అరెరే గుండు - రవి మంత్రి

arere gundu

ఎన్నాళ్ళనుంచో మా NRI ల సాధకబాధకాలు చెప్తూ ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా.కానీ,దానికి కొంత సమయం,ఓపిక,అన్నిటినీ మించి ఎక్కడ మొదలెట్టాలో అన్న ఆలోచన రాక కొట్టుకుంటూ ఉండగా...ఉండగా..ఉండగా,ఇంక ఇంతకంటే ఎక్కువ ఉంటే బాగోదని,ముందు ఇది చెప్పేద్దాం అని,చెప్పకపోతే ఎక్కడ మర్చిపోతానో అని అర్జెంటుగా వచ్చేసా..

టూకీగా చెప్పాలంటే ఇదో పిట్ట కథ..నా జుట్టు కథ..

అతుకుల బొంతలా ఉండే నా మొహానికి నా జుట్టే అందం అని నాకు పెద్ద ఫీలింగు.పందెంకోడికి బాదాంపప్పు,పిస్తాపప్పు పెట్టి మేపినట్టు..ఛీఛీ,ఇదేం పోలిక? పొలానికి సేంద్రియ ఎరువులు వేసి పెంచినట్టు..వేపనూనె,కొబ్బరినూనె, కుంకుడుకాయలు అవి దొరకవు కాబట్టి మంచి షాంపూ గట్రా పెట్టుకుని ఆ ఉన్న జుట్టు ఊడకుండా, కాపాడుకుంటూ ఉంటా.నా సర్కిల్లో నన్నో ట్రైకాలాజిస్టులా చూస్తారు మాట.ఏ చిన్న జుట్టు సమస్య వచ్చిన నా సలహా తీసుకుంటారు.

మా గతమెంతో ఘనం అనీ,ఇదంతా నేను ఇండియాలో ఉన్నప్పటి మాట.ఇక్కడికొచ్చిన వేళావిశేషం ఏవిటోగానీ ముచ్చటగా అర సెంటీమీటరు జుట్టు చూసుకుని ఎన్ని యుగాలైందనీ?

ఇక్కడి తలతిక్క వాతావరణానికి అసలు జుట్టు పెరిగి చావనేచావదు.పొద్దుపొద్దున్నే నా అంత మనిషిని కూడా విసిరికొట్టేసే అంత గాలి,మధ్యాన్నం మాడ్చేసే ఎండా,సాయంత్రం సరదాగా వర్షం,రాత్రికి చంపేసే చలి.ఇన్ని వేరియేషన్స్ ఒకేరోజు చూపించేస్తే తలతిక్క వాతావరణం అనే అంటారు మరి.పోనీ నానా కష్టాలూ పడి ఒపిగ్గా ఒక ఆరు నెల్లు పెంచేసి(నేను చెప్పిన ఆ అర సెంటీ పెరగడానికి నాకు పట్టిన టైము),సరే ఓ మోస్తరు అందంగానే ఉన్నాం అనుకుని...అనుకుని అక్కడ ఆగొచ్చుగా? ఆహా..ఆశ..సినిమాల్లో వాడిని చూసి,బైట ఇంకొకణ్ణి చూసి కొద్దిగా,చాలా కొద్దిగా చివర్లు కట్ చేయించుకుంటే,షేప్ చేయిస్తే,మనం కూడా వాడిలా,ఆ మాటకొస్తే వాడికన్నాఇంకా అందంగా కనిపించేస్తాం ఏమో.నా పిచ్చి!!!అని అనుకుని,ఒక వెచ్చని శని/ఆదివారపు మధ్యాన్నం బయల్దేరా.

బాగా లేకిగానూ,మహా రిచ్చుగాను కాకుండా ఒక మోస్తరుగా ఉన్న సెలూన్ చూసి,బియ్యం డ్రమ్ముపక్కన పెట్టిన ఉల్లిపాయ కోసం కక్కుర్తిపడి ఏ అర్ధరాత్రో అపరాత్రో జాగ్రత్తగా బోనులో పడ్డ పందికొక్కులా నేనుకూడా తిన్నగావెళ్లి వాడి బుట్టలో పడ్డా.
ఇహ అక్కడ మొదలైంది.

ఏ దేవలోకం నుండో ఇంతోసి నా జుట్టు కత్తిరించి నాకు మోక్షం ప్రసాదించడానికి కత్తెర,దువ్వెన పట్టుకుని వచ్చిన దేవకన్యలా ఒక అందం వచ్చినుంచుంది.ఆ అందాన్ని చూసిన మత్తు కాసేపటికి వదిలాకా ఆవిడ వచ్చిరాని ఇంగ్లీషులో ఏం ఇలా తగలడ్డావ్? అంది.ఆవిడ భాషని బట్టి ఆవిడ ఏ రొమేనియా నుండో,బ్రెజిల్ నుండో,చైనా నుండో లేక మరేదో దేశం నుండో వచ్చిందని అర్ధం అయింది.ఇక్కడ సాధారణంగా అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ.సరేలే అని,అసలు నాకు ఏ హెయిర్ స్టైల్ చెయ్యాలో,ఎలా చెయ్యాలో ఒక అరగంట ఆవిడకి వివరించి,అప్పటికే డౌన్లోడ్ చేసిపెట్టుకున్న దిక్కుమాలిన నలుగురైదుగురు హీరోలు,మోడల్స్ ఫోటోలు రిఫరెన్స్ చూపించి ఇలా కావాలి అని చెప్పా.

ఆవిడ భోజపురి సినిమాని మళయాళం ఉపశీర్షికలతో చూసినట్టు,అదో రకంగా నా వంకచూసి,అంతా విని/విన్నట్టు నటించి దీర్ఘంగా నిట్టూర్చి,కత్తెర,దువ్వెన పక్కన పడేసింది.ఇదేంటా అనుకునేలోపే ఒక ట్రిమ్మర్ తీసుకొచ్చి చిన్న వెకిలి నవ్వునవ్వి(నీ తిక్క తీరుస్తా అని అర్ధం ఏమో ఆ నవ్వుకి)దానితో నా నెత్తిమీద మెరుపుదాడి చేసింది.ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పచ్చగా పెరిగిన మొక్కల్ని పిచ్చి మొక్కలతో పాటు చెక్కేసినట్టు ఒక పక్క అంతా ఒకే దెబ్బలో,సెకనులో అరవై ఆరో వంతు వేగంతో గొరిగేసింది.ఇంకేంఉంది?

నా ఆరునెల్ల కష్టం,నా హీరో కలలు,ఆ అప్సరస కాళ్ళదగ్గర శాశ్వతంగా నిద్రపోయాయి.ఇహ అప్పుడు అడిగింది ఇదేనా నువ్వు అడిగింది అని.నీ మొహంమండా!!!ఒక నిమిషం ముందు అడిగి చావొచ్చు కదా??అన్యాయంగా గొరిగేశావ్ అని ఏడవలేక,నవ్వలేక హిహిహి... ఇదే అన్నా.ఒహవేళ కాస్త ధైర్యంచేసి ఇదికాదు అన్నా మళ్ళీ ఈసారి ఏ ఒరియా సినిమానో చూపిస్తుంది అని భయం.తదనంతరం ఆవిడ విజయగర్వంతో ఇంకో పక్క చెక్కడం మొదలెట్టింది.ఆలా కుడిపక్కన ఎక్కువైంది అని ఎడమపక్క,పైన తక్కువైంది అని వెనకపక్క,మొత్తం అయిదు నిముషాల్లో క్షవరం చేసేసి,అద్దంలో నా మొహాన్ని నాకే చూపించింది.

అదెలా ఉందంటే వెనకటికి మా చిన్నపుడు ప్రతీ ఆదివారం ఒక చిన్న పాత సంచి,ఒక నిక్కరు వేసుకుని కొండయ్యతాత అని వచ్చేవాడు.ప్రతీ ఆరునెల్లకి ఓసారి పిల్లమూకని ఆ తాత దగ్గర వరసగా కూచోపెట్టేవారు పెద్దాళ్ళు.ఆ తాత మా నెత్తిచుట్టూ ఒక పురికొస కట్టి,దాని చుట్టూ ఉన్న జుట్టు గొరిగేసి,ఆ లోపల మిగిలిన జుట్టుని అంట కత్తెరేసేసేవాడు. మేము ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినేవాడు కాదు మా కొండయ్యతాత. పెద్దవాళ్ళకి 5 రూపాయిలు,నాలాంటి పిల్లకాయలకి 2 రూపాయలు.తాత ఒకసారి క్షవరం చేస్తే ఆరునెల్ల వరకు మళ్ళీ దువ్వెన్న అక్కర్లేదు.

అలా మా కొండయ్యతాతకి ఏకలవ్య శిష్యురాలు అప్పుడే చెక్కిన నా నెత్తి కళాఖండానికి తుదిమెరుగులు దిద్దుతుండగా..ఒక అరవై డెబ్భయి మధ్య వయసు ఉన్న మామ్మగారు వచ్చింది.ఆవిడని ఇంకో దేవకన్య దీవించింది.ఆ వృద్ధనారికి నెత్తిమీద ఒక 40 వెంట్రుకలకి మించి ఉండవ్.నమ్మనివాళ్ళు వచ్చి లెక్కెట్టుకోవచ్చు.ఆవిడ ఎలా కావాలో చెప్పింది.యధాప్రకారం లేత పనసకాయని చెక్కినట్టు ఆ గుండుని అరగంటసేపు చెక్కి,ఎలా ఉంది అన్నట్టు బామ్మ వంక చూసి కళ్లెగరేసింది చైనా దేవకన్య. నేనేమో,ఏవండీ బామ్మగారూ...ఆ గుండు మీద ఏం ఉందండీ?నా శ్రార్థం,అదేదో  నన్నే అడిగితే ఫ్రీగా చేసిపెట్టేవాడిని కదా అని అడిగేద్దాం అనుకునేలోగా...ఆ గుండుని,దానిమీద మెరుపుని చూసుకుని ఆ బామ్మ కళ్ళలో ఆనందభాష్పాలతో ఆ దేవకన్యకి బిల్లు,దాంతోపాటు టిప్పుకూడా ఇచ్చి డైరెక్ట్ గా ఏ హాలీవుడ్ సినిమా ఆడిషన్ కో వెళ్లినంత గర్వంగా,తల,అదే అదే..గుండు ఎగరేసుకుంటూ వెళ్లిపోయింది. 


ఈలోగా నా సినిమాకి కూడా శుభంకార్డు వేసేసింది మా రోమేనియన్ అప్సరస.నా అవతారం అచ్చం అహనాపెళ్ళంట సినిమాలో బ్రహ్మానందంలా అరగుండుతో అదో రకంగా తయారైంది.నెత్తి మీద చెయ్యి పెడితే చల్లగా తగుల్తోంది.ఇంటికొచ్చి ఆ అరగుండుని చూస్కుని దిక్కులు పిక్కటిల్లేలా,లోపల్లోపలే అనుకో నేను ఏడ్చిన ఏడుపు కి  బాత్రూమ్ అద్దమే సాక్షి.

అయినా మీ కన్నా మా కొండయ్యతాతే నయ్యం.ఆయనే ఉంటే ఈ హెయిర్ స్టైయిల్ కి పేటెంట్ తీసుకునే వాడు. బైటికొస్తే నాలాంటి ఎన్నో అరగుళ్ళు.ఇప్పుడు ఇదే ఫాషన్ గా మోసు.

నాకు అర్ధమైందేంటంటే మనం ఎలా చెప్పినా వాళ్ళు వాళ్ళకి వచ్చిందే చేస్తారు,నచ్చినట్టే చేస్తారు.

అల్పమైన జుట్టు గురించి కలలు కనడం కలే!!!!

మరిన్ని కథలు

love affections
మమతానురాగాలు
- మల్లవరపు సీతాలక్ష్మి
Madhava seva
మాధవ సేవ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు
Bawa Bawa rose water
బావా బావా పన్నీరు....
- గొర్తి.వాణిశ్రీనివాస్
New cousins
కొత్త కోడలు
- యు.విజయశేఖర రెడ్డి
i hate my room mate
ఐ హేట్ మై రూమ్మేట్
- గంగాధర్ వడ్లమన్నాటి
gurupreet singh
గురుప్రీత్ సింగ్
- యు.విజయశేఖర రెడ్డి
pity sundaram
పాపం సుందరం!
- పద్మావతి దివాకర్ల
Listening to what is being said
చెప్పుడు మాటలు వింటే...!
- మీగడ.వీరభద్రస్వామి