ఇది కథ కాదు - సుస్మితా రమణమూర్తి

this is not a story

నిజంగానే ఇది కథ కాదు.బాగా చదువుకున్న తల్లి తండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ఎంత బాధ్యతా రహితంగా ఉంటున్నారో తెలియ చెప్పే చిన్న ప్రయత్నం. *** హోటల్లో టీ తాగుతున్న శ్రీహరికి తన హైస్కూలు మాస్టారు కనిపించారు. మాస్టారు తనను చూడలేదు. “ నమస్కారం సార్! బాగున్నారా ?..మీరిక్కడ!?...” ఆశ్చర్యంగా అడిగాడు శ్రీహరి. కళ్ళ జోడు పెట్టుకుని తేరిపార చూస్తూ—” నీవట్రా శ్రీహరీ!?... ఈ ఊర్లోనే ఉంటున్నావా?” సంతోషంగా అడిగారు మాస్టారు. “ అవును సార్, ఇక్కడే ఉంటున్నాను. నేను మీకింకా గుర్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్!..” “ భలే వాడివిరా!...ఎన్నో ఏళ్ళు పక్క పక్క ఇళ్ళలో ఉన్నవాళ్ళం. మా స్కూల్లో చదువుకున్న వాడివి. నిన్నెలా మరచిపోతాన్రా?...” మాస్టారు మాటలకు శ్రీహరి సంతోషించాడు. “ ఇక్కడకు వచ్చిన పని పూర్తి అయింది. మరో గంటలో బస్సుంది వెళ్ళాలిరా. “ “ చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి .ఓ రెండ్రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి సార్.” ప్రాధేయపడుతూ అడిగాడు శ్రీహరి. శిష్యుడి మాట కాదనలేక పోయారు మాస్టారు. *** “ ఎంతమందిరా పిల్లలు?...ఏం చదువుతున్నారు?...” “ ఇద్దరు మాస్టారూ. అబ్బాయి ఎనిమిదో తరగతి. అమ్మాయి ఆరో తరగతి. “ “ బాగా చదువు కుంటున్నారా ? “ “ అమ్మాయి ఫర్లేదు. అబ్బాయి చదువే తలనొప్పిగా ఉంది. వాడికి ఆటల మీదున్న శ్రద్ధ చదువు మీద లేదు. “ “ డాడీ…ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చేయండి. “ అంటూ కొడుకు వచ్చాడు. “ మాస్టారూ, వీడే మా అబ్బాయి కృష్ణ. ఈ సంవత్సరమే తెలుగు మీడియం స్కూల్లోంచి ,ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసాను. “ అంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ అందుకున్నాడు శ్రీహరి. “ చూడండి మాస్టారూ—ఈ రిపోర్ట్ కార్డ్!...వీడు చదువు ఎలా వెలగ బెడుతున్నాడో తెలుస్తుంది. “ అలా అసహనంగా శ్రీహరి అనేసరికి మాస్టారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందుకున్నారు. అన్ని సబ్జెక్టులలో బొటాబొటీగా పాస్ మార్కులు వచ్చాయి. కుర్రాడి చదువు పరిస్థితి మాస్టారుకి అర్థం అయింది. ‘జిజ్ఞాస—స్కూలు పేరు బాగుంది. ప్రోగ్రెస్ కార్డ్ రంగుల్లో చూడముచ్చటగా ఉంది. మార్కులే ప్చ్!.’ స్వగతంలా అనుకున్నారు మాస్టారు. “ ఏఁవిట్రా ఈ మార్కులు!?...పక్కింటి మోహన్ క్లాసు ఫస్టట!?...” కోపంగా అడిగాడు శ్రీహరి. అలా మాస్టారు ముందు నిలదీసి అడిగే సరికి కృష్ణ మవునంగా ఉండలేక పోయాడు. “ అవును డాడీ! మా క్లాసులో ఎప్పుడూ మోహనే క్లాసులో ఫస్ట్. వాడికి తన డాడీ, మమ్మీ అర్థం కాని పాఠాలు చెబుతారు. పేరెంట్స్, టీచర్ల మీటింగులకి మోహన్తో బాటు ప్రతి నెలా వెళ్తారు. మీరలా చేయరుగా?...సాయంత్రాలు స్నేహితులతో కాలక్షేపమే ముఖ్యం మీకు. మమ్మీ అసలు పట్టించుకోదు.మోహన్ మొదట్నుంచీ ఆ స్కూలులోనే ఉన్నాడు. వాడికి ట్యూషన్ ఉంది. చదువుకోడానికి ప్రత్యేకంగా గది ఉంది . ఎప్పుడూ మార్కుల గురించి కేకలు వేస్తారు గాని, నా చదువు గురించి ఎవరు పట్టించుకుంటున్నారు?...” కొడుకు మాటలకు శ్రీహరి మవునం వహించాడు. మాస్టారుది ప్రేక్షక పాత్ర అయింది. నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ ,కృష్ణ స్నేహితులు వచ్చారు. “ క్రికెట్ ప్రాక్టీసుకి వస్తావా? “ శ్రీహరి కోపం అవధులు దాటింది. “ వీళ్ళతో ఎప్పుడూ ఇదే గొడవ మాస్టారూ….మావాడు రాడు.మీరెళ్ళండి “ శ్రీహరి అరుపులకు వాళ్ళు పారిపోయారు. “ బాబూ కృష్ణా …నీవు క్రికెట్ ప్రాక్టీసుకి వెళ్ళు.నాన్నతో నే చెబుతాలే.” మాస్టారు భరోసాతో కృష్ణ వెళ్ళి పోయాడు. “ శ్రీహరీ!..అలా కూర్చో…నీ బాధ నాకు అర్థం అవుతోంది. వాడు చదువులో ఎందుకు వెనుక బడ్డాడో తెలుసా?...మొదట్నుంచి తెలుగు మీడియంలో ఉన్న వాడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి మార్చడం నీ తొందరపాటు నిర్ణయం. మీరిద్దరూ వాడి చదువు విషయం పట్టించుకోక పోవడం కూడా పొరపాటే. పైగా మంచి మార్కులు రావటం లేదని ,వాడి మీద కేకలు వేస్తున్నావు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారిన, వాడి బాధను మీరు అర్థం చేసుకోటం లేదు. “ “ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి మార్చడం తప్పంటారా?..” సందేహిస్తూ అడిగాడు శ్రీ హరి. “ ఎవరికైనా పాఠాలు మాతృభాషలో అర్థమైనట్లు, పర భాషలో అంత సులభంగా అర్థం కావు. అర్థం కావడానికి ఇంట్లో తల్లి తండ్రులు, అవసరమైతే ప్రయివేటు టీచర్లు పిల్లల చదువు గురించి బాగా పట్టించుకోవాలి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారే అందరి పిల్లల చదువు మొదట్లో మీవాడిలానే ఉంటుంది. అయినా వాడిని ఇంగ్లీష్ మీడియం స్కూలుకి ఎందుకు మార్చారు?” “ …. …. …. …. “ “ చెప్పరా….అర్ధాంతరంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి ఎందుకు మార్చావు? “ శ్రీహరికి తన మనసులో మాట చెప్పక తప్పలేదు. “ జిజ్ఞాస మంచి పేరున్న స్కూలు మాస్టారూ.అందులో సీటు దొరకడం చాలా కష్టం .అతి కష్టం మీద ఎమ్మెల్యే గారి రికమండేషన్తో, లక్ష డొనేషన్ కడితేనే ఆ స్కూలులో సీటు దొరికింది. “ “ ఏదేదో చెబుతున్నావు. అసలు విషయం చెప్పడం లేదు.” మాస్టారు మరో సారి నిలదీయడంతో శ్రీహరికి అసలు విషయం చెప్పక తప్పలేదు. “ మాస్టారూ!...ఆ మోహన్ తండ్రి మా ఆఫీసులో నా జూనియర్. ఆ స్కూల్లో వాడి కొడుకు చదువుతున్నాడని అందరి దగ్గర గొప్పలు చెప్పుకోడం నాకు నచ్చలేదు. అందుకనే…..” “ ఇదేనా అసలు విషయం!?...” “ అవును సార్. “ “ చాలా మంచి స్కూలని ,పేరున్న స్కూలని, బాగా చదువు చెప్పే స్కూలని , రికమండేషన్తో, లక్ష డొనేషన్తో వాడిని ఆ స్కూలులో చేర్చావు . వేలల్లో ఫీజులు కడుతున్నావు. అంతమాత్రాన నీ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నావు నీవు ఆశిస్తున్న మంచి ఫలితం వస్తుందని భ్రమ పడ్డావు…….” “ .... …. …. …. “ “ నీ జూనియర్ లా,కుర్రాడి చదువు గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు?.... నీవే కాదు. నీలాగే బాగా చదువుకున్న వాళ్ళు, చాలామంది తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు. పిల్లల మానసిక క్షోభను అర్థం చేసుకోవటం లేదు.” శ్రీహరికి తను చేసినది -- పొరపాటన్నవిషయం అర్థం అయింది. “ స్సరే!...జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పుడు ఏంచేయాలో ఆలోచించాలి.” “ అవును మాస్టారూ. “ “ ఈ ఇల్లు స్వంతమేనా?...ఎన్ని గదులు ఉన్నాయి.” “ స్వంతమే. క్రింద రెండు గదులు. మీద ఒక గది ఖాళీగా ఉంది. కిరాయికి ఇద్దామని –‘టు లెట్ బోర్డు ‘ పెట్టాను. “ “ అందరూ క్రిందనే ఉంటారా?...” “ అవును మాస్టారూ. క్రింద ఒక గదిలో అమ్మ, నాన్న, మరో గదిలో నేను,మా ఆవిడ ఉంటున్నాం. “ “ మరి… పిల్లల చదువు , పడక ఎక్కడ!?...” “ హాలులో చదువుకోడం, అమ్మ, నాన్నల గదిలో పడుకోడం…” “ ముందు ఆ టు లెట్—బోర్డు తీసెయ్. ఆగది పిల్లల చదువుకి, పడుకోవడానికి కేటాయించు. “ మాస్టారు మీదున్న గౌరవంతో పిల్లలకు సంబంధించిన పుస్తకాలు, వస్తువులు అన్నీ అప్పటికప్పుడు మీద గదికి తరలించాడు శ్రీహరి. మాస్టారుకి ఇంటి పరిస్థితి పూర్తిగా అర్థం అయింది. వారి ఆలోచనలు, సమస్య పరిష్కార దిశగా పరిభ్రమిస్తున్నాయి. “ పిల్లల చదువు గురించి కేవలం బాధ పడితే సరిపోదు. ఏంచేస్తే బాగుంటుందో ఆలోచించాలి. పిల్లలు స్కూలు నుంచి రాగానే కొంతసేపు వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. ఆటలు ఆడుకోనివ్వాలి. స్నేహితులతో తిరగ నివ్వాలి. “ “ అలా వదిలేస్తే చదువు ఎలా సాగుతుంది !?...” శ్రీహరి ప్రశ్నకు మందహాసం చేసారు మాస్టారు. “ స్కూలంటే చదువు ఒక్కటే కాదు. ఆటలు,పాటలు కూడా. “ “ కాస్త వివరంగా చెప్పండి సార్. “ “ పిల్లలతో మంచిగా ఉండాలి. చిర్రు బుర్రు లాడకూడదు. స్కూలు లోని విషయాలను, విశేషాలను ఏరోజుకి ఆరోజు నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి. పిల్లలు తల్లి తండ్రులను మంచి స్నేహితుల్లా భావించే వాతావరణం ఇంటిలో నెలకొనాలి.దానికి పూర్తి బాధ్యత తల్లి తండ్రులదే. అలాంటి వాతావరణంలో పిల్లలు తమకున్న ఇబ్బందుల్ని…చదువు విషయంలో అయినా, మరేదైనా చెప్పుకునేందుకు స్వేచ్ఛ వస్తుంది. అమ్మ, నాన్నల అండ తమకుంది—అన్న ధైర్యం, నమ్మకం వారికి కలుగుతాయి.” శ్రీహరి మవునంగా వింటున్నాడు. “ ఎదుగుతున్న వయసు వారిది. వారి మనోభావాలను అర్థం చేసుకుని వ్యవహరించాలి. ఎప్పుడూ ఒత్తిడికి గురి చేయకూడదు. పిల్లలు ఒత్తిడికి గురి అయితే ఎదురు తిరిగే స్వభావం వస్తుంది. మీవాడి విషయంలో అదే జరిగింది. వాడికి స్కూలు కొత్త. ఇంగ్లీష్ మీడియంలో అర్థం కాని పాఠాలతో నిత్యం బాధ పడుతున్నాడు. “ విషయం అర్థం అయిన శ్రీహరి , తను చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. “ ఇప్పటికైనా మీరిద్దరూ వాడి చదువు విషయం పట్టించుకోండి.అర్థం కాని పాఠాలు ఓపిగ్గా చెబుతుండండి. అవసరం అయితే ట్యూషన్కి పంపించండి. స్కూలు టీచర్ల సలహాలు కూడా పాటించండి. జరిగిందేదో జరిగి పోయింది. ఇకనైనా మీరిద్దరూ మారండి. మీరు మారితే తప్పకుండా వాడి చదువు ఓ గాడిన పడుతుంది.పిల్లల స్నేహితులను కూడా ఆదరంగా చూడాలి. “ “ అలాగే మాస్టారూ. “ “ కాసేపు విశ్రాంతి తీసుకొని, ఆ తర్వాత మీవాడి స్కూలు చూసి వస్తాను.: అంటూ మాస్టారు ప్రక్కనున్న మడత కుర్చీలో నడుం వాల్చారు. “ అలాగే మాస్టారూ.” అంటూ శ్రీహరి పిల్లలకు కేటాయించిన గదిలోకి వెళ్ళాడు. *** నమస్కారం మాస్టారూ, ఆరోజు యాదృచ్ఛికంగా మిమ్మల్ని కలియడం మంచిదయింది. మీ సలహాలు పాటించడం వలన మాకు మేలు జరిగింది పిల్లల చదువు విషయంలో స్కూలు టీచర్ల సలహాలు పాటిస్తున్నాం. ట్యూషనుకి పంపిస్తున్నాం.మేము వాడికి అవసరమైనప్పుడు అర్థం కాని పాఠాలు చెబుతున్నాం.వాడి స్నేహితులతో మంచిగా ఉంటున్నాం. ఈ ఆరు నెలలలో వాడి చదువులో మంచి మార్పు వచ్చింది. మార్కులు బాగా వస్తున్నాయి.ఇప్పుడు వాడి ధ్యాసంతా చదువు మీదే. పిల్లల చదువు గురించి మాకిక బెంగ లేదు. ముందు మీరు మారండి. వాడి చదువు బాగుంటుంది—అన్న మీ మాటలు నిజమయ్యాయి. మీ అమూల్యమైన సలహాలు పాటించడం వల్లే, మా వాడు ఇప్పుడు బాగా చదువుకుంటున్నాడు మాస్టారూ . త్వరలో మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు చెప్పుకుంటేనే గాని నాకు తృప్తిగా ఉండదు. మీ శిష్యుడు ---శ్రీహరి. ఉత్తరం చదివి మాస్టారు—ఆ స్కూలు హెడ్ మాస్టారు, ఒకనాటి ఈ మాస్టారు--మాట మన్నించి, శ్రీహరి కొడుకు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు సంతోషించారు. మాస్టారు అభ్యర్థన వల్లే ఆ స్కూలు టీచర్లు, హెడ్ మాస్టారు ,కృష్ణ చదువు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్న నిజం శ్రీహరి ఎప్పటికీ తెలియదు . * *** / సమాప్తం/ -------

మరిన్ని కథలు

Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల