దేవుడిచ్చినవరం - శింగరాజు శ్రీనివాసరావు

God given social story by singaraju srinivasa rao

" ఇంత చిన్న విషయానికే అలా అల్లుడి మీద చిందులేసి ఇలా రావడం సరైన నిర్ణయం కాదేమోనమ్మా. ఆలోచించు" కూతురు పక్కన సోఫాలో కూచుంటూ చెప్పింది సునంద కూతురు వైదేహితో. " నాకు మాట తప్పేవారంటే చాలా అసహ్యమమ్మా. పెళ్ళికి ముందే చెప్పాను. నాకివంటే చాలా అసహ్యమని. తాగుడు, జూదము, వ్యభిచారం ఇలాంటివి ఒకసారి మొదలైతే ఇక ఆగవు. అసలు నాకు ఇష్టం లేని పనిచేసి వచ్చిన ఆయన ముఖం చూడాలంటే ఛీదరింపుగా ఉంది" వైదేహి మనసులో మాట. " ఏదోలేమ్మా. స్నేహితుల బలవంతం మీద తాగాడన్నాడట కదా. పోనీ ఈ ఒక్కసారికి వదిలేయవచ్చు కదా. ఇంకొకసారి అలా చేయనని మాట ఇచ్చేలా మేము చూస్తాం." సర్దిచెప్పబోయింది సునంద. " ఇలాగే ఇంతకు ముందు జరిగింది. అప్పుడు తప్పయిపోయింది. ఇంకెప్పుడూ చేయనని కాళ్ళు పట్టుకునేటంత పనిచేశాడు. ఇక ఇలా చేస్తే వదిలేసి వెళ్ళిపోతానన్నాను. ఒట్టువేసి మరీ చెప్పాడు తాగనని. మరల మొన్న అలా. నా వల్ల కాదమ్మా. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. మీకు కష్టంగా ఉంటే చెప్పండి. నేను వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను" ఖరాఖండిగా చెప్పింది వైదేహి. " అదికాదమ్మా" " చూడమ్మా. నాన్న ఆయనలాంటి వాడు కాదు కాబట్టి. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు కాబట్టి, ఎన్ని నీతులైనా చెబుతావు. అనుభవించే వాడికి తెలుస్తుంది ఆ బాధ" అని లేచి చరచరా లోనికి వెళ్ళిపోయింది వైదేహి. సునంద, సుధాకర్ లకు ఒక్కగానొక్క కూతురు వైదేహి. ఎంత తెలివిగలదో, అంత మొండిది. ఒక రకంగా దానికి కారణం తండ్రి చేసిన గారాబమే. అలాగని విచ్చలవిడితనం లేదు. కానీ అనుకున్న పంతం నెగ్గకపోతే సాధించేరకం. అక్కడే తల్లీకూతుళ్ళకు పడకపోయినా తండ్రి మాటే పైచేయి కావడంతో వైదేహి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిపోయింది. చదువు అయనదే తడవుగా పిలిచి మరీ ఉద్యోగమిచ్చారు టాటా కన్సల్టెన్సీ వాళ్ళు. పాతిక లక్షల ప్యాకేజి. ప్రేమ, దోమ లాంటి పిచ్చి ప్యాకేజిలు లేకుండా చక్కటి వరుడు దొరికాడు వైదేహికి. అతనూ సాఫ్ట్ వేర్ ఇంజనీరే. పేరు శ్రీరామ్. పేరుకు తగ్గవాడే కానీ, నాగరికత చుక్కలు తాకుతున్న రోజులు కదా, ఎంత నిష్టగా వున్నా, ఎంతో కొంత మైలపడక తప్పదు. స్నేహితుల మొహమాటంతో ఒక్కసారి లైట్ గా మందు సేవనం జరిగింది. ఆ రోజు వైదేహి ఇల్లు పీకి పందిరి వేసింది. ఎలాగోలా బయటపడ్డాడు ఆ రోజు. కానీ మొన్నటికి మొన్న వాళ్ళ బాస్ పుట్టినరోజని, అందరూ బలవంతపెడితే, విధిలేక ఒక రెండు పెగ్గులు మాత్రం తీసుకున్నాడు. విషయం బయటపడకూడదని మౌత్ ఫ్రెషనర్, మిఠాపాన్ లాంటి ట్రిక్కులన్నీ వాడాడు. అయినా అవేవీ పారలేదు వైదేహి దగ్గర. నిలదీసింది. మాటామాటా పెరిగింది. అంతే తట్టా బుట్టా సర్దుకుని వచ్చేసింది వైదేహి. దీని మీద పెద్ద చర్చే జరిగింది సునంద, సుధాకర్ ల మధ్య. సునంద విషయాన్ని తనకు వదిలేయమని చెప్పడంతో, భార్య మీద నమ్మకంతో నిశ్చింతగా ఉన్నాడు సుధాకర్ ******* గత వారం రోజుల నుంచి పనికి ఆలస్యంగా వస్తున్నది వరమ్మ. ఊరంతా కరోనా గోల వల్ల ఎప్పుడు ఎక్కడ రోడ్లు మూస్తారో అర్థంగాక చస్తున్నారు జనం. వరమ్మ వచ్చే దారిలో ఒక వైపు రోడ్డు మూసివేయడం వలన చుట్టూ తిరిగి రావలసి వస్తుందని చెప్తున్నది. రావద్దని చెబ్దామంటే చేసుకోలేనేమోనని భయం. పైగా వైదేహి కూడ ఇక్కడే ఉన్నదాయె. ఆలస్యంగా వచ్చినా చాలా హుషారుగా ఉండే వరమ్మ, ఈ మధ్య ఏదో పరధ్యానంగా పనిచేస్తున్నది. కారణమడిగితే ఏమనుకుంటుందోనని అడగలేదు. ఆ కాలనీలో ఉండే మగవారికున్న బలహీనత తాగడం, వరమ్మ భర్త కూడ అదే కోవకు చెందినవాడు. తాగివచ్చిన రోజు వరమ్మను కారణం లేకుండా కొట్టేవాడు. అయినా పాపం అలాగే పనికి వచ్చేది గాని, ఎగనామం పెట్టేది కాదు. కోవిడ్ పుణ్యమా యని బ్రాందిషాపులు మూసేసేసరికి వరమ్మ పంట పండిందనుకుని సంబరపడిపోయింది. రెండు నెలలు తాగకపోయేసరికి అలవాటు మానుకుంటాడనుకుంది. ప్రభుత్వం మరల షాపులు తెరవడానికి అనుమతి యివ్వడంతో కథ మరల మొదటికొచ్చింది. నెల క్రితం అదే చెప్పుకుని ఏడ్చింది వరం తన బ్రతుకింతేనని. అప్పుడే వైదేహి భర్తను వదలి వచ్చిన తొలినాళ్ళు. ఆ రోజు సంఘటన సునంద కళ్ళల్లో మెదిలింది. ***** " ఆడిక తాగుడు మానుకోడమ్మా. మా సావు మేము సావాల్సిదే" ఏడుస్తూ చెప్పింది వరమ్మ " ఎందుకే అలాంటివాడితో నువ్వింకా కాపురం చేస్తున్నావు. వాడిని వదిలేసి పిల్లను తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో. విడాకులిచ్చి తెగదెంపులు చేసుకో" ఆవేశంగా గదిలో నుంచి వంట గది వైపుకు అరుస్తూ వచ్చింది వైదేహి " ఎందుకే నీకంత ఆవేశం. దానికది మామూలే లేవే" సర్దిచెప్పబోయింది సునంద " అమ్మాయిగోరు. అలా అనకండమ్మా. ఆడికి నేనంటే పేనం. నా ఖర్మగాలి ఆ తాగుడలవాటయింది గాని. లేకుంటే ఆడు బంగారం తల్లీ. తాగొచ్చినపుడు కాస్తంత ఓర్చుకుంటే సాలు. అయినా ఇంత సిన్న తప్పుకు మొగుణ్ణి వదులుకుంటామా తల్లీ. సిన్న పిల్లవు. అమ్మంతయితే నీకు ఆ ఓర్పు వస్తది." ఆ మాటకు ఉలిక్కిపడింది వైదేహి. తాగడం చిన్న విషయమా.. ఇంతకూ అది నేను వచ్చిన కారణం తెలిసే అలా అన్నదా.. క్యాజువల్ గా అన్నదా... అర్థం కాలేదు. అయినా ఆవేశం తగ్గలేదు. " నీలాంటి వాళ్ళకది చిన్నదేమో.. మాలాంటి వాళ్ళకు కాదు" అంటూ విసురుగా వెళ్ళిపోయింది. " చూశారా అమ్మగోరు. సిన్నమ్మాయి కెంత కోపమొచ్చిందో. సిన్నయ్యగారికి సెప్పండమ్మా అమ్మకు ముక్కు మీద కోపమేగాని బంగారుతల్లి యని" అంటూ తన పనిలోకి వెళ్ళిపోయింది వరమ్మ. ఇంత ఆవేశమున్న కూతురు కాపురం ఎలా చక్కబెట్టాలా అని ఆలోచనలో పడిపోయింది సునంద. ******** " అమ్మగారు రాత్రి నుంచి మా ఆయనకు పొట్టలో ఒకటే నొప్పి అంటుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళామమ్మా. రాత్రి ఏవో పరీచ్చలు చేసి పిడుగు లాంటి మాట సెప్పారమ్మా. తాగి తాగి ఆడికి అదేదో కాలేయమంటమ్మా. అది సెడిపోయినాదట. పెద్ద ఆపరేసన్ సేయాలట. వాడికి ఎవరైనా కొద్దిగా కాలేయమిస్తే సాలంట. తరువాత తరువాత అదే పెరుగుతాదంట. ఇచ్చినోల్లకు కూడ పెద్ద ఇబ్బందేమీ ఉండదంట. ఎవరో ఎందుకు నేనే ఇత్తానన్నా. డాకటరు గారు సరే అన్నారు. ఆపరేసను కరుసంతా గవర్నమెంటోల్లే ఎడతారంట. మా సేతిలో ఓ పదేలు ఉంచుకోమన్నారు. సానా పెద్ద ఆపరేసనంటగాని, భయం లేదన్నారమ్మా. ఏదయినా అయి నేను బోయినా, ఆడుంటే సాలమ్మా పిల్లను సూసుకుంటాడు" మనసును దిటవు చేసుకున్నట్టుగా ఉన్నది వరమ్మ మాట. " ఎంత కష్టమొచ్చిందే నీకు. అది సరే, నీ కాలేయాన్ని కొంత తీసి మీ ఆయనకు అమరిస్తే, ఇద్దరికీ ఇబ్బందవుతుందేమో" అనుమానంగా అడిగింది సునంద " లేదటమ్మా. నాకు కూడ పరీచ్చలు చేశారు. నేను శానా ఆరోగ్గెంగా ఉన్నానట. నాకు అది తొందరగా పూడుతదట. అసలు బయం లేదని పెద్ద డాట్టరు సెప్పారు. ఏదయినా సూత్తా సూత్తా ఆడిని పోగొట్టుకోలేను కదమ్మా" వరమ్మ కళ్ళల్లో భర్త మీద ప్రేమ తొంగి చూసింది. 'అదేనేమో మూడుముళ్ళ బంధం మహిమ. భర్త ఎంత దుర్మార్గుడైనా హైందవ స్త్రీకి అతను దేవుడే. ఆ భావన నరనరాలలో జీర్ణించుకుపోయిన రక్తం మనది. అందుకే తట్టుకోలేక పోతున్నది' మనసులో అనిపించింది సునందకు. " వరమ్మా నువు చేస్తున్నది త్యాగమనుకుంటున్నావా. రేపేదైనా నీకు జరగరానిది జరిగితే మీ ఆయన నీ కూతురిని చూస్తాడనుకున్నావా. మరల తాగుడు మొదలుపెట్టి, దాన్ని ఏ వెధవో కట్టబెట్టి దాని బ్రతుకునూ సర్వనాశనం చేస్తాడు" ఉక్రోషం పట్టలేకపోతూ అన్నది వైదేహి వారి మాటలు విని. " ఆడు అసుమంటోడు కాదమ్మా. సుట్టు పక్కలోల్లు ఆడిని అలా చేశారు. ఆడి మీద నాకు నమ్మకమమ్మా. ఆడికి ఇపుడు బుద్దొచ్చింది. ఒకటే ఏడుతున్నాడు. ఇక తాగనని ఒట్టు వేశాడు. ఆడిని ఎలాగైనా బతికించుకోవాలి. ఈ నెలంతా నేను పనికి రాలేనమ్మా. మా తోడికోడలికి చెప్పాను. అది వస్తానంది. సేయించుకోండమ్మా నేను వచ్చేదాకా" అని నమస్కరించి వెళ్ళబోయింది వరమ్మ. " సరేలేవే. ఇంతకూ పై ఖర్చులకు డబ్బులెలా చేస్తున్నావే. పదివేలు ఉన్నాయా నీ దగ్గర. అప్పు చేయాలా" అడిగింది సునంద " లేవమ్మా. మాకు తెలిసిన శెట్టి గారినడిగా. వడ్డీకి ఇత్తానన్నాడు. తెచ్చుకుంటాలేమ్మా" " మరల వడ్డీ కడతావా. అక్కరలేదు గానీ, నేనిస్తా తీసుకెళ్ళు. నీ జీతంలో నెలకింతని తిరిగి ఇద్దువు గానిలే. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదే. నీ అయిదవతనాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. ఉండు ఇస్తా" నని డబ్బు తీసుకురాను లోపలికి వెళ్ళింది సునంద. " ఏమయినా నువు చాలా గొప్పదానివే వరమ్మా. కష్టపెట్టే మొగుణ్ణి కూడ కాపాడు కోవాలని చూస్తున్నావు" వ్యంగ్యంగా అంది వైదేహి " గజ్జి వచ్చినాదని సేతులు నరుక్కుంటామా తల్లీ. మందు రాసి బాగుసేసుకుంటాం. ఆడు నా శరీరంలో సిన్న బాగవమ్మా. ఆడంటే నాకు నమ్మకం, పేమ. మా పెల్లపుడు మా యమ్మ సెప్పింది. మొగుడు, పెల్లాల మధ్య పేమ కంటే నమ్మకం ఎక్కవగ ఉండాలటమ్మా. ఆ మాటే నాకు ఏదవమ్మా" ఎక్కడో తగిలింది వైదేహికి. అంటే తనకు తన భర్త మీద నమ్మకము, ప్రేమ లేదా. తన భర్త చేసిన తప్పు అంత పెద్ద తప్పుగా ఎందుకనిపిస్తున్నది. తన్ని తగలేసే వాడి కోసం వరమ్మ తన ప్రాణాన్నే పణంగా పెడుతున్నది. ఎవరిది తప్పు. అసలు ఆడపిల్ల ఎలా ఉండాలి? నేనే తొందరపడ్డానా? సంపాదిస్తున్నాననే అహమా? మాట వినలేదని కోపమా? అంతా గందరగోళంగా ఉంది వైదేహికి. ఇంతలో సునంద వచ్చి పదివేలు వరమ్మకు ఇచ్చి సాగనంపింది. వారిద్దరి మధ్య మాటలు సునందకు ఆ గదిలోకి వినిపించనే వినిపించాయి. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది. ****** " అరె అల్లుడు గారా రండి రండి" అంటూ శ్రీరామ్ ను ఆహ్వానించాడు సుధాకర్. " బాగున్నారా మామయ్య గారు. అత్తయ్య గారూ ఎలా వున్నారు? " కుశలమడిగాడు శ్రీరామ్. " ముందుగా ఫోను చేస్తే స్టేషన్ కు వచ్చే వాడినిగా" " లేదండీ కారు తీసుకొచ్చాను. వైదేహి కారు తీసుకురమ్మంది " " అవును నాన్నా నేనే తీసుకురమ్మన్నాను. అమ్మ రేపు మంచిరోజని చెప్పింది. నేను వెళతాను నాన్నా. పాపం శ్రీరామ్ చాలా రోజుల నుంచి వండుకోలేక అవస్థలు పడుతున్నాడు అందుకని" అర్థం కాలేదు సుధాకర్ కు. సీను ఇలా మారిపోయిందేమిటి. భార్యవైపు చూశాడు. చిరునవ్వు నవ్వి అంతా సర్దుకుందని కళ్ళతోనే సైగ చేసింది సునంద. రాత్రి అమ్మ చెప్పిన మాటలు వైదేహి చెవులో మారుమ్రోగుతున్నాయి. " చూడమ్మా. జీవితమంటేనే సర్దుబాటు. తప్పు చెయ్యనివారు ఎవరూ ఉండరు. వరమ్మ భర్త కంటే ఎక్కువ తప్పులు చేశాడా శ్రీరామ్, లేదుగా. మరి చదువు రాని వరమ్మ చూడు అతడి మీద ద్వేషం పెంచుకుని వదిలేసిందా. తన దేహంలోని భాగాన్ని అతనికి పంచడానికి సిద్ధమయింది. అటువంటి త్యాగాలు, ప్రేమలేనమ్మా స్త్రీని దేవతను చేశాయి. మన సంప్రదాయంలో మగువను అమ్మవారితో సమానంగా గౌరవిస్తారు. కాలం మారి సమానత్వపు గోల బయటకు వచ్చి ఆడవారు తక్కువగా గౌరవించబడుతున్నారని, లేనిపోని భేషజాలు పెరిగి కాపురాలు నాశనమవుతున్నాయి. ఎక్కడో కొందరు తప్ప, ఎంతో మంది మగవారు తమ సంపాదనలో సింహభాగం భార్యల కోసం ఖర్చు చేసి వారి సంతోషాన్ని కోరుకుంటున్నారు. అంతెందుకు శ్రీరామ్ ఇంటి ఖర్చంతా తనే భరిస్తున్నాడు గాని, నీ జీతం ఎప్పుడైనా అడిగాడా. స్త్రీ అంటే క్షమకు పెట్టింది పేరు. భర్త తప్పు చేసినా, బిడ్డ పొరపాటు చేసినా ఓరిమితో భరిస్తూ వారిని సరియైన దారిలో పెడుతుంది. నీవు ఉత్తముడనుకునే మీ నాన్న గురించి నీకేమి తెలుసమ్మా. నాటకాల పేరుతో ఇంటిపట్టున ఉండేవాడే కాదు. నువ్వు పసిదానివి. అతడిని మార్చుకోను నాకు అయిదు సంవత్సరాలు పట్టింది. భర్త అంటే ఆడదానికి తొలిబిడ్డమ్మా. అతని చిన్న చిన్న తప్పులను సరిదిద్దుతూ, లాలిస్తూ పాలించాలి గాని, వదిలించుకోకూడదు. చిన్నదానివని ఇవన్నీ చెబుతున్నాను. తరువాత నీ ఇష్టం" " నన్ను క్షమించు వైదేహి" అన్న శ్రీరామ్ మాటలతో స్పృహలోకి వచ్చింది. " ఇద్దరం తప్పు చేశాం శ్రీరామ్. సర్దుకుపోదాం. మనమధ్య ఇలాంటి సంఘటనలు ఇక జీవితంలో జరుగవు. సరేనా" వైదేహి మాటలలో ఆత్మీయత. " నేనూ అంతే, మాట తప్పను" హామీ ఇచ్చాడు శ్రీరామ్. సుధాకర్ కళ్ళలో ఆనందం. సునంద వైపు చూశాడు కృతజ్ఞతా భావంతో. సునంద నా జీవితానికి దేవుడిచ్చిన వరం. ఎంతో పుణ్యం చేసివుంటే తప్ప ఇటువంటి భార్య రాదు. నేను అదృష్టవంతుణ్ణి. " చూసింది చాలు " అన్నట్లు కళ్ళు ఆర్పి " పద బాబు నువ్వు ఫ్రెష్ అయితే, అందరం కలసి భోంచేద్దాం" అన్న సునంద పిలుపుతో అందరూ అలర్ట్ అయ్యారు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి