gorintaku - శింగరాజు శ్రీనివాసరావు

గోరింటాకు

రాజమ్మ మంచం మీద కూర్చుని మనవరాలి చేతికి కోడలు అపర్ణ గోరింటాకు పెడుతుంటే చూస్తున్నది. మనవరాలు రిషికను చూస్తుంటే తన చిన్నతనం గుర్తొచ్చింది రాజమ్మకు. తనకు గోరింటాకంటే మహాపిచ్చి, అదే చాలు వచ్చింది రిషికకు. బహుశ తనే ఆ అలవాటు చేసిందేమో కూడ. భర్త బ్రతికి ఉన్నన్నాళ్ళు రెండు చేతులకు, కాళ్ళకు ఠంచనుగా నెలకు ఒకసారైనా గోరింటాకు పెట్టుకునేది. ఆయన పోయిన తరువాత ఈ నాలుగేళ్ళ నుంచి పెట్టుకోవాలని కోరిక వున్నా కోడలు ఏమనుకుంటుందోనని కోరికను చంపుకుంది. కానీ ఈరోజు ఎందుకో పెట్టేటప్పుడే ఎర్రగా పండిన కోడలి చేతులు చూసి మనసు లాగుతున్నది. అందుకే గుడ్లప్పగించి చూస్తున్నది వాళ్ళను. " ఏంటి బామ్మా కొత్తగా చూసినట్లు అలా చూస్తున్నావు. అమ్మ నీలాగ పెట్టడం లేదా" అడిగింది పదిహేనేళ్ళ రిషిక.

" బాగానే పెడుతుందిలేవే. అయినా ఎప్పుడూ పెట్టే డిజైనేగా, కొత్తవి రావు మీ అమ్మకి" తనను పెట్టమంటుందేమోననే ఆశతో, కనీసం ఆ సాకుతో నైనా చేతికి ఆ ఎర్రదనం అంటుకోవాలని చిరు కోరిక. " మీరు చేసిన నిర్వాహకమే ఇది. మామయ్య గారు ఉన్నన్నాళ్ళు ఆయన ప్రాణంతోడి ఊరి మీదకు పంపి గోరింటాకు తెప్పించుకుని మీరు పెట్టుకోవడమే కాదు. దీనికి కూడ రకరకాల డిజైన్లు పులిమి పాడు అలవాటు చేసిపెట్టారు. ఇప్పుడిదేమో వాళ్ళ నాన్నను చంపుకుతింటున్నది" కస్సుమన్నది అపర్ణ. " ఎందుకమ్మ బామ్మను అరుస్తావు. మొన్నటిదాకా బామ్మే పెట్టేది కదా. నువ్వేకదా కొత్త రూలు పెట్టింది. తాతయ్య చనిపోయిన తరువాత మీరు పెట్టకూడదని చెప్పి, బామ్మను పెట్టనీకుండా చేశావు. ఏం బామ్మ పెడితే ఏమవుతుంది. నువ్వు ఎప్పుడు చూసినా అరచేతిలో చందమామ, దాని చుట్టూ చుక్కలు. అంతకంటే చాతకాదు నీకు" మూతి మూడు వంకలు తిప్పింది రిషిక.

" నోరుమూసుకుని కదలకుండ కూర్చో. ఇది ఎప్పటినుంచో వచ్చిన ఆచారమట. భర్త పోయిన వాళ్ళు గోరింటాకు లాంటి షోకులు చేసుకోకూడదట. అరిష్టమన్నారు. మొన్న భక్తి ఛానల్ లో కూడ చెప్పారుకదా" " గొడవపడకే రిషిక. వద్దన్న పని ఎందుకు చేయడం" మనసు నొచ్చుకుని అన్నది రాజమ్మకు. " వితంతువులు పెట్టుకోవడం బాగుండదన్నాడంతే కాని. పెట్టుకోకూడదు, పెట్టకూడదు, అరిష్టం అనేమీ చెప్పలేదు. నేనూ విన్నాను. సగం వాళ్ళు చెబితే సగం వీళ్ళ కల్పన. నాన్న చెబుతాడుగా బామ్మా. 'కవిగారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని' అలా అన్నమాట" " అఘోరించావులే గాని. కాళ్ళు పట్టు, పాదాలకు పెడతాను"

" ఇదిగో వేళ్ళకు పులమకుండా జాగ్రత్తగా పెట్టు. లేకుంటే బామ్మ చేత పెట్టించుకుంటా" " బెదిరింపులు ఆపి. చాపు కాళ్ళు. నాలుగు పీకుతా అతి చేశావంటే" గుడ్లురిమింది అపర్ణ. కాళ్ళు చాపి కూర్చుంది రిషిక మాటలు లేక మౌనంగా చూస్తున్నది రాజమ్మ. ఏం సంప్రదాయాలో ఏమిటో, తనకు ఊహ తెలిసినప్పటి నుంచి పెట్టుకుంటున్నది గోరింటాకు. మరి భర్తకు, ఆ గోరింటాకుకు మధ్యగల సంబంధం ఏమిటో అర్థంకాలేదు. అయినా గోరింటాకు పెట్టుకోగానే కోరికలు రేగి మనసు వశం తప్పుతుందా. భర్తతో పాటే అన్నీ పోతాయా. మరి ప్రాణం పోదేం. ఏమిటో ఈ ఆచారాలు మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టినట్లు. కాలాన్నిబట్టి మనం మారాలి.

అంతేగానీ మనకిష్టమైనవైతే ఒకరకంగా, లేనివైతే మరోరకంగా మార్చకూడదు. అసలు సాంప్రదాయం ప్రకారం గుండు కొట్టించుకుని, తెల్లధోవతి కట్టుకోవాలి. మరి అలా వద్దన్నది ఇదే కోడలు ఆరోజు. అలా నన్ను ఆమె చూడలేదట. ఏమిటో ఇదంతా.... " బామ్మా పెట్టేసుకున్నా చూడు" అంటూ కేక పెట్టింది అపర్ణా. " బాగుంది తల్లీ. అప్పుడే తీయకు. కనీసం రెండు గంటలయినా ఉంచుకో బాగా పండుతుంది" " సరే బామ్మా" అని అటు తిరిగి కూర్చుంది రిషిక. ****** " ఏమండీ కొంచెం బాల్ పెన్ను ఇచ్చి, అదే చేత్తో అగ్గిపుల్ల ఒకటివ్వరా" భర్త ప్రసాదును అడిగింది రాజమ్మ " మొదలుపెట్టావా పండగ. నెలలో ఒకరోజు ఈ గోల తప్పదటే నాకు. అయినా ఈ గోరింటాకు పిచ్చేమిటే. ఏదో పెళ్ళయిన కొత్తల్లో ముచ్చటేమో అనుకున్నాను. యాభైలో పడినా ఇంకా ఈ యావేమిటే" అని శతమానం పెడుతూనే అడిగినవి తెచ్చి ఇచ్చాడు. " మీ సణుగుడు భరించలేకే నేను గోరింటాకు పనివాళ్ళతో తెప్పించుకుంటున్నాను. అయినా నేను మిమ్మల్ని వంటచెయ్యమన్నానా, అగ్గిపుల్లేగా ఇవ్వమన్నాను. దానికే అంత విసుగెందుకు నాయనా" " నా సగం జీవితం వీధుల వెంట గోరింటాకు కోసం తిరగనే సరిపోయింది" " అంత అతొద్దు. ఎవరైనా వింటే ఏమి చోద్యం అనుకుంటారు. ఇదిగో కొంచెం లేచి మగ్గుతో కాసిని నీళ్ళు తెచ్చిపెట్టండి" " నువ్వు గోరింటాకు పెట్టుకుని, అది పండేలోపు కనీసం వందసార్లయినా లేపుతావు కదే నన్ను. నెలకు సరిపడా వ్యాయామం చేయిస్తావు. ఏమన్నా అందామంటే నెత్తిన నీళ్ళకుండతో సిద్ధంగా ఉంటావు" విసుక్కుంటూ లేచి వెళ్ళాడు ప్రసాదు. ఇది నెలకొకసారి తప్పని యుద్ధం వాళ్ళిద్దరి మధ్య. భర్త చిటపటలు చూచి నవ్వుకుంది రాజమ్మ ముసిముసిగా.

*****

ఆ రోజులు గుర్తుకు వచ్చి మనసంతా భారంగా మారిపోయింది రాజమ్మకు. ఆ హవా అంతా భర్తతోనే పోయింది. ఇప్పుడు మిగిలింది ఒక యాంత్రిక శరీరం మాత్రమే. ఎందుకో వద్దనుకున్నా మనసు స్పందించి, కన్నీటిని సృష్టించాయి. " బామ్మా. నా చెయ్యి చూడు ఎలా పండిందో " అని పక్కన కూర్చుని చేతులు చూపించింది రిషిక. కొంగుతో కళ్ళు తుడుచుకుని చూసింది. అసలే పచ్చని చేతులు రిషికవి తన చేతులలాగే. గోరింటాకు బాగా పండే ఆకులాగుంది, చేయంతా సింధూర వర్ణంతో మెరిసిపోతున్నది. అప్రయత్నంగా మనవరాలి చేతులను ముద్దుపెట్టుకుంది. " బుజ్జితల్లీ. ఎంత బాగా పండిందమ్మా గోరింటాకు. నీ చేతికి మరీ అందాన్నిచ్చిందిరా. సింధూరంలా పండింది చేయి. నీకు చందమామే మొగుడుగా వస్తాడు బంగారం" అని బుగ్గల మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది రాజమ్మ. " థాంక్యూ బామ్మా. ఏమయింది బామ్మా కళ్ళు తడిగా ఉన్నాయి." అంది రిషిక రాజమ్మ కళ్ళు తుడుస్తూ. " అబ్బే ఏమీలేదమ్మా. కంట్లో నలకపడితే గట్టిగా రుద్దాను అంతే" మాట దాటేసింది. " నీకు కూడ గోరింటాకు పెట్టుకోవాలని వుంది కదూ" బామ్మ మెడచుట్టూ చేతులువేసి అడిగింది రిషిక. " లేదమ్మా. తాతయ్య లేడుగా. అందుకని పెట్టుకోకూడదు. అవన్నీ ఆయనతోనే పోయాయి. ఇప్పుడిది ఎండిన మోడు" గద్గదమైంది రాజమ్మ కంఠస్వరం. " బాధపడకు బామ్మా. అవన్నీ ఛాదస్తాలు. మా తెలుగు మాష్టారు చెప్పారు. సంప్రదాయాలన్నీ మనం ఏర్పరచుకున్నవేనట. కాలాన్నిబట్టి అవి మారుతుంటాయట. కాలాన్నిబట్టి మనిషి నడవాలి కాని, మూర్ఖంగా ప్రవర్తించకూడదట. నేనున్నాగా బామ్మా నీకు. సంతోషంగా వుండు" బామ్మ బుగ్గను చుంబించి భరోసా ఇచ్చి వెళ్ళింది రిషిక. ****** అపర్ణ పేరంటం నుంచి వచ్చి పంచలో దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది. తన భర్త కిరణ్ వాళ్ళ అమ్మ చేతులకు గోరింటాకు పెడుతున్నాడు. పక్కనే బాల్ పెన్ చేతిలో పట్టుకుని తండ్రికి సూచనలిస్తున్నది రిషిక. కొడుకును తన్మయత్వంతో చూస్తున్నది రాజమ్మ. ఆ దృశ్యం చూసి చిర్రెత్తుకొచ్చింది అపర్ణకు. ఒక్కసారి కోపం కట్టలు తెంచుకుని హూంకరించింది. " ఏంచేస్తున్నారు మీరక్కడ " " వచ్చావా. నువ్వు వచ్చేలోపే అమ్మకు గోరింటాకు పెట్టేసి నిన్ను సర్ ప్రైజ్ చేద్దామనుకుంటే. అప్పుడే వచ్చేసి ఛాన్స్ మిస్ చేశావే అపర్ణా" తన శైలిలో చెప్పాడు కిరణ్. " చేయకూడని పని చేస్తూ ఏం ఆనందపడిపోతున్నారండి మీరు" " హలో. ఇదేం చెయ్యకూడని పని కాదు. ముత్తైదువలు మా అమ్మలాంటి వారికి గోరింటాకు పెడితే వారికేదో అయిపోతుందని కదా మీ ఆలోచన. అందుకే మా అమ్మకు నేనే గోరింటాకు పెట్టాను. తప్పేముంది" " తప్పా. తప్పున్నరా. అది అరిష్టమండీ" " ఏ సిద్ధాంతి చెప్పాడు. ఒకవేళ చెప్పాడే అనుకుందాం. ఆయనకు ఏ దేవుడు ఫోనుచేసి చెప్పాడట. ఆయన పేరు చెప్పమను. నేనూ ఫోను చేసి కనుక్కుంటా" " వెటకారాలొద్దు. సాంప్రదాయం సాంప్రదాయమే" " ఛ. నిజమా. మరి భర్త పోయిన తరువాత జుట్టు ఉండకూడదు. రంగురంగుల చీరలు కట్టకూడదు. తెల్లధోవతులు మాత్రమే ధరించాలి. మరి దీన్నెవరూ పాటించరే. మీ అమ్మగారు డజను బంగారుగాజులు చేతులకు వేసుకుని, మెడలో చాంతాడంత గొలుసు వేసుకుని, పాతికవేలు తక్కువ ధర చేయని పట్టుచీరకట్టి, ఫ్యాషన్ గా చుట్ట చుట్టి మరీ వస్తుందిగా. మరి ఆమెకు లేదా సాంప్రదాయం." " ఏమండీ. మీరు మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అది ఆమె ఇష్టం. మీరేమీ పెట్టి పోషించడం లేదు" ఉక్రోషం తన్నుకు వచ్చింది అపర్ణకు. " అలాగే అమ్మ కూడ తనకు ఎంతో ఇష్టమైన గోరింటాకును పెట్టుకుంటుంది. దీనివలన ఎవరికి సమస్య. చెప్పు. ఎదుటివారికి ఇబ్బంది కలిగించని ఏ పనైనా ఎవరి ఇష్టం కొద్ది వాళ్ళు చేసుకోవచ్చు. చూడు అపర్ణా ఎప్పుడో తాతల కాలం నాటి ఆచారాలను, నేటి సమాజానికి అనువుగా, అనుకూలంగా మార్చుకోవాలి గాని, మూర్ఖంగా వాటినే పట్టుకుని వేలాడకూడదు. మనిషి మనసులోని చిన్న చిన్న అభ్యంతరం లేని కోరికలను సంప్రదాయం పేరుతో చంపకూడదు. అమ్మకు గోరింటాకు అంటే ప్రాణం. నేను కూడ ఇన్నాళ్ళూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఈ రోజు రిషిక నన్ను నిలదీసి అడిగింది." బామ్మ గోరింటాకు ఎందుకు పెట్టుకోకూడదు. దానివలన ఎవరికి నష్టం" అని. నా దగ్గర సమాధానం లేదు. ఏదీ కావాలని నోరు తెరిచి అడగదు అపర్ణా అమ్మ. రిషిక మాటలలో అమ్మకు మనసులో గోరింటాకు పెట్టుకోవాలని ఉన్నదని తెలిసింది. అందుకే నేను ఆమెకు గోరింటాకు పెట్టాను.

ఆమెను సంతోషపెట్టడం నా బాధ్యత. సారీ అపర్ణా మీ అమ్మ గురించి మాట్లాడి నిన్ను బాధపెట్టాను. మనిషి పోయాడని మనసును రాయి చేసుకుని గడపకూడదు. మనుషులు రావడం, పోవడం జీవితంలో ఒక భాగమే. ఈ విషయాన్ని ఇలా వదిలేయ్. లైట్ తీసుకో లైఫ్ పార్ట్ నర్." అంటూ చిన్న సందేశాన్ని వదిలాడు కిరణ్. " మీ అబ్బాకూతుర్లు ఒకటైతే ఇంకెవరి మాట వినరుగా. కానివ్వండి మీ ఇష్టం. ఏం అత్తయ్యా సంతోషమేనా ఇప్పుడు. అమ్మలక్కలడిగితే చెప్పండి. మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా పెట్టారు. మీకేమిటి నష్టమని. ఏ మాటకామాటగాని అత్తయ్యా మీ పచ్చటి చేతులకు గోరింటాకు అదుర్స్" అంటూ ఒక కాంప్లిమెంట్ పారేసి లోపలికి వెళ్ళింది. " బామ్మా సంతోషమేనా." అడిగింది రిషిక ఇద్దరినీ దగ్గరకు పిలిచింది రాజమ్మ. చెరొక భుజంపై తలలు వాల్చి రాజమ్మను ఆనందపరిచారు కిరణ్, రిషిక. తన మనసులోని కోరిక తీర్చిన కొడుకును, మనవరాలిని చిరంజీవులుగా వర్ధిల్లాలని దీవిస్తూ తన చేతులను తృప్తిగా చూసుకున్నది రాజమ్మ.

****** అయిపోయింది*******

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి