వివేకవర్ధనుడి దేశభక్తి - పద్మావతి దివాకర్ల

The patriotism of the sage

అంగదేశ మహారాజైన ప్రచండసేనుడు చాలా కౄరుడు. ప్రజలపై అధిక పన్నులు వేసి ప్రజలను పీడించేవాడు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఎల్లప్పుడూ విందులూ, వినోదాలలో మునిగితేలుతూ ఉండేవాడు. తన రాజ్య ప్రజల కష్టసుఖాలను అసలు పట్టించుకునేవాడు కాదు. పరిపాలనా బాధ్యతంతా తన మంత్రులమీదే వదిలేసి తను మాత్రం నిత్యం విలాసవంతమైన జీవితం గడుపుతూ నృత్యప్రదర్శనలు తిలకిస్తూ రోజులు గడుపుతూ ఉండేవాడు. మంత్రులు కూడా అతని బాటలోనే నడిచి అవినీతిపరులై ప్రజలను పీడిస్తూ ఉండేవారు. ప్రజలు ఈతి బాధలతో ఆక్రోశిస్తున్నా తమని పట్టించుకునే నాధుడు లేక అల్లాడిపోయేవారు. పంటలు సరిగ్గా పండకపోయినా రైతులకు పన్నులు చెల్లించడం తప్పడంలేదు. అలాగే వ్యాపారస్థులు కూడా లాభలతో నిమిత్తం లేకుండా పన్నులు చెల్లించవలసి వస్తోంది. పన్నుల చెల్లింపులో జాప్యం జరిగితే మాత్రం దండన చాలా తీవ్రంగా ఉండేది. ఎవరైనా ఎదురుచెప్తే కఠినంగా శిక్షించేవాడు. కల్తీచేసే వ్యాపారులు మాత్రం అవినీతిపరులైన రాజోద్యోగుల అండతో రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ ప్రజల పరిస్థితి దిగజారిపోయి రాజ్యంలో అరాజకత్వం ప్రబలసాగింది. రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు విచ్చలవిడిగా సాగి సాధారణ ప్రజల జీవనం కంటకప్రాయంగా మారింది. ప్రజలు మహారాజు పరిపాలనపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రచండసేనుడి పరిపాలనపై అంత ప్రజాగ్రహం ఉన్నా అవినీతిపరులైన మంత్రులు ఆ సంగతి అతనికి చేరనివ్వలేదు. పైగా తమ పబ్బం గడుపుకునేందుకు పరిపాలన చాలా చక్కగా సాగుతోందని చెప్పసాగారు.

రాజోద్యోగులందరూ అవినీతిపరులైనా సేనాధిపతిగా ఉన్న వివేకవర్ధనుడు మాత్రం నిజయితీపరుడు, దేశభక్తిగలవాడు. మహా శూరుడు కూడా! అల్లకల్లోలమవుతున్న రాజ్య పరిస్థితులు అతన్ని కలవరపెట్టాయి. ప్రజాగ్రహం వల్ల మహారాజుపై తిరుగుబాటుకూడా జరగవచ్చని అభిప్రాయపడి ఆ విషయమై అతనికి తెలియజేయాలనుకున్నాడు. రాజ్యంలో ప్రబలుతున్న అరాజకపరిస్థితిని ఒకరోజు మహారాజు ప్రచండసేనుడికి విన్నవించాడు.

"మహారాజా! ప్రస్తుతం రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు ఏమీ బాగాలేవు. ప్రజలు చాలా ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రజాగ్రహంవల్ల తిరుబాటు చేసే ప్రమాదం కూడ పొంచిఉంది. మహారాజు పరిపాలన స్వయంగా తమ చేతిలోకి తీసుకుంటే త్వరలో పరిస్థితులు చక్కబడవచ్చు." అన్నాడు.

మంత్రులందరూ తన పరిపాలనని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటే సేనాధిపతి వివేకవర్ధనుడు మాత్రం ఇలా అనేసరికి ప్రచండసేనుడికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది.

"ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేంతవరకూ మీరేం చేస్తున్నారు? ఒకవేళ ప్రజలు తిరుగుబాటు చేస్తే, తిరుగుబాటు అణచడం మీ బాధ్యత. రాజద్రోహులకు మరణదండన ఉంటుందని మరువకండి. నిర్దాక్షిణ్యంగా తిరుగుబాటుని అణచివేయండి. పరిపాలన విషయంలో నాకు తగిన సలహాలివ్వడానికి మంత్రులున్నారు. మీ సలహాలు అనవసరం. సేనాధిపతిగా మీ బాధ్యత సరిగ్గా నెరవేర్చితే చాలు. " ఆగ్రహంగా అన్నాడు.

మహారాజు అలా మాట్లాడేసరికి ఏం అనాలో తోచలేదు వివేకవర్ధనుడికి.

అంగరాజ్యం పొరుగునే ఉన్న కళింగదేశ మహారాజు విక్రమవర్మ మంచి పరిపాలనాదక్ష్యుడు. అతని పరిపాలనలో కళింగరాజ్యం సిరిసంపదలతో సుభిక్షంగా వర్ధిల్లుతోంది. ప్రజల సంక్షేమమే పరమావధిగా విక్రమవర్మ పరిపాలన కొనసాగుతోంది. కళింగరాజ్య ప్రజలందరూ విక్రమవర్మను తమ ప్రత్యక్షదైవంగా భావిస్తున్నారు.

విక్రమవర్మ స్వతహాగా శాంతి కాముకుడైనప్పటికీ అతని చూపు అంగరాజ్యంపై పడింది. అక్కడున్న అరాజక పరిస్థితులవల్ల అంగరాజ్యాన్ని సులభంగా జయించవచ్చని అభిప్రాయం అతనికి కలిగింది. అంగరాజ్యంలో అపారమైన సైన్యం ఉన్నప్పటికీ తన విజయమే తధ్యమని తోచిందతనికి. అంతేకాక అంగరాజ్యం జయించడంవల్ల అక్కడి ప్రజల దుస్థితి తొలగించవచ్చన్న ఆలోచన అతనికి కలిగింది. అందుకే యుద్ధం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయ సంకల్పించాడు విక్రమవర్మ. విక్రమవర్మ ఆదేశానుసారం యుద్ధానికి సర్వం సిద్ధం అయింది. విక్రమవర్మ తన సేనతో అంగరాజ్యం సరిహద్దులో విడిదిచేసి ప్రచండవర్మకి తను యుద్ధానికి వచ్చినట్లు వర్తమానం పంపాడు.

కళింగరాజు యుద్ధానికి తరలివచ్చాడన్న వార్త విన్నా ప్రచండవర్మ చలించలేదు. తనవద్ద ఉన్న మంత్రుల ప్రభావం నుండి పూర్తిగా బయటపడలేదు అతను. వాళ్ళు చెప్పినదాన్నిబట్టి తన సేన అపారమైనదని, కళింగరాజుని సులభంగా ఓడించవచ్చని నమ్మాడు. నిజంగానే అంగదేశానికి అపారమైన సైన్యం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాళ్ళుకూడా ప్రచండవర్మ పరిపాలనపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. చాలా రోజులనుండి సరిగ్గా జీతభత్యాలు అందక వారి మనోనిబ్బరం కూడా బాగా దెబ్బతింది.

వెంటనే సైన్యంతో వెళ్ళి కళింగసైన్యాన్ని ఎదుర్కొని, యుద్ధంలో ఓడించి, విక్రమవర్మని బంధించి తెమ్మని వివేకవర్ధనుడ్ని ఆదేశించాడు ప్రచండవర్మ. మహారాజు ఆఙానుసారం సైన్యాన్ని సమావేశపరచి యుద్ధరంగానికి బయలుదేరి వెళ్ళాడు వివేకవర్ధనుడు. సాయంకాలానికల్లా యుద్ధరంగానికి మరోవైపు తమ రాజ్యం సరిహద్దులో తమ సైన్యాన్ని మోహరించాడు. తమ సైన్యంలో ఉన్న అసంతృప్తిని అప్పటికే గుర్తించాడు వివేకవర్ధనుడు. యుద్ధం మధ్యలోనే తన సైన్యంలో తిరుగుబాటుకూడా జరగవచ్చేమోనని అనుమానం వచ్చింది.

అటువైపు ఉన్న కళింగరాజు సైన్యం వైపు చూసాడొకసారి. ఆత్మవిశ్వాసంతో కదంతొక్కుతున్న కళింగసైన్యాన్ని ఆత్మ స్తైర్యంలోపించి డీలాపడిన తన సైన్యంతో బేరీజు వేసుకున్నాడు.

కొద్దిసేపు ఆలోచించిన మీదట వివేకవర్ధనుడు రాత్రవగానే ఇద్దరు సైనికులని వెంటతీసుకొని కళింగరాజు గుడారం వైపు కదిలాడు. వీళ్ళు రావడం దూరం నుండి చూస్తూనే కళింగసైనికులు అప్రమత్తమైనారు. "శత్రువులు, శత్రువులు!!" అని వాళ్ళలో కలకలం రేగింది. వెంటనే తమ రాజు విక్రమవర్మకు తెలిపారు. అంగరాజు సేనాధిపతి తననెందుకో కలసుకోవడానికి వస్తున్నాడని గ్రహించిన విక్రమవర్మ వాళ్ళని అనుమతించమని తన సైనికులకు తెలిపాడు.

వివేకవర్ధనుడివద్ద, వెంటవచ్చిన వారివద్ద ఆయుధాలేమీ లేవని రూఢి పర్చుకొని అతన్ని తమ మహారాజు విక్రమవర్మ వద్ద ప్రవేశపెట్టారు సైనికులు.

విక్రమవర్మని చూస్తూనే అతనికి ప్రణామములు చేస్తూ, "కళింగ మహారాజుకి నా నమస్సులు! మా దేశానికున్న అపార సైన్యంతో మేము సులభంగా గెలుపొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా శ్రేయస్సుదృష్ట్యా మేము లొంగిపోవాలని నిర్ణయించుకున్నాం. మా రాజ్యంలో నెలకొన్న పరిస్థితులదృష్ట్యా అనవసర ప్రాణనష్టం కలిగించటం నాకు మనస్కరించడంలేదు. రక్తపాతం లేకుండా మా రాజ్యాన్ని వశపర్చుకొని తమ రాజ్యంలోలాగే జనరంజకంగా పరిపాలిస్తే మా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు.” అని తన మదిలోని ఆలోచన తెలియపర్చాడు." అన్నాడు వినయంగా.

ముందు వివేకవర్ధనుడి ప్రస్తావనకి ఆశ్చర్యపోయినా ఆ తర్వాత సునిశితంగా అలోచిస్తే అతని అంతరంగం అర్ధమైంది.

వివేకవర్ధనుడి మాటలు విని రక్తపాతం లేకుండా అంగరాజ్యం కైవసం చేసుకొని ప్రజాకంటకులైన ప్రచండవర్మనూ, అతని మంత్రులనూ బంధించి కారాగారంలో వేసాడు విక్రమవర్మ. ఆ తర్వాత వివేకవర్ధనుడికి అంగదేశ రాజుగా పట్టాభిషేకం చేయడానికి సంకల్పించాడు విక్రమవర్మ. అంతేకాక, అతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించడానికి సంకల్పించాడు కూడా.

ఈ విషయంవిన్న విక్రమవర్మ మంత్రి వినయుడు అందుకు అభ్యంతరం తెలుపుతూ, "మహారాజా! వివేకవర్ధనుడు ఒక దేశద్రోహి. ప్రచండవర్మ వద్ద సేనాధిపతిగా ఉంటూకూడా మనం విజయం సాధించడానికి సహాయం చేసాడు. తద్వారా దేశద్రోహం తలపెట్టాడు. ఇకముందు మనకికూడా ద్రోహం తలపెట్టడని నమ్మకం ఏమిటి? అందుకే ఆ దేశద్రోహికి అంగదేశానికి రాజునిచేసి సత్కరించక మరణదండన విధించడమే సమంజసంగా ఉంటుంది." అన్నాడు.

అందుకు విక్రమవర్మ చిన్నగా మందహాసం చేసి, "వివేకవర్ధనుడు దేశద్రోహి అనడానికి తగిన ఆధారాలు లేవు. అతను కచ్చితంగా దేశభక్తుడే. అతను తలచుకుంటే మన సైన్యాన్ని జయించగలిగి ఉండేవాడు. దేశభక్తుడు కాబట్టే తన దేశంలో జరుగుతున్న అరాచకాలకి బాగా చలించి ఆ నిర్ణయం తీసుకున్నాడు. కళింగదేశం పరిపాలనలో ఉంటే తన దేశం సుభిక్షంగా, శాంతితో వర్ధిల్లగలదని ఆశించాడు. లోకకంటుకుడైన ప్రచండవర్మ పరిపాలన అంతమొందిస్తేనే అతని ఆశయం సిద్ధిస్తుంది. అందుకే అతను మనకి సహకరించాడు. అతను దేశక్షేమాన్ని, ప్రజాక్షేమాన్ని కోరి మనకి సహకరించాడు. అనవసర రక్తపాతాన్ని కూడా నిరోధించగలిగాడు. అందువల్ల అతను దేశద్రోహి ఎంతమాత్రమూ కాదు. వివేకవర్ధనుడి దేశభక్తి చాలా గొప్పదని గ్రహించాను. అందుకే అతని దేశభక్తికి కానుకగా అతన్నే అంగదేశం రాజుగా ప్రతిష్ఠిస్తే రాజ్యాన్ని తన ఆశయాలకి అనుగుణంగా మలచుకుంటాడని నా ఆలోచన. అంగరాజ్యంకూడా మన కళింగరాజ్యంలానే సుభిక్షంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష." అన్నాడు.

విక్రమవర్మ తీసుకున్న వివేకంతో కూడిన నిర్ణయాన్ని హర్షించాడు వినయుడు.

వివేకవర్ధనుడు అంగదేశ రాజ్యభారం చేతిలోకి తీసుకోగానే అనేక సంస్కరణలు చేపట్టాడు. అధికపన్నులు రద్దుచేసాడు. ప్రజల సంక్షేమంకోసం అనేక నూతన పథకాలు ప్రవేశపెట్టాడు. త్వరలోనే అంగదేశం అభివృద్ధిబాటపై పయనించింది. ప్రజలంతా అతని పరిపాలనలో సుఖసంతోషాలతో జీవించారు.

కొన్నాళ్ళ తర్వాత కళింగ మహారాజు విక్రమవర్మ తన కుమార్తె రేణుకాదేవిని వివేకవర్ధనుడికిచ్చి వివాహం జరిపించాడు. దాంతో ఇరుదేశాలమధ్య మైత్రి మరింత బలపడింది.

మరిన్ని కథలు

* Experience *
*అనుభవం*
- భాగవతుల భారతి
Aunt
అత్తమ్మ
- గొర్తి.వాణిశ్రీనివాస్
Picinari
పిసినారి
- డి వి డి ప్రసాద్
Inhuman
అమానుషం
- బుద్ధవరవు కామేశ్వరరావు
Improper donation
అపాత్ర దానం
- పద్మావతి దివాకర్ల
Ruby in clay
మట్టిలో మాణిక్యం
- డాక్టర్. షహనాజ్ బతుల్
మహత్కార్యం
మహత్కార్యం
- పద్మావతి దివాకర్ల
Teaching (children's story)
ఉపదేశం (బాలల కథ)
- డి వి డి ప్రసాద్