అస్తిత్వం - డాక్టర్ చివుకుల పద్మజ

Existence

స్వార్ధం మనిషి యొక్క ప్రధాన గుణం. 'స్వ ప్లస్ అర్ధము' అంటే 'తన ప్రయోజనము' అని అర్ధం. ఈ గుణం ఉండబట్టే ఆనాటి ఆదిమానవుడు నిప్పు, చక్రం లాంటివి కనుగొని నేటి ఆధునిక మానవుడిగా పరిణామం చెందాడు. క్రమేణా స్వార్ధం అంటే 'తనకు మాత్రమే ప్రయోజనము' అని నిర్వచనం చేయబడింది. ఏ స్వార్ధం వల్ల ఆ ఆదిమానవుడు పురోగమించాడో, అదే స్వార్ధం యొక్క రూపు మార్చి ఈ ఆధునిక మానవుడు తిరోగమిస్తున్నాడు. ప్రకృతి అన్నివేళలా మానవునికి సహకరించదు కదా మరి! తన అస్తిత్వానికే ముప్పు ముంచుకొచ్చినప్పుడు విపత్తుల రూపంలో మానవుడిని హెచ్చరిస్తుంది. విన్నాడా! సరే సరి!!.. వినలేదా!..ప్రళయమే!!
టి.వి. ఆపేసి ఆలోచిస్తూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళుమూసుకున్నాను. 'అంటే మనిషికి స్వార్ధం ఉండకూడదా? పైకి ఎదగటం స్వార్ధమా? నేను స్వార్ధపరుడినా? కాదా? కాకపోతే నేనెవరిని?'
"ఏమలా వున్నారు?"
"తెలీట్లేదు ప్రశాంతీ! ఏంటో అయోమయంగా, అర్ధం కాకుండా వుంది."
"ఖాళీగా ఇంట్లో వుంటున్నారు కదా! అలాగే ఉంటుంది" మెల్లగా అని వెళ్ళిపోయింది.
టి.వి. నిండా కోవిడ్ వార్తలే - ఆస్పత్రులు, చావులు, దానాలు, ధర్మాలు.. వీటన్నిటి మధ్య నేనేంటో నాకే తెలియని ఒక అయోమయం.
అస్పష్టమైన ఒక ఆకారం నా కళ్ళ ముందు కనపడింది.
"ఎవరు నువ్వు?"
"నేను నువ్వే!"
"అంటే?" ఇంకాస్త అయోమయం..
"నేనెవరో, నువ్వెవరో తెలియాలంటే..వెనక్కి వెళ్ళు, బాల్యం నించి నడు!.. ప్రతి పాత్రలో నిన్ను నువ్వు చూసుకో!..తప్పొప్పులు అవలోకనం చేసుకో!!"
ఎవరతను? నన్నెందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? అప్రయత్నంగానే నా నోటి వెంట వచ్చింది - "వెళ్తున్నా."
                                                                                    కొడుకు
మా నాన్న - ఒంటి మీద చెమటని భూమి మీద రాల్చి, ఆ మట్టిని బంగారం చేసే వ్యవసాయదారుడు. బంగారం దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతే, మిగిలిన మట్టినే ఆప్యాయంగా తడిమే భూమి బిడ్డ.
చదువు మానేసి స్నేహితులతో ఆటలు, పాటలు అంటూ తిరుగుతుంటే, వద్దని, చక్కగా చదువుకోమని చెప్తే వినని నన్నేమనలేక అమ్మతో తన గోడు వెళ్లబోసుకునే వాడు- "బాగా చదివి పైకి వచ్చి బాగుపడతాడని ఆశ పడితే వీడేంటే?' అని.
అయన బ్రతికున్నంత కాలం నేను రికామీగానే తిరిగాను. ఏమీ పట్టేది కాదు. ఆ దిగులు పెట్టుకుని నాన్న పోయాక గానీ, నాకు లోకం అర్ధం కాలేదు. చాలా ఆలస్యమైంది. ఎంతో కష్టపడ్డాను చదివి, స్థిరపడడానికి. తల్చుకుంటే ఏడుపు వస్తోంది.
నాన్న ఫోటో చేతిలోకి తీసుకున్నాను. 'నాన్నా!..క్షమించు నాన్నా!" బిగ్గరగా ఏడ్చాను. ఫోటోలోంచి చల్లగా దీవించినట్లనిపించింది.
అమ్మ - ప్రేమమూర్తి. కడుపులో పెట్టుకుని పెంచింది. ప్రయోజకుడినై పట్నానికి వచ్చాక, పల్లెకు వెళ్ళటం తగ్గిపోయింది. తను పెద్దదైపోయింది. నేనెప్పుడూ వస్తానా అని కళ్ళలో వత్తులేసుకుని చూస్తుంది. ఇక్కడికి రమ్మంటే రాదు. నా ఇల్లు, నా నేల అంటుంది.
"ఒక్కసారి వచ్చిపోరా! చూడాలని వుంది" అంటుందెప్పుడూ. నా వుద్యోగం, నా కుటుంబం..నాకంత తీరిక కనిపించలేదు. విసుక్కునేవాడిని "ఎలా అమ్మా?" అని. నేను బిజీ అని తనే ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కుంటుంది.
"అమ్మా!..ఎలా వున్నావమ్మా?" ఎప్పుడూ కొడుకు నుంచి ఫోన్ అందుకోని అమ్మ సంతోషపడటం స్పష్టంగా తెలిసింది.
"మా నాయనే! బంగారు తండ్రీ!! ఎలా వున్నావురా నువ్వు?" ఫోన్ లోనించే నన్ను వొళ్ళంతా తడిమినట్లనిపించింది. మాట్లాడుతుంటే అమ్మకి కనిపించట్లేదనే బాధ క్రమంగా తగ్గిపోతోంది. అమ్మను నా దగ్గరికి తెచ్చుకుంటాను ఖచ్చితంగా.

                                                                                       అల్లుడు
నా పెళ్లి మా నాన్నమ్మ చేతుల మీదుగా జరిగింది. భోజనాల దగ్గర ఏదో మాటా-మాటా వచ్చి పెద్ద గొడవ అయింది. మా బాబయ్య, నాన్నమ్మ బెట్టు తగ్గలేదు. పెళ్ళికూతుర్ని కాపురానికి తెచ్చాక మళ్ళీ పుట్టింటికి పంపలేదు ఏ సందర్భానికైనా.
మా పిల్లలప్పుడు పురుళ్ళు మా అమ్మే పోసింది. తనే అమ్మై సేవలు చేసింది కోడలికి. నేను మామూలుగానే ఏమీ పట్టించుకోలేదు. ఒక చిన్న విషయానికే కన్నకూతురు దూరమై మా అత్తమామలు ఎంత బాధ అనుభవించి వుంటారో! నాన్నమ్మ పోయాక సంబంధాలు పునరుద్ధరించాము, కానీ ఆ దూరం దూరమే. వాళ్ళూ బాగా పెద్దవాళ్ళైపోయారు. కొడుకు దగ్గర పొసగక ఆశ్రమంలో వుంటున్నారు.
ఫోన్ చేశాను. "మా వాళ్ళ తరుపున ఇన్నేళ్లకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను మామయ్య గారూ!"
"కొడుకుతో పాటు మీకు కూతురూ ఉందని నేను మర్చిపోయాను. క్షమించండి. రేపు మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాం, అడ్డు చెప్పద్దు."
ఆ వృద్ధ దంపతులకి ఈ వయసులో మరో కొడుకు దొరికాడు.
                                                                                      భర్త
స్త్రీ సహనానికి మరో పేరు. అవును, నా భార్య మా ఆగడాలన్నీ సహించింది. పుట్టింటికి దూరమైనా, తన దుఃఖం లేశమాత్రమైనా మాకు తెలియనివ్వలేదు. అత్తమామల్ని పల్లెత్తి మాటనలేదు. వాళ్లలో తన తల్లితండ్రుల్నే చూసుకుంది.
నాకొచ్చే సంపాదన చాలక పట్నంలో ఇబ్బంది పడుతుంటే, తానూ ఉద్యోగంలో చేరి నాకు వేన్నీళ్ళకి చన్నీళ్లయింది. పొద్దున్న నాలుగు గంటలకల్లా లేచి పిల్లలకి, నాకు అన్నీఅందించి, తాను ఆఫీసుకు వెళ్లి, సాయంత్రం మళ్ళీ అన్ని పనులు చేసుకుని, నేను ఇంటికి ఆలస్యంగా వస్తే వేడివేడిగా భోజనం పెట్టి ఆదరించిన నా భార్య.
నేను ఏ పనుల్లోనూ ఆమెకు సహాయం చెయ్యలేదు. పిల్లల పెంపకం, వాళ్ళ రోగాలు, రొష్టులు... అన్నిట్లోనూ తనే. ఎన్ని అవస్థలు పడిందో..నన్ను ఒక్క మాట అనలేదు.
"ఇదిగోండి కాఫీ".. నా ఆలోచనలకు అంతరాయం.
చప్పున చెయ్యి పట్టుకున్నాను.."ప్రశాంతీ!..నీకు ఎన్నిసారీలు చెప్పినా సరిపోదు. ఇకపై నీ బాధ్యతలన్నీ నన్ను మోయనివ్వు."
ప్రశాంతి నవ్వింది మెత్తగా.
                                                                                       తండ్రి
తను సరిగ్గా చదువుకోక చిల్లరమల్లరగా తిరిగి దెబ్బతిన్నట్లు తన పిల్లలు కాకూడదని, చాలా కట్టుదిట్టాలు ఏర్పాటు చేశాడు. చదువుల పేరుతో వాళ్ళకి తల్లితండ్రులతో గడిపే సమయమే ఇవ్వలేదు. సరదాగా ఆడింది లేదు, పాడింది లేదు. తను వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి మరీ కొడుకును ఉన్న ఊళ్ళోనే హాస్టళ్లలో పెట్టి చదివించాడు. వాడిని వదల్లేక భార్య చూసిన బేలచూపుల్ని తోసిరాజన్నాడు. వాడు ఐ.ఐ.టి. సీటు సంపాదించుకునేదాకా వదల్లేదు. కూతురు మెడిసిన్ చదువుతోంది ఇక్కడే. మంచి వుద్యోగం తెచ్చుకున్న కొడుకు తమను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయాడు, మరో కొత్త హాస్టల్ కి వెళ్తున్నట్లే .. చాలా సామాన్యంగా..
"చిన్నా! నీ ఉన్నతి కోసమే ఆలోచించానే తప్ప, నీ మనసు అర్ధం చేసుకోలేకపోయాను రా!.. చిన్నవాడివి!..నన్ను మన్నిస్తావా!!" ఫోన్ లో రెండు పక్కలా ఇద్దరం ఉద్వేగంతో ఒణికిపోతున్నాం. ఘనీభవించిన మంచు కరిగి నీరవుతోంది. నా కూతురు నా చేయి పట్టుకుని నాకు ధైర్యం చెప్తోంది.
                                                                                     స్నేహితుడు
విశ్వంగాడు. నా చిన్ననాటి స్నేహితుడు. కలిసి చెట్ల వెంటా, పుట్టల వెంటా తిరిగిన ఆత్మీయ నేస్తం. మాస్టారి దెబ్బల్నించి, మా నాన్న నించి నన్ను కాపాడిన సందర్భాలెన్నో. వృత్తిపరమైన బేధాలు, పైకి ఎదిగే క్రమంలో వ్యక్తిగత స్పర్ధలుగా మారాయి. దారులు వేరయ్యాయి. నంబరు తెలీదు. లింకులు పట్టుకోవాలి. నా తప్పు ఒప్పుకుని మనసారా కావిలించుకోవాలి.
                                                                                       మనిషి
మనిషిగా పుట్టాక కేవలం తన కుటుంబమే కాదు, భూమి సంరక్షణ కూడా తన బాధ్యతే. ఆర్ధికంగా బాగా పైకి ఎదగాలనే తపనతో వుద్యోగంలో నిలదొక్కుకున్న తర్వాత తాను స్థాపించిన వ్యాపారం, ఒక మోస్తరు కెమికల్ ఫ్యాక్టరీ.
ఉత్పత్తి జరిగాక వెలువడే వాయువులు ప్రమాదకరమైనవి. సరైన ఫిల్టర్లు పెట్టకపోతే వాయుకాలుష్యానికి దారి తీస్తుంది. కానీ ఆ ఫిల్టర్లు ఖరీదెక్కువ.  లాభాపేక్షలో కన్నుమిన్ను గానక చవకరకం పెట్టించాడు తను, అధికారులకి డబ్బిచ్చి మరీ.
ఆ విషవాయువులతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు తనకి ఎవరిచ్చారు? తను ఎదిగితే చాలా? పక్కవారు ఏమై పోయినా పట్టదా? సమాజానికి మేలు చెయ్యకపోయినా పర్లేదు, చూస్తూ చూస్తూ చెడు మాత్రం చెయ్యకూడదు, ఎంత నష్టమైనా సరే. రేపు ఫ్యాక్టరీ తెరుస్తూనే ముందు ఆ ఫిల్టర్లు ఏర్పాటు చెయ్యాలి. దానితో పాటు ఫ్యాక్టరీ చుట్టుపక్కలా చిన్న అడవి పెంచాలి, పుట్టిన భూమి ఋణం తీర్చుకోవాలి. నిశ్చయించుకున్నాను.
                                                                                          నేను
చాలా, చాలా తేటగా ఉందిప్పుడు. వర్షం కురిసిన తర్వాత చెత్త అంతా కొట్టుకుపోయిన రోడ్డంత స్వచ్ఛంగా వుంది మనసు. కళ్ళెత్తి చూశాను. జరిగిన వాటన్నిటికీ నా ఎదురుగా సాక్షీభూతంగా ఉన్నఆ 'నేను' ఇప్పుడు లేడు, మాయం. అర్ధం అయింది అతనెవరో! అది నా అస్తిత్వమే!! ఐహిక జీవనంలో మరుగున పడేసిన భావావేశాలన్నీ బయటకి వచ్చాక కానీ 'నేను' అంటే ఎవరో నాకు తెలియలేదు.
స్వార్ధంతోనే మనిషి ఎదగాలి కానీ, దాని అర్ధం 'తనతో పాటు ఇతరుల ప్రయోజనం' అయ్యి ఉండాలి. దానితోపాటు తెలిసీ, తెలియక చేసిన తప్పొప్పులు సరిదిద్దుకుంటే ఏముందీ!..ఇంక జీవితంలో అంతా 'ప్రశాంతమే!!'

మరిన్ని కథలు

this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి