వరాల లక్ష్మి - సత్య పెట్లూరి

Varala laksmi
శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! వైకుంఠ లోకే, క్షీర సాగర మధ్యే, భుజగ శయనే, శ్రీ మహా విష్ణో సన్నిధానే, శ్రావణ మాసే, శుక్ల పక్షే, భృగు వాసరే...
స్వామీ వారి కాళ్ళు పడుతూ ఉన్న మహా లక్ష్మి దేవి ఉన్నపళాన ఒక్కసారి ఉలిక్కి పడి కంగారుగా ఎక్కడికో బయలు దేరడానికి ఉద్యుక్తురాలు అయ్యింది. దక్షిణాయన కాలానుగుణంగా యోగ నిద్రలో ప్రసన్న చిత్తుడైన స్వామీ వారు ప్రయాణానికి సన్నద్ధమైన అమ్మ వారిని అరమోడ్పు కన్నులతో చూసి, సకల విశేష మూలాదారుడైన అయన "దేవి ఏమిటి విశేషం" అని కను సంజ్ఞలతోనే ప్రశ్నించారు. "పాపం భూలోకంలో నా కోసం సత్య వ్రతులై భక్తి శ్రద్దలతో ఈ రోజు వ్రతం ఆచరించే పతివ్రతాశిరోమణులందరికీ వారు కోరిన వరాలని నెరవేరుస్తానని మాట ఇచ్చాను కదా స్వామీ. నా మాట నిలబెట్టుకోవడానికే ఈ హడావుడి" అంటూ అమ్మ వారు త్వర పడింది. విష్ణుమూర్తి విలాసంగా కొంచం కొంటెగా నవ్వుతూ "తధాస్తు" అని మళ్ళీ తన యోగ నిద్ర లోకి జారుకున్నారు.
బాగా పొద్దెక్కే సరికి, పడుతూ లేస్తూ కొద్దిగా వికలిత మనస్కురాలై అమ్మ వారు మొహం కంద గడ్డ చేసికొని వైకుంఠానికి తిరిగి మరలారు. ఇంకా లాభం లేదనుకొంటూ విష్ణు భగవానుడు, తన యోగ నిద్రకి తాత్కాలిక విరామం ప్రకటించి, లక్ష్మి దేవిని వివరం అడిగారు. "ఏమి చెప్పమంటారు స్వామి. కృత యుగం లోనించి వస్తున్నదే కదా ఈ పరంపర! వాళ్ళు అడగడం, నేను వారి పట్ల కొంగు బంగారమై అడిగిందల్లా నెరవేర్చడం పరి పాటే కదా. కృత మరియు త్రేతా యుగాల్లో సావిత్రి, అనసూయ వంటి సాధ్వీ మణులు వాళ్ళ పతి దేవుల, అత్త మామల క్షేమ సౌభాగ్యయాలే తమవి గా భావించి వరాలు కోరే వారు. సరే, ద్వాపరానికి వచ్చేసరికి అత్త మామలుని మిహాయించినా పతి సౌఖ్యమే పరమావధి గా భావించే వారు. చివరికి కలి యుగంలో మొగుళ్ళ సంగతి పక్కన పెట్టి, వాళ్ళకి మాత్రం లేటెస్ట్ డిజైన్ పట్టు చీరలు, మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన డైమండ్ నెక్లెస్ మోడల్స్, మాచింగ్ జాకెట్లు ఇట్లా అడగడం మొదలు పెట్టారన్న విషయం మీకు తెల్సిందే కదా. కానీ ఈసారి, నా ఊహకే అందకుండా ఒక విచిత్రమైన కోరిక ప్రతిచోటా అడిగారండీ" అంటూ బిక్క మొహం పెట్టి ఆ వరాలలక్ష్మి తన పాట్లు పతి దేవుని వద్ద విన్నవించుకొన్నది.
  • శ్రద్దగా పూజ ముగించి మహా నైవేద్యం సమర్పిస్తూ ముత్యాలు పొదిగిన మాస్క్లు అడిగిన ముదితలు కొంత మంది
  • తమ తమ శరీర లావణ్యం మరియు ఛాయ తో ఇంపుగా ఒదిగి పోయి, ఎదుటి వాళ్ళకి మాస్కు పెట్టుకొన్నట్టే అనిపించకుండా ఉండేటట్టు వరాలు కోరిన ముద్దుగుమ్మలు కోకొల్లలు
  • వాళ్ళు ఈ మధ్య లిపిస్టిక్ లాంటివి పెట్టుకొంటున్నారుట స్వామి. ఈ మాస్కులు గొడవ వల్ల ఆ ఇనుమడించిన సౌందర్యం కనపడకుండా మరుగున పెడుతోందట. ఏది ఏమైనా మహిమలు చేసి ఈ వెసులుబాటు కొనసాగించేలాగా వరమడిగిన సుందరీ మణులు మరికొంతమంది
  • ఇంకా విచిత్రం, వాయనానికి సెనగలు బదులు మాస్కులు పెట్టుకోవాలట. తమ వీధి వారందరికన్నా మెరుగైనవి ఇప్పించమని వారి మనోగతం నాతో ముచ్చటగా విన్న వించు కొంటున్నారు స్వామీ
ఇవన్నీ చూస్తుంటే, వీరందిరి కోర్కెలు తీర్చడం కన్నా ఆ కరోనా మహమ్మారి నే నిర్మూలించడం సుసాధ్యమేమో స్వామీ. మీ విలాసం లో భాగంగా అవతరించిన ఆ మహమ్మారిని తక్షణమే తొలగించవలసిందిగా నా ప్రార్ధన మహానుభావా, మన్నించండి అంటూ సకల ఐశ్వరాలకి ప్రదాత అయిన అమ్మవారు విష్ణు భగవానుడిని వేడుకొంది. మరి ఆయన ఆ అభ్యర్ధనకి సానూకూలంగా స్పందించాడో లేదో తెలియాలంటే మనం వేచిచూడాల్సిందే

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి