శాపమా! వరమా!! - పద్మావతి దివాకర్ల

bad or good

మోహన్రావు చనిపోయాడన్న వార్త విన్న ఆనందరావు తన చెవులను తానే ఓ క్షణం నమ్మలేకపోయాడు. ఆ వార్త నిజం కాదేమోనని ముందు తలచినా ఆ వార్త అందించిన రాజారావు మోహన్రావుకి ఆప్తమిత్రుడవటం వల్ల నమ్మక తప్పలేదు. ఆనందరావు కూడా మోహన్రావు మిత్రుడే. అయితే రాజారావు మాత్రం అతనికి అత్యంత సన్నిహితుడు. మోహన్రావు తన వయసువాడే! మరీ ఎక్కువైతే నలభై ఆరు గాని నలభై ఏడేళ్ళ వయసుగానీ ఉంటుంది. అంతే! అంత చిన్నవయసులోనే మోహన్రావుకి నూరేళ్ళూ నిండిపోయాయా అని విచారించాడు ఆనందరావు. మోహన్రావు తాగుడు అలవాటే అతని ప్రాణంతీసింది, తను ఎంత చెప్పినా వినిపించుకోలేదని బాధపడ్డాడు. మోహన్రావు మృతితో అ కుటుంబానికి కలగబోయే దుస్థితికి చింతించాడు ఆనందరావు. అతను పోవడం ఆ కుటుంబానికి తీరని శాపం. మోహన్రావు కుటుంబానికి కలిగిన ఈ హఠాత్ పరిణామానికి అతని హృదయం ద్రవించింది. మోహన్రావు బతికి ఉన్నప్పుడే ఆ ఇంటిపరిస్థితి అంతంత మాత్రం. ఇకముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో? అతని మృతిని వాళ్ళు ఎలా తట్టుకుంటారో? వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎంత చిన్నాభిన్నమవుతుందో అని ఆనందరావు ఆందోళన చెందాడు. రాజారావు తను కూడా వస్తానని కొద్దిసేపు వేచిఉండమని చెప్పినా ఒక్క క్షణంకూడా నిలువలేకపోయాడు ఆనందరావు. భార్య సురేఖతో బయలుదేరుతూ, రాజారావుని మోహన్రావు ఇంటికే తిన్నగా వచ్చేయమన్నాడు.

**** **** **** **** ****

ఆనందరావు, మోహన్రావు, రాజారావు ఈ ముగ్గురూ ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒకే ఊళ్ళో కలిసి పనిచేసారు. అప్పటికింకా ఎవరికీ వివాహం కాకపోవడం వల్ల ఒకే గది అద్దెకి తీసుకొని అందులో ఉండేవారు. ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చాయి ఆనందరావుకి. హోటల్లో భోజనం చేయలేక స్వంతంగా వంట చేయడానికి ఆనందరావు ఉపక్రమిస్తే, వాళ్ళిద్దరూ మిగతా పనుల్లో సహాయ పడేవారు. ఆదివారం ఒక్కరోజు మాత్రం ముగ్గురూ వంటమాని హోటల్‌కి వెళ్ళి భోజనం చేసి అటునుండటే సెకండ్‌షో సినిమాకి వెళ్ళేవారు. ఆ రోజులన్నీ చాలా సరదాగా అలా గడిచిపోయేవి.

ఓ రెండేళ్ళ తర్వాత వాళ్ళ స్నేహానికి విరామం వచ్చింది. ఆనందరావుకి ఇంట్లో వత్తిడి ఎక్కువై పెళ్ళి చేసుకొని ఒకింటివాడయ్యాడు. ఆ తర్వాత ఇంకో ఇల్లు చూసుకొని కాపురం పెట్టాడు. అప్పటినుండి క్రమంగా వాళ్ళ మధ్య స్నేహబంధంలో విరామమొచ్చింది. ఆఫీస్‌లో ఉన్నంతవరకే స్నేహం. సాయంకాలం ఆరయ్యేసరికి సంసార జీవితంలో పడ్డ ఆనందరావు ఇంట్లోనే ఉండేవాడు.

అయితే ఆనందరావు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత, రాజారావు, మోహన్రావు కొత్త వ్యసనాల బారిన పడ్డారు. ఒకప్పుడు సెలవు రోజుల్లో సినిమాలకి, షికార్లకి వెళ్ళిన ఆ స్నేహితులిద్దరూ మరో ఇద్దరు కొత్త స్నేహితులని వెతుక్కొని పేకాట, తాగుడు వంటి వ్యసనాలు అలవర్చుకున్నారు. కొన్నాళ్లకి వాళ్ళకి శని ఆదివారాలు మాత్రమే కాదు, వారంలో మిగతా రోజుల్లో కూడా సమయం దొరికితే చాలు చతుర్ముఖ పారాయణంలో కూర్చుండిపోతున్నారు. తాగుడు అయితే సరేసరి! తాగుడు లేకపోతే జీవితమే లేదు అన్నంత దశకి వచ్చారిద్దరూ.

వ్యసనాలు శ్రుతి మించడంతో ఆనందరావు ఒకసారి మందలించాడు కూడా. అయితే ఆనందరావు మాటలు పెడచెవిన పెట్టారిద్దరూ.

"నీలా 'రాముడు మంచి బాలుడు ' అన్నట్లు ఉంటే ఎలా గురూ! మా సరదాలు ఎలా తీరుతాయి? నీకైతే పెళ్ళైంది కదా, భార్య చెప్పిన మాట విని తీరాలి నువ్వు. కాని మమ్మల్ని అడిగేవారెవరు? ఈ బ్రహ్మాచారి జీవితం తనివితీరా అనుభవించనీ. అసలు మేము హాయిగా ఉంటూంటే చూడలేక నువ్వు కుళ్ళుకుంటున్నావేమో అని అనిపిస్తోంది ఇప్పుడు. నువ్వు మాలా జీవితం అనుభవించ లేకపోతున్నావని బాధపడుతున్నావు. అంతేనా గురూ!" అన్నాడు మోహన్రావు మందు నిషాలో తూలుతూ.

"నేనెందుకు కుళ్ళుకుంటాను? మీరు పతనమై పోతుంటే చూసి భరించలేకపోతున్నాను గానీ. జీవితం అనుభవిస్తున్నామని ఇప్పుడు అనుకుంటున్నారు గాని, మీ వ్యసనాలు మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని గ్రహించారా ఎప్పుడైనా? కోరి ఆరోగ్యం చెడగొట్టుకోవడం దేనికి?" అన్నాడు ఆనందరావు.

"ఛ!...నువ్వు కూడా మాకు ఉపదేశాలు ఇవ్వడం మొదలెట్టావా? తాగిన వాడికే ఆరోగ్యం చెడిపోతుందంటే మరి మన సీనియర్ అకౌంటెంట్ రామానుజంకి ఏ దురలవాట్లూ లేవు, ఆఖరికి వక్కపోడి కూడా వేసుకోడు. మరి వాడికి క్యాన్సర్ ఎలా వచ్చింది? అందుకే దానికీ దీనికీ ఏ మాత్రం సంబంధం లేదు, తెలిసిందా?..."అంటూ చెప్పుకుపోతున్నాడు రాజారావు. తమ చర్యని సమర్థించుకొనే వితండవాదం వారిది. వాళ్ళ మాటలు వినదలచుకోలేదు, అందుకే మరి అక్కడ ఉండటానికి మనస్కరించక తిరిగి వచ్చేసాడు ఆ రోజు.

రోజులు గడుస్తున్నాయి కానీ వాళ్ళ అలవాట్లు, వ్యసనాలు ఏ మాత్రం మారలేదు. తాగుడైతే మితిమీరిపోయింది.

ఆనందరావు సలహాలు వినకపోవడమే కాక అతన్ని చులకనగా చూడసాగారు ఆ మిత్రద్వయం. ఆ తర్వాత వాళ్ళని ఇక పట్టించుకోలేదు అతను. మోహన్రావు, రాజారావు స్నేహం మాత్రం బాగానే వర్ధిల్లింది. కొంతకాలానికివాళ్ళపెద్దవాళ్ళకి ఈ విషయం తెలిసి పెళ్ళి చేస్తేనైనా బాగుపడుతారని తలిచారు. ఆ విధంగా ముందు మోహన్రావుకి, ఆ తర్వాత రాజారావుకీ పెళ్ళిళ్ళు జరిగాయి. వాళ్ళ బ్రహ్మచారి జీవితానికి అంతటితో బ్రేక్‌పడింది. వాళ్ళ పెళ్ళికి భార్యతో సహా హాజరయ్యాడు ఆనందరావు. ఆనందరావు కూడా వాళ్ళ పెద్దవాళ్ళలానే భావించాడు, పెళ్ళైన తర్వాతైనా వాళ్ళు బాధ్యతనెరిగి వ్యసానాలు వదిలిపెడతారని. కానీ, వాస్తవంలో ఆ విధంగా ఏమీ జరగలేదు. పెళ్ళైన కొత్తలో కొన్నాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ ఆ వ్యసనాలే కలిపాయి. ఆనందరావు తలచినట్లుగా కానీ, వాళ్ళ తల్లితండ్రులు తలచినట్లుగా కానీ వాళ్ళేం పెద్దగా మారలేదు. తాగుడుకి పూర్తిగా బానిసయ్యారు.

ఆ తర్వాత ముగ్గురు స్నేహితులకి వేర్వేరు ప్రాంతాలకి బదిలీ అయి విడిపోయారు. తమకి వీలైనప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళకున్న వ్యసనాల కారణంగా తన మిత్రులకి కాస్త దూరంగానే ఉంటూ వచ్చాడు ఆనందరావు. అయితే మోహన్రావు, రాజారావు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నావీలున్నప్పుడల్లా పరస్పరం కలుస్తూనే ఉన్నారు, మందుపార్టీ చేసుకుంటూనే ఉన్నారు.

కాలచక్రంలో రోజులు నెలలుగా మారి, నెలలు సంవత్సరాలుగా మారి దొర్లిపోతూనే ఉన్నాయి. చూస్తూండగానే ఓ పాతిక ఏళ్ళు గడిచిపోయాయి. ఆనందరావుకి ప్రమోషన్లు వచ్చి ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నాడు. ఆనందరావు కొడుకులిద్దరూ బుద్ధిమంతులు. ఇంజినీరింగ్ చదువుతున్నారు. మళ్ళీ స్వంత ఊరికే బదిలీపై వచ్చాడు. మోహన్రావుకి, రాజారావుకి కూడా పదోన్నతి దొరికింది కాని వాళ్ళిద్దరూ ఇంకా ఆనందరావు స్థాయికి ఎదగలేదు. వాళ్ళు కూడా అదే ఊరికి బదిలీపై వచ్చారు. కాకపోతే ముగ్గురివీ వేర్వేరు శాఖలు. మళ్ళీ ఆ స్నేహితులు ముగ్గురికీ ఒకర్నొకరు కలిసే అవకాశం దొరికింది.

సరిగ్గా ఓ ఆర్నెల్ల క్రితం ఆదివారం సాయంకాలం ఒకసారి ఆనందరావు అటువైపు వెళ్ళే పనిపడటంతో తన భార్య సురేఖతో మోహన్రావు ఇంటికి వెళ్ళాడు.

అతనింటికి వెళ్ళేముందు ఫోన్ చేసి చెప్పాడు కూడా. అయినా ఇంటికెళ్ళేసరికి మోహన్రావు లేడు. అతని భార్య సరళ వాళ్ళని ఆహ్వానించింది. చాలా రోజుల తర్వాత ఆమెని చూసాడు ఆనందరావు. అప్పటికీ, ఇప్పటికీ అమెలో ఎంతో మార్పు! ఆమె వయసు మరీ ఎక్కువ కాకపోయినా చూడటానికి అసలు వయసుకన్నా ఓ పదేళ్ళు పైబడినట్లే కనిపించింది.

కళా విహీనమైన నేత్రాలు, కళ్ళకింద వలయాలు, ముఖంపై ముడతలు ఆమె వయసు పెంచేసాయి. ఆమె ధరించిన బట్టలు పాతబడి చిరుగులుపట్టి ఉన్నాయి. ఆ చిరుగులు కనపడకుండా తాపత్రయ పడుతూ మాటిమాటికీ సర్దుకుంటోందామె. వాళ్ళు ఉన్న ఇల్లు కూడా అతి సాధారణంగా ఉంది. చాలా దయనీయంగా ఉంది ఆ ఇంటిపరిస్థితి. కూర్చోడానికి ఇంట్లో సోఫా కానీ, మంచి కుర్చీలు కానీ లేవు. ఇంట్లో ఉన్న పాతబడి పాడైపోయిన కుర్చీలు రెండు తెచ్చి హాల్‌లో వేసి తను నులక మంచంపై కూర్చుంది. ఆ ఇంట్లో చూడగానే దరిద్ర దేవత తాండవిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఊరికి ట్రాన్స్‌ఫరై వచ్చిన తర్వాత మొదటిసారి వెళ్ళడమేమో ఆనందరావు విచిత్రంగా గమనించాడు ఆ ఇంటి పరిస్థితిని.

మాటల వరసలో తమ పరిస్థితిని చెప్పుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుందామె, "ఆయన ఈ మధ్య బాగా చెడిపోయారు అన్నయ్యగారూ! అంత విపరీతంగా తాగుతారని నాకు ముందు తెలియదు, ఏదో పార్టీలప్పుడు మాత్రమే ఆ అలవాటు ఉందని భావించాను. ఇప్పుడు అసలు ఇంటి విషయమే పట్టించుకోవడం పూర్తిగా మానేసారు. ఈ ఇల్లు ఎలా గడుస్తుందో ఏమిటో అన్న ఆలోచన కూడా లేదాయనకి. ఊరినిండా లెఖలేనన్ని అప్పులు. కూతురు పెళ్ళికి ఎదిగిందని దానికి పెళ్ళిచేయాలన్న ఙానం కూడా లేదు మనిషికి. అబ్బాయి ఏదో ఇంతవరకూ లాక్కొచ్చాడు కానీ ఇప్పుడు వాడి చదువో సమస్యైంది. వాడికి ఇంజినీరింగ్ చదవాలని ఉంది, కానీ డబ్బేది? బ్యాంక్ లోన్ తీసుకున్నా అది సక్రమంగా వాడి చదువుకే వాడతారన్న నమ్మకం కూడా లేదు. పైగా ఆయన ఆరోగ్యం కూడా ఈ మధ్య బాగానే క్షీణించింది. ఆ పాడు తాగుడు ఆయన్ని కబళిస్తోంది. మానమని ఎంత బతిమాలినా వినడమే లేదు. పైగా కోపం విపరీతంగా పెరిగి నా పైనా, పిల్లలపైనా చేయి చేసుకుంటారు కూడా! ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు ఏం తోచడమే లేదు." అని తన కష్టాలన్నీ చెప్పుకు ఏడ్చింది. అమె ముఖంలో అంతులేని గుబులు, మాటల్లో జీవితంపై విరక్తి కొట్టొచ్చినట్లు కనిపించాయి ఆనందరావుకి. వాళ్ళ పరిస్థితికి ఆనందరావుకి, సురేఖకీ కూడా కళ్ళు చెమర్చాయి. వాళ్ళ అబ్బాయి సురేష్‌ని, అమ్మాయి అనితని చూసారిద్దరూ. వాళ్ళ ముఖాల్లో తమ భవిష్యత్తు పట్ల అనిశ్చితత గోచరించడం స్పష్టంగా గమనించాడు ఆనందరావు.

"బాధపడకు వదినా! అతను మారతారని, మీ సమస్యలన్నీ త్వరలో గట్టెక్కుతాయని ఆశిద్దాం. మావారు ఓ సారి అన్నయ్యగారితో మాట్లాడతారు. అన్ని చోట్ల ఈ వ్యసనం మార్పించడానికి కేంద్రాలు ఉన్నాయి. చూద్దాం ఏమైనా మార్పు వస్తుందోమో?" ఆమెని ఊరడించి ఆనందరావు వైపు చూసింది సురేఖ.

ఆనందరావు కూడా మోహన్రావు పరిస్థితి, అతని ఇంటి పరిస్థితి ఇంత దిగజారిపోయిందని అనుకోలేదు. సరళవైపు సానుభూతిగా చూస్తూ, "అసలు ఇవాళ నేను ఫోన్ చేస్తే ఇంట్లో ఉంటానన్నాడు ఈ సమయంలో. అందుకే చాలా రోజులైంది కదా కలసి అని మేము వచ్చాం. నేను రేపోసారి వాడిని కలిసి మాట్లాడి నా వంతు ప్రయత్నిస్తాను." చెప్పాడు మనస్ఫూర్తిగా తన మాటకి మోహన్రావు ఎంత విలువిస్తాడోనని ఓ పక్క సందేహమున్నా.

సరళకి ధైరం చెప్పి భారమైన గుండెలతో ఇంటికి తిరిగివచ్చారు వాళ్ళిద్దరూ.

ఆ మరుసటి రోజు తీరుబాటు చూసుకొని మోహన్రావుని కలిసాడు ఆనందరావు. విషయం దాచకుండా తను అనుకొన్న మాటలు సూటిగా చెప్పాడు ఆనందరావు.

"చూడు మోహన్రావూ...నిన్న మీ ఇంటికెళ్ళాం. నువ్వు ఇంట్లో ఉంటావని మాటిచ్చి మరీ మాట తప్పావు. మీ ఇంట్లో పరిస్థితి చూసాను. నీ తాగుడు వల్ల మీ ఇంటిల్లపాదీ చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా నీ ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టి ఆ వ్యసనం నుండి బయటపడు. ఇంతమందిని కష్టబెట్టి నువ్వు బావుకునేదేమిటి? నీ ఒక్కడి ఆనందం చూసుకుంటే చాలా? ఇంట్లో వాళ్ళందరి కోసం ఆలోచించవద్దా? ఇప్పుడైనా ఆలోచించు. డీఅడ్డిక్షన్ సెంటర్‌లో చేరితే త్వరలో నీ వ్యసనం వదిలేట్టు చేయగలరు. కాస్త ఆలోచించు." అని గట్టిగానే చీవాట్లు పెట్టాడు ఆనందరావు.

ఆనందరావు అలా మాట్లాడతాడని ఊహించని మోహన్రావు ముందు విస్తుపోయాడు. "హుఁ!...ఇంకా నీ ఉపదేశాలు చెప్పడం మానవా? అందరూ నాకు చెప్పేవాళ్ళే! ఇంట్లోనూ బయట అన్నిచోట్లా, ప్రతీ అడ్డమైనవాళ్ళు నాకు నీతులు చెప్పేవాళ్ళే! ఇప్పుడిక ఎవరి మాటలు వినే స్థితిలో నేను లేను." కోపంగా అని ఒక్కక్షణం ఆగి, "ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు నేను తాగుడు వదిలిపెడతానన్నా, అది నన్ను వదిలిపెట్టనంటోంది. నేనన్న మాటలకి కోపం తెచ్చుకోకు గురూ..." అని తూలుతూ వెళ్ళిపోయిన మోహన్రావువైపు నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు ఆనందరావు.

ఈ విషయమై తనేమీ చేయలేనని తన అశక్తత గ్రహించిన ఆనందరావు ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం మానుకున్నాడు మధ్యనో రెండు మూడు సార్లు మోహన్రావుని కలిసే సందర్భం ఏర్పడినా.

ఇది జరిగిన ఓ అర్నెల్ల తర్వాత ఇదిగో ఈ వార్త.

**** **** **** **** ****

అరగంటలోనే భార్య సురేఖతో మోహన్రావు ఇంటికి చేరుకున్నాడు ఆనందరావు.

అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. బతికినన్నాళ్ళూ భార్యనీ పిల్లలనీ తన తాగుడు అలవాటుతో హింసించిన మోహన్రావు నిర్జీవంగా నేలపై పడి ఉన్నాడు. భార్య సరళ, కొడుకు సురేష్, కూతురు అనిత అతని శరీరం పక్కన కూర్చొని రోదిస్తున్నారు. వాళ్ళని కష్టాలు పాలు చేసి, ఇక తనకా బాధ్యత తీరిపోయిందన్నట్లు వెళ్ళిపోయాడు మోహన్రావు. బతికినన్నాళ్ళూ భార్యా బిడ్డల గురించి ఆలోచించనేలేదు. ఇప్పుడు మరిక వాళ్ళ చింతే అక్కరలేదు. తన తదనంతరం తనని నమ్మినవాళ్ళకేం దారి అని కూడా ఆలోచించలేదు. అలా ఆలోచించి ఉంటే ఎప్పుడో తాగుడు వ్యసనం బారినుండి బయటపడి బాగుపడి ఉండును. అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సురేఖ సరళవద్దకు వెళ్ళి ఆమెని, పిల్లలనీ ఊరడించింది.

నేరుగా మోహన్రావు ఇంటికి వస్తానన్న రాజారావు వస్తాడో రాడోనని ఆనందరావుకి సందేహమున్నా త్వరలోనే అతను చేరాడు. రాజారావుని చూస్తూనే 'నయం! మందుమీద లేడు, మనలోనే ఉన్నాడు.' అని మనసులో అనుకున్నాడు ఆనందరావు.

సరళ, ఆమె పిల్లల దైన్య పరిస్థితి చూసి మనసులోనే మౌనంగా రోదించాడు ఆనందరావు. మోహన్రావు తరఫు చుట్టాలెవరూ పెద్దగా రాలేదు. అతని తల్లితండ్రులెప్పుడో గతించారు. తన తాగుడు అలవాటు కారణంగా మిగతా బంధువులని కూడా దూరం చేసుకొని ఉంటాడని భావించాడు ఆనందరాపు. స్నేహితులు, సహోద్యోగులుకూడా చాలా తక్కువే వచ్చారు. ఇంతలో మోహన్రావు బంధువు ఒకతను వచ్చాడు ఆనందరావు వద్దకు.

"మీరు…మీరు మా మోహన్రావు స్నేహితుడనుకుంటాను." అని అడిగాడు.

"అవును. మోహన్రావు నా స్నేహితుడు మాత్రమే కాదు, నా సహోద్యోగుడు కూడా." జవాబిచ్చాడు ఆనందరావు.

"నా పేరు మాధవరావు. నేను మోహన్రావుకి మేనమామనవుతాను. రండి. కొంచెం పక్కకిరండి. మీతో కొంచెం మాట్లాడాలి." అన్నాడతను.

ఆనందరావు పక్కకి తిరిగి రాజారావుకోసం చూసాడు, కాని ఆ చుట్టుపక్కలెక్కడా కనపడలేదు. రాజారావు ఎక్కడికెళ్ళి ఉంటాడో ఊహించిన ఆనందరావు మరి అతనికోసం చూడకుండా ఆ పిలిచిన వ్యక్తివెనుకే వెళ్లాడు.

"చూసారా ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో? మోహన్రావు పెళ్ళాం,పిల్లల్ని నట్టేట ముంచి వెళ్ళిపోయాడు. ఇంతకాలం అతని అండన పస్తులుండైనా రోజులు గడుపుతూ ఉండేవారు. ఇంటిబాధ్యతలు ఏ మాత్రం పట్టించుకోకుండా జల్సాగా జీవితం గడిపి ఇప్పుడేమో అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. అతని భార్యా పిల్లల పరిస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. ఇంకో విషయమేమిటంటే, ఇప్పుడు అతని అంత్యక్రియలు జరపటానికైనా వాళ్లవద్ద చిల్లిగవ్వ లేదు. మనమందరమూ ఓ చెయ్యవేసి ఈ కార్యక్రమం జరిపించాలి. ఈ విషయమై మీలాంటి సహృదయుల సహకారం కూడా అర్థిస్తున్నాను. మీరు అతని స్నేహితులూ, సహోద్యోగులని అంటున్నారు కదా, మీరు కూడా పూనుకొని ఈ కార్యక్రమం కాస్త జరిపించాలి. ఆ తర్వాత మీ ఆఫీస్ నుండి అతని భార్యకి గాని, పిల్లలకి గానీ ఉద్యోగంలాంటి సహాయ సహకారాలేమైనా అందజేయగలిగితే బాగుంటుంది." అన్నాడు మాధవరావు.

మాధవరావు అన్నమాట నిజమే. మాధవరావు మాటలు విన్న ఆనందరావు హృదయం ద్రవించింది. అప్పటికే రావలసిన వాళ్ళంతా వచ్చారు. చుట్టుపక్కల ఇంటివాళ్ళందరూ కూడా మోహన్రావుతో సత్సంబంధాలు లేకపోయినప్పటికీ అతని భార్యా పిల్లలని చూసి జాలిపడి తలోచెయ్యి వేసారు. ఆనందరావు కూడా తన సహకారం అందించాడు. మొత్తానికి అందరి సహకారంతో మోహన్రావు అంత్యక్రియలు పూర్తైయ్యాయి. మధ్యమధ్య రాజారావుకోసం వెతుకు తూనే ఉన్నాడు ఆనందరావు. ఇందాక ఎప్పుడో అక్కడ్నుంచి మాయమైపోయిన వ్యక్తి ఆఖరికి మోహన్రావు అంత్యక్రియలకి కూడా హాజరు కాలేదు. ఇంతకాలం మోహన్రావుకి బార్లలో కంపెనీ ఇచ్చిన రాజారావు ఇప్పుడు బహుశా తన మిత్రుడి మృతికి సంతాపంగా ఆ బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఏ మధుసాలలో ఉన్నాడో మరి!

**** **** **** **** ****

మోహన్రావు భార్య సరళకి వాళ్ళ ఆఫీస్‌లో కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. అందుకోసం ఆనందరావు స్వయంగా బాధ్యత తీసుకున్నాడు. మోహన్రావు మరణాంతరం అతని భార్యకి చెందవలసిన డబ్బులకి సంబంధించిన వ్యవహారాల్లోనూ తనకు చేతనైన సహాయం చేసి అవి త్వరగా లభించేట్లు చేసాడు. క్రమంగా సరళ భర్త పోయిన దుఃఖం నుండి తేరుకొని ఉద్యోగ బాధతలు నిర్వహిస్తోంది. మధ్యమధ్యలో ఆనందరావు వాళ్ళ సమాచారాలు కనుక్కుంటూనే ఉన్నాడు.

కాలచక్రం ఎవరికోసం ఆగదు. రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. అప్పుడే మోహన్రావు చనిపోయి ఓ సంవత్సరం గడిచిపోయింది.

ఓ ఆదివారం సాయంకాలం భార్య సురేఖతో ఆనందరావు అటువైపు వెళ్తూ ఒకసారి చూసిపోదామని వాళ్ళింటివైపు వెళ్ళాడు. ఆనందరావుని, సురేఖనీ చూస్తూనే సరళ వాళ్ళని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది.

ఇప్పుడు ఆమె కళ్ళలో పూర్వపు దైన్యం లేదు. ఇంతకుముందు కేవలం పసుపుకొమ్ము మాత్రమే ఆమె మెళ్ళో ఉండేది తాళిబొట్టుకు బదులుగా. ఇప్పుడేమో ఆమె కంఠాన్ని పసుపుకొమ్ము స్థానాన్ని ఐదారు తులాల బంగారం గొలుసు ఆక్రమించింది. ఈ ఏడాదిలో కాస్త వళ్ళు కూడా చేసి ఉందామె.

లోపలికి అడుగుపెడుతూనే మారిపోయిన ఆ ఇంటిపరిస్థితులు ఆనందరావుని ఆశ్చర్య చకితుణ్ణి చేసాయి. పూర్వంలా లేదు ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి. చూడచక్కని సోఫాలు, పెద్ద టివి ఇతరత్రా హంగులతో ఇల్లంతా నీట్‌గా సర్ది ఉంది. ఆనందరావు, సురేఖ సోఫాలో కూర్చున్నారు. సురేఖ కూడా ఇల్లంతా వింతగా చూస్తోంది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఉన్న దరిద్ర ఛాయలు ఏమాత్రం కనిపించలేదు వాళ్ళ కంటికి. సరళ కూడా వాళ్ళెదురుగా కూర్చుంది. ఆమె ముఖంలో ఇప్పుడు ఆత్మవిశ్వసం తొణికిసలాడుతోంది. ఆ కళ్ళలో భవిషత్తు పట్ల భయం కూడా లేదు.

"అన్నయ్యగారు నాకు సహాయం చేయకపోయి ఉంటే నేను చాలా అవస్థలపాలై ఉండేదాన్ని. ఆయన పోయిన తర్వాత నాకు త్వరగా ఉద్యోగం వచ్చేట్లు చేసారు. ఆఫీసునుండి రావలసిన బకాయిలు త్వరగా అందేట్లు చేసారు. ఆ వచ్చిన డబ్బులుతో అప్పులన్నీ తీర్చేయగా కొంత మిగిలింది కూడా. మీరు చేసిన సహాయానికి, అందించిన చేయూతకి మీ ఇద్దరికీ నేను చాలా ఋణపడి ఉన్నాను." అందామె సురేఖతో.

ఇంతలో సరళ కూతురు అనిత వచ్చి వాళ్ళిద్దరికీ నమస్కరించి కాఫీ అందించింది.

"దేముడి దయవల్ల ఈ మధ్యనే మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. త్వరలోనే పెళ్ళి చేయాలనుకుంటున్నాం. మీరిద్దరూ తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి." అంది అనితని చూపించి.

"చాలా మంచిది." వాళ్ళ పరిస్థితి మెరుగుపడినందుకు, అమ్మాయకి సంబంధం కుదిరినందుకు సంతోషిస్తూ చెప్పింది సురేఖ.

ఇంతలో వాళ్ళ అబ్బాయి అప్పుడే కాలేజీ నుండి ఇంటికి వచ్చాడు.

"ఇదిగో మా వాడు సురేష్! ఆయన పోయిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలో చేరాడు. ఈ మధ్యే మొదటి సంవంత్సరం పరీక్షలు రాసాడు." అంది సరళ.

సురేష్ ఆనందరావు దంపతులిద్దరికి నమస్కరించి ఇంట్లోకి వెళ్ళాడు.

ఆనందరావుకి, సురేఖకి ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి చక్కగా అర్థమవుతోంది. భర్త మోహన్రావు బతికుండగా ఆమె ఏమేం కోల్పోయిందో ఇప్పుడు అవన్నీ తిరిగి పొందగలిగింది, ఒక్క పసుపు కుంకుమ లు తప్ప. వ్యసనపరుడైన భర్త బతికుండగా సరిగ్గా తిండికి కూడా నోచుకోని మోహన్రావు భార్యా పిల్లలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. విచిత్రం! వాళ్ల ముఖాల్లో ఇదివరకున్న దుఃఖపు ఛాయలు ఇప్పుడు లేవు, వాళ్ళ సమస్యలన్నీ కాలమే తీర్చింది. మోహన్రావు బతికుండగా ఇంట్లోని తనవాళ్ళనందర్నీ కష్టపెట్టి తనొక్కడు మాత్రం సంతోషంగా జీవితాన్ని అనుభవించేవాడు. అయితే అతని మృతి అతని భార్య పిల్లల జీవితాల్లో వెలుగు నింపిందన్నది మాత్రం అక్షర సత్యం. భర్త మరణాంతరం వచ్చిన డబ్బులతో ఆమె అప్పులన్నీ తీర్చివేసింది. కూతురుకి పెళ్ళిచేసి పంపించబోతోంది. కొడుక్కి చదువు చెప్పించగలుగుతోంది. మోహన్రావు బతికి ఉండి ఉంటే ఇవన్నీ సాధ్యమై ఉండేవా అన్నది సందేహమే! మోహన్రావుని హరించిన మృత్యువే వాళ్ళ పాలిట వరమైందేమో? మోహన్రావు మృతి అతని భార్యాబిడ్డలకి తీరని శాపమని తను భావించాడు కానీ అదే వాళ్ళ పాలిట వరమైందేమో?

అక్కడో ఓ గంటసేపు గడిపి తిరిగివచ్చారు ఆనందరావు, సురేఖ.

ఇంటికి తిరిగివస్తున్న ఆనందరావుకి అప్పుడే రాజారావు స్ఫురణకి వచ్చాడు. రాజారావుకి కూడా మోహన్రావులాంటి పరిస్థితి దాపురించదు కదా అన్న ఆలోచన ఆనందరావుని నిలువనియ్యలేదు. 'రాజారావుని కూడా హెచ్చరించాలి త్వరగా ఆ వ్యసనం బారినుండి బయటపడమని. వీలైతే ఒకసారి అతన్ని మోహన్రావు ఇంటికి తీసుకెళ్ళి వాస్తవాన్ని చూపెట్టాలి. అప్పటికైనా మారాలని నిశ్చయించుకుంటే అది అతని అదృష్టం.' అని మనసులో అనుకున్న తర్వాతగాని ఆనందరావు మనసు కుదుటపడలేదు. రాజారావుకి ఏం జరగబోతోందో కాలమే చెప్పాలి.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి