నమ్మకం - పద్మావతి దివాకర్ల

Believe

ఆ రోజు శ్రావణ శుక్రవారం. తెల్లవారి నాలుగింటికే లేచిన శ్రావణి వాకిలి శుభ్రపరచింది. స్నానం ముగించి ముంగిట ముగ్గులు వేసి వరలక్షి పూజ కోసం పువ్వులు కోసింది. శ్రద్ధగా పూజ చేసుకుంది. శ్రావణికి దైవభక్తి మెండుగా ఉంది. శ్రావణికి వ్రతాలు, నోములు, పూజలు అవీ శ్రద్ధగా చేసుకోవడం అలవాటు. ఆమె భర్త శైలేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

ప్రతీ సోమవారం ఉదయమే లేచి శివుని గుడికివెళ్ళి అర్చన చేయించడం అలవాటు. అలాగే శనివారం శ్రీనివాసుని కోవెలకి వెళ్తుంది. అలాగే దాదాపు వారంలో ప్రతీరోజు ఏదో ఒక గుడికి వెళ్ళి వస్తూనే ఉంటుంది. ఆమెకి పాతతరం వాళ్ళలా చాలా నియమాలే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది లక్ష్మివారం, శుక్రవారం డబ్బులు ఖర్చు పెట్టకూడదన్నది ఒకటి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ఆ రోజుల్లో తనెలాగూ ఖర్చుపెట్టదు, అంతేకాక భర్త చేత కూడా ఖర్చుపెట్టనివ్వదు.

ఆ రోజుల్లో డబ్బులు ఖర్చుపెడితే తమ ఇంట్లోని లక్ష్మి దూరమవుతుందని ఆమె ప్రగాఢ విశ్వాసం. చిన్నప్పుడు తల్లితండ్రులవద్ద కన్నా బామ్మ దగ్గరే ఆమెకి చేరిక ఎక్కువ. శ్రావణి బామ్మ ఆమెకి చిన్నప్పటినుండి బాగా భక్తిభావం నూరిపోసింది. భక్తికథలు, రామాయణ మహాభారతాలు ఆమెకి చిన్నప్పుడే బోధించేది. అలాగే నీతి కధలు కూడా చెప్పేది. అలా పెద్దయినాక కూడా తనకంటూ కొన్ని నియమాలు ఏర్పరచుకొని వాటిని తూచా తప్పక పాటిస్తోంది శ్రావణి. లక్షివారం, శుక్రవారం డబ్బులు ఖర్చు చేయకూడదన్న నియమంకూడా అలా ఏర్పరచుకున్నదే. తన బామ్మ నమ్మకాల్ని పుణికిపుచ్చుకుందామె. శ్రావణి బామ్మకి ఇలాంటి చాదస్తాలెన్నో! వాటన్నిటికీ శ్రావణి సరైన వారసురాలైంది. పూర్వకాలపు ఆచారాలన్నీ పాటిస్తుంది. అద్భుదయ భావాలకల శైలేంద్ర ఆమె ప్రవర్తనకి అప్పుడప్పుడు విసుక్కునేవాడు కూడా.

ఓ శుక్రవారం నాడు తన స్కూటర్ చెడిపోవడంతో మెకానిక్‌ని పిలవవలసి వచ్చింది. అతను బండి రిపేర్ చేసిన తర్వాత శైలేంద్ర డబ్బులు ఇవ్వబోతుంటే ఒప్పుకోలేదు ఆమె.

"శుక్రవారం డబ్బులు ఖర్చు చేస్తే శ్రీమహాలక్ష్మి ఇల్లు వదిలిపోతుందండీ! అతనికి డబ్బులు రేపు ఇస్తానని చెప్పండి." అందామె. ఆ విధంగానే ఏదో సాకు చెప్పి ఆ మెకానిక్‌కి అప్పటికి ఎలానో పంపవలసి వచ్చింది అతనికి. ఆ మరుసటి రోజు అతనికి డబ్బులు చెల్లించాడు.

అలాగే ఒకసారి రాకరాక శైలేంద్ర చెల్లెలు, బావగారు ఇంటికి వచ్చారు. వాళ్ళకి బట్టలు కొనడానికి బజారుకి తీసుకెళ్ళడానికి బయలుదేరుతూంటే శ్రావణి అందుకు ఒప్పుకోలేదు.

"మర్చిపోయారా! ఇవాళ శుక్రవారం. ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. రేపు ఉదయమే వెళ్ళి కొనండి." అందామె.

అన్నతో బజారుకు వెళ్ళడానికి తయారైన శైలేంద్ర చెల్లెలు గిరిజ వదిన మాటలకి చిన్నబుచ్చుకుంది.

"రేపు ఉదయమే వాళ్ళు వెళ్ళిపోతారు కదా! రేపెలా కొనగలను?" అన్నాడు అయోమయంగా శైలేంద్ర భార్య ప్రవర్తనకి చిరాకు పడుతూ.

"ఏది ఏమైనా ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టడానికి వీల్లేదు." అందామె ఖరాఖండీగా.

భార్య మాటలకి చెల్లెలు, బావగారిముందు తలకొట్టేసినట్లైంది శైలేంద్రకి. భార్య మాటలకి కోపం వచ్చి ఆ రోజంతా మాట్లాడలేదు. అతని చెల్లెలు గిరిజ కూడా వదిన్ని చూసి మొహం తిప్పుకుంది. అయితే ఆ మరుసటిరోజు, వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు శైలేంద్ర తనకోసం పదివేల రూపాయలు పెట్టి కొన్న కొత్తచీర పసుపుకుంకుమలతో ఆడబడుచుకి ఇచ్చి, ఆమె భర్తకోసం బట్టలు కొనుక్కోవడానికి తను దాచుకున్న ఐదువేల రూపాయలు కూడా ఇచ్చింది శ్రావణి. ఆమె ప్రవర్తనకి విస్తుపోయాడు శైలేంద్ర. గిరిజ కూడా తన వదినని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు మనసులోనే బాధపడింది. ఆ తర్వాత వదిన నియమాలు, నమ్మకాలు గుర్తుకు వచ్చి సర్ధుకుంది.

ఇంకోసారిలాగే శైలేంద్ర స్నేహితుడు సత్యమూర్తి వాళ్ళింటికి వచ్చాడు. మాటలవరసలో అతను తనో ఫ్లాట్ కొనడానికి ముందుగా కొంత డబ్బులు ఇచ్చినట్లు చెప్పాడు. అంతేకాక ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఇంకొక్క ఫ్లాట్ మాత్రమే మిగిలి ఉందని, అది బుక్ చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజని తెలిపాడు. ఆ అపార్ట్‌మెంట్ మంచి లోకాలిటీలో ఉండటమేకాక ధరకూడా అందుబాటులో ఉంది. చాలారోజులనుండి శ్రావణికి, శైలేంద్రకి బ్యాంక్‌లోన్ తీసుకొని ఓ ఫ్లాట్ కొనుక్కోవాలని ఉంది. అయితే ఆ రోజు లక్ష్మివారం కావడంవలన ఆ రోజు బయానాగా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు శ్రావణి. ఆ విధంగా లభించిన అరుదైన అవకాశం చేజారిందని విచారించాడు శైలేంద్ర. భార్య చాదస్తానికి అతనికి కోపం కూడా వచ్చింది. అయితే ఆమె పట్టుదల తెలిసిన శైలేంద్ర ఏమీ అనలేకపోయాడు.

అయితే శ్రావణి చాదస్తం వల్ల కొన్ని సార్లు మేలు కూడా జరిగింది. ఓ సారి శ్రావణికి మామయ్య వరసైన ఏకాంబరం ఏదో అత్యవసరమైన పని ఉందని, పాతికవేలు అప్పుకావాలని అడిగాడు. భార్య తరఫు బంధువని, శ్రావణి అతనికి అప్పు ఇవ్వడానికి అభ్యంతరం పెట్టదని అనుకున్నాడు. అయితే తన అంచనా తప్పని తెలుసుకోవడానికి అతనికి ఎక్కువసేపు పట్టలేదు. ఆ రోజు లక్ష్మివారం కావడంతో శ్రావణి అందుకు ఒప్పుకోలేదు. ఏకాంబరం వాళ్ళని చీదరించుకొని వెళ్ళాడు. అతనికి బాధ కలిగించినందుకు శైలేంద్ర బాధపడ్డాడు కాని శ్రావణి ఏమాత్రం బాధపడలేదు. ఆ మరుసటి రోజు తెలిసినదేమిటంటే, ఏకాంబరం ఇంకెక్కణ్ణుంచి అప్పు తెచ్చాడో ఏమో మాత్రం, పేకాట ఆడుతూ పోలీసులకి దొరికిపోయాడు. అది తెలిసిన శైలేంద్ర తను ఏకాంబరంకి అప్పు ఇవ్వనందుకు సంతోషించాడు.

అలాగే ఒకసారి శైలేంద్రకి దూరపు చుట్టం ఒకరు చిట్ ఫండ్‌లో డబ్బులు పెడితే మంచి లాభాలు, బహుమతులు వస్తాయని ఊరించాడు. అతని వాగ్ధాటికి చిత్తయిపోయిన శైలేంద్ర అందులో ఓ రెండు లక్షలు జమ చేద్దామని అంటే ఆ రోజు శుక్రవారం కావటం మూలాన శ్రావణి ఒప్పుకోలేదు. ఆ చిట్ ఫండు కంపెనీ నిర్వాహకులు నెలరోజుల్లోపే బోర్డ్ తీప్పేసారని తెలిసి గుండెలమీద చెయ్యేసుకున్నాడు శైలేంద్ర. ఆ విధంగా శ్రావణి నమ్మకం వాళ్ళిద్దర్నీ చాలా సార్లు కాపాడింది.

శ్రావణి చాదస్తం తెలిసిన ఇరుగూ, పొరుగూ, చుట్టపక్కల వాళ్ళు కూడా ఆమెని ఆ రోజుల్లో చేబదులు అడగడానికి జంకుతారు. బంధువులైతే సరే సరి! పొరపాటున ఎవరైనా వారంలో ఆ రెండురోజుల్లో ఆమె చేత ఖర్చు పెట్టదలిస్తే ఇక అంతే సంగతులు! ఆమె సంగతి తెలిసిన పనిమనిషి, వాడుకగా పాలు పోసేవాడు, ఇలాంటివాళ్ళందరూ కడు జాగ్రత్తగా ఆమెతో మసులుతారు. మిగతా రోజుల్లో దానకర్ణుడైన ఆమె ఆ రెండురోజుల్లో మాత్రం చిల్లిగవ్వకూడా బయటకు వెళ్ళనివ్వదు. ఏదిఏమైనా తన నమ్మకం ఆమెకి ముఖ్యం.

**** **** **** **** ****

ఆ శ్రావణ శుక్రవారం పూజ ముగించిన తర్వాత భర్తకి కేరియర్ సర్దింది శ్రావణి. శైలేంద్ర ఆఫీసుకి బయలుదేరడానికి స్కూటర్ తీసేసరికి పక్కింటి సుమతి అదరాబాదరాగా వచ్చింది వాళ్ళింటికి.

ఆమె గాబరా పడుతూండటం చూసి, "ఏమైంది అక్కా!” అని అడిగింది శ్రావణి ఆమెకి ఎదురెళ్ళి.

"బాబుకి రెండు రోజులనుండీ విపరీతమైన జ్వరం. ఇందాక ఫిట్సు కూడా వచ్చాయి. సమయానికి ఆయన ఊరిలో కూడా లేరు. ఇంట్లో డబ్బులు కూడా పెద్దగా ఏమీ లేవు. ఇరుగుపొరుగు అందర్నీ అప్పు అడిగాను, కాని ఎక్కడా దొరకలేదు. నాకు ఏం చేయాలో కాళ్ళు చేతులూ ఆడటం లేదు." అంది సుమతి విపరీతమైన ఆందోళనతో. ఆమె పరిస్థితి చూసి చలించింది శ్రావణి.

"అయ్యో! ఇప్పుడెలా?" అన్న శ్రావణి వెంటనే తేరుకుని ఓ నిర్ణయం తీసుకొని, "ఒక్క నిమిషం ఉండు అక్కా! నేను కూడా వస్తాను, హాస్పిటల్‌కి తీసుకెళ్దాం బాబుని." అని ఇంటిలోకి వెళ్ళి పర్సు చేతపట్టుకుని ఇంటికి తాళం వేసింది.

అప్పుడే ఆఫీసుకి బయలదేరబోతున్న శైలేంద్ర కూడా అక్కడికి వచ్చి పరిస్థితి తెలుసుకున్నాడు. "మిమ్మల్ని ఆటో ఎక్కించి నేను కూడా హాస్పిటల్‌కి వస్తాను. ఏం భయం లేదు." అని వెంటనే తన ఆఫీసుకి ఫోన్ చేసి పరిస్థితి వివరించి సెలవు పెట్టాడు. ఈ లోపు సుమతి, బాబుని తీసుకొని వీధిలోకి వచ్చింది శ్రావణి. శైలేంద్ర బాబు వంటిమీద చెయ్య వేసి చూసాడు. ఒళ్ళు కాలిపోతోంది. ఇక జాగు చెయ్యక అటు పోతున్న ఆటోని పిల్చి వాళ్ళని ఎక్కించి, తను స్కూటరుపై వాళ్ళ వెనక వెళ్ళాడు.

స్కూటర్‌పై వెళ్తూన్న శైలెంద్రకి హఠాత్తుగా ఓ సందేహం వచ్చింది. ఇవాళ శుక్రవారం, అంతేకాదు శ్రావణ శుక్రవారం! సుమతి వద్ద బాబు వైద్యానికి సరిపడా డబ్బులు లేవు. శ్రావణి మానవతా దృష్టితో ఆమెని, బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిందేగాని, అక్కడ డబ్బులు కట్టడానికి ఒప్పుకోదే! ఏమి చేయటమా అని ఆలోచించసాగాడు శైలేంద్ర.

ఇలా ఆలోచిస్తూనే హాస్పిటల్‌కి చేరాడు శైలేంద్ర. సరిగ్గా అప్పుడే ఆటోకూడా అక్కడకి చేరుకుంది. ఆటోలోంచి దిగారు శ్రావణి, సుమతి బాబుతో. ఆటో అతనికి డబ్బులివ్వడానికి జేబులో చెయ్యపెడుతూ ఆగిపోయాడు శ్రావణిని చూస్తూనే. సుమతి తను డబ్బులు ఇవ్వబోతుంటే ఆమెని వారించి పర్సు తెరిచి ఆటోఅతనికి డబ్బులిచ్చింది శ్రావణి. ఆమె వంక ఆశ్చర్యంగా చూసారు శైలేంద్ర, సుమతి కూడా. బహుశా ఈ గందరగోళంలో ఆమె ఇవాళ శుక్రవారం అన్న సంగతి మర్చిపోయిందేమో అని అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు శైలేంద్ర.

ఆ తర్వాత సుమతిని వెంటబెట్టుకొని ఆస్పత్రి లోనికి వెళ్ళింది శ్రావణి. ఆ వెనుకే శైలేంద్ర కూడా వెళ్ళాడు. బాబుని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసారు. శ్రావణే శైలేంద్రని పిల్చి కౌంటర్‌లో డబ్బులు కట్టమని చెప్పింది, "అక్క దగ్గర డబ్బులు లేవుట పాపం, మీరు కట్టేయండి." అంది. ఎప్పుడూ శుక్రవారం తనచేత కూడా డబ్బులు ఖర్చుపెట్టనివ్వని శ్రావణేనా ఈ మాటలు అంటున్నది అని ఆమెవైపు అపనమ్మకంగా చూసాడు.

"మీకే చెప్పేది! వేగం వెళ్ళి డబ్బులు కట్టి రండి." అందామె బాబుని తీసుకువెళ్ళిన వార్డు వైపు కదులుతూ. ఆమె వెళ్తున్నవైపు విస్మయంగా చూస్తూ ఆ పనిలో పడ్డాడు శైలేంద్ర.

ఆ రోజు సాయంకాలం వరకూ శైలేంద్ర, శ్రావణి కూడా సుమతికి తోడుగా హాస్పిటల్‌లోనే ఉన్నారు. మధ్యాహ్నం తను హోటల్లో తిని వాళ్ళిద్దరికీ భోజనం తెచ్చాడు. సాయంకాలమయ్యేసరికి బాబుకి కొంచెం నెమ్మదించింది. ప్రాణాపాయ పరిస్థితి తప్పింది. ఈ లోపు ఫోన్‌ద్వారా కబురు తెలుసుకున్న సుమతి భర్త శివరాం హుటాహుటిన హాస్పిటల్‌కి చేరుకున్నాడు. బాబు పరిస్థితి బాగుపడటం చూసి ఊపిరి పీల్చుకున్నాడు.

"మీరిద్దరూ మాకెంతో సహాయం చేసారు. మీ మేలు మర్చిపోలేను." చెప్పాడు శివరాం కన్నీళ్ళతో శైలేంద్ర చేతులు పట్టుకొని.

"నిన్న రాత్రి నుండి బాబుకి విపరీతమైన జ్వరమండి. ఫిట్సు కూడా వచ్చాయి. చేతిలో డబ్బులు కూడా లేవు. సమయానికి అక్కయ్యావాళ్ళు సహాయం చేయకపోతే బాబు పరిస్థితి ఏమై ఉందేదో తలచుకోవడానికే భయం వేస్తోంది." చెప్పింది సుమతి కంటతడి పెట్టి.

"ఇరుగూ పొరుగూ అన్నాకా ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలాగా!" అంది శ్రావణి.

సాయంకాలం ఏడు గంటల వరకూ అక్కడే ఉండి ఇంటికి తిరిగివచ్చారు శైలేంద్ర, శ్రావణి.

స్కూటర్‌పై ఇంటికి తిరిగివచ్చాక, "ఎంత గండం గడిచింది! సమయానికి హాస్పిటల్‌కి బాబుని తీసికెళ్ళకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది!" అంది శ్రావణి ఇంటి తాళం తీస్తూ.

సోఫాపై అలసటగా చేరబడిన శైలేంద్రకి ఒక విషయం మాత్రం అంతుబట్టలేదు. లక్ష్మివారంగానీ, శుక్రవారంగానీ పైసా కూడా ఖర్చుపెట్టనివ్వని శ్రావణి తను స్వయంగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాకుండా, తన చేత కూడా ఎలా డబ్బులు కట్టించింది అన్న విషయమే అర్ధం కాలేదు శైలేంద్రకి. పొరపాటున ఇవాళ శుక్రవారమన్న సంగతిగాని ఆమె మర్చిపోయిందా?

ఈలోపు బాత్‌రూముకివెళ్ళి స్నానంచేసి కాఫీ కలిపి భర్తకి ఇచ్చింది శ్రావణి. తనని వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం తెలుసుకోగోరి ఆమెని అడిగాడు, "అవునూ, ఇవాళ శుక్రవారం, అందులో శ్రావణ శుక్రవారం కదా! డబ్బులు కట్టమన్నప్పుడు కొంపతీసి ఆ విషయం మర్చిపోయావా?"

"భలేవారే! ఎందుకు మర్చిపోతాను? అయితే డబ్బులు కన్న ప్రాణం గొప్పది కదా! డబ్బులు పోతే తిరిగివస్తాయి, కానీ ప్రాణం అలాకాదుగా! ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే మనం వారం వర్జ్యం చూస్తే అవుతుందా? మామూలు ఖర్చులంటే ఆ రోజుల్లో చెయ్యకపోయినా ఉపద్రవం ఏమీ లేదు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు చెయ్యకపోతే ఎలా? నా నమ్మకం నమ్మకమే, కాని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రం కాదు." చెప్పిందామె తను కూడా సోఫాలో కూర్చొని.

అవాక్కై ఆ మాటలు వింటున్నాడు శైలేంద్ర. ఆమె చెప్పింది నిజమే! అనవసర ఖర్చులు ఆ రోజుల్లో మానుకోవచ్చు కానీ, అత్యవసర పరిస్థితులు మనకోసం ఆగవుగా! అందుకే ప్రాణాపాయ పరిస్థితిలో ఆమె తన నమ్మకాన్ని సడలించిందన్న నిజం గ్రహించి భార్యవైపు అభినందన పూర్వకంగా చూసాడు శైలేంద్ర.

-పద్మావతి దివాకర్ల

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు