పలుచనైన పచ్చదనం - పి.వి. ప్రభాకర మూర్తి

Thin greenery

అది ఒక అడవి. మానవుడి కన్ను పడని కారడవి. పచ్చదనం అక్కడ విస్తారంగా పరచుకుంది. అన్ని అడవి మృగాలకి ఆ అడవి ఆలవాలం. భయం లేకుండా అన్నీ మృగాలు విచ్చలవిడిగా తిరిగే కాన అది. ఆకలి వేసినప్పుడే వేటాడే జంతువులు అనేకం ఉన్న అడవి. ఒకదాన్ని ఒకటి ప్రేమించుకోవడం తప్ప, విచ్చలవిడిగా చంపుకోవడం వాటికి తెలియదు. చెట్లు రొమ్ము విరుచుకుని విస్తారంగా పెరిగే ఆడవది.

అడవికి రాజు సింహం. అన్నీ జంతువులకి చిరునవ్వుతో పలకరిస్తూ పెద్ద బండమీద కూర్చుంది. కొంతసేపైన తరువాత భారంగా ఊపిరిపీల్చి మాట్లాడటం మొదలుపెట్టింది. “ మిత్రులారా! తోటి జంతువులకు నమస్కారాలు! నిన్న రాత్రి మా తాత కలలోకొచ్చి, చాలా విషయాలు మాట్లాడాడు. ముఖ్యంగా మనుషుల గురించి చాలా చెప్పాడు. మా తాత చెప్పిన ఒక్క మాటను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. “మీరు మనుషులను నమ్మవద్ధు” అని చెప్పి మాయమైపోయాడు. కల చెదిరిపోయింది. అందుచేత ఈ రోజు నుండి మనుషులను అడవిలోనికి రానీయకండి. వారి మాయమాటలు నమ్మకండి “ అంటూ పెద్దగా ఘాండ్రించి తోక ఊపుకుంటూ వెళ్లిపోయింది.

హెలికాఫ్టర్లో వెడుతున్న నాశనం అనే మనిషి పచ్చని అడవినిచూసి వెర్రెత్తిపోయి శ్రమకోర్చి అడవిలోకి జొరబడ్డాడు. వాడితోపాటు తుపాకీని తీసుకెళ్ళాడు. మెచ్చిన వాటిని, మెచ్చని వాటిని, కాల్చిపారేశాడు. పులి తోలు తీసి బట్టలు కుట్టించుకున్నాడు, గోడలకు తగిలించుకున్నాడు. గోళ్ళను ఊడపెరికి పులిగోరు పతకాలు మెడలో వేసుకున్నాడు, లెక్కలేనన్ని పులులను చంపి, చచ్చిన పులి ప్రక్కన నిలబడి ఫోటోలు తీయించుకున్నాడు. కొమ్ములున్న లేళ్ల తలలను గుమ్మాలకు ఇరువైపులా అలంకరించుకున్నాడు. పులులు, లేళ్ళ శరీరాల్లోని మాంసం బయటకు లాగి, అందులో దూది కూరి విశాలమైన గదుల్లో నిలబెట్టి ఆనందించాడు. అందమైన పక్షి ఈకలతో బట్టలు కుట్టించుకున్నాడు, టోపీలపై ఈకలు గుచ్చుకున్నాడు. నెమలి ఈకలతో విసినికర్రలు తయారుచేసుకుని, విసురుకుని చల్లగాలిని అనుభవించాడు. ఏనుగు దంతాలు కోసేసి బొమ్మలు చేసుకుని చూసుకున్నాడు. ఖడ్గమృగం కొమ్ముతో మందులు చేసుకు పూసుకున్నాడు. గుడ్లగూబను చూసి అమ్మో అన్నాడు, చంపేసి చేతులు దులుపుకున్నాడు.

నాశనం వెళ్ళి సర్వనాశనాన్ని పంపాడు. వాడు పచ్చని చెట్లు నరికేయడం మొదలుపెట్టి రోజుకు కొన్ని వందల యకరాల పచ్చదనాన్ని పొట్టనపెట్టుకున్నాడు. చందనమన్నాడు, ఎర్రచందనమన్నాడు, మూలికలన్నాడు, మట్టి మశాన్నంతో సహా అన్నీ తరలించుకుపోయాడు.

ఇప్పుడు నెత్తిమీద చేతులెట్టుకుని, వానలు లేవన్నాడు, అబ్బో వరదలన్నాడు, నెమలేదన్నాడు, పులి ఏదన్నాడు, నల్లటి మేఘంకోసం కరువాచిపోయి, జిడ్డుమొహంతో నింగివైపు చూస్తున్నాడు. పోయిన పచ్చదనం రాదు, చచ్చిన పోలి లేవదు. ఎగిరే పక్షి కనపడదు. ప్రకృతిని వెక్కిరించావు, ఒక్కడిగా మిగిలిపోయావు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు