అమ్మమ్మా నా మొగుడెవరమ్మా !!?? - ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్.

grandmaa who is my husband

కళ్యాణ మండపం కళ కళ లాడుతోంది.వేసవి కాలమైనా జనం బాగానే వచ్చారు. ఏసీ హాల్ కనుక ఎవ్వరూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కూచుని ఉన్నారు.

పెళ్లి తంతు ప్రారంభం అయ్యింది.పురోహితులు వివిధ కార్యక్రమాల ఏర్పాట్లతో హడావిడి పడుతూ ఉంటే , ఫోటోగ్రాఫర్ లు ,వీడియో వాళ్ళు తమ తమ స్థానాలలో కుదురుకుంటున్నారు.ఈ రోజుల్లో పంతుళ్ళ కంటే ఫోటోగ్రాఫర్ ల సూచనలే అందరూ పాటించాల్సిన పరిస్థితులు !!??వాళ్ళు ఎలా చెపితే అలా వినాలి.లేకపోతే వాళ్ళకి కోపం వచ్చిందంటే కష్టం!!??

‘ పురోహితులు వాళ్ళు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు.కానీ మంచి వీడియో గ్రాఫర్స్ దొరకడం కష్టం’ అని సామన్య ప్రజానీకం అభిప్రాయం!!??

పెళ్ళి జరుగుతున్నది ఇరువైపుల మంచి సంప్రదాయం కల కుటుంబాల పిల్లల మధ్య. కనుక పురోహితులు అంతా శాస్త్ర ప్రకారం జరిపిస్తున్నారు. అయితే వాళ్ళకి, వాళ్ళ స్వేచ్చకి వీడియో గ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అప్పుడప్పుడు అడ్డు పడుతున్నారు!! ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఫోటోలు,వీడియోలు తీసే వాళ్ళని తప్ప స్టేజి ని ఏ మాత్రం వీక్షించలేకపోయారు!!?? అయితే పెళ్లి వారి దయా ధర్మమా అని “జైంట్ స్క్రీన్” మీద చూడగలిగారు.

“ఈ మాత్రం దానికి ఇక్కడకి రావడం ఎందుకు.సిటీ కేబుల్ లో లైవ్ ఇచ్చేస్తే ఊళ్ళో వాళ్ళయితే ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు, ఊరినుంచి వచ్చిన వాళ్ళు ఎవరి హోటల్ లో వాళ్ళు చూసేవారు కదా!!వీడియో వాళ్ళని చూడడానికా దుంపలు దంపలు చేసుకుని ఇక్కడకు వచ్చింది” అని ఎవరో పెద్దాయిన అందరికి వినిపించేలా విసుక్కున్నాడు. కానీ పాపం అయన మాటలు అరణ్య రోదనే అయ్యాయి.

కాశి యాత్రలో గెడ్డం కింద బెల్లం కొట్టడం మూడు సార్లు చేయాల్సి వచ్చింది. అప్పడికి గాని ఫోటోలు సరిగ్గా కుదరలేదు!!??పాపం పెళ్లి కొడుకు కి గెడ్డం నెప్పి పెట్టిందేమో!?

తరువాత గౌరీ పూజలో పెళ్లి కూతురు కుంకుమ పూజలో ఫోటో కోసం పోజులు ఇవ్వడంలో ఏ మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ చెయ్యలేక పోయింది.పాపం పురోహితుడు నిస్సహాయంగా కూచుండి పోయాడు.

ఇక పెళ్ళిలో ప్రధాన ఘట్టం మొదలు అయ్యింది.

పెళ్లి కూతురు తల్లి దండ్రులు , పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చారు. పురోహితుల మంత్రాల మధ్య పెళ్లి తంతు నడుస్తోంది.

పురోహితులు తాము చదివే మంత్రాలకి, చేయించే కార్యక్రమాలికి అర్థం, మండపంలో కూచున్నఅమ్మాయి తల్లి తండ్రులకి, పెళ్లి కుమారునికి వివరిస్తూ చక్కగా చేయిస్తున్నారు.

అంతలో పెళ్లి కుమార్తె ని తీసుకు వచ్చేరు.కాబోయే దంపతుల మధ్య తెర ఉంచబడింది.ముహూర్త సమయంలో ఆ తెర వారిద్దర మధ్య నుంచి తొలిగిస్తారు.

సరిగ్గా అప్పుడే వీడియో గ్రాఫర్ వచ్చి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.తెర అలా పట్టుకోండి, ఇలా ఉంచండి అంటూ చెప్పసాగాడు . దానికి పురోహితుడు కొంచం విసుక్కున్నాడు.శాస్త్రాలలో కలగ జేసుకోవద్దని నెమ్మదిగా హెచ్చరించాడు. కానీ చుట్టూ ఉన్న వారందరి మద్దతు వీడియో గ్రాఫర్ కే!!??

చేసేదేమీ లేక పురోహితుడు పెళ్లి తంతులో ముందుకు పోసాగాడు.

ముహూర్తానికి ఇంకా సమయం ఉంది.

వారి మధ్య ఉంచిన తెర విశిష్టత,అందులోని ధర్మ సూక్ష్మం వధూ వరులకు వివరించ సాగాడు పురోహితుడు.ఇద్దరు ఆసక్తిగా విన సాగారు.

ముహూర్తం సమీపించింది.జనంలో ఉత్సుకత , వధూవరులలో ఉద్వేగం, పురొహితులలో కంగారు మొదలయ్యాయి.ఫోటోగ్రాఫర్ లు, వీడియో గ్రాఫర్ లు తమ తమ స్థానాలలో తయారుగా ఉన్నారు.

ముహూర్తం ఆసన్నమయ్యింది. మంగళ ధ్వనుల మధ్య జీల కర్ర , బెల్లం కలిపిన మిశ్రమం వధూవరులు ఒకరి శిరస్సు ఫై ఒకరు ఉంచుకున్నారు. తెర తొలిగింపబడింది.కానీ అక్కడ అంతా పురోహితుని ఆధ్వర్యం లో కంటే , ఫోటోలు ,వీడియో తీసే వాళ్ళ సూచనల ప్రకారం జరుగుతోంది. పెళ్లి కార్యక్రమం ముగిసింది.

పెళ్లి కుమార్తె తిన్నగా తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి “అమ్మమ్మా నా మొగుడు ఎవరమ్మా!!??” అని అడిగింది సీరియస్ గా.

“ఓసి నీ చోద్యం కూలా . అదేం ప్రశ్నే!!??బంగారం లాంటి కుర్రాణ్ణి పెళ్లి చేసుకుని అవేం పిచ్చి మాటలు!!??”అని కసురుకుంది ఆమె అమ్మమ్మ కోపంగా.

“అది కాదు అమ్మమ్మా .పంతులుగారు ఏం చెప్పారంటే శాస్త్ర ప్రకారం ముహూర్త సమయంలో నేను ఎవరిని చూస్తానో ఆయనే నా భర్త అని చెప్పాడు.కానీ ముహూర్త సమయంలో ఫోటోగ్రాఫర్ నన్ను అతని వేపు చూడమన్నాడు.నేను ముహూర్త సమయం లో ఫోటోగ్రాఫర్ ని చూసాను. కానీ పెళ్లి చేసుకున్నది వేరే అతన్ని.అందుకని డౌట్ వచ్చింది.” అంది పెళ్లి కుమార్తె కొంటెగా నవ్వుతూ.

“అవును తల్లీ మనం పంతుళ్ళ సూచనల కంటే ఈ ఫోటో వాళ్ళ సూచనలకే ఎక్కువ విలువ ఇస్తుంటే ఇలా అర్థాలు, సంబంధాలు మారిపోతాయి. ధర్మం అధోగతి పాలు అయిపోతుంది. చిన్న దానివయినా చాల చక్కని విషయం చెప్పావే.ఈ సంగతి అందరం గట్టిగా ఆలోచించాలి......నువ్వు ముందు నీ మొగుడు దగ్గరికి వెళ్ళవే ..పాపం అతను నీ కోసం చూస్తున్నాడు.”

“ఏ మొగుడు!?”అని అడిగింది పెళ్లి కుమార్తె నవ్వుతూ.

“నిన్నూ ... “అంటూ ప్రేమగా , సుతారంగా మొట్టింది వాళ్ళ అమ్మమ్మ###

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి