వరహాలరావా మజాకా! - పద్మావతి దివాకర్ల

Varahalarava, not a a joke!

ఆనందరావు ఏమాత్రం ఆనందంగా లేడు.  మనసంతా ఆలోచనలతో అలజడిగా, గజిబిజిగా ఉంది.  తన ఇంట్లో అద్దెకున్న దయాకరరావు ఆగడాలతో బెంబేలెత్తి దిగులుగా ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు.  ఈ విషయమై ఉదయమే భార్యతో కూడా మాటామాటా పెరిగింది. పైవాటాలో అద్దెకి దిగిన దగుల్బాజి దయాకరరావు ఆనందరావుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు.  దయాకరరావు ఇంటిపేరు దగుల్బాజి కానేకాదు, అయితే అతని పేరులో ఉన్న దయ మాత్రం మనిషిలో లేకపోవడంవల్ల ఆనందరావే అతనికి అదే తగిన ఇంటిపేరని స్థిరపర్చాడు.  ఇంట్లో దిగిన తర్వాత ఏకుమేకై కూర్చున్నాడు.   అద్దె ఇవ్వడు, ఇల్లు వదలడు ‘కదలడు వదలడు ’ అన్నట్లు.  ఏమైనా అంటే తన కష్టాలు ఏకరవు పెడతాడు.  అసలు ఇల్లు ఎవరికీ అద్దెకివ్వడం ఇష్టం లేదు ఆనందరావుకి.  ఇంటికి చుట్టాలెవరైనా వస్తే సౌకర్యంగా ఉంటుందని పై వాటా కట్టుకున్నాడు.  మూడేళ్ళ క్రితం భార్య పోరు పడలేక దయాకరరావుకి అద్దెకిచ్చాడు.  ఇంట్లో దిగినప్పుడు మెత్తగా మాట్లాడిన దయాకరరావు ఆ తర్వాత తన దగుల్బాజి గుణం చూపించాడు.

చాలా రోజులు వేచి చూసిన ఆనందరావు ఇక ఇలా లాభం లేదని ఇల్లు ఖాళీ చెయ్యమన్నాడు, అద్దె పోతే పోయింది ఇల్లు ఖాళీ చేస్తే చాలుననుకొని.

"మీరు ఇలా హఠాత్తుగా ఇల్లు ఖాళీ చెయ్యమంటే చెయ్యగలమా?  నాకు మంచి ఇల్లు దొరికితే తప్పక ఖాళీ చేస్తాను.  మీరు మాకేం పదేపదే చెప్పనక్కరలేదు." అని అన్నవాడు ఆరునెలలైనా తన మాటమీద నిలబడలేదు, ఇల్లు వదలలేదు.

చాలా సార్లు చెప్పిచెప్పి విసుగేసింది తప్పితే ఫలితం మాత్రం కనబడలేదు.  పైగా ఇల్లంతా కూడా నానా ఖంగాళీ చేసేసారు.  ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా లాభం లేకపోయింది.  సామ, దాన, భేద, దండోపాయాలు కూడా ఏమాత్రం పనిచేయలేదు.  ఈ లోపు ఆఫీసులో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడి సస్పెండ్ అయ్యాడు దయాకరరావు.  దానికితోడు దయాకరరావు కొడుకేమో డిగ్రీ ఫెయిలయ్యి జులాయిగా తిరుగుతున్నాడు.  కూతురికేమో దాదాపు నిశ్చయమైన పెళ్ళిసంబంధం తప్పిపోయింది.  ఈ కారణాలవల్ల ఇంకాస్త మొండిగా తయారయ్యాడు దయాకరరావు.  ఆఖరికి ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నంతవరకూ వచ్చాడు.  దయాకరరావు చేత ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో తెలియక తల పట్టకు కూర్చున్నాడు ఆనందరావు.  తను ఇల్లు అద్దెకి ఇవ్వకపోయినా ఈ బెడద ఉండకపోను.  ఉత్తినే ఖాళీగా ఉంచడమెందుకు అద్దైనా వస్తుందని భార్య అనంతలక్ష్మి పోరు పెట్టడంతో ఇల్లు అద్దెకి ఇవ్వక తప్పింది కాదు.  అందుకే ఉదయం భార్యమీద కోపగించుకోవలసి వచ్చింది కూడా.

ఇలా ఆలోచనలతో సతమతమవుతున్న ఆనందరావు కాలింగ్ బెల్ శబ్దానికి ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.  తలుపుతీసిన ఆనందరావు ఎదురుగా బావమరిది వరహాలరావు కనిపించేసరికి ముఖం చిట్లించాడు.  అసలే మనసు చిరాగ్గా ఉంది, ఇప్పుడే రావాలా ఈ మహానుభావుడు అని అనుకొని, మనసులో కలిగిన భావాన్ని పైకి కనబడనీయకుండా అతికష్టంగా ముఖంపై నవ్వు పులుముకొని, "రా!  వరహాలూ, ఇదేనా రావడం?  ఊళ్ళో అందరూ బాగున్నారా?" అని కుశల ప్రశ్నలు వేసాడు ఆనందరావు.

"ఆఁ...!  అందరూ కుశలమే బావా!  అక్కేదీ?" అంటూ ఇంట్లోకి ప్రవేశించాడు వరహాలరావు.

"మీ అక్క వంటింట్లో అష్టావధానం చేస్తూ ఉంటుందిలే!" అన్నాడు ఆనందరావు.

"అహాఁ...!  అలాగా...!"  అంటూ బ్యాగ్ అక్కడే వదిలి అక్కని పలకరించడానికి వంటింట్లోకి వెళ్ళేసరికి అనంతలక్ష్మి చీర కొంగుతో కన్నీళ్ళు తుడుచుకోవడం కంటబడి కంగారు పడ్డాడు వరహాలరావు.

"ఏమిటే అక్కా!  ఏమైంది, ఎందుకా కన్నీరు?  ఏమిటైంది, ఎందుకేడుస్తున్నావు?  బావగానీ ఏమైనా అన్నాడా, ఉండు చెప్తాను." అని అవేశంగా హాల్‌లోకి వెళ్ళబోయిన వాడల్లా అనంతలక్ష్మి చాకుతో తరుగుతున్న ఉల్లిపాయని చూసి ఆగిపోయాడు.  "ఓహో!  ఉల్లిపాయ కన్నీళ్ళా?" అని నాలిక్కరుచుకొని, “ఇంకా నయం బావతో తగువు పెట్టుకోవడానికి వెళ్ళలేదు." అన్నాడు.

ఉల్లిపాయలు తరుగుతున్నదల్లా పని ఆపి, "తమ్ముడూ, ఇవి ఉల్లిఘాటుకి కలిగిన కన్నీళ్ళే కానీ, మీ బావ ప్రవర్తన వల్ల నిజంగానే ఏడుపొస్తోందిరా!" అందామె మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకుంటూ.

అక్క ముఖంలో విచారం చూసి కంగారుపడ్డాడు వరహాలరావు.  అక్కా, బావల మధ్య ఎదో జరిగిందని గ్రహించాడు.

"ఏమిటి అక్కా, బావ ప్రవర్తన వల్ల ఏడుపువస్తోందా? ఛ...ఛ...!  అయినా బావకి ఈ వయసులో ఇదేం పాడు బుద్ధి అక్కా!  ఉండు...ఇప్పుడే కడిగిపారేస్తాను." అన్నాడు మళ్ళీ ఆవేశంగా.

"కడిగేయటానికి అయనేమైనా చెంబు, తపేళా ఏమిట్రా!  అయినా పూర్తిగా వినిపించుకోకుండా ఆ తొందరేమిట్రా నీకు?  ప్రవర్తనంటే నువ్వు ఊహించినదేమీ కాదు.  ఆయన బంగారం." మురిసిపోతూ అంది అనంతలక్ష్మి.

"తను బంగారమేనని బావే అన్నాడేమిటి నీతో కొంపతీసి.  అనేఉంటాడు నీకు బంగారం వస్తువులు కొనే పని తప్పుతుందని.  అయితే ఇంతకీ బావ ప్రవర్తన సంగతేమిటి?  బావ బంగారమంటావు, మళ్ళీ ప్రవర్తన అంటావు." అన్నాడు వరహాలరావు ఏమీ బోధపడక.

"ఏం చెప్పమంటావురా?  ఎలా చెప్పమంటావు?  మా ఇంటిపైవాటా అద్దెకి ఇచ్చామా!  వారివల్లే వచ్చింది మా ఇద్దరి మధ్యా గొడవ.  అసలు ఇల్లే అద్దెకి ఇవ్వొద్దని మీ బావ అంటే, అద్దె వస్తుంది కదా అని నేనే పై వాటా అద్దెకి ఇవ్వడానికి అతన్ని బలవంతాన ఒప్పించాను.  ఇప్పుడు వాళ్ళవల్లే వచ్చింది అసలు చిక్కంతా!  అద్దె సంగతి అలా ఉంచి రోజూ మద్దెల దరువే!  మీ బావ నాపై ఒకటే చిందులు వేస్తున్నారు." అంటూ ముక్కు చీదింది అనంతలక్ష్మి.

"వంటింట్లోనే అక్కా తమ్ముళ్ళు ఉంటారా ఇవాళ రోజంతా, లేక నా మొహాన ఇంత కాఫీ పోసి, టిఫిన్ పెట్టేదేమైనా ఉందా!" అని హాల్లోంచే గావుకేక వేసాడు ఆనందరావు.

"ఇదిగో మళ్ళీ మీ బావకి కోపం వచ్చేట్లు ఉంది." అని వరహాలరావుతో అని కాఫీ కలిపి హాల్లోకి పరుగెట్టింది అనంతలక్ష్మి.  ఆమె వెనుకే వచ్చిన వరహాలరావు సోఫాలో కూర్చుంటూ, "ఏమిటి బావా, ఏమిటి అద్దెకున్న వాళ్ళతో గొడవ?" అని అడిగాడు.

భార్య తన తమ్ముడికి సంగతంతా చెప్పిందని గ్రహించిన ఆనందరావు, "చెప్తే మాత్రం నువ్వేమైనా ఆరుస్తావా, తీరుస్తావా?  అందరికీ తంపులు పెట్టడం తప్పించి నీకింకేం తెలుసు?" అన్నాడు ఆనందరావు చిరాగ్గా మొహం పెట్టి.

ఆనందరావు మాటలకి చిన్నబుచ్చుకున్నాడు వరహాలరావు.  అది గమనించిన అనంతలక్ష్మి, "ఎప్పుడూ మా తమ్ముణ్ణి ఆడిపోసుకోవడమే మీ లక్ష్యం.  మన సమస్య చెబితే వాడేమైనా సలహా ఇస్తాడేమో కదా!" అంది అనంతలక్ష్మి.

"అఁ..వాడిచ్చేదేమిటి బోడి సలహా!  మన ఇంటి వాస్తు బాగులేదు అందుకే ఇలా జరిగిందని, తలుపు ఇక్కడ ఉండకూడదు, గోడ ఇక్కడ ఉండకూడదు, కిటికీ అటుపక్క ఉండాలి అని ఇలాంటి పనికిమాలిన సలహాలు మాత్రమే ఇవ్వగలడు." నిరసనగా అని వరహాలరావు వైపు తిరిగి, "అసలు వరహాలూ, రోజుకాని రోజు, వేళకాని వేళ వచ్చావేమిటి, అడగడం మరచిపోయాను." అని అడిగాడు.

