ఆభరణం - చెన్నూరి సుదర్శన్

Jewelry

“సురేంద్రా! నీ పెళ్ళాం చూడురా.. తన పెట్టెలో పట్టెడంత బంగారు గొలుసు పెట్టుకుని నంగనాచి వేషాలు వేస్తోంది” అంటూ మా నాన్న గొంతు గర్జించే సరికి, భయపడుకుంటూ.. హాల్లోకి వచ్చాను. నన్ను చూస్తూనే.. వెటకారంగా ముఖం పెట్టి..

“మా అత్తగారు చాలా బీద వాళ్ళు. వాళ్ళను కానీ కట్నం గూడా అడుగొద్దని కంకణం కట్టుకుని మరీ పెళ్లి చేసుకున్నావు. ప్రతీ విషయంలోనూ వాళ్ళనే సపోర్ట్ చేస్తూ.. మా నోరు మూయిస్తున్నావు. చివరికి పడుకోడానికి పట్టెమంచం గూడా మనింటి నుండే తెచ్చుకున్నావు. గంత గతి లేని వాళ్ళైతే ఈ గొలుసు ఎక్కడినుండి వచ్చిందిరా..!” అంటూ ఉరుముకుంటూ చూశాడు.

నేను నిరుత్తరుడనయ్యాను. నిండుగా కొంగు కప్పుకొని, తల దించుకొని వంటింటి గుమ్మం ముందు నిలబడి ఉంది నా జీవన సహచరి సరోజ. ఆమె కన్నీటి బిడువులు నేలపై రాలుతూండడం గమనించి నా మనసు ద్రవించింది. స్నిగ్ధలా ఉన్న ఆమెను చూస్తూ.. సందిగ్ధంలో పడిపోయాను.

“ఇల్లంతా బొత్తిగా బోసిపోయినట్లున్నది. ఇది అమ్మేసి టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ నాలుగు కుర్చీలు తెచ్చుకుందామని అంటుంటే.. నీ పెళ్ళాం బెల్లం కొట్టిన రాయిలా ముఖం పెట్టుకుంది. మీ మంచికే చెబుతున్నా.. ఎవరైనా వచ్చి మీ అత్తగారు ఏం పెట్టారని అడిగితే ఏం చెబుతావు? తలదించుకుంటావా!. నీకేమో గాని నాకు తల కొట్టేసి నట్టుగా ఉంటుంది సురేంద్రా..” అంటూ నా వంక తీక్షణంగా చూశాడు నాన్న.

సరోజ దగ్గర అంత పెద్ద గొలుసు ఉన్నట్టు నాకూ తెలియదు. నామనఃస్తత్వం తెలిసి గూడా తన ఇంటి నుండి గొలుసు తెచ్చుకోవడం కోపం వచ్చింది. అయినా కొత్త సంసారం.. సరోజ బెదరి పొతుందని తమాయించుకుంటూ..

“సరోజా.. గొలుసు ఎందుకు తెచ్చావ్?” అంటూ నెమ్మదిగా అడిగాను.

గొలుసు అమ్ముదామన్న విషయం తేల్చకుండా గొలుసు ఎందుకు తెచ్చావని అడుగు తున్నందుకు సరోజ మీది వాడి చూపులు మళ్ళీ నామీదకు మళ్ళించాడు నాన్న.

సరోజ కడకొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటూ..

“గొలుసు కాదు సురేంద్రా. అది ‘ఆభరణం’. మావాళ్ళు దానిని నాలుగు తరాలుగా దేవుని గుళ్ళో పెట్టి ప్రతీ లక్ష్మీవారం పూజిస్తూ వస్తున్నారు. సంప్రదాయం ప్రకారం మా అమ్మ నిన్న నన్ను దిగబెట్టడానికి వచ్చినప్పుడు ఇచ్చి వెళ్ళింది. ఈరోజు నీకు చూపించి సర్ ప్రైజ్ చేసి, ఇద్దరం కలిసి పూజిద్దామనుకున్నాను. ఇంతలో మామయ్య గారు పెట్టె తెరచి చూశారు. దీనిని అమ్మగూడదని ప్రాణప్రదంగా చూసుకోవాలని అమ్మ చెప్పింది” అంటూ బిక్క ముఖం పెట్టింది సరోజ. ఆమె ముఖం చూస్తుంటే నాకు ముచ్చటేసింది. ఎంత అమాయకత్వం. అప్రయత్నంగా నా పెదవులపై చిరునవ్వు మొలిచింది. నాన్న లేకుంటే వాటేసుకునే వాణ్ణి. అప్పుడే సరోజ స్నానం చేసి వచ్చినట్టుగా ఉంది. కడిగిన ముత్యంలా మెరుస్తూంది. నాన్న పోలీసు బుద్ధి పోనిచ్చుకోలేదు. ఇటువైపు డ్యూటీ మీద వచ్చానన్నాడు. మా కొత్త కాపురాన్ని చూసి పోదామనుకున్న వాడు చూసి పోక.. సరోజ అనుమతి లేకుండా పెట్టె తెరచి చూడ్డం.. నా మనసు చివుక్కుమంది.

ఆ పట్టెమంచం కూడా నేను అడిగి తెచ్చుకున్నది కాదు. మా అమ్మ మమ్మల్ని దీవించి ఇచ్చిందే. దానిని మా ఇంట్లో అందరం ‘ఛత్రికోళ్ళ పట్టెమంచం’ అంటాం. చూడ ముచ్చటగా ఉంటుంది. మంచానికి రెండు చివర్లలో మధ్య భాగమున రెండు అడుగుల వెడల్పు, మూడడుగుల నిడివి కలిగిన రెండు అద్దాలుంటాయి. ఒకవైపు చూపుడు అద్దమైతే.. మరో వైపు రెండు నెమళ్ళ నృత్య భంగిమలు.. కొలనులో రెండు హంసల సోయగాలు.. కొలను చుట్టూ కొండలు.. వానిపై జలపాత దృశ్యాలు.. ఆకాశంలో పక్షులు.. ఆయారంగులతో మెరుస్తూ.. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా.. నగుషీలు అలరిస్తూ ఉంటాయి. దోమతెర వెసులుబాటు సరేసరి. ఆ మంచాన్ని మా తాత గారికి అతని స్నేహితుడు పెళ్లి కానుకగా ఇచ్చాడట. ఆ మంచం ఆశీర్వాదబలమే.. మానాన్న జననం.. ఆ తరువాత నేను.. మా చెల్లెలు కవిత.

సరోజను, నన్ను కలిపింది కూడా మా పట్టెమంచమే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి సంఘటన మరెవ్వరి జీవితంలోనూ జరుగదనుకుంటాను.

నేను అప్పుడు హన్మకొండలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. పట్టెమంచం నవారు జీర్ణమయ్యింది.. కొత్తది కొనుక్కు రమ్మని అమ్మ ఆదేశిస్తే.. హసన్ పర్తి వెళ్లాను. ఆ ఊళ్ళో నవారు నేయడం కుటీర పరిశ్రమ. దాదాపు ప్రతి ఇంటా నవారు నేస్తూంటారు. వారికి ముడి సరుకు ఇవ్వడం.. నవారు నేసినందుకు కూళ్ళు ఇవ్వడం అక్కడి చేనేత సహకార సంఘం చూసుకుంటుంది. నేను సంఘంలో నవారు బిల్లలు కొందామని వెళ్లాను. సంఘంలో క్యాషియర్ మాకు దూరపు బంధువు.. పెద్దనాన్న అవుతాడు. అదే సమయంలో నవారు బిల్లలు సంఘంలో అప్పగించడాననికి వచ్చింది సరోజ. అవి గంగ తడల నేతతో.. చూడ ముచ్చటగా ఉన్నాయి. అలా ఉంటే మన్నిక గూడా.. ఆ నవారు బిల్లలనే ఖరీదు చేశాను.

‘ప్రధమ చూపులోనే ప్రేమ చిగురిస్తుంది’ అని ఒక కవి శ్రేష్ఠుడు చెప్పినట్టుగా సరోజ హావభావాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. పెద్దనాన్నకు నేను సరోజ మీద మనసు పడ్డ విషయం చెప్పాను. నా ఆదర్శభావాలు తెలిసిన పెద్దనాన్న మా సంబధం కుదిర్చాడు. మా అమ్మ సంతోషంగా ఒప్పుకున్నా.. నాన్న తిరకాసు పెట్టాడు. ‘నువ్వు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటావు సరే గానీ.. రేపు కవితకు కట్నమివ్వకుండా విదిలించుకుంటానంటే నేను ఒప్పుకోను. నేను చూసిన సంబంధం.. నేను ఒప్పుకున్న కట్నకానుకలిచ్చి పెళ్లి చేస్తానంటేనే మీ పెళ్ళికి ఒప్పుకుంటా’నని షరతు పెట్టాడు. అన్ని షరతులకు ఒప్పుకుని సరోజను నా సొంతం చేసుకున్నాను. మా వివాహం నిరాడంబరంగా జరిగింది.

ఆనవాయితీగా పట్టెమంచాన్ని నన్ను తీసుకు పొమ్మని అమ్మ బతిమాలింది. సరోజ స్వయంగా నేచిన నవారునే అల్లిన మంచమది. అదే మంచంలో మా శోభనం జరిగిందన్న విషయం మదిలోకి రాగానే అప్రయత్నంగా నా పెదవులు విచ్చుకున్నాయి. అంతవరకూ నేనూ ఏమీ మాట్లాడక పోయే సరికి నాన్నకు మరింత కోపం వచ్చినట్టుంది. వెళ్లి పోదామని గబా, గబా పోలీసు యూనిఫాం వేసుకుంటున్నాడు. భోజనం చేసి వెళ్ళండని సరోజ, నేను ఎంత బతిమాలినా వినిపించుకోకుండా..

“అప్పుడే నీ పెళ్ళాం నిన్ను కొంగుకు గట్టిగానే ముడి వేసుకుందిరా.. ఇక కవిత పెళ్ళి ఖర్చు నీమీద నమ్మక పెట్టుకుంటే.. మేక మెడ చన్నులను పితికినట్టె.. ” అనుకుంటూ.. రుసరుసా వెళ్ళి పోయాడు.

ఆరాత్రి నేనేమైనా అంటానేమోనని సరోజ భయంభయంగా పడక గదిలోకి అడుగు పెట్టింది శోభనం నాటి తొలిరాత్రిలా.. ఎదురుగా వెళ్ళి దరహాసం చేస్తూ.. దగ్గరికి తీసుకున్నాను. ఆమె మేనులో వణకు ప్రస్ఫుటమవుతోంది. ‘భయపడకు’ అన్నట్టుగా గట్టిగా హత్తుకున్నాను. నా కళ్ళల్లోకి సూటిగా చూడ్డానికి జంకుతోందని గ్రహించి నెమ్మదిగా నడిపించుకుంటూ పట్టెమంచం మీద కూర్చోబెట్టాను. నేనూ ప్రక్కనే కూర్చుంటూ..

“సరోజా.. ఆభరణాన్ని పూజించుకుందాం. కాని దానిని ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ.. మన అవసరాల కోసం వాడొద్దు. కట్నం తీసుకున్న వాడినవుతాను” అన్నాను. సరోజ కృతజ్ఞతా పూర్వకంగా నా ఎద మీద వాలి పోయింది.

భార్యాభర్తలమన్నాక ప్రతీ సంఘటన తరువాత ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడు కోవాలన్నది నా సిధ్ధాంతం. ఇదే మంచి సమయమని “సరోజా..” అంటూ ముద్దుగా పిలిచాను. “ఊ..” అంది గోముగా..

“సరోజా.. నా చెల్లెలు కవిత పుట్టాక మా నాన్న ఆలోచన ధోరణి మారుతూ వస్తోంది. అందరినీ అనుమానించడం పోలీసు వృత్తి ధర్మాన్ని నా మీదా ప్రయోగిస్తూ వస్తున్నాడు. తాను సంపాదించింది పెద్దగా ఏమీ లేకపోయినా.. నేనెక్కడ ఉన్నది ఊడ్చుకు పోతానోనని అనుమానం. నా మీద చదువుకు పెట్టిన పెట్టుబడి వడ్డీతో సహా రాబట్టుకోవాలని ప్రణాళికలు రచించుకున్నాడు. డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు వ్రాయగానే ఏదైనా ఉద్యోగం చూసుకుమ్మని వేధించే వాడు. నాకేమో! ఎమ్మెస్సీ మ్యాథ్స్ చెయ్యాలని కోరిక. అది నెరవేర్చుకోడానికి.. కాస్త వెసలుబాటు ఉంటుందని టీచరు ఉద్యోగం చూసుకున్నాను. ఉద్యోగంలో చేరానని నాన్న నా పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కట్నాల బేరసారాలు కొనసాగుతూ వస్తున్నాయి. అందుకే నేను పెళ్ళికి తొందర పడ్డాను. నాన్న బేరాలకు గంటి కొట్టాను కదా!.. దాంతో నా మీద మరింత కోపం పెరిగింది. ప్రతీ నెల కొంత డబ్బు పంపాలని మరో కొత్త ప్రపోజల్ పెట్టాడు” అంటూ ఉదయం జరిగిన సంఘటనకు సంజాయిషీ వివరిస్తుంటే సరోజ కళ్ళల్లో సన్నని కన్నీటి ధారలు.. కంగారు పడి పోయాను.

“అది సహజమే కదా సురేంద్రా..!” అంది. కళ్ళు తుడ్చుకుంటూ.. “లోకంలో ప్రతీ తండ్రి ఆలోచనలు అలాగే ఉంటాయి. నా ఆడపడుచు పెళ్ళికి చాలా సమయముంది. ప్రతీ నెలా డబ్బు పంపే బదులు ఒక రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలో చేరితే మంచిది. చివరగా పెద్ద మొత్తంలో డబ్బు సర్దవచ్చు. మరొక సలహా..” అని ఆగింది సరోజ. విస్మయంగా చూస్తూ.. చెప్పుమన్నట్టుగా కళ్ళతో మాట్లాడాను. గోడకు వేళ్ళాడుతున్న పాపాయి బొమ్మను చూపిస్తూ.. ఇప్పుడప్పుడే వద్దు అన్నట్టుగా కళ్ళతోనే అర్థించింది. అర్థం చేసుకున్నాను. సరే అన్నట్టుగా చిరునవ్వు నవ్వాను. నా నవ్వులో శృతి కలిపింది సరోజ.

ఇక ప్రధానమైన ప్రధమ సమస్య డబ్బు సంపాదన. దానికి మార్గాలు మరికొన్ని సూచించింది. నిజమే.. మనిషి కష్టకాలంలోనే.. మార్గాలు వెదుకుతాడు. సరోజకు ఇంకా ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తండ్రి సామిల్ లో పనిచేసే వాడు. ప్రమాద వశాత్తు ఒక చెయ్యి పోయింది. పనిలో నుండి తీసేశారు. అయినా ధైర్యం చెడకుండా చిన్న టీకొట్టు పెట్టుకున్నాడు. అతనికి సపోర్టుగా ఇంట్లో అందరూ పని చేసే వారు. మా అత్తమ్మ, మరదలు బీడీలు చేసే వాళ్ళు. సరోజ పదవ తరగతి మానేసి నవారు నేసేది. వచ్చిన ఆదాయం తమ్ముని చదువుకు సర్దేది. సరోజ కు బతుకంటే భయం లేదు. అనేక మార్గాలున్నాయని నాకు ధైర్యం చెప్పింది. ఆమె మానసిక పరిపక్వతకు ఆశ్చర్య పోయాను.

“అందుకే అన్నారు. కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేషు లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా.. ఇవి ధర్మపత్ని ఆరు సుగుణాలు. అన్నీ నీలో ఉన్నాయి ” అంటూ సరోజను ఆప్యాయంగా హత్తుకున్నాను.

***

సరోజ చూపిన బాటలో మా ప్రయాణం ప్రారంభమయ్యింది.

నాకు బాల్యం నుండి గణితశాస్త్రమంటే మక్కువ. పాఠశాలలో ‘స్వయం పరిపాలనా దినోత్సవం’ నాడు నేను లెక్కల మాష్టారుగా ప్రధమ బహుమతి సాధించాను. ఆ ఉత్సహాన్ని నెమరు వేసుకుంటూ.. పదవ తరగతికి, ఇంటర్ మీడియట్ పిల్లలకు వేకువ ఝామున్నే ట్యూషన్లు చెప్పడమారంభించాను. మరో ప్రక్క సరోజ సాయంత్రం పూట కాలనీ చిన్న పిల్లలకు పాఠాలు బోధించడం.. హోమ్ వర్క్ చేయించడం.. తదితర పనుల్లో మునిగి పోయింది. అలా మా అదనపు సంపాదన ఆరంభమయ్యింది.

బీదవిద్యార్థులకు ఉచితంగా బోధించే వాణ్ణి.అనతి కాలంలోనే మాకు మంచి పేరు వచ్చింది.

విద్యార్థుల సంఖ్య పెరిగింది. దాంతో మరో రెండు బ్యాచ్ లకు రాత్రి బోధించసాగాను.

సరోజ తనూ చదువుకుంటానంది. ఆమె చదువుకోవాలన్న జిజ్ఞాస నన్ను అబ్బుర పర్చింది. పదవ తరగతి విద్యార్థులతోబాటు కూర్చో మన్నాను.

కవితను గూడా పంపించమని ప్రాధేయ పడితే నాన్న ససేమిరా అన్నాడు. అమ్మ చెప్పినా విన లేదు. ఆనాటి నుండి నాన్న మనసును గెలవాలనే నా ప్రయత్నం ద్విగుణీకృతమయ్యింది.

సరోజ పదవతరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. దాంతో ఆమెలో ఆత్మ విశ్వాసం పెరిగింది. చదువుపై శ్రద్ధ రెట్టింపయ్యింది. దాన్ని సడలించగూడదని ప్రైవేటుగా ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూప్ తో పరీక్షకు సన్నద్ధం చేశాను. ఏకాగ్రతతో చదివేది. ఆమె చదువుకుంటూండడం చూడ ముచ్చటేసేది. ఇంటర్ సైతం ప్రథమ శ్రేణిలో ఫలితం సాధించింది. నా ఆనందానికి హద్దులు లేవు. ఇక మా చదువులను ఆపదలచుకో లేదు. ఒక సంవత్సరం కూడా వృధాగాకుండా డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. కోసం తెలుగు ప్రధాన సబ్జెక్ట్ తో అడ్మిషన్ తీసుకుంది. టీచర్ ట్రైనింగ్ కోర్స్ లో ప్రవేశం కోసం కోచింగ్ తీసుకోసాగింది. నేను సరోజ ప్రోత్సాహంతో నా కోరికా తీర్చుకున్నాను. ప్రైవేటుగా ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేసి పట్టా అందుకున్నాను. కాని లెక్చరర్ ఉద్యోగం రావాడం గగనమే.. సర్వీసు కమీషన్ ప్రథమంగా ఏర్పడింది. గొడవల్లో చిక్కుకుని లెక్చరర్ ఉద్యోగాల ప్రకటన వాయిదాలు వేస్తూ వస్తోంది.

సరోజ టీచర్ ట్రైనింగ్ ప్రవేశ పరీక్షలో సీటు సాధించింది. అటు కాలేజీకి వెళ్ళడం.. ఇటు డిగ్రీ పరీక్షలకు సన్నద్ధం కావడం.. ఒక యంత్రంలా పని చేసేది. ఆమె ఆరోగ్యం కాస్త నలతగా ఉన్నప్పుడల్లా భయమేసేది. సరియైన పోషకాలు తీసుకొమ్మంటే పొదుపు పాఠాలు వల్లెవేసేది. మన సంసార నావ సురక్షితంగా ఒడ్డుకు చేరాలంటే తప్పదని నాకు ధైర్యం నూరి పోసేది. అవును నిజమే.. వాస్తవానికి ఆడవారికి ఉన్నంత ధైర్యం మగవారికి ఉండదేమోనని.. అనిపించేది.

చూస్తూండగానే మరో రెండు సంవత్సరాలు గడిచాయి. సరోజ టీచర్ ట్రైనింగ్ పూర్తయ్యింది. ఇంత వరకు ఖర్చులు తప్ప రూపాయి వెనుక వేసింది లేదు.. చిట్ ఫండ్ లో డబ్బు కట్టడం మినహా. మాకు మంచి ఉద్యోగాలు వస్తే.. కాస్త చేయి తిప్పుకుని కవిత పెళ్ళి ఘనంగా జరిపించ వచ్చని అనుకుటుంటే.. అకస్మాత్తుగా నాన్న దగ్గరి నుండి ఫోన్ వచ్చింది.

“సురేంద్రా..! కవితకు పెళ్లి సంబంధం సెటిలయ్యింది. ముందు ఎందుకు చెప్పలేదు.. డబ్బు సర్దుకునే వాణ్ణని.. అంటావని మూడు నెలల ముందే చెబుతున్నా. దీపావళి తరువాత మూడు రోజులకు నిశ్చితార్థం.. అదే నెలాఖరున పెళ్లి” అంటూ తేదీలు చెప్పి ఠక్కున ఫోన్ పెట్టేశాడు. నా గుండెలో రాయి పడింది. కవిత ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం తప్పింది. ఇప్పుడే పెళ్లి ఏమిటని కళ్ళు తేలేసి కుర్చీలో కూలి పోయాను. విషయం చెప్పేసరికి సరోజ నిర్ఘాంతపోయింది.

***

నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయ్యింది. అబ్బాయి వాళ్ళు అలా వెళ్ళారో లేదో.. అమ్మ ఒక ప్రక్క వారిస్తున్నా.. పెళ్లి ఖర్చుల ప్రస్తావన తీశాడు నాన్న.

“బాబూ సురేంద్రా..! కవిత పెళ్ళికి నీ వంతుగా ఏమిస్తావో చెప్పు” అని నాన్న అడుగుతుంటే.. “వాళ్ళు ఇంతవరకు చదువుల ఖర్చుల్లోనే ఉన్నారు. చెయ్యి తిప్పుకున్నాక సర్దుక పోరు. వానికి మాత్రం తెలియదా!” అని అమ్మ నాకు మద్ధతు పలికింది.

“వాని దగ్గర ఉంటే మాత్రం ఇస్తాడా! నీ పిచ్చి గానీ. వాడు కట్నం కానుకలు ఇచ్చే రకమేనా! వాని అత్తామామలకు గూడా తెలియాలి కదా అని అడుగుతున్నా..” అనుకుంటూ సరోజ తల్లిదండ్రులను దెప్పిపొడుస్తున్నట్లుగా చూడసాగాడు. నామనసు చివుక్కుమంది.

“నాన్నా.. మీరేమడిగినా ఇస్తాను” అంటూ ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించాను.

“అయితే ముందుగా ఇరవై కాసుల బంగారానికి డబ్బులు సర్దు. నగలు చేయించాలి” అన్నాడు.

నా గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కుంది. తమాయించుకుంటూ..

“నాన్నా.. చెల్లెలి పేరు మీద వేసిన చిట్టీ డబ్బులు తెచ్చాను. ప్రస్తుతానికి ఇవి ఉంచండి..” అంటూండగా.. సరోజ నాదగ్గరకు వచ్చి నా చేతిలో నాలుగు ప్యూర్ గోల్డ్ కాయిన్స్ పెట్టింది. మా అమ్మను చూసుకుంటూ..

“అత్తమ్మా.. కవితకు మేము నగలు చేయిస్తే నచ్చుతుందో లేదోనని ఇరవై కాసుల చొక్కం బంగారం తెచ్చాం. కవితకు ఇష్టమైనవి చేయించండి” అంటూ ఇవ్వమన్నట్లుగా నా వంక సైగ జేసింది.

నేను ఆశ్చర్య పోయాను. సరోజను అడగడానికిది సమయం కాదని.. పెళ్ళి సమయంలో ఆమె మనసు చెడగొట్టడం ఇష్టం లేక.. ఇంటికి వెళ్ళాక అడుగుదామని నా మనసుకు సర్ది చెప్పుకున్నాను. మా నాన్న మొదటి సారిగా ప్రశాంతంగా కనబడ్డాడు. అలాంటి వాతావరణం కలుషితం చేయదల్చుకో లేదు.

***

కవితను అత్తవారింటికి సాగనంపి మా ఇంటికి తిరిగి వచ్చాం. మా కోసం రెండు ఉత్తరాలు ఎదురి చూస్తున్నాయి. సరోజ ఉత్తరం తనకిచ్చేసి నా ఉత్తరం తెరిచాను. నాకు జూనియర్ లెక్చరర్ పోస్టింగ్ ఆర్డర్స్. ఎగిరి గంతులు వేయాలనిపించింది కాని మనసులో సరోజ చేసిన పని అలజడి ఆపేస్తోంది.

“సురేంద్రా.. గుడ్ న్యూస్.. నాకు ప్రభుత్వ సెకండరీ గ్రేడ్ టీచరుగా ఉద్యోగం వచ్చింది” అంటూ సుడిగాలిలా వచ్చి సుట్టేసుకుంది. నా స్తబ్ధత చూసి బుంగమూతి పెట్టింది. అలాంటి ముఖం చూస్తేనే నాకు ముచ్చటేస్తుంది. వాటేసుకుని.. నెమ్మదిగా అడిగాను.

“బంగారు నాణాలు ఎక్కడివి సరోజా..!”

“అదేంటి సురేంద్రా.. నువ్వు ఊహించావనుకున్నాను. మనం పూజించే ఆభరణమే. మనకోసం వాడొద్దనుకున్నామే గానీ.. మరెవ్వరికీ ఇవ్వొద్దని అనుకోలేదు కదా!. ఆభరణాన్ని నా ఆడపడుచుకివ్వడం నాకెంతో తృప్తిగా ఉంది. ఆ రోజు మామయ్యవాళ్ళు బంగారం అడుగుతారేమోనని.. ఆభరణం దగ్గర పెట్టుకొమ్మని మా అమ్మ సలహా ఇచ్చింది. ఒకవేళ అడిగితే.. ఆభరణాన్ని అదే రూపంలో ఇస్తే.. అది వంశపారంపర్యంగా వచ్చే ఆభరణం.. కవితకు అరిష్టం కలుగుతుందేమోననే అనుమానంతో తీసుకుంటారో.. లేదోనని, చితక కొట్టించి మేలిమి బంగారం రూపంలో నాలుగు నాణాలు చేయించాను.

స్త్రీకి అసలైన ఆభరణం చదువు. అది నువ్వు ప్రసాదించావు. పూజించాల్సింది బంగారు ఆభరణాన్ని కాదు.. బంగారంలాంటి నిన్ను” అంటూ ప్రశంసల ఝల్లు కురిపిస్తుంటే అవాక్కయ్యాను.

నాకూ ఉద్యోగం వచ్చిందని నింపాదిగా చెప్పాను. సరోజ కళ్ళు మెరిశాయి.

సరోజ మెడలో నల్లపూసలు, మంగళ సూత్రాలు తప్ప మరో బంగారపు నలుసు లేదు. కాసంతైనా కావాలని ఆమె ఎప్పుడూ నోరు తెరచి అడుగ లేదనే ఆలోచనలతో.. నా కళ్ళు చెమ్మగిల్లాయి.

“నువ్వు అంతగా గిల్టీగా ఫీలైతే.. నీకు ఉద్యోగం వచ్చింది కదా.. కొత్త ఆభరణం చేయిద్దురుగానీ.. మన పాప కోసం” అని తన పొట్టను తడుముకుంటూ.. కిల, కిలా నవ్వింది.

“నిజమా..!” అన్నాను ఉద్వేగంగా..

నిజమే అన్నట్టు నాలో ఒదిగి పోయింది సరోజ.*

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