అమానుషం - బుద్ధవరవు కామేశ్వరరావు

Inhuman

ఏసీపీ క్రైమ్ గా పనిచేస్తున్న నేను, కమీషనర్ గారి వద్ద నుంచి ఫోన్ రాగానే, ఆయన ఆఫీసుకి వెళ్లాను. "చూడండి, మీ పని తీరు తెలుసుకాబట్టి నిన్న రాత్రి జరిగిన మన జిల్లా కలెక్టర్ గారి అనుమానస్పద మృతి కేసు దర్యాప్తు అధికారిగా మిమ్మల్ని నియమిస్తున్నాను. వీలయినంత త్వరగా పరిశోధన పూర్తి చేయండి. ఇందులో నక్సలైట్ల ప్రమేయం కూడా ఉండవచ్చు. మీకు దొరికిన సమాచారం మటుకు ఎక్కడా లీక్ చేయకండి" అంటూ సంభందిత ఫైలు నాకు ఇచ్చారు కమీషనర్ గారు. ఆయనకు సెల్యూట్ చేసి, ఆ ఫైలు తీసుకుని బయటకు వచ్చాను. కలెక్టర్ ఉండే ప్రభుత్వ బంగాళాకి మరమ్మతులు జరుగుతూండడంతో ఆయన వేరే డూప్లెక్స్ మోడల్ విల్లా అద్దెకు తీసుకున్నారు. కారులో ఘటనా స్థలానికి పయణిస్తూ ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఓ సారి మననం చేసుకున్నా.

***** ***** ***** *****

నాకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం... కలెక్టర్ గారు ఒక్కరే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆయన భార్య భర్తతో విభేదించి ముంబైలో వేరే ఉంటోంది. రోజూ ఉదయం వచ్చే బంట్రోతు, ఎంత పిలిచినా కలెక్టర్ గారు తలుపు తీయకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో, వాచ్ మెన్ తో కలసి పోలీసులకు రిపోర్టు చేసారు. ఆ పడకగదికి ఆటోమేటిక్ లాక్ ఉండడంతో, నిపుణుల పర్యవేక్షణలో తాళం పగలకొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు, .. కుర్చీలో కణతకు పాయింట్ బ్లాంక్ లో కాల్చుకోవ డంతో తీవ్రంగా గాయపడి, తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించిన కలెక్టర్ గారి మృతదేహం కనపడింది. ఆయన కుడి చేతిలో ఉన్న రివాల్వర్ స్వాధీనం చేసుకుని, వెంటనే కమీషనర్ గారికి సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన బట్టి చూస్తే ఇది నిజంగా ఆత్మహత్యేమో? కానీ కలెక్టర్ గారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ? అని అలోచిస్తున్నా.

***** ***** ***** *****

కారు ఘటనాస్థలానికి రాగానే, నా ఆలోచన లకి ఫుల్ స్టాప్ పెట్టి, నా టీముని సమావేశ పరచి, సీసీ టీవీ ఫీడ్ బేక్, కాల్ డేటా, అక్కడ ఉన్న అందరి వేలిముద్రలు, ఫొటోలు తీసుకోమనీ...ఇలా అందరికీ తలో పని అప్పచెప్పా ! గదిలోకి వెళ్లిన నా వద్దకు వేలిముద్రల నిపు ణుడు వచ్చి, "సార్, గదిలో ఉన్న అటోమేటిక్ లాక్ మీద ఎటువంటి వేలు ముద్రలు లేవు సార్. ఎవరో తుడిచేసినట్టు ఉన్నారు." అని చెప్పడంతో, అంతవరకూ ఇది ఆత్మహత్యే అనుకున్న నేను ఒక్క సారిగా షాక్ కి గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అయన ఖచ్చితంగా లోపల లాక్ బటన్ నొక్కి, తలుపు వేసుకుంటాడు. అప్పుడు ఆయన వేలిముద్రలు ఆ డోర్ లాక్ మీద ఉండాలి. అవి చెరిపేసారంటే తప్పకుండా ఇది ఎవరో చేసిన హత్యే. వెంటనే, కింద ఉన్న వాచ్ మేన్ ని పైకి పిలిపించాను. "చూడు, నిన్న రాత్రి అయ్యగారి గదిలోంచి ఏమీ శభ్ధాలు ఏమీ వినపడలేదా ?" అడిగాను. "వినబడ్డాయి సార్, ఢాంఢాం అని శభ్ధాలు వచ్చేయి సార్. కానీ ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళు పునాదులు తవ్వడానికి బాంబులు వాడుతున్నారు సార్. అవి ఆ శభ్ధాలు అనుకున్నా సార్" కొంచెం భయపడుతూ చెప్పాడు వాచ్ మెన్.

"సరే, నిన్న అయ్యగారి కోసం ఎవరెవరు వచ్చారు ? గుర్తు చేసుకొని చెప్పు" "సార్, అయ్యగారి కోసం ఇంటికి సాధారణంగా ఎవరూ రారు సార్. నిన్న మాత్రం ఉదయం కాంట్రాక్టరు యాదగిరి, పక్క ఊరి సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఓ ఇద్దరు ఆఫీసు గుమాస్తాలు, రోజూ వచ్చే వంటవాడు షణ్ముగం, బంట్రోతు వచ్చారు సార్." "సరే నిన్న వచ్చిన వారి ప్రవర్తనలో ఏదైనా తేడా గమనించావా ? " "ఆ...జ్ఞాపకం వచ్చింది సార్. కాంట్రాక్టర్ గారూ వెళ్తూ, " నా గురించి ఏమనుకుంటు న్నాడో ఈ కలెక్టర్? నా తడాఖా చూపిస్తా" అని అరుచుకుంటూ వెళ్ళేరు సార్. అలాగే రెడ్డి గారు కూడా "నా సంగతి తెలియదు ఈయనకు. అవసరమైతే లేపేస్తా." అని కేకలు వేస్తూ వెళ్లారు సార్" చెప్పాడు వాచ్ మెన్.

"ఔనూ, ఇంటి తాళాలు ఎవరెవరి దగ్గర ఉంటాయి? మీ అమ్మగారు ఇక్కడ ఉండరా? " "ఓ సెట్ అయ్యగారి దగ్గర ఉంటుంది సార్. ఇంకో సెట్ ముంబైలో వేరేగా ఉంటూ, అప్పుడప్పుడు వచ్చి పోయే అమ్మగారి వద్ద ఉంటాయి సార్." "సరే నువ్వు వెళ్లు. అవసరమైతే పిలుస్తాం." అని చెప్పి, మా వాళ్లతో ఆ తాళం చెవి ఎక్కడ ఉందో వెతకమని చెప్పాను. కొంత సేపటికి, "సార్, తాళం చెవి ఈ డైనింగ్ టేబుల్ మీద ఉంది" అన్న మా కానిస్టేబుల్ పిలుపుతో, అక్కడికి వెళ్లి, దానిని ఓ సారి పరీక్షగా చూసి, వేలిముద్రలు చూడమని వేణుకి ఇచ్చాను. పరీక్షించి, కాసేపటి తర్వాత "దీనిమీద కూడా ఎవరో వేలిముద్రలు చెరిపేసారు సార్." అని చెప్పడంతో నీరుగారిపోయాను. ఆ తాళంచెవి ఇంకో సారి పరీక్షగా చూసిన నా బుర్రలో ఫ్లాష్ వెలిగింది. వెంటనే మా ఎస్సైకి ఆ తాళం ఇచ్చి ఏం చేయాలో చెప్పాను.

***** ***** ***** *****

"చూడండి మిష్టర్ యాదగిరి! నిన్న మీరు కలెక్టర్ గారిని బెదిరించారు. అందువలన ఈ హత్య కేసులో పరోక్షంగా మీ హస్తం ఉందని అనుమానించవలసి వస్తోంది" చెప్పాను కాంట్రాక్టర్ యాదగిరితో, అతని ఇంటికి వెళ్లి. "సార్. ఆవేశంతో బెదిరించిన మాట వాస్తవం. కేవలం ఇరవై లక్షల బిల్లు కోసం అంత పెద్ద మనిషిని ఎలా చంపుతాను సార్. ఇంకో మార్గంలో ఆ బిల్ పాస్ చేయించు కుంటా కానీ" కొంచెం బాధగా చెప్పాడతను. చేసేది ఏమీ లేక, అవసరం అయితే ఓసారి స్టేషన్ కి రావాల్సి ఉంటుందని చెప్పి బయటకు వచ్చాను.

***** ***** ***** *****

సర్పంచ్ ఇంటికి వెళ్తూంటే, మా స్టాప్ నుంచి ఫోన్ వచ్చింది. సీసీ టీవీ ఫీడ్ చూసామనీ, ఇంటికి ముందు సీసీ టీవీ ఉంది కానీ వెనకవైపు లేదని, అలాగే వాచ్ మేన్ చెప్పిన వ్యక్తులే సీసీ ఫుటేజ్ లో ఉన్నారనీ, కానీ రాత్రి పదకొండు తర్వాత సీసీ టీవీ ఫుటేజ్ లేదనీ.

***** ***** ***** *****

"సర్పంచ్ గారూ, కలెక్టర్ గారి హత్య కేసులో మీ ప్రమేయం ఉందని స్పష్టంగా తెలు స్తోంది. మధ్యాహ్నం గొడవ పడ్డారు. రాత్రి మీ మనుషులను పురమాయించి హత్య చేయించారు. అనుమానం రాకుండా ఉండడానికి సీసీ టీవీ వైర్లు కట్ చేయించారు" చెప్పాను ఆవేశంగా. "కధ బాగా అల్లేరు. చూడండి ఆయనతో నా గొడవ ...ఆక్రమణలో ఉన్న ఓ ఎకరం పొలం గురించి. దాని కోసం ఆయనను మర్డర్ చేయిస్తానా ? అవసరమైతే ఏ మంత్రి ద్వారానో సెటిల్ చేసుకుంటా కానీ" "సరే హత్య చేసిన ప్రతీవాడు ఇలాగే చెబుతాడు లెండి. ఇంకో విషయం మా అనుమతి లేకుండా ఊరు దాటి వెళ్ళకండి." "అలాగే కానీ, అరెస్టు చేసే ఉద్దేశం ఉంటే కొంచెం ముందు చెప్పండి. ముందస్తు బెయిలు తెచ్చుకుంటా !" కొంచెం వెటకారంగా చెప్పాడు. బయటకు వచ్చిన నాకు కలెక్టర్ గారి భార్య వచ్చేరన్న ఫోన్ రావడంతో మళ్ళీ కలెక్టర్ గారి ఇంటికి బయలుదేరాను.

***** ***** ***** *****

"మేడమ్. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. మీ వారి హత్య గురించి మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా ?" "నాకు తెలిసి, ఇది ఆత్మహత్య. అతను నాకు తప్ప అందరికీ మంచివాడే. అంచేత అతడిని ఎవరూ హత్య చేసి ఉండరు." చాలా క్యాజువల్ గా చెప్పింది. "కానీ, ఆధారాలు బట్టి చూస్తే ఆత్మహత్య కు అవకాశాలు తక్కువ ఉన్నాయి మేడమ్." "డూప్లికేట్ కీ నా దగ్గర ఉంది కాబట్టి, నా మీద కొంచెం అనుమానం వచ్చేలా చేయడానికి , నన్ను ఇబ్బంది పెట్టడానికి , ఆ లాక్ మీద గుర్తులు అతనే చెరిపేసి ఉండ వచ్చుగా !" ఏమాత్రం భాధ పడకుండా చెప్పింది. "మేడమ్, మీకు ఆయనతో వివాహం అయ్యి ఎన్నాళ్లయ్యింది ?" "సుమారు రెండు సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ నేను అతనితో కలసి ఉన్నది మాత్రం చాలా కొద్ది రోజులే !" "మేడమ్ ఆయనంటే మీకు ఎందుకంత ఏహ్య భావం ?" "ఎందుకంటే, ఆయన ప్రవర్తన.............. " అంటూ అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. అదే సమయంలో నేను బయటకు పంపిన మా ఎస్సై నుంచి అద్భుతమైన సమాచారం అందింది.

***** ***** ***** *****

"చూడు, షణ్ముగం ! నిన్న మధ్యాహ్నం భోజనాలు తర్వాత బయటకు ఎందుకు వెళ్లావ్ ?" అడిగాను వంటవాడిని. "కూరగాయలు తేవడానికి సార్" చెప్పాడు ఏమాత్రం తడుముకోకుండా. "మరి తాళం చెవి తీసుకుని, దాని డూప్లికేట్ చేయించడానికి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆలీ దగ్గరకు ఎందుకు వెళ్లావ్?" "సార్... అది.. అదీ..." అంటూ నీళ్లు నమల సాగేడు షణ్ముగం. "చూడు షణ్ముగం. ఈ హత్య నువ్వే చేసావని తెలుసు. నిన్న మధ్యాహ్నం భోజనం సమయంలో సర్పంచ్ గారితో కలెక్టర్ గారు గొడవపడడం నువ్వు విన్నావు. ఇదే అదనుగా చేసుకుని నువ్వు ఓ డూప్లి కేట్ తాళం చేయించుకుని, రాత్రి ఎవరికీ తెలియకుండా వెనకనుంచి గోడ దూకి గది లోపలకి ప్రవేశించావు." ఆశ్చర్యంగా వింటున్నాడు షణ్ముగం. "సరే, ఆ తరువాత ఏం జరిగిందో నువ్వు చెప్పు. నేరం ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది." చెప్పాను షణ్ముగానికి. "చెబుతాను సార్. అంతా తెలిసిపోయాక నేను మాత్రం దాచేది ఏముంది ? వెనుక నుంచి వచ్చిన నేను, ఈ నేరం వేరే వాళ్ళ మీదకు అనుమానం వచ్చేలా సీసీ టీవీ వైర్లు కట్ చేసేను.

తరువాత నా వద్ద ఉన్న డూప్లికేట్ తాళంతో అయ్యగారి తలుపు తీసేను. ఆ సమయంలో చేతిలో కత్తితో వచ్చిన నన్ను చూసి, ఆశ్చర్యపోయిన అయ్యగారు వెంటనే రివాల్వర్ నాకు గురిపెట్టారు. నేను ఒక్క అంగలో తప్పించుకుని, ఆయనను ఒడిసి పట్టుకుని, ఆయన చెత్తోనే ఆయన కణత మీద కాల్చుకొనేలా చేసి, ఉదయం తీసుకున్న అసలు తాళం డైనింగ్ టేబుల్ మీద పడేసి, లోపల నుంచి డోర్ బటన్ నొక్కి, డోర్ బయటనుండి వేసి వాటిమీద వేలిముద్రలు చెరిపేసిమళ్ళీ వచ్చిన దోవలోనే వెళ్లి పోయాను." తల వంచుకుని చెప్పాడు షణ్ముగం. "ఔనూ, కలెక్టర్ గారిని చంపవలసిన అవసరం నీకు ఎందుకొచ్చింది ? ఎవరైనా డబ్బులు ఇస్తామంటే, ఆశపడి ఈ హత్య చేసావా ? " "ఎవరి ప్రోద్బలం లేదు సార్. నా ఆత్మాభి మానం దెబ్బతిని ఇది నేనే చేసాను." "ఏం జరిగిందో పూర్తిగా చెప్పు." "సార్, అయన వలన నేను చాలా మానసిక వేదన అనుభవించాను సార్. చాలా రోజులుగా అయ్యగారు నాకు ఇష్టం లేని ఓ పని చెయ్యమని బలవంతం చేస్తూ ఉండడంతో వేరే దారి లేక అయిష్టంగానే ఒప్పుకొనేవాడిని.

ఒప్పుకోక పోతే ఉద్యోగం తీసేస్తానని, ఏదో కేసులో ఇరికించి జైలుకు పంపిస్తాననీ, నా భార్యా పిల్లలును చంపించేస్తానని కూడా బెదిరించేవారు. నిన్న ఉదయం కూడా దీని గురించే గొడవయ్యింది. అందుకే ఇక దీనికి ముగింపు పలకాలని ఈ హత్య చేసాను సార్." చెప్పాడు షణ్ముగం. "ఇంతకీ నీకు ఇష్టంలేని ఆ పని ఏమిటి ?" అడిగాను, అతని నోటితో చెప్పించాలని. "సార్, అది..............." అంటూ నా చెవిలో రహస్యంగా చెప్పాడు షణ్ముగం. "సరే అతడిని అదుపులోకి తీసుకోండి" అని బయట ఉన్న మా స్టాప్ కి చెప్పి కమీషనర్ ఆఫీసుకు బయలుదేరాను.

***** ***** ***** *****

"వెల్ డన్ మై డియర్. చాలా త్వరగా కేసుని సాల్వ్ చేసావు. ఔనూ నాకో డౌట్ ? కలెక్టర్ ది ఆత్మహత్య కాదని ఎలా తెలుసు కున్నావు ?" అడిగారు కమీషనర్ గారు, ఇది ఆత్మహత్య కాదు అని నేను చెప్పగానే. "సార్, వాచ్ మేన్ ఢాంఢాం అని రెండు సార్లు శబ్దం విన్నాను అని చెప్పడంతో అనుమానం వచ్చింది. ఆత్మహత్య చేసుకొనే వాడు రెండు సార్లు పేల్చుకోలేడు కదా? అలాగే గదిలో దొరికిన రెండు రివాల్వర్ తూటాలు, డోర్ లాక్ మీద ఆయన వేలిముద్రలు చెరిపేయడం చూసి ఇది ఆత్మహత్య కాదని నిశ్చయించుకున్నా." "గుడ్. మరి ఆ తాళం చెవి మీ ఎస్సై కి ఇవ్వడంలో నీ ఆంతర్యం ?"" "సార్, ఆ తాళం చెవి చేత్తో తీయగానే నాకు సబ్బు వాసన వచ్చింది. అంటే ఎవరో సబ్బు మీద ఎవరో దీనిని అదిమి డూప్లికేట్ చేయించారు అని అనుమానించా. వెంటనే మన ఎస్సైని ఆ పనిమీద పురమాయించా.

రైల్వే స్టేషన్ సీసీ టీవీలో ఈ షణ్ముగం ఆలీ వద్ద డూప్లికేట్ తాళం తయారు చేయించుకున్న దృశ్యాలు నమోదు అయ్యాయి." "మరి షణ్ముగం అర్ధరాత్రి గోడదూకి కలెక్టర్ ఇంట్లో ప్రవేశించాడని ఎలా తెలిసింది ?" "కలెక్టర్ ఇంటి వెనక కొన్ని ఇళ్ళ వద్ద ఉన్న సీసీ టీవీల్లో అర్ధరాత్రి అతను వస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి సార్." "వెరీగుడ్. సరే ఇంతకీ ఈ షణ్ముగం, కలెక్టర్ గారిని ఎందుకు హత్య చేసాడుట ?" "సార్, కలెక్టర్ గారిని ఆయన భార్య విభేదించడానికీ, అలాగే షణ్ముగం హత్య చేయడానికి కారణం... ఆయనకున్న ఓ బలహీనత సార్." "బలహీనతా ? ఏమిటది ? " అడిగారు కమీషనర్ గారు. దగ్గరకు వెళ్లి, కమీషనర్ గారి చెవిలో నెమ్మదిగా చెప్పాను, "సార్, ఆయన ఓ హోమోసెక్సువల్ అదే స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ వ్యక్తి".

మరిన్ని కథలు

murthy uncle
మూర్తి బాబయ్య
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
kaamini
కామిని
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
Smoke stick
అగ్గి పుల్ల
- అఖిలాశ
Punishment in discipline
క్రమశిక్షణ లో శిక్ష
- కందర్ప మూర్తి
dont leave you too..!
నేను మిమ్మల్నీవదలా...!
- బొందల నాగేశ్వరరావు
Sister Value (Children's Story)
చెల్లెలి విలువ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు‌