నేరము - శిక్ష - శ్రీమతి దినవహి సత్యవతి

Crime - Punishment

‘జిల్లా కలెక్టర్, రమేష్, ఆత్మహత్య’ కేసు హై ప్రొఫైల్  కేసు కావటం వలన, ఇదివరకు ఇటువంటి కేసుల్ని తన  సమయస్ఫూర్తితో,  అనుభవంతో చాకచక్యంగా చేధించి మంచి పేరు గడించిన  ఎ.ఎస్.పి. అభిరాం కి అప్పగించింది ప్రభుత్వం . అభిరాం స్టేషన్ లో అడుగు పెట్టి, హెడ్ కాన్స్టేబుల్  అచ్యుతంని పిలిచి ఫైలు తెప్పించుకుని చదివాడు..ప్రాథమిక దర్యాప్తు ప్రకారం...

ఎప్పటిలాగే ఉదయాన్నే కలెక్టర్ గారు నివసించే అపార్ట్మెంట్ కి, ఆయన  బంట్రోతు విధులకు వచ్చి తలుపు కొట్టడం, ఎప్పుడూ తాను వచ్చే సమయానికే జాగింగ్ అదీ పూర్తి చేసుకుని  ఫైల్స్  చూస్తుండే కలెక్టర్ గారు ఎంతకీ తలుపు తీయక పోయేటప్పటికి, ఆయన సెల్ కి ఫోన్ చేయడం, రింగ్ అవుతున్నా అటునుంచి సమాధానం రాకపోవటంతో వెంటనే పోలీస్ కంట్రోల్ రూం కి ఫోన్  చేయడం జరిగింది. అపార్ట్మెంట్ లో కలెక్టర్ గారు ఒక్కరే ఉంటున్నారు ప్రస్తుతం. ఆయనకి ఆరు నెలల క్రితమే వివాహమైంది. అయితే ఏదో కారణం వలన భార్య సుజాత ,  ఆయనతో విభేధించి మూడు నెలలై ముంబయి లో ఉంటోంది. అరగంటలో పోలీసులు వచ్చి చూసి,  ఎక్స్పర్ట్ ని పిలిపించి కలెక్టర్, రమేష్, గది తాళం తెరిపించారు.

రమేష్ కుర్చీలో తల ప్రక్కకి వాల్చి పడి ఉన్నారు. ఆయన అపార్ట్మెంట్ కి రెండు తాళాలు. ఒకటి ముంబై లో ఉన్న ఆయన భార్య వద్ద ఉంటే రెండవది డైనింగ్ టేబుల్ పైన పెట్టి ఉంది. రమేష్ కణత పై కాల్చుకోవటం వలన కారిన రక్తం క్రింద పరుచుకుని గడ్డ కట్టింది. గది లాక్ పై ఎటువంటి వేలిముద్రలు లేకపోవటంతో గదిలోకి ఎవరూ బలవంతంగా రావడం జరగలేదనీ,  రమేష్ ఆత్మ హత్య చేసుకుని మరణించారని నిర్థారణ చేసారు పోలిసులు.

‘ఊ.....’ ఫైల్ చదవడం ముగించి దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి వాలి ఆలోచిస్తుంటే కలెక్టర్ గారు తనకి ఇవ్వబడిన ప్రభుత్వ బంగళాలో ఉండకుండా అపార్ట్మెంట్ లో ఎందుకు ఉంటున్నారన్నదానికి తనకి కేసు అప్పగిస్తూ పై ఆఫీసర్ చెప్పిన విషయం ... ఆయన సొంతంగా అన్ని సౌకర్యాలతో కట్టుకున్న తన ఫ్లాట్ లోనే ఉండటానికి సుముఖత వ్యక్తం చేసారని ..చెప్పడం జ్ఞప్తికి వచ్చింది. అప్పుడే ఇంకో విషయం కూడ హఠాత్తుగా తట్టింది అభిరాం కి!

“అచ్యుతం..అచ్యుతం కలెక్టర్ గారి కేసు తాలూకు ఎవిడెన్స్ బాక్స్ ఇలా పట్రా అర్జెంటుగా” కేక వేసాడు.

ఒక్క క్షణంలో తెచ్చిచ్చాడు అచ్యుతం.

బాక్స్ తెరిచి గబ గబా వెతికాడు ఒక తాళం చెవి తప్ప ఏమీ లేదు అందులో ‘మరైతే  అదేమైనట్టూ?’ అనుకుని “ఏమయ్యా ప్రాథమిక దర్యాప్తు జరిగినప్పుడు నువ్వు ఉన్నావు కదా అక్కడ మీకు ఈ తాళం చెవి తప్ప మరేమీ దొరకలేదా?”

పై కప్పు కేసి చూసి  బుర్ర గోక్కుని “బాగా క్షుణ్ణంగా వెతికాము సార్ ఆ ఇల్లంతా. వేరేమీ కనపడలేదు సార్”

“ఊ.... పద మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాము” హుటాహుటిన రమేష్  అపార్ట్మెంట్ కి వెళ్ళారిద్దరూ.

“నువ్వు కాక ఇంకెవరెవరు వస్తుంటారు ఇంటికి?”  బంట్రోతుని పిలిచి అడిగాడు.

“పనమ్మాయి, పాలవాడు, పేపర్ బోయ్”

“ఊ...పాలవాడు ఇంట్లోకి  వచ్చే అవకాశం లేదు. పేపర్ వాడు క్రిందనుంచే తారాజువ్వలా పడేస్తాడు కాబట్టి వాడినీ అనుమానించలేము. ఇక మిగిలింది పనమ్మాయి.. పేరేమిటీ? ఏదీ ఎక్కడ? పిలు”

“పేరు మల్లి అండి. అయ్యగారు చనిపోయిన రోజునుంచీ పనిలోకి రాలేదండీ. వాళ్ళయ్యకి ఒల్లు బాగాలేక ఆస్పత్రిలో ఉన్నాడు రాలేనని చెప్పిందండి”

“అలాగా సరేలే నేను చూస్తాను” అని అచ్యుతానికి చెప్పాడు మల్లిని గురించి కనుక్కోమని. కలెక్టర్ ఇల్లంతా కలియజూస్తూ టెలిఫోన్ దగ్గరున్న డైరీ తీసుకుని కలెక్టర్ గారి భార్యకి ఫోన్ చేసి అత్యవసరంగా స్టేషన్ కి వచ్చి కలవమని చెప్పాడు. అభిరాం స్టేషన్ కి వచ్చేటప్పటికి సుజాత కూర్చుని ఉంది.

“అచ్యుతం రెండు కాఫీ తెప్పించు”

కాఫీలు కప్పుల్లో తెచ్చి పెట్టి వెళ్ళాడు అచ్యుతం.

“తీసుకోండి” సుజాతకి ఒక కప్పు అందించాడు. కాఫీ త్రాగటం అయ్యాక కప్పులు తీసుకెళ్ళమని అచ్యుతం కి సైగ చేసి “మీకూ రమేష్ గారికీ మధ్య విభేదాలు రావడానికి కారణం?” ప్రశ్నించాడు సుజాతని.

“అది నా వ్యక్తిగతం”

“మేడం మీ భర్త , ఈ జిల్లా కలెక్టర్ హత్య చేయబడ్డారు.....”  

“ఆగండాగండి..రమేష్ ది  ఆత్మహత్య అని ప్రాథమిక దర్యాప్తులో నిర్థారించబడింది కదా! మీరిప్పుడు హత్య అంటున్నారు?”

“ఇది హత్య అనడనికి మాకు  కొన్ని ఆధారాలు దొరికాయి. ఇకపోతే ఈ కేసు గంభీరత దృష్ట్యా ఇంక ఇక్కడ వ్యక్తిగతాలూ, పరగతాలూ అన్నవి ఉండకూడదు”

“ఏమిటో ఆ సాక్ష్యాలు?”

“సమయం వచ్చినప్పుడు అవే బయటపడతాయి. అన్నట్లు రమేష్ గారి వద్ద తుపాకీ ఉండేదా?”

“నాకు తెలియదు”

ఆమెవైపు సాలోచనగా చూసి “మీరిక వెళ్ళొచ్చు. అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. మీకు తెలుసుగా కేసు దర్యాప్తు ముగిసేదాకా మీరు ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు”

“ఆ తెలుసు” విరుపుగా అని వెళ్ళిపోయింది సుజాత.

వెంటనే అచ్యుతాన్నిపిలిచి సుజాత త్రాగిన కాఫీ కప్పుని ఫోరెన్సిక్  ల్యాబ్ కి పంపించి వేలిముద్రలు సేకరించమని చెప్పమన్నాడు.

 “సార్ పనిమనిషి మల్లిని పిలుచుకొచ్చాను” అచ్యుతం సమాచారం.

వెనకాలే సుమారు పాతికేళ్ళ అందమైన అమ్మాయి వచ్చింది. మల్లిని ఆపాదమస్తకం పరీక్షగా చూసాడు.  

“కలెక్టర్ గారు చనిపోయిన రోజునుంచీ రావడం లేదట ఏమైంది?”

చెప్పింది మల్లి.    

“ఓహో! సరేలే వెళ్ళు. పిలిచినప్పుడు రావాలి. ఊరొదిలి పోకూడదు”

“ఏడికెళతానయ్యా అయ్యని వదిలిపెట్టీ?” అదోలా చూసి వెళ్ళిపోయింది. మల్లి మీద ఓ కన్నేసి ఉంచమని కాన్స్టేబుల్ కనకయ్యకి చెప్పాడు.  

భర్త రమేష్ చనిపోయినప్పుడు ముంబయ్ నుంచి వచ్చిన సుజాత అదే ఊళ్ళో ఒక హోటల్  లో ఉంటోంది. ఆమె బస చేసిన హోటల్ కి వెళ్ళాడు అభిరాం. అయితే ఆమె బయటకు వెళ్ళిందని తెలిసింది. హోటల్  వాళ్ళనడిగి , రిసెప్షన్, సుజాత ఉండే అంతస్తు, రెస్టారెంట్ సెక్షన్ ....ఇత్యాది అవసరమైన సి.సి.టివి. ఫుటేజ్ లన్నీ తీసుకుని స్టేషన్ కి వచ్చి తన కంప్యూటర్ లో చూడసాగాడు. ఎక్కడా సుజాతను అనుమానించడానికి ఎటువంటి ఆధారం కనిపించలేదు.

చివరగా  రెస్టారెంట్ ఫుటేజ్ చూస్తూ ఒక చోట ఆగాడు...’సందేహం లేదు ఆమె సుజాతే..అయితే ఆ ఎదురు వ్యక్తి ఎవరూ? కానీ ఇరువురికీ పరిచయం  ఉన్నట్లు అనిపించటం లేదే? అరే..అదేమిటీ.....!’  ఆశ్చర్యపోయి  మళ్ళీ మళ్ళీ చూసాడు ఆ క్లిప్పింగ్ ని. ఫుటేజ్ లు బయటకి తీసి కవరులో పెట్టి భద్రంగా డ్రా లో ఉంచి ‘అచ్యుతం పద జీపు తియ్యి’ అని సరాసరి  ఒక చోటికి  వెళ్ళి సోదా చేయగా అతడు వెతుకుతున్నది దొరికింది.

ఒక నంబరు డయల్ చేసి వెంటనే స్టేషన్ కి రమ్మని  చెప్పి, అచ్యుతాన్ని, మరో మహిళా ఇన్స్పెక్టర్  ని తీసుకుని అరస్ట్ వారంట్ తో వెళ్ళి  “మల్లీ!  కలెక్టర్ గారిని హత్య చేసిన నేరంపై  నిన్ను అదుపులోకి తీసుకుంటున్నాను. ఇన్స్పెక్టర్ నళినీ ఈమెను అరెస్ట్ చేయండి” అన్నాడు.  

“సార్..సార్ నేనేం చేయలేదు సార్” ఏడుస్తూ మొత్తుకున్న మల్లితో “అదంతా కోర్టులోచెప్పుకో పద” అన్నాడు

మల్లిని అరెస్ట్ చేసి స్టేషన్ కి వెళ్ళేటప్పటికే సుజాత వచ్చి ఉంది.

“మీ భర్త కలెక్టర్ రమేష్ ని మీ పనిమనిషి మల్లి హత్య చేసింది” అన్నాడు సుజాతతో.

“ఛి! ఛీ విశ్వాస ఘాతకురాలా” ఛెళ్ళున చెంప దెబ్బకొట్టింది మల్లిని.  

“అమ్మా! మీరు కూడా ?”

“ఇంకేఁ మాట్లాడకు నోరుముయ్యి” అంది ఛీత్కారంగా .

“సార్! సార్. నిజంగా నేనే పాపమూ ఎరగను సార్. అయ్యగారిని చంపింది నేను కాదు సార్. మా అయ్య మీద ఒట్టు” అంది ఏడుస్తూ.  

“నువ్వు కాకపోతే మరెవరో చెప్పు?”

సుజాత వైపు చూపిస్తూ “అమ్మగారే సార్”

“ఏం కూసావే?” మళ్ళీ మల్లిని కొట్టబోయింది.  

“ఆగండి మేడం. మల్లి చెప్తున్నది నిజం. కలెక్టర్ గారిని హత్య చేసింది మీరే”  

“అలా అనడానికి మీదగ్గర సాక్ష్యం ఏముంది? కోర్టు మీ ఉత్తుత్తి నిందారోపణలని నమ్మదు” అంది ధీమాగా కళ్ళెగరేస్తూ సుజాత.  

“చాలా బలమైన సాక్ష్యం ఉంది చూస్తారా......” అని హోటల్  నుంచి తెచ్చిన సి.సి.టి.వి. ఫుటేజ్ సుజాత   ముందు పెట్టాడు.

అందులో సుజాత ఒక టేబుల్ దగ్గర కూర్చుని తన హాండ్ బ్యాగు టేబుల్ పైన పెట్టి కాఫీ త్రాగుతోంది. ఇంతలో మరో వ్యక్తి వచ్చి ఆమె ఎదురుగా కూర్చుంది. ఆమె దగ్గరా సుజాత దగ్గర ఉన్నటువంటి బ్యాగే ఉంది. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. అయితే వెళ్లేటప్పుడు మాత్రం తమ తమ బ్యాగులు కాకుండా ఎదుటివారి బ్యాగు తీసుకోవడం, చాలా నిశితంగా ఇద్దరినీ గమనించే వారికి తప్ప తెలియడం అసంభవం.

అందుకే ఆ రోజు ఫుటేజ్ చూస్తున్నప్పుడు అభిరాం పదే పదే దాన్ని చూసాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మల్లి అని గుర్తించడానికి ఎంతో సేపు పట్టలేదు అభిరాం కి.

ఫుటేజ్ అంతా చూసిన సుజాత ముఖం నల్లగా మాడిపోయింది.

“ఆ రోజే మల్లి ఇల్లు సోదా చేస్తే  చూరులో దాచిన  బ్యాగు అందులో మీ భర్త  తుపాకీ, కొన్ని నోట్ల కట్టలూ బయట పడ్డాయి. ఆ తుపాకీ పై మీ వేలిముద్రలు ఉన్నట్లు రుజువైంది. తలుపుపై వేలిముద్రలు తుడిచేసిన మీరు తుపాకీ పై తుడవడం మర్చిపోయారు. అందుకే అంటారు ”ఎంతటి తెలివిగల నేరస్థుడైనా ఎక్కడో చిన్న పొరపాటు తప్పక చేస్తాడని. ఇప్పుడేమంటారు మేడం? మల్లి  పేదరికాన్ని అలుసుగా తీసుకుని ఆమె తండ్రి వైద్యానికి డబ్బిస్తానని ఆశ పెట్టి ఆ అమాయకురాలిని మీ నేరంలో భాగస్థురాలిని చేసారు. మీతో పాటు ఆమెకీ శిక్ష పడుతుంది. అది మీకు న్యాయం అనిపించిందా?”

“హు....న్యాయం! ఏ న్యాయం గురించి మాట్లాడుతున్నారు మీరు? మీరంతా ఎంతో మంచివాడు అని పొగుడ్తున్నారే ఆ కలెక్టర్, నా భర్త ఒక దుర్మార్గుడు. అతడి చేతిలో  నాకు జరిగిన అన్యాయం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. మా పెళ్ళైన కొన్నాళ్ళకే నాకు తెలిసింది రమేష్ సమాజంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న ఒక గోముఖ వ్యాఘ్రమని. అతడి చేతిలో ఇదివరకే ఒక అమ్మాయి మోసపోయిందనీ, ఆమె తో గడిపిన రాత్రి అశ్లీల వీడియో తీసి ఎవరికైనా చెప్తే దానిని పబ్లిక్ చేస్తానని ఆమెను బెదిరిస్తున్నాడనీ తెలిసి అతడికి బుధ్ధి చెప్దామని అనుకున్న నాకు కూడా,  మా మొదటి రాత్రి రహస్యంగా తీసిన  వీడియో చూపించి, నోరెత్తితే  పబ్లిక్ చేస్తానని బెదిరించాడు. అందుకే అతడిని వదిలి వెళ్ళిపోయాను. కానీ ఆ తరువాత మల్లిని బాధపెట్టడం మొదలెట్టాడట. అది నా దగ్గర చెప్పుకుని ఏడ్చింది. అటువంటివాడి దుర్మార్గుడిని  బ్రతకనిస్తే ఇంకా ఎంతమంది జీవితాలు బలౌతాయో అని సైలెన్సర్ ఉన్న అతడి తుపాకీతోనే అతడిని చంపాను. ఆ దుర్మార్గుడిని చంపినందుకు నాకెటువంటి పశ్ఛాత్తాపమూ లేదు. నావల్ల మల్లికి శిక్ష పడుతుందన్న ఒక్క బాధ తప్ప. మల్లీ నన్ను క్షమిస్తావా” అంది సుజాత దోసిట్లో ముఖం దాచుకుని ఏడుస్తూ.

                                                ***************

మరిన్ని కథలు

love affections
మమతానురాగాలు
- మల్లవరపు సీతాలక్ష్మి
Madhava seva
మాధవ సేవ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు
Bawa Bawa rose water
బావా బావా పన్నీరు....
- గొర్తి.వాణిశ్రీనివాస్
New cousins
కొత్త కోడలు
- యు.విజయశేఖర రెడ్డి
i hate my room mate
ఐ హేట్ మై రూమ్మేట్
- గంగాధర్ వడ్లమన్నాటి
gurupreet singh
గురుప్రీత్ సింగ్
- యు.విజయశేఖర రెడ్డి
pity sundaram
పాపం సుందరం!
- పద్మావతి దివాకర్ల
Listening to what is being said
చెప్పుడు మాటలు వింటే...!
- మీగడ.వీరభద్రస్వామి