చెప్పుడు మాటలు వింటే...! - మీగడ.వీరభద్రస్వామి

Listening to what is being said

ఒక వనంలో ఒక తూనీగ ఉండేది. ఆ తూనీగకు ఒక సీతాకోక చిలుకతో స్నేహం ఉండేది. వీటికి ఒక గండు చీమతో స్నేహం కుదిరింది. మూడూ ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక రోజు ఒక మిడత ఆ వనములోకి వచ్చింది. తూనీగ, సీతాకోకచిలుక, గండుచీమల మద్య ఉన్న స్నేహాన్ని చూసి మిడత ఈర్ష్య పడింది. ఎలాగైనా ఆ మిత్రుల మద్య గొడవ పెట్టి వాటిని విడదీయాలని ప్రణాళిక వేసుకుంది. ఒక రోజు గండు చీమ, తూనీగ ఆహారం సంపాదనకు వెళ్ళినప్పుడు సీతాకోక చిలుక వద్దకు వెళ్లి" చీమను నమ్మకూడదు నువ్వు గాఢ నిద్రలో వున్నప్పుడు నిన్ను తన జాతి చీమల సాయంతో చంపి తినేయగలదు, అందుకే ఆ చీమ నీతో స్నేహం నటిస్తుంది, దానితో నీకు ఏ క్షణాన్నైనా ప్రాణాపాయం తప్పదు. ఇక ఆ తూనీగ పెద్ద కర్రలాంటి తోకపెట్టుకొని బంతిలాంటి తల, అందం చందం లేని శరీరంతో చూడటానికి అసహ్యంగా ఉంటుంది,అలాంటి జీవితో నీలాంటి అందగత్తెకు స్నేహం ఏమిటి? నువ్వు ముందు చీమని చంపేసి తూనీగతో స్నేహంగా ఉండకుండా దూరంగా ఉండు"అని సీతాకోకచిలుకకు తప్పుడు సలహా ఇచ్చింది.మరో రోజు తూనీగ ఒంటరిగా ఉండటం చూసి "మిత్రమా సీతాకోకచిలుక ఇప్పటి రూపం చూసి మోసపోకు దాని గతరూపం గొంగళిపురుగు, అలాంటి దానితో స్నేహం అవమానకరం, ఇక చీమ ప్రమాదకారి దాని జాతిని నమ్మరాదు"అని చెడు మాటలు నూరిపోసింది. మిడత పాచిక పారింది ముగ్గురు మిత్రులు మద్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. ఇంకో రోజు చీమ పుట్ట దగ్గరకు పోయి " ఓ పిపీలకమా! నువ్వు వెఱ్ఱిబాగులదానిలా వున్నావు సీతాకోకచిలుక, తూనీగ ఆహారంగా చీమల్ని దోమల్ని తింటుంటాయి అని విన్నాను, ఏదోరోజు నిన్ను తినేస్తాయి, వాటికి దూరంగా ఉండు" అని చీమకి అనుమానాన్ని రేకెత్తించింది. మిడత చెప్పుడు మాటల ప్రభావం బాగా పనిచేసింది, ఆ మిత్రులు మద్య ఎడముఖం పెడముఖం అన్నట్లు కొన్నాళ్ళు సాగింది, ఒకరోజు తూనీగ ఒక పువ్వుపై వాలి ఉండగా మిడత ఒక చెట్టుకొమ్మను విరిచి తూనీగ పైకి విసిరింది, తూనీగని చంపేడానికి, అదే సమయంలో చీమ తూనీగపై కొమ్మ పడకుండా అడ్డుపడి కొమ్మను పక్కకు విసిరేసింది, అదే సమయంలో పక్క ఆకుమీద ఉన్న సీతాకోకచిలుక తూనీగకి కొమ్మతగలకుండా తూనీగని పక్కకు లాగేసింది. తృటిలో ప్రమాదంనుండి బయట పడ్డ తూనీగ తనని చంపడానికి మిడతే ప్రయత్నించిందని గమనించక, చీమను, సీతాకోకచిలుకను నిందించింది,"మీరే నన్ను చంపడానికి కుట్ర చేశారు"అని చీమతోనూ, సీతాకోకచిలుకతోనూ గోడవపడింది, అంతలో మిడత అక్కడకు వచ్చి "కొమ్మను చీమ, తూనీగలు ఇద్దరు మీదకూ విసిరింది సీతాకోకచిలుక , అయితే చీమ చాకచక్యంగా తప్పించుకొని తూనీగ మీదకు విసరబోయింది" అని చీమ, తూనీగ, సీతాకోకచిలుకల మద్య తగువును పెంచింది. సీతాకోకచిలుక అవాక్కై "నాకు ఏ పాపమూ తెలీదు, ఇది చీమ కుట్ర" అని లబోదిబోమంది, "నేనేందుకు తూనీగను చంపుతాను తూనీగ, నువ్వూ కలిసి నన్నే చంపేస్తారు ఏనాటికైనా" అని చీమ మండి పడింది. విషయం స్పష్టంగా తెలియక పోయినా మిడత జిత్తులుమారి మాటలు నమ్మి ఆ మూడు ప్రాణులూ ఒకదానికొకటి నిందించుకుంటూ కీచులాడుకున్నాయి, అవి తన్నుకొని చస్తే తినడానికి సిద్ధం అన్నట్లు కూర్చుంది మిడత తగువు తీర్చకుండా... ఒక పిచ్చుక అక్కడకు వచ్చి" మిత్రులు మద్య అనుమానం మంచిది కాదు నేను చాలా రోజులు నుండి గమనిస్తున్నాను ఈ మిడత వాలకం బాగాలేదు మీలో మీకు తగువులు పెట్టడానికే చూస్తుంది, అసలు కొమ్మను తూనీగ పైకి విసిరింది మిడత, కొమ్మ తూనీగపై పడకుండా అడ్డుకుంది చీమ, కొమ్మ పొరపాటున తూనీగకు తగులుతుందేమో అని తూనీగను పక్కకు లాగింది సీతాకోకచిలుక, మీ ముగ్గురూ ప్రాణమిత్రులే, ఒకర్ని రక్షించడానికి మరొకరు ప్రయత్నం చేశారు, మధ్యలో ఈ అనుమానాలు, అభిప్రాయభేదాలూ దేనికి, మిడత మాటలు నమ్మి మిత్రత్వాన్ని, శత్రుత్వంగా మార్చుకోవడం దేనికి అని చీమ, తూనీగ సీతాకోకచిలుకలకు హితవు పలికింది. అవి మిడత మాటలు నెమరువేసుకొని, మిడత చెడ్డ బుద్ధిని గ్రహించి,కోపంతో మూకమ్మడిగా మిడతపై దాడి చేశాయి. పిచ్చుక వాటిని శాంతపరిచి, చంపడం... చావడం మంచి సాంప్రదాయం కాదు, మిడతకు ఈ వనం నుండి బహిష్కరిద్దాం అని మిడతను తీవ్రంగా మందలించి వనం విడిచి పొమ్మని అదేశించి, చీమ, సీతాకోకచిలుక, తూనీగలను కలిపి...లివ్ లాంగ్ అంటూ వాటికి ఐకమత్యం గొప్పతనం కథలు చెప్పి తుర్రున ఎగిరిపోయింది. రచన::- మీగడ. వీరభద్రస్వామి

మరిన్ని కథలు

There is something in that story!
ఆ కథలో ఏదో ఉంది!
- గంగాధర్ వడ్లమన్నాటి
this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్