సిబ్బందితో గ్రామ సర్పంచిని కలిసి తమ విద్యార్థులు చేయబోయే ప్రణాళికను వివరించాడు. మురికి కాలువల నిర్మూలనకై కృషి చేయాలని విన్నవించాడు.

సంక్రాంతి సెలవులు పూర్తయ్యే సరికి గ్రామ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామ ప్రజలంతా విస్తుపోయారు. సర్పంచ్ గ్రామ వార్డ్ సభ్యులను సమావేశ పరిచి తమ వంతు సహకారాన్ని అందించాలని అభ్యర్థించాడు. నిధులను విడుదల చేసాడు.

వీరి కృషి జిల్లా కలెక్టరు గారికి తెలిసి గ్రామాన్ని సందర్శించాడు. సభ ఏర్పాటు జేసి గ్రామం ఒక నందనవనంలా మార్పుకు కారణమైన భారతిని కొనియాడాడు. తన పరిధిలోని ప్రత్యేక నిధులు మంజూరు చేసాడు.

***

భారతి ఇప్పుడు పదవ తరగతి..

అలవాటు ప్రకారం భారతి రామాలయంలో అడుగు పెట్టింది.

“రామాయణం పరం శాస్త్రం – మంత్రో రామాయణో మహాన్

రామాయణం పరం ప్రాప్యం - ధనం రామాయణం పరమ్ ॥“

అనే శ్లోకం రామాలయంలో మారుమ్రోగింది. భారతి కంఠ స్వరానికి కోకిల సిగ్గుపడింది.

పూజారి పరుగు పరుగున వచ్చి భారతిని ఆశీర్వదిస్తూ “అమ్మా భారతీ.. నీ అకుంఠిత దీక్ష ఊరంతా గుడిగా మారింది. ఈ సంవత్సరం మన గ్రామం ‘ఆదర్శ గ్రామం’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది’ అనగానే గుడి ప్రాంగణమంతా భక్తుల కరతాళధ్వనులతో మారుమ్రోగి పోయింది. భారతి సిగ్గు మొగ్గయ్యింది.*

మరిన్ని కథలు

Bhojaraju Kathalu - Four Gems
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Cow and Tigers
ఆవు - పులులు
- యు.విజయశేఖర రెడ్డి
Trikala Vedi - Bhojaraju Kathalu
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
laziness is a sin
సోమరితనం అరిష్టం
- సరికొండ శ్రీనివాసరాజు‌
Toy Stories - Sadgunavathi
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- బెల్లంకొండ నాగేశ్వరరావు.
Laughing Club
నవ్వుల లోకం
- భాస్కర్ కాంటేకార్
Toy Stories - Rudra Bhavani
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.