మా నాన్నకు పెళ్ళి - డా.సూరపరాజు కిషోర్ కుమార్

Married to our father

టైం పదవుతోంది. కోర్ట్ కు బయలుదేరుతున్నాడు కృష్ణ మోహన్.

ఇంతలో ఫోన్ మోగింది.

ఏదో కొత్త నెంబర్ లా ఉందే అంటూ ఆన్సర్ చేసాడు.

అటునుంచి చెప్తున్నాడు. సర్ నా పేరు సతీష్. సాయంత్రం మీ అపాయింట్మెంట్ కావాలి. ఎన్ని గంటలకి రమ్మంటారు ?

ఏడుగంటలకు రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్ ని కారు తీయమన్నాడు.

కృష్ణ మోహన్ ముప్పై ఐదేళ్లు బ్యాంకు లో పనిచేసి మూడేళ్ళ క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన కిష్టమైన లీగల్ ప్రొఫెషన్ లోకి మారాడు.

అరవై ఏళ్ళకి రెండేళ్ల దూరంలో ఉన్నా హుషారుగా కుర్రాడిలా తిరుగుతుంటాడు యాక్టివ్ గా. పదేళ్ల క్రితం బ్యాంకు లో పనిచేసేప్పుడు చదివిన లా అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంకు లో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్నా భార్య ఆకస్మికంగా చనిపోవడంతో బ్యాంకు కు బై చెప్పి న్యాయవాద వృత్తి చేపట్టాడు.

తన ఇద్దరు కూతుళ్లు అమెరికా లో ఎం ఎస్ చేసి అక్కడే పని చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు గా. భార్య ఉండగానే ఇద్దరికీ పెళ్లిళ్లు చేసాడు. వారి భర్తలు కూడా అమెరికా లోనే పని చేస్తున్నారు.

హైదరాబాద్ లో కృష్ణ మోహన్ తన సొంత ఇంట్లో పైన నివాసముంటూ క్రింద తన ఆఫీస్ పెట్టుకున్నాడు.

మూడేళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో, సాంకేతిక నిపుణతతో చక చక అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఆ వయసులో కూడా రాత్రిళ్ళు బాగానే చదువుతూ, ఆకళింపచేసుకుంటూ, కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు.

ఓ నలుగురు జూనియర్స్ కూడా తన దగ్గర పని చేస్తున్నారు. వారికి కూడా చేతినిండా పని. వారికి చక్కటి పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు కృష్ణమోహన్. అందుకే అతని వద్ద జూనియర్స్ గా చేరేందుకు చాలా మంది క్యూ లో ఉంటారు.

ఇక వంటకి, ఇల్లు చూసుకునేందుకు ఓ భార్యా భర్తల జంట అతని దగ్గరే ఉంటారు.పెద్ద ఇల్లు కావడంతో ఆఫీస్ వెనుక భాగం లో వాళ్ళు నివాసముంటున్నారు.

అలా అన్నీ ఏర్పాటు చేసుకుని ఏ ఆటంకము లేకుండా తన వృత్తి లో ముందుకు దూసుకెళుతున్నాడు.

రోజూ కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు.

ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్లు సతాయిస్తారు డాడీ ఎందుకు అక్కడ అలా ఒంటరిగా. ఇక్కడకి రండి మాతో ఉండొచ్చు అని. అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్ కి. మామగారిని నెత్తినపెట్టుకుంటారు. మామ అంటే వారికి ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం.

కూతుళ్లకంటే కృష్ణమోహన్ కి అల్లుళ్ళ ఒత్తిడి ఎక్కువయింది అమెరికా కి రమ్మని. ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఈ వృత్తి లోనే ఉంటాను అని వారి అభ్యర్ధనని మర్యాదపూర్వకంగా త్రోసిపుచ్చుతాడు ఎప్పటికప్పుడు.

ఆరోగ్య విషయములో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి కూతుళ్ళకు కొంత నిశ్చింత. అప్పటికీ వాళ్ళు తండ్రికి తెలీకుండా ఇంట్లో ఉండే వంటావిడకి ఫోన్ లు చేస్తుంటారు డాడీ ఎలా ఉన్నాడు అని. ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటారు రహస్యంగా.

కూతుళ్లను చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమతో పెంచాడు కృష్ణ మోహన్. అతని కనుసన్నలలో వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకుని చక్కగా చదువుకుని మెట్టినింటిలో మెప్పు పొందుతున్నారు.

సివిల్, క్రిమినల్, సర్వీస్ మేటర్స్ ఇలా అన్ని కేసులు చూడడంతో అన్ని రకాల కేసులు అతని దగ్గరకు వస్తుంటాయి. రోజంతా బాగా బిజీ గా ఉంటాడు.

***

అనుకున్నట్లుగా రాత్రి ఏడుగంటలకు సతీష్ వచ్చాడు. కొత్త క్లైంట్స్ ను ముందుగా కృష్ణ మోహన్ రిసీవ్ చేసుకుని వివరాలు తెలుసుకుంటాడు. తరువాత జూనియర్స్ కి అప్పచెప్తాడు ఏమేమి చెయ్యాలో చెప్తూ.

సతీష్ అతని తమ్ముడు రాఘవ్ ని కూడా పరిచయం చేసాడు కృష్ణమోహన్ కి.

ఎందుకొచ్చారో వివరాలు అడిగాడు కృష్ణ మోహన్.

సతీష్ చెప్పాడు. రెండేళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు. ఆయనకి సంతానం ఈ ఇద్దరు కొడుకులే, సతీష్, రాఘవ్. కొడుకులు, కోడళ్ల ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుందని, ఆమె తదనంతరం పిల్లలకి చెరి సమానంగా పంచమని వీలునామా రాసి మరీ చనిపోయాడు. అందుచేత వారికి ఆస్తి చేజిక్కించుకునే అవకాశం లేదు. వారి భార్యల ఒత్తిడి ఎక్కువయ్యింది ఎలాగైనా అత్తగారి దగ్గరనుంచి ఆస్తి తమ చేజిక్కుంచుకోవాలని. సతీష్, రాఘవ్ చదువులు అంతంత మాత్రమే అవడంతో ఉద్యోగాలు చిన్నవే. ఆస్తి ఎంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు. అందుచేత కృష్ణమోహన్ దగ్గరికి వచ్చారు. ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకు వచ్చేలా చూడమని.

వారిచ్చిన పత్రాల కాపీలు తీసుకుని చూసాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ ఆరు కోట్ల పైనే ఉంటుంది. కానీ అంతా వారి తల్లి పేరుతో నే వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంది. వీళ్లకు ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయి.

ఆమె పేరు చూసాడు పారిజాతలక్ష్మి అని ఉంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకున్నాడు.

మాటల్లో అడిగాడు ఏ వూరు మీది అని. సతీష్ చెప్పాడు. వారి తండ్రిది విజయవాడ. తల్లిది కావలి.

సతీష్ బ్రతిమిలాడుతూ అడిగాడు ఎలాగైనా ఆస్తి మాకు దక్కేలా చూడండి సార్. మీరు అడిగిన ఫీజు ఇస్తామని.

మీ తల్లి గారు మీతోనే ఉంటున్నారా అన్నాడు.

లేదు సర్. మా భార్యలకు ఆవిడంటే పడదు. అందుకే వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాము అన్నారు ఇద్దరూ ఒకే మాటగా.

పేపర్స్ మళ్ళీ ఒక మారు చూసాడు. ఆవిడ వయసు యాభై రెండేళ్లు.

విషయం అర్ధమయ్యింది కృష్ణమోహన్ కి. అందరూ బలవంతంగా ఆమెని వృద్ధాశ్రమంలో చేర్చినట్టున్నారు.

మరి ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉన్నారుగా. ఇంకేంటి సమస్య అన్నాడు.

ఎలాగైనా ఆస్తి తమ పేరున వస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిదీ అమ్మని అడగాలి. అందుకు మా భార్యలు ఒప్పుకోవడం లేదు. మీరే ఎలాగైనా ఉపాయం తో మా ఆస్తి అమ్మ నుంచి మా పేరుతో మారేట్లు చెయ్యాలి అన్నారు.

అడిగితే ఎంతైనా ఇచ్చేట్లున్నారు ఫీజు.

తప్పకుండా చూస్తాను. రెండు రోజులు టైం ఇవ్వండి. అలోచించి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కృష్ణమోహన్.

