వ్యామోహం - పద్మావతి దివాకర్ల

Craze

తాను సాధువునని, సర్వసంగ పరిత్యాగినని చెప్పుకునే విజయానందస్వామి దేశసంచారం చేస్తూ ఒకరోజు బ్రహ్మపురం అనే గ్రామం చేరాడు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగల బ్రహ్మపురంలో దాదాపు అందరూ సంపన్న రైతులే ఉన్నారు. అక్కడివాళ్ళు అందరూ ధార్మిక చింతన గలవాళ్ళు. అతిథుల్ని, సాధు సన్యాసుల్నీ సేవించడంలోనూ వాళ్ళకెవరూ సాటి రారు.

తమ ఊరికి అలాంటి సాధువు రాక తమ అదృష్టంగా భావించిన ఆ గ్రామ ప్రజలు చాలా ఆనందించి అతనికి, శివాలయం సమీపంలో ఒక చిన్న కుటీరంలో తగిన వసతి సదుపాయాలు సమకూర్చారు. ప్రతీరోజూ సాయంకాలం విజయానందస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువుతీరి అక్కడకి వచ్చినవారందరికీ తన ప్రవచనాలు, ఉపదేశాలు వినిపించసాగాడు. భక్తుల సందేహాలకు సమాధానాలు ఇస్తూండేవాడు. గ్రామస్థులు తమ సంతోషంకొలదీ అతనికి కానుకలు సమర్పించేవారు. ఆ ఊరి జనమందరూ పెందరాడే తమతమ పనులు ముగించుకొని విజయానందస్వామి చెప్పే ఉపన్యాసాలు వినడానికి అక్కడకి చేరేవారు.

అప్పటికే వారం రోజులైంది విజయానందస్వామి తన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ. స్వర్గ, నరకాల గురించి, పాపపుణ్యాల ఫలం గురించి, ఇహపరాల గురించి అతను తన ఉపన్యాసం ఇస్తూంటే ఆ గ్రామ ప్రజలు శ్రద్ధగా వినేవాళ్ళు.

ఆ రోజు విజయానందస్వామి ప్రసంగం అత్యాశ వల్ల జరిగే అనర్థాలు, విషయ వాంఛల పట్ల వ్యామోహం తగ్గించుకోవలసిన ఆవశ్యకత గురించి కొనసాగుతోంది.

అతను ప్రసంగిస్తూ, "ఈ జీవితం క్షణభంగురం! మనం పుట్టినప్పుడు ఈ లోకానికి ఏమీ తేలేదు, అలానే ఈ లోకం వదిలిపెట్టేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోజాలం. ఇది అందరికీ తెలిసినదే అయినా అందరూ ధనంపైన వ్యామోహం పెంచుకుంటారు. సంపద వెనుకేసుకోవడంలో వెనుకంజ వేయరు. విషయవాంఛలపట్ల ఆశక్తి పెంచుకుంటారు. మానవునికి అత్యాశ తగదు. మనం దాచుకున్న ధనం, వస్తువాహన, కనకాదులు మనవెంట పరలోకంలోకి ప్రవేశించలేవు. మనం సంపాదించే పుణ్యమే మనని కాపాడుతుందిగానీ ఈ ధనం మనకేమాత్రం ఉపయోగపడదని తెలుసుకోలేరు. అందువలన మనం ధనం మరియు ఇతర ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహం త్యజించాలి." అని అన్నాడు.

అక్కడ ఉన్న భక్తులందరూ శ్రద్ధగా వింటూ తలలు ఊపుతున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ కూర్చున్న వాళ్ళలో హఠాత్తుగా కలకలం రేగింది. చూసేసరికి సాధువు విజయానందస్వామి కోసం ఏర్పాటైన కుటీరం ఏ దీపశిఖనుండి నిప్పురవ్వపడటం వలనోగానీ అగ్నికి ఆహుతి అవడం కనిపించింది.

వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు మంటలు ఆర్పడానికి ప్రయత్నించసాగారు. పక్కనే ఉన్న బావి నుండి కొంతమంది నీళ్ళు తోడుతుంటే, కొంతమంది ఆ నీళ్ళు మంటలపై పోసి నిప్పు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. తను వసతి ఉంటున్న కుటీరం అగ్నికి దగ్ధం అవడం చూస్తూనే విజయానందస్వామి పరుగుపరుగున కుటీరం వద్దకు చేరుకున్నాడు. అగ్నికీలల మధ్య చిక్కుకున్న కుటీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించసాగాడు. అగ్ని ప్రమాద తీవ్రత చూసిన గ్రామప్రజలు అతన్ని లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు.

"స్వామీ! మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. తమరు దూరంగా ఉండండి." అన్నడొక భక్తుడు.

"అయ్యో!... నా ధోవతులు, బట్టలు, నా వస్తువులు, ఇంతకాలం నేను దాచుకున్న నా ధనం అంతా ఆ కుటీరంలోనే ఉన్నాయి. మొత్తం అగ్నికి ఆహుతైపోతాయి. ఎవరైనా వాటిని సురక్షితంగా తీసుకురండి." అని ఆక్రోశించాడు. అప్పుడు అందరూ విజయానందస్వామివైపు విచిత్రంగా చూసారు. క్షణం క్రితం జీవితం క్షణభంగురమని, ధనంపై వ్యామోహం పెంచుకోవద్దన్న స్వామేనా ఇలా ప్రవర్తిస్తోంది అని విస్మయం చెందారందరూ. ఆ అగ్నిశిఖలనుండి అతని వస్తువులను తీసుకురావడం అసంభవం అని తెలిసినా వాటికోసం అతను తాపత్రయం చెందడం ఆ భక్తులకి ఆశ్చర్యమనిపించింది.

అందరూ కలిసి కష్టపడి మంటలు ఆర్పారు కానీ, ఆ కుటీరంలో ఉన్న విజయానందస్వామి వస్తువులన్నీ కూడా అప్పటికే అగ్నికి ఆహుతైయ్యాయి. అది చూసి విచారగ్రస్తుడైన విజయానందస్వామిని తన ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు ఆశ్రయం ఇచ్చాడు ఆ ఊరి గ్రామాధికారైన రామన్న.

రెండురోజుల్లో ఆ గ్రామంలోని యువకులందరూ కలిసి ఆ కుటీరాన్ని పునర్నిర్మించారు. ఊరివారందరూ కలిసి చందాలు వేసుకొని విజయానందస్వామి పోగొట్టుకున్న వస్తువులు కొని ఇచ్చి, కావలసిన ధన సహాయం కూడా చేసారు. విజయానందస్వామి మళ్ళీ ఆ కుటీరంకి చేరుకున్నాడు. ఆ రోజు సాయంకాలం యధాప్రకారం శివాలయ ప్రాంగణంలో తన ప్రవచనాలు గ్రామస్థులకి వినిపించడానికి కొలువయ్యాడతను. అయితే విచిత్రంగా ఆ రోజు నుండి అతని ప్రవచనాలు వినడానికి ఊరివాళ్ళెవరూ పెద్దగా రాలేదు. మరో రెండురోజులు చూసినా అదే పరిస్థితి.

ఇంతకుముందు తన ప్రవచనాలు, ఉపదేశాలు వినడానికి తండోపతండాలగా వచ్చిన ఆ ఊరివాళ్ళు ఇప్పుడెందుకు రావడంలేదో ఊహించగలిగాడు విజయానందస్వామి. తన ఉపదేశాలకి, ప్రవర్తనకీ పొంతన లేకపోవడమే అందుకు కారణమని సులభంగానే గ్రహించాడు అతను. తనకక్కడ ఇక గౌరవం లభించదని తెలిసిన విజయానందస్వామి ఆ మరుసటిరోజే ఎవ్వరికీ చెప్పకుండా ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.

మరిన్ని కథలు

* Experience *
*అనుభవం*
- భాగవతుల భారతి
Aunt
అత్తమ్మ
- గొర్తి.వాణిశ్రీనివాస్
Picinari
పిసినారి
- డి వి డి ప్రసాద్
Inhuman
అమానుషం
- బుద్ధవరవు కామేశ్వరరావు
Improper donation
అపాత్ర దానం
- పద్మావతి దివాకర్ల
Ruby in clay
మట్టిలో మాణిక్యం
- డాక్టర్. షహనాజ్ బతుల్
మహత్కార్యం
మహత్కార్యం
- పద్మావతి దివాకర్ల
Teaching (children's story)
ఉపదేశం (బాలల కథ)
- డి వి డి ప్రసాద్