సోమరి (బాలల కథ) - బొందల నాగేశ్వరరావు

Lazy (Children's Story)

సాధువు ఒకరు వూరికి దూరాన వున్న నది ఒడ్డున పర్ణశాలను నిర్మించుకొని శిష్యులతో జీవిస్తున్నాడు.ఆ వూరే కాకుండ చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సైతం ఆయన వద్దకొచ్చి వాళ్ళకష్టాలను, బాధలను చెప్పుకొని వాటి నివృత్తికి మార్గాలను తెలుసుకొని అందుకు తగ్గట్టు నడచుకొంటూ సుఖంగా బ్రతుకుతున్నారు. ఆ సంగతి ఆర్థిక ఇబ్బందులు,కష్టాలతో సతమతమౌతున్న సోమయ్య తెలుసుకొని తనూ సాధువుకు తన సమస్యలను చెప్పుకొని ఉపశమనం పొందాలని ఆయన వద్దకు వెళ్ళాడు. సోమయ్య చెప్పినదంతా విన్న సాధువు అతని వాలకాన్ని చూసి ఇతను పనీ పాటకు వెళ్ళకుండా బాగా తింటూ వుబుసుకుపోని మాటలతో సోమరి తనంగా వూర్లు పట్టుకు తిరిగేవాడని పసికట్టాడు. అందుకే అతనికో గుణపాఠం నేర్పాలన్న నిర్ణయానికొచ్చి "సోమయ్యా!నీకున్న కష్టాలు,ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు విముక్తి పొందాలంటే ఒక్కొక్క సమస్యను ఒక్కో కాగితం మీద రాసుకొని అన్ని కాగితాలను ఓ తెల్ల గుడ్డలో మూటకట్టుకొని రాబోయే శుక్రవారం నాడు మళ్ళీ నా దగ్గరకు రా! అప్పుడు నేను వాటన్నిటికి నివృత్తి మార్గాన్ని చెపుతాను"అని చెప్పి పంపించేశాడు సాధువు. శుక్రవారం రానేవచ్చింది.సాధువు చెప్పినట్టు సోమయ్య తనకున్నసమస్యలను, ఒక్కో సమస్యను ఒక్కో కాగితంలో దాదాపు ముఫ్ఫై కాగితాలమీద రాసుకొని అన్నిటిని ఓ తెల్ల గుడ్డలో మూట కట్టుకొని అందరికన్నాముందే వెళ్ళి సాధువుకు భవ్యంగా నమస్కరించి నిలబడ్డాడు. సాధువు "భలే!చెప్పినట్టే వచ్చావు.నీ వద్ద వున్నఆ సమస్యల మూటను తీసుకొని అదిగో...ఆ కనబడుతున్న గదిలోకి వెళ్ళు.అక్కడ నీకులాగే బోలెడు సమస్యలు వున్న ఎంతో మంది మూటలు ఓ పెద్ద పెట్టెలో వున్నై.నీ ఈ సమస్యల మూటను అక్కడుంచి దీనికన్నా తక్కువ సమస్యలున్నచిన్న మూట వుంటే తెచ్చుకో.వాటిని చాకచక్యంగా, సమర్థవంతంగా అధిగమిస్తూ ముందుకు సాగుపో!అదే నీకు నివృత్తి మార్గం.వెళ్ళు" అంటూ గదిలోకి పంపాడు. ఎంతో సంతోషంగా గదిలోకి వెళ్ళిన సోమయ్య గంట తరువాత సాధువు వద్దకు తిరిగొచ్చి మౌనంగా నిలబడ్డాడు. "ఏమిటి తక్కువ సమస్యలున్నచిన్నమూటను తెచ్చుకున్నావా?" అడిగాడు సాధువు. "లేదు స్వామీ!నా వద్ద వున్నమూటకన్నా తక్కువ సమస్యలతో వుండే చిన్న మూటకోసం పెట్టె మొత్తం వెతికాను.అందులోని అన్నిమూటలు నా మూటకన్నా పెద్దవే!అంటే అందరూ నాకన్నాఎక్కువ సమస్యలతో సతమతమౌతున్నారని గ్రహించి వచ్చేశాను"అన్నాడు సోమయ్య. సాధువు నవ్వి "నువ్వంటుంది నిజం సోమయ్యా!తతిమ్మా వాళ్ళతో పోల్చుకుంటే నీకున్న సమస్యలు చాలా తక్కువ. వాటిని తెలివితో సమర్థవంతంగా చాకశక్యంగా పరిష్కరించుకొని ఆర్థికంగా పుంజుకోవాలి.ఆర్థికంగా పుంజుకోవాలంటే నువ్వు నీలోని సోమరిని బయటికి పంపించేసి కష్టించటానికి అలవాటు పడాలి "అన్నాడు. "ఎలా స్వామీ!నేను సోమరినని మీరెలా కనుగొన్నారు?" ప్రశ్నించాడు సోమయ్య "గతవారం నువ్వు వచ్చినప్పుడే నీ వాలకాన్ని బట్టి నువ్వోపరమ సోమరివని గమనించాను.తల్లితండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిని కరగదీసుకొంటూ,వచ్చి పోయేవాళ్ళతో సొల్లుకబుర్లు చెప్పుకొంటూ కాలాన్ని వెళ్ళబుచ్చేవాడవని గ్రహించాను.అందుకే నువ్వు అప్పుల పాలై అలవిగాని ఆర్థిక ఇబ్బందులతో నా వద్దకొచ్చావు.ఇందుకు ఒక్కటే మార్గం.నువ్వు కష్టించి చెమటోడ్చి సంపాదించుకోవాలి. ఆ డబ్బుతో నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. అంతేకాని నాలాంటి సాధువుల ద్వారా నువ్వాశిస్తున్నదేదో జరిగిపోయి సులువుగా బ్రతకొచ్చునని ప్రయత్నించకూడదు.వెళ్ళు! రేపటినుంచి ఏదేని పనిచేసి సంపాయించుకొని కుటుంబాన్ని పోషించుకో. ఆ వచ్చిన దానిలోనే కొంత మొత్తాన్ని అప్పుల వాళ్ళకిచ్చి నీ అప్పులను కూడా తీర్చుకో!"అనిచెప్పాడు. తనలోని లోపాన్ని తెలుసుకున్న సోమయ్య "అలాగే స్వామీ!"అంటూ తన సమస్యల మూటను అక్కడే కాలుతున్నపొయ్యిలో పడేసి ఇంటి ముఖం పట్టాడు.

మరిన్ని కథలు

Nannu nadipinche uttaram
నన్ను నడిపించే ఉత్తరం
- రాము కోలా.దెందుకూరు.
Anubhavam
అనుభవం
- తాత మోహనకృష్ణ
Gummam bayata cheppulu
గుమ్మం బయట చెప్పులు
- కొడాలి సీతారామా రావు
Maal
మాల్
- తడకమళ్ళ మురళీధర్
Nachiketuni katha
నచికేతుని కథ
- హేమావతి బొబ్బు