వాళ్ళు వెళ్లిన తరువాత వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమం అడ్రస్ గూగుల్ లో వెతికాడు. అడ్రస్, ఫోన్ నెంబర్ రెండూ దొరికాయి.

ఆ రోజు మిగతా క్లయింట్స్ తో మాట్లాడి డిన్నర్ చేసేప్పటికి పది దాటింది. కూతుళ్లు, అల్లుళ్లతో ఓ గంట మాట్లాడి పడుకున్నాడు.

***

పొద్దున్నే యోగా, ధ్యానం, స్నానం, పూజ ముగించుకుని వచ్చేసరికి ఎనిమిదయ్యింది.

రోజూ తొమ్మిదింటికి టిఫిన్ చేసి కింద ఆఫీస్ లో కూర్చుని పదింటికి కోర్ట్ కి బయలుదేరుతాడు.

వంటమనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది. ఎనిమిదింటికి టిఫిన్ చేసి డ్రైవర్ ని కారు తీయమన్నాడు.

పొద్దున్న ఎనిమిది గంటలకే ఇద్దరు జూనియర్స్ వస్తారు. వాళ్లకి డైరెక్టుగా కోర్ట్ కి వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు.

అడ్రస్ వివరంగా డ్రైవర్ కి చెప్పి వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమం కి వెళ్ళమని చెప్పాడు.

బాగా లోపలికి ఉంది వృద్ధాశ్రమం. కనుక్కోవడం కష్టమయ్యింది. అది చిన్నదిగా ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో ఎవరికి అంతగా తెలీదు. ఎలాగోలా కనుక్కుని చిన్న సందు కావడంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరాడు.

బయట వాచ్మెన్ ని అడిగాడు పారిజాతలక్ష్మి పేరు గల ఆవిడని పిలవమని.

వాడికి తన వివరాలు చెప్పాడు.

చాలా పురాతనంగా పాడుబడ్డ ఇల్లులా ఉంది అది. ఎక్కువ మంది కూడా లేనట్లున్నారు అందులో. అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో వరండాలో నిలుచొనున్నాడు.

ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చింది ఆమె.

దగ్గరకు వస్తూనే పోల్చుకోగలిగాడు ఆమెని.

వస్తూనే నమస్కారం అంది తను.

గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్.

ఆవిడ తలెత్తి తేరిపార చూసింది. ఓహ్ మీరా అంది ఆశ్చర్యంగా.

ఆమె గుర్తుపట్టినందుకు సంతోషపడ్డాడు.

లోపలి రండి. కూర్చుని మాట్లాడుకుందాం అంది.

చిన్న హాల్ లో ఒక టేబుల్ రెండు కుర్చీలు వేసున్నాయి అతిధులు వస్తే కూర్చునేందుకు.

ఇద్దరూ కూర్చున్నారు.

ఆమెని చూస్తూనే గతంలోకి జారాడు కృష్ణమోహన్.

కృష్ణమోహన్ వాళ్ళ పూర్వీకులది కావలి. అక్కడే తన బాల్యం నుంచి కాలేజీ చదువు వరకు సాగింది.

ఆ రోజు తను స్కూల్ నుంచి రాగానే తమ పక్క పోర్షన్ లో ఎవరో అద్దెకు దిగిన వాళ్ళు సామాను దించుతున్నారు. పాతకాలం రోజులవి. కాన్వెంట్ స్కూల్స్ పెద్దగా లేని రోజులు. అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాల్సిందే.

కృష్ణమోహన్ అప్పుడు ఏడో క్లాస్ చదువుతున్నాడు కావలి జిల్లా పరిషద్ హై స్కూల్ లో. తండ్రి కోర్ట్ లో గుమాస్తా గా పని చేసేవాడు. కృష్ణ మోహన్ కి అన్న, చెల్లెలు. పెద్ద ఇల్లు కావడంతో ఓనర్ రెండు పోర్షన్ లు గా చేసాడు. ఒక పోర్షన్ లో కృష్ణమోహన్ వాళ్ళు ఉండేవాళ్ళు. పక్క పోర్షన్ రెండు నెలలు నుంచీ ఖాళీగా ఉంది.

ఆ రోజె పారిజాతలక్ష్మి కుటుంబం అద్దెకు దిగింది. పారిజాతం కు ఇద్దరు అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో గుమాస్తా గా ఉన్నాడు. అదే ఊర్లో వేరే ఇంటినుంచి ఇక్కడికి మారారు.

కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల రెండో క్లాస్. పారిజాతం కూడా రెండో క్లాస్ లో చేరింది. శకుంతల కి పారిజాతానికి బాగా స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరికీ ఏ సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చెయ్యాల్సిందే. అది కృష్ణమోహన్ తల్లి గారి ఆర్డర్స్. తల్లి మాటంటే కృష్ణమోహన్ కి వేదవాక్కు. ఎందుకో ఆమెకి పారిజాతం అంటే అమిత ఇష్టం. అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది. ఆమెకు నచ్చిన విషయాల్లో మొదటిది పారిజాతం అన్న పేరు. రెండోది చలాకీగా అందంగా ఉండేది. పోత బోసిన బొమ్మలా ఉండేది. స్కూల్ లో కూడా పారిజాతం అందరిలోకి ప్రత్యేకంగా ఉండేది. చిన్న పిల్ల అయినా అణకువగా ఎంతో ఒద్దికగా తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతుండేది. అందుకే కృష్ణమోహన్ తల్లి కి పారిజాతం అంటే అంత ఇష్టం.

ఆ రెండు కుటుంబాలు చక్కగా అరమరికలు లేకుండా ఒక్కటిగా ఉండేవాళ్ళు. ఏ పండుగైనా, ఫంక్షన్ అయినా అందరూ కలిసి మెలిసి ఆనందించేవాళ్ళు. అలా రెండేళ్లు గడిచాయి. పిల్లలందరూ సరదాగా ఆటలు, కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒద్దికగా ఉండేవాళ్ళు.

రెండేళ్లు యిట్టె గడచిపోయాయి.

అనుకోకుండా పారిజాతలక్ష్మి వాళ్ళ నాన్నకి వేరే ఊరికి బదిలీ అయ్యింది. ఆ విషయంలో అందరూ ఉదాసీనమయ్యారు.

పెద్దలు, పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పటిలా ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉండేవి కావు ఇళ్లలో. ఉత్తరాలతోనే సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లగా వారం రోజులు పట్టేవి చేరేందుకు.

కొద్ది కాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి. మెల్ల మెల్లగా అవి ఆగిపోవడంతో సమాచారాలు ఆగిపోయాయి. కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం పారిజాతలక్ష్మి పేరు, ఆమె రూపం అలా ముద్రించి ఉండిపోయాయి.

మరలా ఇన్ని రోజులకు ఆమెను చూసాడు. వయసులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికలలో ఏమీ మార్పు కనిపించలేదు.

తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఈ పిల్ల తోటి అంటుండేది. చిన్న వయసులో ఆ మాటలు తనకు అర్ధమయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఆమెని చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తోంది అనుకున్నాడు.

అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో పారిజాతం మెల్లగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది.

ఆ పిలుపుతో ఈలోకంలోకి వచ్చాడు. పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ.

ఎందుకుండదూ. బాల్యం ఎవరికైనా జీవితాంతం గుర్తుంటుంది అంది. ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది.

తన విషయాలు అన్నీ చెప్పాడు.

తెల్ల డ్రెస్ వేసుకోవడం గమనించి మీరు అడ్వకేట్ గా ఉన్నారా అంది.

అవును అన్నాడు.

తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చెయ్యడం తో ఆస్తులు కరిగిపోయాయి. ఆ బాధతో తండ్రి మంచం పట్టి చనిపోవడంతో తనకు ఎలాగోలా పెళ్ళిచెయ్యాలని తల్లి తపనపడి ఇద్దరు మగపిల్లలున్న గోవిందరావును ఇచ్చి చేసింది. ఆ ఇద్దరు పిల్లలకు తల్లయితే అయ్యింది కానీ తను మాత్రం తల్లికాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవతి తల్లి కావడంతో తను ఎంత ప్రేమ చూపించినా పిల్లలకి మాత్రం ఆమె పై ప్రేమ కలుగలేదు. ఆ దూరం పెద్దయ్యేకొద్దీ ఇంకా పెరిగింది. భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరుతో వీలునామా రాసాడు. రెండేళ్ల క్రితం భర్త హఠాన్మరణం తో ఆమె ఒంటరయ్యింది. కొడుకులు, కోడళ్ళు ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఆస్తి కోసం రోజూ నానా మాటలూ అనేవారు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి. అందుకే ఓల్డేజ్ హోమ్ లో చేరుస్తామని కొడుకులంటే సరే అని ఒప్పుకుంది. అవన్నీ చెప్పేప్పుడు చాలా నిర్లిప్తత గోచరించింది ఆమె మొహంలో. ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి.

ఆమె కొడుకులు వచ్చి ఆస్తి విషయం గురించి మాట్లాడిన విషయం అంతా చెప్పాడు కృష్ణమోహన్. ఏమి చెయ్యమన్నావు అని అడిగాడు.

ఇచ్చేయండి. నాకు ఆ ఆస్తి పల్లేదు. ఇలా ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను అంది స్థిరంగా.

ఆమె నిర్ణయానికి ఒక్క క్షణం నివ్వెరపోయాడు కృష్ణమోహన్. అంతా వాళ్లకు ఇచ్చేస్తే మరి రేపు వాళ్ళు నీకు ఏ సహాయమూ చెయ్యకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు తేరుకుని.

ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను. నా ఒక్క పొట్ట పోషించుకోవడం అంత కష్టమేమీ కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటె చెప్పండి. ఇంట్లో వంట నుంచి అన్ని పనులు చేసిపెడతాను అంది.

అదే నీ నిర్ణయమంటావు. ఆస్తి లో చిల్లిగవ్వ కూడా నీకు వద్దంటావు అని గుచ్చి గుచ్చి అడిగాడు ఒక అడ్వకేట్ గా.

అవును. నాకు వద్దు. వాళ్లనే అనుభవించనివ్వండి అంది.

ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బ్రతకగలవు. కొంచెం ఆలోచించు అన్నాడు.

ఫరవాలేదు. బ్రతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్లి మృత్యువుని ఆహ్వానిస్తాను అంది.

కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్.

మీరు అంతగా ఆలోచించకండి నా గురించి. కొన్ని బ్రతుకులంతే. అలా రాలిపోవాల్సిందే అంది తెచ్చుకున్న నవ్వుతో.

మా ఇంట్లోనే నువ్వు అడిగిన పోస్ట్ ఉంది. వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు అడిగాడు ఆమెని.

ఓ ! నేను చేస్తాను. నాకు ఇప్పించండి అంది ఎక్కడ ఆ పోస్ట్ పోతుందో అన్న బెంగతో.

మరి ఎప్పుడు చేరతావు అన్నాడు.

మీరు ఎప్పుడంటే అప్పుడే.

ఇప్పుడు నాతో వచ్చెయ్యగలవా అని అడిగాడు.

ఓహ్ తప్పకుండా అంది.

మరి నీ పిల్లల పర్మిషన్ అక్కర్లేదా అన్నాడు.

వాళ్ళు ఇక్కడ నన్ను చెరిపించేప్పుడే చెప్పారు వాళ్ళని ఎప్పుడూ విసిగించొద్దని. ఏదన్న అవసరముంటే ఆశ్రమం ఇంచార్జి వాళ్ళతో మాట్లాడుతాడు నా తరపున అని చెప్పారు. వాళ్లకి నన్ను చూడటం, నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంది బాధగా.

సరే. నీ బట్టలు అవి తెచ్చుకో నాతో వెళదాం మా ఇంటికి అన్నాడు.

ఈ లోపు ఆశ్రమం ఇంచార్జి వచ్చాడు. అతనితో చెప్పింది పారిజాతం తను ఖాళీ చేస్తున్నానని.

అతను నివ్వెరపోయాడు. మీ వాళ్ళు మూడు నెలల డబ్బు కట్టాలి మీరు ఉన్నందుకు. అడుగుతుంటే ఇంకా కట్టకుండా జాప్యం చేస్తున్నారు ఇవాళ రేపు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్ కి ఫోన్ చేసాడు మీ మదర్ వెళతానంటున్నారు. బాకీ డబ్బులు కట్టండి అర్జెంటు గా అని.

ఇంతలో సతీష్ పారిజాతం కి ఫోన్ చేసాడు. ఎక్కడికి వెళుతున్నావు అని.

కృష్ణమోహన్ సైగ చేసాడు తన పేరు చెప్పొద్దని.

తెలిసిన వాళ్ళింట్లో వంటమనిషిగా కుదిరింది అని చెప్పింది పేరు చెప్పకుండా. వెళ్ళినతరువాత ఫోన్ చేస్తానని చెప్పింది.

సరే అని సతీష్ ఫోన్ పెట్టేసాడు.

కృష్ణమోహన్ అడిగాడు ఇంచార్జి ని ఎంత డబ్బులు బాకీ అని.

పదివేలు అని చెప్పాడు అతను.

జేబులోంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాడు.

అయ్యో మీరెందుకు ఇవ్వడం అంది పారిజాతం నొచ్చుకుంటూ.

ఫరవాలేదులే . నీ జీతంలో కట్ చేస్తాను నెల నెలా అని చెప్పాడు.

రూమ్ లోకెళ్ళి తన సూట్ కేసు తో వచ్చింది.

ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతినుంచి సూట్ కేసు తీసుకున్నాడు.

పారిజాతం ని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్.

అప్పటికే టైం పదకొండు దాటింది. ఫోన్ చేసి జూనియర్స్ కి చెప్పాడు ఇవాళ కోర్ట్ కి రావడం లేదని. వాళ్ళని మేనేజ్ చెయ్యమని చెప్పాడు. అంత ఇంపార్టెంట్ కేసెస్ కూడా లేవులే అని సమాధానపడ్డాడు. సామాన్యంగా కోర్ట్ కెళ్ళడం మానడు కృష్ణమోహన్.

ఇంటికెళ్ళగానే వంటమనిషిని పిలిచి పారిజాతం ని గెస్ట్ రూమ్ లో ఉండేట్లు ఏర్పాటు చెయ్యమని చెప్పాడు.

తను కిందికి ఆఫీస్ కి వచ్చి కూర్చున్నాడు. వంటమనిషి, ఆమె భర్తని పిలిచి పారిజాతం తన గెస్ట్ అని, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సరే అన్నారు వాళ్ళు.

మధ్యాన్నం లంచ్ టైం కి పైకి వెళ్ళాడు.

అప్పటికే పారిజాతం అటూ ఇటూ తిరుగుతోంది హాల్ లో.

కృష్ణమోహన్ వెళ్ళగానే అడిగింది తనకి ఇంకా పనేమీ చెప్పలేదేమని.

రేపటినుంచి చెపుతానని చెప్పాడు.

ఇద్దరూ కలిసి భోజనం చేశారు. బాల్యం నెమరువేసుకున్నారు. ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

రెస్ట్ తీసుకోమని చెప్పి తనూ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.

సాయంత్రమయ్యింది. హాల్ లో టి వి చూస్తూ కూర్చుంది పారిజాతం.

సాయంత్రమైతే కృష్ణమోహన్ చాలా బిజీ అవుతాడు. క్లయింట్స్ తో మాట్లాడటం పూర్తయ్యేసరికి రోజూ రాత్రి తొమ్మిదవుతుంది. తరువాత జూనియర్స్ తో కాసేపు రేపటి కేసులు గురించి డిస్కస్ చేస్తాడు.

ఆ రోజు టైం ఎనిమిది కాగానే ఇవాళ నేను ఎర్లీ గా వెళుతున్నాను అని జూనియర్స్ కి చెప్పి పైకి వచ్చాడు.

హాల్ లో టి వి చూస్తున్న పారిజాతం లేచి నిలుచుంది కృష్ణమోహన్ ని చూడగానే.

కూర్చోమని చెప్పి తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వంటావిడ ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది.

నిన్నొకటి సూటిగా అడుగుతాను. ఏమీ అనుకోవుకదా అన్నాడు పారిజాతం వైపు చూస్తూ.

నా పోస్ట్ పదిలమే కదా. నన్ను తీసెయ్యవు కదా అంది. ఎందుకంటే వంటావిడ, ఆమె భర్త ఉన్నప్పుడు ఇక తన అవసరం ఆ ఇంట్లో లేనట్లే అని ఆమె ఒక అభిప్రాయానికొచ్చింది అప్పటికే.

ఆమె మొహంలో కంగారు చూసి తను అడగబోయే విషయానికి ఆమె ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు అంత వయసులోనూ.

నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను అన్నాడు. తను ఎలా తీసుకుంటుందో అన్న మీమాంసలో ఆమె మొహం వైపే చూస్తున్నాడు. తొందరేమీ లేదు. అలోచించి నీ నిర్ణయం ఒక వారం తరువాత చెప్పు అన్నాడు.

ఆమె మోహంలో ఏ భావమూ లేదు. కొంత నిర్లిప్తత కనిపించింది.

నీ మనసులో మాటలు నిర్భయంగా మాట్లాడొచ్చు అన్నాడు. మనమేమీ చిన్న పిల్లలం కాదు. శేష జీవితంలో ఒకరికొకరు తోడు కోసం నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. నీవు నీ మనసులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు.

కొంచెం సేపు అలోచించిన పిమ్మట తను అంది. నావైపు అలోచించి నా బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. మీ అమ్మాయిల అభిప్రాయం కూడా అడగండి. వారికి సమ్మతమైతే మీరు ఎలా చెప్తే అలా అంది.

సరే. ముందు డిన్నర్ చేద్దాం పద అన్నాడు.

భోజనం చేసిన తరువాత వీడియో కాన్ఫరెన్స్ లో ఇద్దరు కూతుళ్ళకి పారిజాతం కధ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు. కూతుళ్లు, అల్లుళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారి చప్పట్లు చరుస్తూ తమ ఆనందం వెలిబుచ్చారు. ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీ ని చూపించండి అని అడిగారు ఉత్సాహంతో.

పక్కన కూర్చున్న పారిజాతం వైపు లాప్టాప్ తిప్పాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది ఆమె. ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది. తను కేవలం నీడ కోసం అడిగితే మీ డాడీ తన జీవితాన్ని నాకు పంచుతున్నారు అంది ఆనందభాష్పాలతో గొంతు బొంగురుపోతుండగా. నేను ఇందుకు అర్హురాలిని అవునో కాదో నాకు తెలీదు అని గద్గదికంగా అంది.

కృష్ణమోహన్ కూతుళ్లు అలా అనకండి మమ్మీ. ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాము. మేము ఇక్కడ ఉన్నా మా మనసంతా అక్కడే ఉంటుంది. రోజూ రాత్రి మాట్లాడేంతవరకూ ఆత్రుతగానే ఉంటుంది మాకు. ఈ రోజునుంచి మేము కొంత రిలాక్స్ అవుతాము అన్నారు సంతోషంగా. అల్లుళ్ళు కూడా వరుస కలిపి అత్తయ్యగారు అంటూ వాళ్ళ మామగారి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. రోజూ పదకొండు వరకు మాట్లాడేవాళ్ళు ఆరోజు తెల్లవారు ఝాము మూడయ్యింది.

కూతుళ్లు, అల్లుళ్ళు ఇద్దరికి అమెరికాలోనే పెళ్లి చేస్తామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు కృష్ణమోహన్ కి. ఎన్నోసార్లు రమ్మన్నా బ్యాంకు లో బిజీగా ఉండటంతో అమెరికా వెళ్లలేకపోయాడు. భార్య చనిపోయిన తరువాత న్యాయవాద వృత్తిలో పడి ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక వెళ్లి తన కూతుళ్లు, అల్లుళ్లను చూసి రావొచ్చు అనుకున్నాడు.

అందరూ బై చెప్పి సెలవు తీసుకున్నారు.

లాప్ టాప్ మూసేసి మళ్ళీ అడిగాడు నీకిష్టమే కదా అని.

పారిజాతం ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. రెండు కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి.

నీ ఆస్తి ని మీ పిల్లల పేర రాసేసి, మనం అమెరికా వెళ్లి పిల్లల సమక్షంలో పెళ్ళయ్యేంతవరకు ఇలానే విడిగా ఉందాం. ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలూ ఉన్నాయి. నీవు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు కృష్ణమోహన్.

సరే అంది పారిజాతం.

ఇద్దరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి