ఆ కథలో ఏదో ఉంది! - గంగాధర్ వడ్లమన్నాటి

There is something in that story!

“కుదరదంటే నా మీద ఒట్టే.ఈ ఒక్క సారికీ నా మాట మీద గౌరవం ఉంచి ఇలా కానివ్వండి సార్. ప్లీజ్”.బ్రతిమాలాడు కొత్త ముసలం పత్రిక సంపాదకుడు పాతబ్బాయ్.

“నా వల్ల కాదు.నేను ముందు మాటలూ ,సమీక్షలూ వ్రాయను.బలవంత పెడితే ఒకటీ అరా ముందు మాటలు వ్రాసాను.సమీక్ష అంటారా నా వల్ల అస్సలు కాదు.అయినా చేయి తిరిగిన సమీక్షకులు ఇందరు ఉండగా నేనే వ్రాయాలని ఎవుందండీ.వారిలో ఎవరి చేతనైనా రాయించొచ్చుగా” చెప్పాడు మధు

“వద్దు మహాప్రభో వద్దు.వాళ్ళలో చాలామంది పైకి బుస్సు,లోన తుస్సు.చిన్న వారైనా మీ చేతులు పట్టుకు అడుగుతున్నాను. కాదనకండీ”.అడిగాడు పాతబ్బాయ్.

“అందరూ ఇలా మొహవాట పెట్టడమో ,బలవంత పెట్టడమో చేస్తే ఎలాగండీ .సరే రాస్తాను.కానీ ఉన్నదున్నట్టుగా రాస్తాను”.చెప్పాడు మధు.

“అమ్మో, అలా అయితే ఇంకావన్నా ఉందా.నా కొంప మునిగి పోతుంది.నా బతుకు కొల్లేరైపోతుంది.ఆ కథలో ఏదో ఉంది అని మొదలెట్టి,అంతర్లీనంగా అలా చెప్పారూ,ఇలా చెప్పారూ అని తెగ వ్రాసేసి చివరికి కొత్త రచయితలకి ఈ కథ ఎంతో ఉపయోగం అని కూడా రాసేయండి.సరిపోతుంది”. చెప్పాడాయన చేతులు పట్టుకుని.

“అదేదో మీకు అనుకూలంగా ఉన్నవాళ్లతోనే వ్రాయించి మీ పత్రికలో వేసేసుకుంటే సరిపోతుందిగా.దానికి మళ్ళీ నేనెందుకూ” అడిగాడు మధు.

“మీరు మరీ చిలిపి.తెలిసే తమరు ఏవీ తెలియనట్టు అడుగుతారు.సమీక్ష నేను వ్రాయగలను.కానీ ఆ సమీక్ష కింద మీ పేరు లేకపోతే దానికి అంత విలువ వస్తుందా చెప్పండి” అడిగాడు మొహవాటంగా నవ్వుతూ .

“అర్ధమైంది.అంటే మీకు కావాల్సింది నా పేరుతో ఉన్న సమీక్షన్నమాట”.

“అదికూడా సార్.ఎప్పుడూ సమీక్ష వ్రాయని మీరైతే బావుంటుందని అతనే అన్నాడు.ఈ సమీక్షని త్వరలో వేయబోయే కథల సంపుటిలో కూడా వాడుకుంటాడట .అలాంటి వాళ్ళ అండ ఉంటే మంచిదని తప్పక ఇలా కానిస్తున్నాను”.

“ఇంతకీ ఏ కథ అది” అడిగాడు మధు.

“అదే సార్.పోయిన సంచికలో వచ్చిన కొత్త ముస్టోడు కథ. మీరు చదివారా.చదవకపోయినా ఇబ్బంది లేదు.మీకోసం ఆ పత్రిక తెచ్చాను” చెప్పాడు పాతబ్బాయ్.

“కాంప్లిమెంటరీ కాపీ వచ్చింది.చదివాను.అయితే అది ఒట్టి పాత కథాంశం కదండీ.ఎక్కడో పాత సినిమాల్లో చూసేసిన సన్నివేశాల్నే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి రాసినట్టనిపించిందే” చెప్పాడు మధు

“నాకూ అంతే సార్.అలానే అనిపించింది.కాకపోతే అతని తృప్తీ కోసం ఓహో ,ఆహా అని వ్రాయడం అంతే”.చెప్పాడు పాతబ్బాయ్ మరోసారి నవ్వేస్తూ.

“అలా ఎలా అంటాం పాతబ్బాయ్ గారూ.,తలకి మించిన తలపాగా,కథకి మించిన ఊదర గొట్టుడు సమీక్ష బావుండవండీ.అతను వ్రాసాడని మిగతా వారు బాకా ఊదడమే కానీ అదో మామూలు కథ.ఆ కథలో సన్నాసి అలియాస్ సన్నీ అనే బిచ్చగాడు అడుక్కుని బ్రతుకుతూ,తోటి ముస్టోళ్ళని చేరదీస్తాడు.వారికి అడుక్కోవడంలో మెళకువలు నేర్పిస్తాడు.దాంతో వారు రెండు బొచ్చెలా సంపాదించుకుంటూ,దర్జాగా ముస్టెత్తుకు బతకడం నేర్చుకుంటారు.ఓ సారి ప్రేమించిన అమ్మాయ్, నేను నాలుగిళ్ళలో పనిచేసి హాయిగా బ్రతుకుతున్నాను.నువ్వూ కష్ట పడి పనిచేయి అని సన్నీకి చెపడంతో ,అతను మనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు.అప్పుడు అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం చెల్లించి గంజాయి కొనుక్కుని తాగి, ఆ తరువాత చనిపోవాలనుకుంటాడు.కానీ గంజాయి తాగాక మనసు మార్చుకుంటాడు.ఆ మత్తు గమ్మత్తుగా ఉండటంతో మళ్ళీ మళ్ళీ ఆ మత్తులో చిత్తై పోవాలనుకుంటాడు. దాంతో డబ్బుల కోసం తోటి ముస్టోళ్ళని వేపుకు తింటాడు.అలా వారి మీద దౌర్జన్యం చేసి ముస్టోళ్ళకి దాదా అయిపోతాడు.వారి బొచ్చెలో డబ్బులు దౌర్జన్యంగా తీసుకుంటూ ఉండటంతో వారిలో విసుగు పెరుగుతుంది.తరువాత అతని పై కసి పెరుగుతుంది.దాంతో వాళ్లే ఇతన్ని పోలీసులకి పట్టిస్తారు.కథ ముగుస్తుంది.ఏవిటండీ ఈ కథ.ఈ కథ మీద సమీక్ష ఏం రాయమంటారు చెప్పండి”.అడిగాడు మధు

“మళ్ళీ మీరు మొదటికి రాకండి మహాప్రబో.ఇందాక నేను చెప్పినట్టు, ఏదోటి వ్రాసేద్దురూ " అని ఓ క్షణం ఆగి "ఆ ...ఇది ఎవరూ స్పృశించని అంశం.సమాజంలో ఎవరూ చూడని కోణం.ముష్టి జీవితాలని కళ్ళకి కట్టాడు. అడుక్కునే వాడిని కూడా మాదక ద్రవ్యాలు వదల్లేదూ. శైలి అధ్బుతంగా ఉంది.ఓ ముష్టెత్తుకునే వ్యక్తే నేరుగా వచ్చి తన కథ తాను స్వయంగా రాసిన అనుభూతి కలిగింది.అంత గొప్ప కథ, అతని అనుభవం మరో సారి బయటపడింది.ఇలాంటి ముష్టి కథలు ఆయన మరెన్నో వ్రాసి.ముష్టి కథల రచయితగా ఎదగాలి అంటూ వ్రాసేయండి సార్” చెప్పాడు పాతబ్బాయ్ ఉత్సాహంగా.

“సరే,ఒప్పుకున్నాక తప్పుకోవడం కుదరదు కదా” అని తప్పక చప్పున ఆ కథపై ఓ సమీక్ష వ్రాసి ఇచ్చేశాడు.దానిపై మీద వచ్చిన పాఠకుల సందేశాలు చూసి ఖంగు తిన్నాడు పాతబ్బాయ్.ఒకరు, కథ కంద దుంపలా ఉంటే సమీక్ష చిలకడ దుంపలా ఉందన్నారు. కథ కంటే సమీక్ష బావుందని కొందరంటే ,ఇక నుండి అయినా ఇలాంటి సమీక్షకి సరిపోయే కథలు వారి కలం నుండి రావాలని ఆశిస్తాo అని మరి కొందరూ రాయడంతో బిక్క చచ్చిపోయాడు పాతబ్బాయ్.

మరిన్ని కథలు

murthy uncle
మూర్తి బాబయ్య
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
kaamini
కామిని
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
Smoke stick
అగ్గి పుల్ల
- అఖిలాశ
Punishment in discipline
క్రమశిక్షణ లో శిక్ష
- కందర్ప మూర్తి
dont leave you too..!
నేను మిమ్మల్నీవదలా...!
- బొందల నాగేశ్వరరావు
Sister Value (Children's Story)
చెల్లెలి విలువ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు‌