పదోన్నతి - పద్మావతి దివాకర్ల

Promotion

చూస్తున్న ఫైల్‌లోంచి తలెత్తి సమయం చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు మనోహర్.  సమయం ఏడు కావస్తోంది.  అప్పటికే ఆఫీస్‌లో చాలమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు.  తనుకాక ఇంకో ఇద్దరు మాత్రమే ఇంకా ఆఫీసులో  ఉన్నారు.  వాళ్ళు కూడా   అంతా సర్దుకొని ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు.  వారం రోజుల్లో హెడ్ ఆఫీసునుండి అడిట్ రానున్నదని సూచనాప్రాయంగా తెలియడంవల్ల పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేయడమే కాక, అడిట్‌కి కావలసిన ఫైల్సు అన్నీ సిద్ధం చేయమని మనోహర్‌కి బాస్ చిదంబరం చెప్పాడు.  ఆ పనిలోనే గత వారం రోజులనుండీ నిమగ్నమై ఉన్నాడు మనోహర్.  ప్రతీ రోజూ ఇంటికి వెళ్ళేసరికి తొమ్మిది దాటుతోంది.

కనీసం ఈ రోజైనా ఇంటికి తొందరగా వెళ్దామని అనుకున్నాడు గాని, బాస్ చిదంబరం మధ్య మధ్య అతన్ని పిలిచి కొన్ని కొత్త పనులు అప్పగిస్తూ ఉండటంతో ఈ సమయమైంది.  అప్పగించిన పని పూర్తైంది, ఇక వెళ్ళొచ్చని భావించి ఫైల్స్ అన్నీ సర్దాడు.

ఈ లోపున బాస్ నుండి మళ్ళీ పిలుపు వచ్చింది.  మనసులోనే విసుక్కొని బాస్ చాంబర్ లోకి వెళ్ళాడు మనోహర్.

చిదంబరం తన చాలా బిజీగా ఉన్నాడు.  అతని ముందు చూడవలసిన ఫైళ్ళు చాలా ఉన్నాయి.  మనోహర్ ఆ రూములోకి అడుగుపెడుతూనే తలెత్తి,"మనోహర్!  ఇప్పుడే మన హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది.  ఈ ఫైల్ అర్జెంట్‌గా పంపాలి, చూడు.  రేపటికల్లా పూర్తి కావాలి.  ఇంకోమాట, నీతో కొంచెం మాట్లాడాలి.  ఈ లోపున నాకు ఇంకో పని ఉంది.  పని పూర్తి చేసాక నిన్నుమళ్ళీ పిలుస్తాను." చెప్పాడు.

అది విని హతాశుడయ్యాడు మనోహర్.  ఈ రోజు కూడా తను తొమ్మిది గంటల లోపున ఇంటికి వెళ్ళేలా లేనని అనుకున్నాడు.  అడిట్ వచ్చిన తర్వాత ఎలాగూ మళ్ళీ ఓ పది రోజుల వరకూ ఎటూ త్వరగా ఇంటికి వెళ్ళడం కుదరదు.  ఆ ఫైల్ అందుకొని తన సీటుకి తిరిగి వెళ్ళాడు.

మనోహర్ ఆ కార్యాలయంలో చాలా నిబద్ధతగా, పద్దతిగా పని చేసే ఉద్యోగి.  తనకి అప్పగించిన పని పూర్తయ్యేవరకూ కుర్చీలోంచి కదలడు.  పూర్తి ధ్యాసంతా పనిమీదే ఉంటుంది.  వంచిన తల ఎత్తకుండా పని చేసే నైజం మనోహర్ సొంతం.  ఆ మంచి గుణమే అతనికి ఇంతవరకూ పదోన్నతి రాకుండా అడ్డుకుంది.  అదే స్థానంలో పనిచేసి పదేళ్ళు దాటినా, అతనికి ఇప్పటివరకూ ఏ పదోన్నతి దక్కలేదు.  ఇంతవరకూ అతనిపై అధికారులందరూ మనోహర్ పనితనాన్ని బాగా వాడుకొని వదిలేసినవాళ్ళే.  మనోహర్ పనితనాన్ని పైకి మెచ్చుకునేవారేకాని అందువల్ల మనోహర్‌కి ఎటువంటి ప్రయోజనం ఉండేది కాదు.  అతనికి ప్రమోషన్ వచ్చి బదిలీ అయి వెళ్ళిపోతే బహుసా ఆఫీస్ పనులు సక్రమంగా జరగవేమోనన్న ఆలోచన వారిది కావచ్చు.  మనోహర్ పనితనం వల్ల ఆ అధికారులందరూ మాత్రం పదోన్నతి సాధించినా అతనికి మాత్రం ఏ మాత్రం లాభం లేకపోయింది.  పైగా పనిలో ఏ మాత్రం శ్రద్ధ చూపని తన సహోద్యోగులు మాత్రం పదోన్నతి సాధించడం చూసి కాస్త విరక్తి చెందాడు. రానురాను మనోహర్‌లో కూడా నిరాశా నిశ్ప్రహలు అలుముకున్నాయి, కాని పని రాక్షసుడిగా పేరు పొందిన అతను మాత్రం కాలానుగుణంగా మారలేకపోయాడు.  పనిలో అతని శ్రద్ధ కూడా తగ్గలేదు.  పదోన్నతి రాలేదన్న దిగులు మనసులో ఆవరించినా, పనిలో మాత్రం అది చూపెట్టేవాడు కాదు.

చిదంబరం అధికారిగా ఈ కార్యాలయానికి వచ్చి ఒక్క సంవత్సరం మాత్రమే అయింది.  అతను కూడా త్వరలోనే మనోహర్ పనితనాన్ని గుర్తించాడు.  ఇంకెవరివల్లా కాని పనులన్నీ మనోహర్ చేతే చేయించుకోనారంభించాడు.  ఎంత పని చేయించినా ఇంతవరకూ ఎప్పుడూ మెచ్చుకోలేదు మాత్రం.  అప్పటికే ఆఫీసర్లు అందరూ ఒకేలాంటి వాళ్లని ఓ అభిప్రాయం ఏర్పర్చుకున్నాడు మనోహర్. అయితే మనోహర్ వీటన్నిటికీ అతీతంగా ఎప్పటివలే తన పని తాను చేసుకుపోతున్నాడు.  అయితే వరసగా వారం రోజులనుండీ ఇంటికి వెళ్ళడం ఆలస్యం అవడంతో ఈ రోజు కొంత విసుగుపుట్టింది.  తనలాంటి పని చేసే వాళ్ళని వదిలి ప్రమోషన్లు కూడా పని చేయనివారికే ఇవ్వడంవల్ల ఈ మధ్య కొంత బాధనిపిస్తోంది.  పని చేస్తూ ఆలోచనల్లో పడ్డాడు మనోహర్.  ఈ అడిట్ పూర్తైన తర్వాత ఇక మరి ఎక్కువ సేపు ఆఫీసులో ఉండకూడదని మనసులోనే ఓ నిర్ణయం తీసుకున్నాడు.  ఈ మధ్యనే మళ్ళీ పదోన్నతి కోసం హెడ్ ఆఫీసుకి తన సిఫార్సులు పంపించనున్నాడు ఆఫీసర్ చిదంబరం.  ఆఫీసులో అసలు పని మాటే ఎత్తని రాంబాబు ఈ సారి ప్రమోషన్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నాడు, ఎందుకంటే అతని   దగ్గర బంధువు ఒకడు హెడ్ ఆఫీసులో పెద్ద పదవిలో ఉన్నాడు.  అలాగే ఇంకో సహోద్యోగుడు అనిల్‌కి ఓ రాజకీయ నాయకుడి అండ ఉంది.  శంకర్ అనే ఇంకో సహోద్యోగుడికైతే యూనియన్ లీడర్ల అండదండలున్నాయి.  ఆ ముగ్గురూ కూడా ఈ సారి ప్రమోషన్ తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు.  వీళ్ళెవరికీ పనిలో నిజాయితీ, నిబద్ధత, శ్రద్ధ లేకపోయినా సాధారణంగా ప్రమోషన్ వచ్చేది ఇలాంటివాళ్లకే.  తను ఎన్ని ఏళ్ళు కష్టపడి పని చేసినా తన బతుకు ఇంతే అని వైరాగ్యంగా అనుకున్నాడు మనసులో మనోహర్.  పైగా తనని చూసి నవ్వేవాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్య.

ఇకనుండి తను కూడా అందరిలాగే అయిదు గంటలకల్లా ఆఫీసు వదిలేయాలి.  తను  ఆఫీసు పనిలో పడి ఇంటి విషయాలు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు.  పిల్లల విషయం కూడా పట్టించుకోలేక పోతున్నాడు.  పిల్లల చదువు, ఇంటి బాధ్యతంతా భార్య మాలతే చూసుకొంటోంది పాపం.  ఎప్పుడో రెండు మూడు నెలలకోసారి మాత్రమే భార్యా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళ గలుగుతున్నాడు.  ఇకనుండి తను కూడా మిగతా వాళ్ళలాగే ఉండాలి.  ప్రమోషన్ ఎలాగూ రాదు, తనొక్కడే మాత్రం ఎందుకు అంత కష్టపడి పని చేయాలి!  ఇలా సాగుతున్నాయి మనోహర్ మదిలో ఆలోచనలు.  ఇలా ఆలోచిస్తూ పని చేస్తూ మనోహర్ ఎప్పుడు తొమ్మిది గంటలైందో కూడా గమనించలేదు.

పని చేస్తూ యధాలాపంగా వాచీ చూసుకొన్న మనోహర్ ఉలిక్కిపడ్డాడు. సమయం తొమ్మిది దాటింది.  ఇంతవరకూ చిదంబరం నుండి పిలుపు రాలేదు.  పనిలో బిజీగా ఉండి మర్చిపోయాడేమో అనుకొని మనోహర్ అతని రూముకి వెళ్ళాడు.

మనోహర్ రావడం గమనించిన చిదంబరం, "రావోయ్!  రా కూర్చో!  నిన్ను పిలుద్దామని అనుకొనే లోగా నువ్వే వచ్చావు.  టైం తొమ్మిది దాటింది.  ఇవాళ్టికి చాలు.  ఇక వెళ్దాం.  మళ్ళీ రేపు ఉదయమే రావాలి." అని, "ఆఁ...నీతో మాట్లాడాలని అన్నాను కదా!  నువ్వు చాలా సిన్సియర్‌గా పని చేస్తున్నా నీకెందుకు ఇంతవరకూ ప్రమోషన్ రాలేదో నాకు అర్ధం కావడంలేదు.  నీ చేత చాకిరీ చేయించుకొని ప్రమోషన్ విషయం వచ్చేసరికి నీ మాట మర్చిపోయేవారేమో ఇంతకు పూర్వం అధికారులు!  హెడ్ ఆఫీస్ నుండి ఈ ఏడు పదోన్నతికి జాబితా పంపమని పదిరోజుల కిందటే సందేశం వచ్చింది. అసలు ఈ కార్యాలయంలో నువ్వొక్కడివే అందుకు అర్హ్వుడవని వాళ్ళకి తెలియపర్చాను.  మరో రెండురోజుల్లో ఆ శుభవార్త వస్తుంది. ఆ విషయం నీకు చెబ్దామనే ఆగమన్నాను. బెస్ట్ ఆఫ్ లక్!  ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.  ఇంక ఇంటికి వెళ్ళి రా!  నేను కూడా ఓ రెండు నిమిషాల్లో బయలుదేరుతున్నాను." అని చిదంబరం చెప్పి మనోహర్‌తో కరచాలనం చేసాడు.

బాస్ చెప్పిన శుభ వార్తకి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు మనోహర్.  ఎట్టకేలకు తన కృషికి తగిన ఫలితం లభించిందని భావించాడు.  తన మదిలో ఇదివరకు కలిగిన భావనలు చెరిపేసి, ఇకముందు మరింత శ్రద్ధగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని మనసులోనే దృఢ సంకల్పం చేసుకున్నాడు.

"ధన్యవాదాలు సార్!" అని సంతోషంగా తన కృతఙతలు తెలియజేసి బయటకు వచ్చాడు మనోహర్.

మరిన్ని కథలు

this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి