గర్వా నికి శిక్ష - నంద త్రి నా ధ రావు

Punishment for pride

మల్లయ్య అనే ఒక ఆసామి ఒక గొర్రె, మేక, కోడిని పెంచుకోసాగాడు. వాటిలో మేక, కోడి చాలా మంచివి. కానీ గొర్రె మంచిది కాదు. అది ఎప్పుడూ తన నేస్తాలైన మేక, కోడితో- "నేను మీకన్నా బలవంతుడిని. కనుక నేను చెప్పినట్టు మీరు వినాలి . నా మాట వినకపోతే మిమ్మల్ని నా కొమ్ములతో పొడిచి చంపుతాను” అని వేధిస్తూ ఉండేది. అమాయకులైన మేక, కోడి ఆ పొగరుబోతు గొర్రెపోతు కి భయపడి అది చెప్పినట్టు చేసేవి. అంతే కాకుండా, మల్లయ్య వాటికి పెట్టే ఆహారం కూడా గొర్రె, దౌర్జన్యంగా సగం లాక్కుని తినేసేది. మేక, కోడి దాన్ని ఎదిరించలేక చాలా బాధ పడేవి. గర్వంతో విర్రవీగే దానికి దేవుడే తగిన శాస్తి చేస్తాడని తలచి అవి రెండూ గొర్రె పెట్టే బాధల్ని భరించేవి. దాంతో దాని వేధింపులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఒకరోజు మేక, కోడి, గొర్రె కి బుద్ధి చెప్పాలను కున్నాయి. అవి రెండు కలిసి దానిని ఎదిరించాయి. దాంతో గొర్రెకి చాలా కోపం వచ్చింది. “నన్నే ఎదిరిస్తారా? మీకు నా బలమేంటో చూపిస్తాను” అని దాని వాడి కొమ్ములతో మేకని బలంగా పొడిచి దాని ఒక కాలు విరక్కొట్టింది. అలాగే కోడిని కూడా కొమ్ములతో కుమ్మి చంపుతానని బెదిరించింది. అవి తనని ఎదిరించినందుకు శిక్షగా ఆరోజు నుండి మల్లయ్య వాటికి పెట్టే ఆహారం గొర్రె పూర్తిగా తినేసేది. దాంతో మేక, కోడి ఆహారం లేక బక్క చిక్కాయి. ఒకసారి దసరా ఉత్సవాలు వచ్చాయి. మల్లయ్య మేకని కోసి దేవతకి ఇవ్వాలను కున్నాడు. ఆ మాటలు తన వాళ్ళతో చెప్పడం మేక, కోడి, గొర్రె విన్నాయి. ఆ రోజు నుండి మేకకి బెంగ పట్టుకుంది. త్వరలో తను చనిపోతున్నందుకు చాలా బాధ పడింది. కోడి కూడా తన నేస్తమైన మేక తనకి దూరమవుతున్ననందుకు చాలా బాధ పడింది. కానీ గొర్రె మాత్రం బాధ పడలేదు. పైగా అది తన శత్రువైన మేక అంతం అవుతున్నందుకు చాలా సంతోషించింది. పూజకు ఏర్పాట్లు జరిగాయి. ఇంతలో పూజారి కుంటుతున్న మేకని చూసి- “అపచారం! కుంటుతున్న ఇది బలికి పనికిరాదు. అదీ కాక ఈ మేక తిండి లేక బక్కచిక్కింది. అదిగో.. ఆ కనిపిస్తున్న గొర్రె ఆరోగ్యంగా బలంగా వుంది. అది బలికి చాలా బాగా పనికి వస్తుంది” అన్నాడు. విషయం విన్న గొర్రె భయంతో గజ గజ లాడింది. ఇన్నాళ్లూ తను చాలా ఆరోగ్యంగా, బలంగా వున్నానని గర్వంతో విర్ర వీగింది. తన నేస్తాలైన, మేకని కోడిని వేధింపులతో చాలా బాధ పెట్టింది. మేక కాలు కూడా విరిచింది. అవి తినే ఆహారం కూడా తను లాక్కుని తినేసేది. అందువలన తను ఆరోగ్యంగా తయారైంది. ఆహారం లేక అవి బక్క చిక్కాయి. గర్వంతో నేను చేసిన ఆ పని వలన వాటికి మేలు జరిగింది. నాకు కీడు జరిగింది. చివరికి తన బలమే తనని బలికి సిద్దపరిచిందని బాధ పడుతూ కసాయి చేతిలో ప్రాణాలు విడిచింది గొర్రెపోతు.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి