మార్పు తెచ్చిన కరోనా - కర్రా నాగలక్ష్మి

Corona brought about change

ఏప్రిల్ మొదటివారంలో  యాభైయేళ్లుగా కష్టాలలో సుఖాలలో తోడునీడగా వుండి కాలంలో కలసిపోయిన భర్త ఏటివిళ్లు బాగా జరిపి తన సహచరునికి శ్రధ్దాంజలి యివ్వాలని ప్రతీరోజూ ప్రణాళికలు వేసుకొని సింగపూర్ నుంచి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దిగడం వరకు ఒకయెత్తు, ఎయిర్పోర్ట్ నుంచి ఇల్లు చేరడం మరోయెత్తు. 

         ఎయిర్ ఏషియా వారి నియమాలకి లోబడి సామాను సర్దుకోడం, పిండికొద్దీ రొట్టె అనే సామెతని నిజం చేస్తూ ప్రయాణంలో వారు గ్లాసులో నీరుతప్ప యేమీ యివ్వకపోవడంతో ప్రతీరోజూ విసుక్కొంటూ తినే భోజనం విలువ తెలిసింది, ఇంటికి చేరుతూనే యేదైనా తిందామన్న ఆశమీద ఆ టెస్టులు, ఈ టెస్టులు యిక్కడవేచివుండండి అక్కడ వేచి వుండండి, ఈ కాయితం మీద సంతకాలు, ఆ కాయితాలు నింపండి లాంటి కసరత్తులతో సునాయాసంగా ఆరుగంటలకాలాన్ని ఆవిరి చేసిన అధికారుల చేతులలోంచి బయటపడేసరికి ఆకలి నిస్సహాయతగామారి కళ్లల్లో నీరు తిరుగుతూ వుండగా బయట వున్న ఒకటీ అరా టాక్సీలను చూసి బేరమాడడానికి ధైర్యంలేక వారడిగిన రేటు రెండురెట్లని తెలిసినా టాక్సీలో కూలబడ్డాను, నాతోపాటే నా కోడలు శ్రధ్ద కూడా.

             ఇంటికి వెళితే అన్నీ సర్దుకుంటాయని అనుకుని కళ్లు మూసుకున్న నాకు అప్పుడు తెలీదు ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని.

          ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గ్రాండుగా చేద్దామనుకున్న ఏటివిళ్ల పిలుపులు కుదించి ఫామిలీకి మాత్రమే అనే నిర్ణయించుకున్నా.

         ముందుగా ఫుడ్ ఆర్డరు చేసుకొని ఆరునెలలుగా వదిలి పెట్టిన యిల్లు సర్దుకోవాలని నిర్ణయించుకున్నాను.

         కోడలుని రెస్ట్ తీసుకోమని చెప్పాలి పాపం పిల్ల తనతో సమానంగా ఎయిర్ పోర్టంతా పరుగులు పెట్టింది, వైజాగ్ నేను మంచిగా యాభై సంవత్సరాలు గడిపిన ప్రదేశం, అందరికీ తలలో నాలికలా వుండి మంచి పేరు సంపాదించుకున్నాను, నేను ఓ చిటిక వేస్తే వందమంది అలా నిలబడి నాకు సహాయపడతారనే నమ్మకం నాకుంది, అందుకే యీ నేలమీద కాలుపెట్టగానే నాకంత శక్తొచ్చింది.

         వీధి తలుపుతియ్యగానే ధూళిదుమ్ముతో వున్న ఇల్లు నన్ను కంగారు పెట్టలేదు.

        గత ఇరవై యేళ్లగా నాయింట్లో పనిచేసే ఆదెమ్మ ఒక్క ఫోను కాల్ దూరంలో వుందని నాకు తెలుసు, నేను పెదవి విప్పి చెప్పక ముందే అన్ని పనులూ చక్కబెట్టగల సమర్ధురాలు.

        కాని నాకోసం ఒకదానితరువాత ఒక షాక్ లు దాగివున్నాయని నాకేం తెలుసు.

          ముందుగా స్విగ్గి ఏప్ ఓపెన్ చెయ్యగానే ‘ సారి నో సర్వీస్ ‘ అనే మెసేజ్ చదివి ఓకె స్విగ్గి కాకపోతే మరోటి అని మరో ఏప్ ఓపెన్ చేస్తే అదే మసేజ్ , ‘ అత్తయ్యగారూ యిది కరోనా ప్రభావమేమో ‘ అన్న కోడలు మాటతో ఏమో అనుకున్నా.

       సరే మిగులూ తగులూ డబ్బాలలో యేమైనా వున్నాయేమో అని చూస్తే ఓ గ్లాసుడు బియ్యం, గుప్పెడు పప్పు దొరికేయి , ఫరవాలేదు పప్పు బియ్యం రైస్ కుక్కర్లో పడేసి ఏ ఆవకాయతోనో కడుపు నింపుకుంటే రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు గట్టిగా వూపిరి పీల్చుకొని బత్రూము వైపు నడిచేను.

         హాయిగా వేడినీటిస్నానం చేసి.......... , అనుకుంటూ గీజరుస్విచ్ వేసి గదిలో వెలుతురు తగ్గడంతో లైట్ ఆన్ చేసేను వెలగలే ..... , బల్బుపోయిందా అనుకుంటూ ఫేను ఆన్ చేసేను ఊహూ ..... ఫేను తిరగలే ..., పరిస్థితి అర్దమైంది , ఆరునెలలుగా బిల్లుకట్టలేదు , దానికి ప్రతిఫలం కరెంటులేదు. 

          ఒక్కసారి గుండె గుభేలు మంది , వంటయెలా? రైసుకుక్కరు కరెంటు లేకుండా పనిచెయ్యదు, గాస్ వున్నా స్టవ్ రిపేరులోవుంది తెల్లవారితేగాని యేమీ చెయ్యలేని నిస్సహాయతకి ఒక్కసారి కళ్లల్లో నీళ్లు తిరిగేయి.

          ఇరుగు పొరుగుల సహాయం తీసుకోవాలనుకుంటే నేను మునుపటి మనిషినికాదు, దీపాలవేళ నామొహం చూడ్డానికి చాలా మందికి అభ్యంతరం వుండొచ్చు.                 

        మనిషి చంద్రుడిమీద కాలుపెట్టినా మారని మనస్తత్వం మనది, సాంప్రదాయం, నమ్మకం ( మూఢ) అంటూ ఫాలో అయిపోతాం. 

           ఎందుకైనా పనికొస్తాయని పెట్లో పెట్టుకున్న బిస్కెట్లు తిని రేపటికి పరిస్థితి చక్కబడుతుందనే ఆశతో రాత్రి గడిపోయేం.

           తెల్లవారుతూనే ఆ ఆశ అడియాశేనని అర్దమవడానికి నాకెంతో సమయం పట్టలేదు.

         తాగేనీళ్ల దగ్గరనుంచి పక్కవాళ్లమీద ఆధారపడాలని తెలియగానే నేను సగం చచ్చిపోయేను, పక్కవాళ్ల తలుపుకొట్టక తప్పలేదు మూడేళ్లుగా పక్కపక్క ఇళ్లల్లోవున్నవాళ్లం, ఆరునెలల తరువాత కలిసేం, నేను సింగపూర్ వెళ్లేటప్పుడు నాకన్నా యెక్కువ ఆవిడే ఉత్సాహపడింది, అందుకే ఆవిడకి అక్కడనుంచి ముత్యాలహరం తెచ్చేను, ఆపేకట్ తీసుకొని వెళ్లి మరీ తలుపు తట్టేను . ఇవాళ ఆమె ప్రవర్తన జీర్ణించుకోలేక పోయేను, కనీసం నా చేతిలో వున్న గిఫ్ట్ పేక్ కూడా తీసుకోకుండా మొహం మీద తలుపేసింది.

             కోడలు యేదోకిందామీదా పడి కరెంట్ వచ్చేటట్లు చెయ్యగలిగింది కాని నిత్యావసర సరుకులు మాత్రం తెప్పించలేకపోయింది. ఆన్ లైనులో అన్నీ కొనుక్కోవచ్చు అనే నమ్మకానికి చుక్క పడింది. 

             ఆదెమ్మకి ఫోను చేస్తే రాలేనమ్మా అనే మాటతో నా నోట మాట పడిపోయింది. అది చెప్పిన కారణం విన్న తరువాత పక్కింటావిడ ప్రవర్తనకి అర్దం బోధపడింది . అదే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘ కరోనా ‘, పై దేశాలనుంచి వచ్చిన వారివల్ల వ్యాపిస్తోందని, అందుకే తనవారిలాంటివారిని దూరంగా వుంచాలని నిముషనిముషానికి ప్రముఖులు టీవీలో చెప్తున్నారట, హతవిధీ మరిప్పుడు మాగతేంకావాలి ?.

          టీవీలో మేం కూడా ఆ వార్తలని చూసేం, ఆదివారం ‘ జనతా కర్ఫ్యూ ‘ విధించేరు. ఆ రోజే ఓ పదిమంది హెల్త్ వర్కర్లు వచ్చి ఆ టెస్ట్ యీ టెస్టూ అని హడావిడి చేసేరు, విమానాశ్రయంలో టెస్ట్ లు చేసేరన్నా వినలేదు, వీళ్లేకాక వీధివాళ్లంతా గుమిగూడి పోయేరు. ప్రతీవాళ్లూ యేదో హంతకులను చూసినట్లు చూడడం. హెల్త్ వర్కర్లు వెడుతూ వెడుతూ గోడకి పోస్టరు అంటించి పోయేరు, మేం విమానం దిగిన రోజునుంచి మమ్మలని హోం క్వారంటైన్ లో వుంచినట్లు, మా యింటికి ఎవరూ రాకోడదు, మేం ఎవరింటికీ వెళ్లకోడదు అని దాని సారాంశం.

        దాంతో నాలో యెక్కడో వున్న ఆశ కూడా చచ్చిపోయింది.

        అందరిమీదా యేదో తెలీని కసి అనిపించింది. ఇందరు వేడుక చూడ్డానికి తయారవుతున్నారు కాని మగదిక్కు లేక వున్నారు యింట్లో సరుకులు వున్నాయా లేదా? యేవైనా కావాలా ?అని అడిగిన పాపానపోలేదు.

           ఆ తిరనాళ్ల హడావిడి తగ్గేసరికి మద్యాహ్నం మూడయింది.

            నిస్సహాయత, నీరసంతో మగతలో వున్న నాకు కాలింగ్ బెల్ శబ్ధానికి మగతవీడింది, ఈ సమయంలో యెవరబ్బా అనుకుంటూ  వచ్చి వీధి తలుపు తెరచేను.

        ఆంటీ మీరేమీ అనుకోకపోతే , ఈ సామానులు తీసుకోండి, నేను రెండు నెలలకోసం వేయించుకున్నాను, మీకవుసరమేమో అని ......, మీరు కొనుక్కున్నాక తిరిగి యివ్వొచ్చు ..... నసుగుతూన్నట్లుగా అంటున్న యెదురింటమ్మాయిని నమ్మలేనట్లు చూసేను.

           ఆమె యంబిబియెస్ చేస్తోందని తెలుసు, ఆ అమ్మాయి యెప్పుడూ అలసటగా వుండడం వల్లనో లేకపోతే ఆ డాక్టరు చదువులు, శవాలని కోస్తారు, మడి మైల వుండదనో, మరి యెందుకో తనకు ఆమెమీద నెగిటివ్ అభిప్రాయమేర్పడింది, అందుకే ఆమెతో యెప్పుడూ మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు, నా యింట్లో ఫంక్షన్లకి పిలవకపోవడమే కాదు యెదురు పడితే నవ్వాలనే కనీసపు మర్యాదని కూడా పాఠించలేదు.

          అందరూ మాట్లాడ్డానికి కూడా భయపడుతున్న సమయంలో ఆమె అందించిన సహాయం నాలో యేదో స్పందన కలిగించింది.

            ఓ నా మతిమరుపు మండా ఆ అమ్మాయి పేరు చెప్పనేలేదు కదూ ‘ మానస ‘. పన్నెండు గంటలు , పదహారు గంటలు డ్యూటీ చేసి అలసిపోయి వచ్చినా పాలు కూరలు తేవడం మరచిపోవడం లేదు.

         అమ్మయ్య ‘ కరోనా ‘ ని జయించేను అనుకున్నాను, కాని అదికూడా ఆరంభమే అని అంతం కాదని తెలియడానికి యెంతో సమయం పట్టలేదు.

         పెద్దాయన మళ్లా టీవీలో ప్రజలనుద్దేశించి లాక్ డౌన్ ప్రకటించేరు, ఈ సారి 21 రోజులు అన్నారు. 

           అంటే నా భర్త సంవత్సరీకాలు యేమౌతాయి ?.

      మనసంతా దిగులుగా మారింది .

      అంతర్దేశీయ విమానాలు బందు చెయ్యబడతాయనగానే నా కొడుకు సింగపూర్ నుంచి వచ్చీసేడు, వాడొచ్చిన తరువాత మళ్లా  హెల్త్ వర్కర్లు వచ్చి రకరకాల ప్రశ్నలు వేసి మరో పోస్టరు అంటించి వెళ్లేరు. అంతేకాదు మేం ముగ్గురం కూడా దూరం పాఠిస్తూ వుండాలి , ఒకరు తాకిన వస్తువలు మరొకరు తాకకూడదు, మొదటిసారి విన్నప్పుడు యింతేనా అని అనిపించినా క్షణం క్షణం నరకం కనిపించ సాగింది. వాడిన ప్రతీ వస్తువనూ శుభ్రం చేస్తూవుంటే ఒకే యింట్లో వుంటూ ‘ కరోనాదూరం ‘ పాఠించాలంటే యెంత కష్టమో తెలిసి వస్తోంది.

         అప్పుడు నాకో ఉపాయం తట్టింది, హెన్నా పెట్టుకోడానికి తెచ్చుకున్న గ్లౌసులు వాడడం మొదలు పెట్టేం దాంతో సగం పని తగ్గింది అందుకే ఉపాయం లేని వాళ్లని ఊరులోంచి తరిమేయమన్నారు.

             ఇంత మానసిక వొత్తిడిలోనూ ఒకటే ఊరడింపు అదేమిటంటే మేం ముగ్గురం ఒకేచోట వుండడం.

       ఏనాటి బంధం నాకు మానసకు ఆ మాటే అంటే నవ్వి ‘ ఈ జన్మదే ఆంటీ ‘ అనేది.

          అయితే మా మాటలన్నీ ఆమె గుమ్మంలో నుంచి ఆమె నా గుమ్మం లోంచి నేను అంతే. 

          రోజులు గడుస్తున్న కొద్దీ ఏటివిళ్లు పెట్టగలమనే ఆశ క్షీణించింది . లాక్ డౌన్ చాలా సమర్ధవంతంగా పాటిస్తున్నారు . అత్యవసర సేవలు తప్ప అన్నీ బందులోనే వున్నాయి . బందుని విఛ్చిన్నం చేద్దామనుకున్న అల్లరి మూకలు పోలీసుల లాఠీ దెబ్బలు తిని తోక ముడిచేరు. 

           నలుగురినీ పిలువకుండా బ్రాహ్మణులని మాత్రం పిలిచి శ్రార్ధ కర్మలు నిర్వహిద్దామన్నా చేయలేని పరిస్థితి.

      అప్పటికీ ఆశ చావక ఇంటి పురోహితుడికి ఫోను చేస్తే ‘ అమ్మా అంతంత మాత్రంగా వున్న యీ పరిస్థితులలో మీ కోసమో , మీరిచ్చే డబ్బుకోసమో ఆశపడి బయటకి వచ్చి ఆ మహమ్మారికి స్వాగతం పలకలేనమ్మా ‘ అనే సమాధానంతో యేం చెయ్యడానికీ పాలుపోలేదు.

              నా కన్నా వయసులో చిన్నదయినా యెందుకో మానసతో యివన్నీ చెప్పుకోవాలని అనిపించి చిన్నపిల్ల ఆమెకేం తెలుస్తుందని చెప్తున్నావ్ అని మనసు వద్దంటున్నా ఆమెతో నాలోని బాధను చెప్పుకున్నాను.

          చిన్న పిల్లయినా చక్కని పరిష్కారం చూపుతుందని అప్పుడు నేను ఊహించలేదు కూడా.

          నన్ను శాంతం చెప్పనిచ్చి ‘ చూడండాంటీ ఈ శ్రాద్దకర్మలు అన్ని మతాలవారూ, జాతులవారూ నిర్వహిస్తారు, విధివిధానాలలో తేడా వుండొచ్చు, నాకు అర్ధమైనదేమిటంటే ఆరోజున పోయిన వారిని తలచుకొని వారి పేరుమీద అన్నదానం చెయ్యడం, ఇలాంటి పరిస్థితిలో లక్షలమంది రోజు కూలీలు ఉపాధి పోగొట్టుకొని తినడానికి తిండిలేక, పనికోసం బయటకి వెళ్లలేక పస్తులతో దినాలు వెళ్లదీస్తున్నారు ‘ఒక్కమారు సందేహిస్తున్నట్లుగా ఆగిన మానస ‘మీరు అంకుల్ జ్ఞాపకార్ధం బ్రాహ్మణులకే భోజనం పెడదామనుకుంటున్నారు కదా? పెళ్లిళ్లు, శుభకార్యాలూ లేక ఇల్లు దాటే పరిస్థితులు లేక వారి జీవితాలు కూడా రోజుకూలీల పరిస్థితి లానే వుంది. నాకు తెలిసిన ఓసంస్థ అలాంటి పేద బ్రాహ్మణులకు భోజనాలు అందజేస్తోంది, దానికి మీరు మీకు తోచినంత, పదిరూపాయలిస్తే ఒక మనిషికి ఒకపూట భోజనం అందజేసినట్లు, మీ యింట్లో మూడు రోజుల కార్యక్రమం చెయ్యడానికి ఓ పాతికవేలేనా అవుతాయికదా?, అంతా యివ్వకపోయినా అందులో సగం యిచ్చినా యెంతోమంది ఆకలి తీర్చొచ్చు , యేమంటారు ఆంటీ ‘.

         ఎప్పుడు లోపలకి వెళ్లిందో ఆలోచనలలో మునిగి పోయిన నేను గమంచనేలేదు ఓ రెండు కాయితాలు నా చేతిలో పెట్టింది. వాటిలో పేదలకు సహాయమందించే సంస్థలు వారు యేయే ప్రదేశాలలో సేవలందిస్తారో, వారి అకౌంటు వివరాలు వున్నాయి.

            

             ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో కోత అనగానే ప్రజలు పేపర్లు రకరకాలుగా వ్యాక్యానించేరు, మరి వీరికి బ్రతుకు తెరువుకే కోతే పడిందిగా, వీరు యెవరికి చెప్పుకోవాలి ?, వీరికి సంఘాలు లాంటి వేమీలేవే ?, వీరిహక్కుల కోసం యెవరు పోరాడుతారు, మనం పోరాడలేక పోయినా వారి ఆకలి ఒక్కరోజుకైనా తీర్చగలిగితే ...........

           ఎక్కడో సందేహం నేను చేస్తున్న పని నా భర్తకి వున్నతలోకాలనిస్తుందా ?.

            చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీ పాఠాలు గుర్తొచ్చేయి, రాజుల గురించి చదివేటప్పుడు మంచిరాజులు చెడ్డరాజులు అని, మంచిరాజుల జాబితాలో రాజులు అన్నీ మంచిపనులే చేసినట్లు రాయాలి, మంచి పనులంటే చెట్లు నాటించడం, చెరువులు త్రవ్వించడం యిలా అన్నమాట, చెడ్డ రాజులంటే అలాంటివేమీ చెయ్యకపోగా శిస్తులు వసూలు చేసెను, పరమతసహనము లేనివాడు, జిజియా పన్ను విధించెను, ప్రజలను హించెను యిలా గుర్తుంచుకొని పరీక్షలు రాసేదానిని. హిస్టరీలో ఏదో పాసుమర్కుతో గట్టెక్కేను. 

             మంచిని యెప్పుడూ దేవుడు సమర్ధిస్తాడు.

                 చనిపోయిన వారిని తల్చుకొని నలుగురికి భోజనం పెట్టడమే తద్దినం కదా ?, ఏటివిళ్లలో అదనంగా భూదానం , గోదానం , సువర్ణదానం లాంటివి వుంటాయి. ఈ దానాలకి బదులు తాంబూలంలో దక్షిణ  యివ్వడం పరిపాటి, మంత్రాలు, విధులను పక్కన పెడితే ముఖ్య వుద్దేశ్యం కడుపునిండా భోజనం పెట్టడమే కదూ? అదే యిక్కడ కొన్ని వందలమందికి భోజనం అందిస్తున్నప్పుడు తప్పకండా ఆ లోకంలో వున్నవాళ్లు మెచ్చుకుంటారనే నమ్మకం నాలో కలిగింది.

                కొడుకూ కోడలుతో చర్చించేక ఓ నిర్ణయం తీసుకున్నాను. తిరిగి మా గురువు గారికి ఫోను చేసి నా నిర్ణయం చెప్పేను , అలాగే నాకు తెలిసీ యీ వృత్తి చేస్తున్న పురోహితుల అకౌంటు నెంబర్లు కూడా వారి దగ్గర తీసుకొని యేదో ఉడుతా భక్తిగా కొంత సొమ్ము పంపుతాను మా వారి పేరు మీదుగా అని చెప్పేను. ఆ మాటతో అతని గొంతులో తొంగి చూసిన ఆనందం మాటలలో చెప్పగలనా ?, ఆ ఆనందంతో అతను దీవించిన దీవనలు యెంత విలువైనవి.

          నా భర్త ఏటివిళ్లకోసం నేను వుంచిన సొమ్ముతో ఎంతమంది పేదలకు కడుపునిండా భోజనం పెట్టగలనో తలచు కోగానే నేను యింతమందికి భోజనం పెడుతున్నానా? అని ఆశ్చర్యం కలిగింది, ఆనందం కూడా వేసింది.

    

          ‘జనతా కర్ఫ్యా‘ నాడు అందరూ చప్పట్లు కొట్టేరని కొట్టేను, కాని యివాళ మనస్పూర్తిగా మాలో స్పందన కలుగజేసినందుకు మానసకు, మానస నాకు దగ్గర అవడానికి కారణమయిన వారందరకీ చప్పట్లు కొట్టేను, చుట్టుపక్కల వారు చేతులకోసం నేను చేస్తున్న వ్యాయామం అని అనికున్నా నేను ఖాతరు చెయ్యలేదు.

మరిన్ని కథలు

thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి
Millions ... letters
లక్షలు... అక్షరాలు
- మీగడ.వీరభద్రస్వామి
new life
నవజీవనం
- బుద్ధవరవు కామేశ్వరరావు