ఆనందరావు మాటలు విన్న వరహాలురావు బిక్కమొహం వేసి అక్కవైపు చూసాడు సపోర్టు కోసం.

"మీకెప్పుడూ మా తమ్ముణ్ణి ఏదో ఒకటి అనడమే పనా!  నన్ను, మిమ్మల్నీ చూడటానికి వచ్చాడు.  అంతేకదా తమ్ముడూ!" అందామె.

"అంతే!  అంతే!!  అయితే, ఈ ఊళ్ళో నా స్నేహితుడు ఒకడు ఇల్లు కడుతున్నాడు.  వాస్తు విషయంలో నా సలహా కోసం పిల్చాడు.  పనిలోపని మిమ్మల్ని కూడా చూసినట్లు ఉంటుందని వచ్చాను." అన్నాడు వరహాలరావు బావ మాటల్ని సీరియస్‌గా తీసుకోకుండా.

"చూసావా!... నేచెప్పలే, ఎవరి కొంపో కూల్చడానికి వచ్చాడు, అంతేకాని ఇల్లు కట్టించడానికి కాదు.  ఆ స్నేహితుడికి బుద్ధిలేకపోతే సరి!  ఇల్లు ఇంకెక్కడ కట్టగలడు వాడు?" అన్నాడు వాక్ప్రావాహం కొనసాగిస్తూ వాస్తు మీద ఏ మాత్రం నమ్మకం లేని ఆనందరావు.

ఆనందరావు మాటలకి దెబ్బతిన్నట్లు చూసాడు.  తనని అంతంత మాటలంటూంటే ఇక సహించలేకపోయాడు వరహాలరావు.

"హుఁ... బావా!...నా ప్రతిభ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ గుర్తించినా నువ్వు మాత్రం ఎప్పటికి గుర్తిస్తావో మరి!   నాకు వాస్తు సిద్ధాంతిగా ఎంత పేరు ఉందో నీకు తెలియదో, లేక నాకంత పేరు ఉందని నువ్వు కుళ్ళుకుంటున్నావో మరి!  నాకు ఎంత డబ్బులైనా చెల్లించడానికి సిద్ధమై క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసునా!"  సొంత డబ్బా కొట్టుకున్నాడు వరహాలరావు.

"అబ్బ నువ్వుండరా తమ్ముడూ!  ఏమండీ, నన్నైతే కసిరేస్తారు, ఇంటికి వచ్చిన మా తమ్ముణ్ణి కూడా ఇలాగే కడిగిపారేస్తే రేపొద్దున్న మనింటికి ఎవరూ రారు తెలుసునా!  ఒరేయ్ తమ్ముడూ... బావ మాటలకేమిగాని, నువ్వు లోపలికెళ్ళి స్నానం చేసి రా!  టిఫిన్ చేసాను.  తిందువుగాని!"  అంది అనంతలక్ష్మి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తూ. వరహాలరావు స్నానం చేయడానికి బాత్‌రూంకి వెళ్ళడంతో ఆ చర్చ అంతటితో వాయిదా పడింది.

వరహాలరావు తయారై వచ్చేసరికి డైనింగ్ టేబుల్‌మీద టిఫిన్ సిద్ధంగా ఉంది.  అప్పటికే ఆనందరావు, ఆనంతలక్ష్మీ వరహాలరావు కోసం ఎదురు చూస్తున్నారు.

వరహాలరావు కూడా కుర్చీ ముందుకు లాక్కుని కూర్చుంటూ, "సరే బావా!  మనమధ్య అసలు తగువెందుకు గానీ, అసలు కథ ఏమిటి? మీకు వచ్చిన కష్టమేమిటో చెప్తే సాధ్యమైతే ఏమైనా సహాయం చెయ్యగలనేమో ప్రయత్నిస్తాను కదా!"  అన్నాడు.

ఈ సారి ఆనందరావు కొద్దిగా శాంతించాడు.  బావమరిది సలహా మీద బొత్తిగా నమ్మకం లేకపోయినా తన సమస్య వివరించి చెప్పాడు.

"అదీ సంగతి!  అద్దె ఇవ్వడు, ఇల్లు ఖాళీ చెయ్యడు ఈ దగుల్బాజి దయాకరరావు.  ఏమైనా అంటే ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని కూడా చెప్పాడు." పెద్దగా నిట్టూర్చుతూ అన్నాడు ఆనందరావు.

"పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయావా బావా!" అన్నాడు వరహాలరావు.

"అదీ అయింది.  వాళ్ళనెలా మంచి చేసుకున్నాడో మరి, తిరిగి నేనే వాళ్ళని వేధిస్తున్నానని నన్నే బెదిరించి వెళ్ళారు పోలీసులు." నీరసంగా అన్నాడు ఆనందరావు.

"అలాగా!...ఎవరైనా రౌడీలను ఉసిగొల్పలేకపోయావా, కరెంటు, నీళ్ళు కట్ చేయకపోయావా?" అన్నాడు.

"అన్నీ అయ్యాయి!  ఏమీ లాభం లేకపోయింది."

"ఓహ్!...అయితే ఒక్కసారి వాళ్ళ వాటాకి వెళ్దాం రా బావా!" అన్నాడు వరహాలరావు టిఫిన్ ముగించి లేస్తూ.

"నన్ను చూస్తే ఆ దయాకరరావు దయలేకుండా మండిపడతాడురా!" చెప్పాడు ఆనందరావు.

"అలా అయితే ఎలా బావా?  ఇంటి యజమానివి, ఆఫ్ట్రాల్ ఇంట్లో అద్దెకున్నవాడికి నువ్వు భయపడితే ఎలా!  పోనీ నన్ను పరిచయం చేసి నువ్వు వచ్చేయ్." అన్నాడు వరహాలరావు.

అందుకు ఒప్పుకుని పై వాటాకి తీసుకెళ్ళి దయాకరరావుకి వరహాలరావుని పరిచయం చేసి కిందకి వచ్చేసాడు ఆనందరావు.

ఓ అరగంటసేపు వరహాలరావు దయాకరరావుతో ఏం మాట్లాడేడో గానీ, తిరిగి వచ్చి, "బావా!  నీకింకేం భయం లేదు. వారం రోజుల్లోపు ఆ దయాకరరావు ఆ వాటా ఖాళీ చేయకపోతే అప్పుడు నన్నడుగు." అన్నాడు.

"ఆఁ...!ఇలా నేనెన్ని చేయలేదు.  నువ్వో అరగంట చెప్తే మాత్రం వినేస్తాడా ఆ దగుల్బాజి." అన్నాడు ఆనందరావు.

"ఓ వారం రోజులు ఓపిక పట్టు బావా!  నువ్వే నన్ను పొగుడుతావు." అన్నాడు వరహాలరావు.

ఆ తర్వాత వరహాలరావు తన స్నేహితుడింటికివెళ్ళి సాయంకాలానికల్లా తిరిగివచ్చాడు.  ఆ తర్వాత రోజే ప్రయాణమై వాళ్ళ ఊరెళ్ళిపోయాడు.

వెంటనే ఆ విషయం మర్చిపోయాడు ఆనందరావు.  అయితే చిత్రం!  వరహాలరావు చెప్పినట్లు సరిగ్గా వారం రోజులలోపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు దయాకరరావు.  ఆశ్చర్యపోయాడు ఆనందరావు.  తను ఎంత ప్రయత్నించినా కానిది తన బావమరిది ఎలా సాధించాడో ఎంతమాత్రమూ అర్ధం కాలేదు ఆనందరావుకి.  మొత్తానికి ఇల్లు ఖాళీ అయినందుకు అనంతలక్ష్మి కూడా ఆనందించింది. "మా తమ్ముణ్ణి ఆడిపోసుకున్నారు గానీ, ఎంత సులభంగా వాళ్ళచేత ఇల్లు ఖాళీ చేయించాడో చూసారా?" అని మురిసిపోయింది కూడా.   కేవలం అరగంటలోనే తన సమస్యని వరహాలరావు ఎలా పరిష్కరించాడో తెలుసుకోవాలన్న జిఙాస ఆనందరావుని నిలువనియ్యలేదు.

వెంటనే వరహాలరావుకి ఫోన్ చేసి, "నువ్వన్నట్లుగా ఆ దయాకరరావు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.  ఇంతకీ నువ్వు అతనికి ఏం చెప్పావేమిటి?" అన్నాడు ఆత్రుతగా.

"ఆఁ...పెద్దగా ఏం లేదు బావా!  ఈ ఇంటి వాస్తు బాగులేదు.  అందుకే మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చింది.  మీ అమ్మాయి పెళ్ళి తప్పిపోవడానికి, మీ అబ్బాయి చదువు ఆగిపోవడానికి అన్నింటికీ ఇంటి వాస్తే కారణం.  ఇంకా వాస్తు దోషం కారణంగా ఇంట్లో ఎవరికైనా ప్రాణాపాయం కూడా కలగవచ్చు అన్నాను బావా దయాకరరావుతో. అంతే!  దెబ్బకి ఇల్లు ఖాళీ చేసాడు!  వరహాలరావా మజాకా!" అన్నాడు వరహాలరావు నవ్వుతూ.

"ఓర్నీ!  నీ అబద్ధాలతో దయాకరరావుని బాగానే హడలు గొట్టించావు.  దెబ్బతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సుమీ!  ఈ సారి వచ్చినప్పుడు నీకో మంచి బహుమతి ఇస్తానులే!" అన్నాడు అనందరావు గట్టిగా నవ్వి.

"బావా!  అతను హడిలిపోయి ఇల్లు వదిలాడు సరే కానీ, పై వాటాలో నిజంగానే వాస్తు దోషం ఉంది బావా!  ఇల్లు కట్టేటప్పుడు  నువ్వేమో నా మాట వినకపోతివి. ఎప్పుడు రావాలో చెప్పు, వాస్తులో ఏం మార్పులు చేయాలో నేను చెప్తాను." అన్నాడు వరహాలురావు.

వరహాలురావు మాటలు మింగుడుపడలేదు ఆనందరావుకి.  వెంటనే తేరుకొని, "పై వాటా ఇకముందెవరికీ ఇద్దెకిచ్చేది లేదు.  ఇంటికి అతిథులెవరైనా వచ్చినప్పుడు గెస్ట్‌రూముగా మాత్రమే ఉపయోగపడుతుంది.  అందాకా స్టోర్‌రూముగా వాడతాను!  ఇలా చేస్తే వాస్తు అవసరం ఉందంటావా?" అన్నాడు.

ఆనందరావు సంగతి తెలుసుకాబట్టి ఏమనలేక, "ఫర్వాలేదు బావా!  వాస్తు అనుగుణంగా  మార్పులు చేయాలని భావిస్తే మాత్రం నాకు కబురు చెయ్యు." అని ఫోన్ పెట్టేసాడు వరహాలరావు.

తను కూడా ఫోన్ పెట్టేస్తూ, 'వాస్తా, నా బొందా!  ఏదో వాస్తు పేరు చెప్పి ఇల్లు ఖాళీ చేయించాడు కాని ఆ పేరు చెప్పి ఇంట్లో మార్పులు చెయ్యమంటే చెయ్యాలా ఏం!' అని మనసులో అనుకున్నాడు వాస్తుపై అసలు నమ్మకం లేని ఆనందరావు. 

 

-పద్మావతి దివాకర్ల

 

 

 

 

 

మరిన్ని కథలు

this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి