శ్రీమతి డైరీ - పి.వి.వి.లక్ష్మీ కుమారి

srimati dairy

"ఏమిటో పొద్దు పొడవక మునుపే నిద్ర లేవాలి, ఇంటి పని చూసుకుంటూనే ,పిల్లల్ని స్కూల్ కి తయారు చేసి పంపించాలి . ఈయన్ని ఆఫీస్ కు పంపించాలి తరువాత ఇంట్లో పని చూసుకోవాలి.

ఇహ నాకు తీరిక ఎక్కడుంటుంది " అనుకుంటూనే తనని తానే ఓదార్చుకుంటూ,మనోధైర్యం నింపుకుంటూ రోజులాగే తన పనుల్లో నిమగ్నమైయింది రోహిణి. సహనానికి తానే మారుపేరు అనేలా. కాలం వేగంగా గుడుస్తూనే ఉంది, తన పని తాను చేసుకు పోవాలన్నట్లుగా. తను ఎంతగా అంటే ఒక్కోసారి భోజనం కూడా చేయలేనంతగా. అలా మంచంపైన ఒక్క క్షణం నడుము వాల్చింది.

తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది రోహిణి. పిల్లల పిలుపుతో మేలుక్కొంది. మళ్ళీ దైనందిన జీవితం మామూలేగా పిల్లలతో హోమ్ వర్కు చేయించి, పిల్లలకు భోజనం తినిపించి, వాళ్ళను నిద్ర బుచ్చి ,తను స్నానానికి వెళ్ళింది. తాను వచ్చేసరికి మల్లెపూల పరిమళంతో తన భర్త ఎదుట నిలిచాడు. అలసిన శరీరం. మానశికంగా సిద్దంగా లేదు. అయినా తన మనసు ఎరిగి ప్రేమగా లాలనగా దగ్గరకు తీసే మనస్తత్వం తన భర్తలో లేదు .

అది తెలిసి తన నుండి ఏమీ ఆశించదు రొహిణి. కనీసం తిన్నావా !లేదా !అని కూడా అడగడు. ఆదివారం పూటైనా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఐనా ఉండనివ్వరు . కానీ ఇలా తన అవసరానికి తను తన శరీరం తనకి రోజు ఇస్తూనే ఉండాలి . ఇదేనేమో స్త్రీకి వరము, శాపము రెండూనూ. అద్దం ముందు గొనుకుంటున్న భార్యని " ఏమిటో అలా అద్దానికే చెప్పుకుంటున్నావు కాస్త నాకు చెప్పొచ్చు కదా విషయం ఏమిటో " అంటూ తనని హత్తుకుని తన మురిపెం కానిచ్చాడు...

ఏదొ తన శరీర తాపం తగ్గించుకునే ప్రయత్నంలో మాత్రమే. ఇది దాంపత్యంలో ని సుఖం కాదని తెలిసి కూడా. ఈయన మంచివారు కాదని కాదు కానీ నా మనసేరిగిన వాడు ఐతే కాదు. ఐనా ఏంచేస్తాము !అనుకుంటూ తన మనసుకి తానే సర్దిచెప్పుకుంది రోహిణి.

*****

ఇంకా తెల్లవారక ముందే ఫోన్ రింగ్ కావటంతో నిద్ర లేచింది . "హలో" అంది రోహిణి "అమ్మకి బాగోలేదు "అంటూ తన చెల్లి మాటలకు మనసులోని దుఃఖం తన్నుకు వస్తున్నా పంటి బిగువున అదిమేస్తూ "ఇదిగో ఇప్పుడే వస్తున్నా" అంటూ ఫోన్ పెట్టేసి

"ఏవండి నేను మా అమ్మ వారింటికి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకుని రేపటికి ఉండి ఎలుండి వచ్చేస్తాను మీరు జాగ్రత్త " అంటూ హడావిడిగా ఊరికి బయల్దేరి వెళ్ళింది రోహిణి. ఆరోజు అంతా వెలితిగా అనిపించింది భార్య లేక రోహిణి భర్తకు. పెళ్లయిన ఎనిమిది సంవత్సరాలు . తనని పిల్లల్ని వదిలి పెద్దగా ఎక్కడికి వెళ్లలేదు. తను దూరం గా ఉన్న రోజు కూడా లేదు. నేడు తను దూరంగా ఉన్నదన్న ఊసే మనసును కలచి వేస్తుందనుకుంటూ భార్య ఆలోచనలో పడ్డాడు.

రోహిణి తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఏలోటు అనిపించలేదు. చాలా బాగా చూసుకుంటుంది. కానీ రోజు అద్దం ముందు తనలో తానే ఏదో మాట్లాడుకుంటుంది.అదేమిటో అనుకుంటూ , పక్కనే ఉన్న డెస్కు తెరవగానే రోహిణి డైరీ కనిపించింది.సదరు రోహిణి భర్తకు. తెరిచి చదవకూడదు అనే ఆలోచనే వదిలేసి , ఆత్రంగా లోపలి అక్షరాలు వెంట చూపులను పరుగు తీయించాడు.

"నా భర్త చాలా మంచివాడు., కానీ !నేను అనుకున్న జీవితానికి తగ్గినట్టుగా ఉండరు. సరదాగా బయటికి తీసుకు వెళ్లడం, కబుర్లు చెప్పుకోవడం చెయ్యలేరు. ముఖ్యంగా నాకు పెళ్లికి ముందున్న కోరిక కూడా నెరవేరలేదు పెద్ద పెద్ద కోరికలు ఏమీ కావు అవి సగటు స్త్రీ కి ఉండే చిన్న చిన్న సరదాలు మాత్రమే దాంపత్యంలో ఆస్వాదించాలనుకునే కొన్ని మధుర క్షణాలు "ఐ మిస్ మై లైఫ్ "రోహిణి రాసుకుంది.

అదేంటి అని ఆతృతగా చదవ సాగాడు వారం మొత్తం నావాళ్ళకు తగ్గట్టుగానే అన్నీబాగా చేసిపెడతాను కదా! కనీసం ఆదివారంనాడు అయినా నాకు ఇష్టం వచ్చినట్టుగా గడిపితే ఎంత బాగుండునో కదా.? పెళ్లికి ముందు ఎంతగా ఉహించుకున్నానో దాంపత్య జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటూ.....కానీ.......???.

పగలంతా పనితో అలసిన శరీరం ఉదయం కాస్త బద్దకం లేవాలని ఉన్నా సహకరించని శరీరం అటువంటి సమయంలో నాకు ఇష్టమైన బ్రు కాఫీతో మావారు నా ఎదుట నిల్చుంటే ఎంత బాగుంటుందో! అనుకునే పసి మనస్థత్వం నాది" చదువుతున్న భర్త మనసులో దాగిన మానవత్వంను తట్టి లేపింది రొహిణి డైరీలోని అక్షరం. తన చిన్న చిన్న కోరికలను తీరని నిరాశతో రాసుకున్న అక్షరాలను అతను చదివాక. ఛా !నేను మరీ ఇలా ఉన్నానా?

నిజమే రోహిణీ అన్నట్టుగా తాను పక్కనుండి వడ్డిస్తుంటే నువ్వు తిన్నావా! అని ఏరోజు అడగలేదు. బయటికేద్దామండి అని తాను అడిగినప్పుడల్లా, డబ్బులిచ్చి "నువ్వు వెళ్ళు" అనే వాడినే గాని దగ్గరుండి ఎప్పుడూ తీసుకెళ్లిందిలేదు. అనుకుంటూ తనలో తాను చాలా మధన పడ్డాడు. రోహిణి వచ్చాక తాను అనుకున్నట్టుగా ఆదివారం శ్రీమతికి ధైనందన జీవితంలోని బిజీకి సెలవు ఇచ్చి తను అనుకున్నట్టుగా మారి , తనను సంతోషంగా ఉంచేలా చూడాలి అనుకున్నాడు సదరు భర్త. రోహిణి రాగానే "మీ అమ్మగార్కి ఎలా ఉంది " అని అడిగిన తన భర్తకి "బాగానే వుందండి" కాకపోతే షుగర్ ఎక్కువైంది. మా చెల్లి గురించే తన బెంగ ఆంతా. మీకు తెలిసిందే కదా! తాను కాస్త నలుపుగా ఉంటాది కదా! మొన్న వచ్చిన సంబంధం కూడా కుదరలేదని అమ్మ బాగా దిగులు పెట్టేసుకుందండీ .

డాక్టర్ గారు చూసి మందులు రాసిచ్చారు. మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను" అని కన్నీటిని ఆపుకుంటూ చెప్పింది రోహిణి. సరేలే బాధ పడకు ! మీ చెల్లికి సంబంధం నేను చూస్తాను " అని ఓదార్పుగా మాట్లాడిన తన భర్త వైపు చూసి అలాగేనండి అంటూ కనులను తుడుచుకుంటూ ఇంటిపనిలో నిమగ్నమయింది రోహిణి. మరునాడు ఉదయం తాను డైరీలో రాసుకున్నట్టుగానే తనకు ఇష్టమైన బ్రు కాఫీతో తన ముందు నిలుచున్న భర్తను చూస్తూ ఇది కలా !నిజమా !అనుకుంటూ భర్త ఇచ్చిన కాఫీ తాగుతూ అలా చూస్తూ వుండి పోయింది

రోహిణి. త్వరగా రెఢీ అయితే !అలా బయటికి వెలుద్దాము. కాస్త నీకు రిలీఫ్ గా ఉంటుందేమో అన్న భర్త మాటలకు ఈ లోకంలోని వచ్చింది. కాఫీ కమ్మదనం నుండి బలవంతంగా బయటకు వస్తూ ఏమిటీ ఈయన మావారేనా! ఏమిటీ కొత్తమార్పు నేను ఊరికి వెళ్ళాక నా డైరీ ఏమైనా చదివారా? అనుకుంటూ ఏమిటండి ఈ రోజు ఏమైనా స్పెషల్ ఉందా! అని అడిగింది రోహిణి. ఆమె మాటకు అవును స్పెషల్ ఉంది.

ఇకనుంచి ఆదివారం పూటైనా మా శ్రీమతికి సెలవు ఇద్దాము అని ఓ నిర్ణయానికి వచ్చానోయ్ శ్రీమతి అదే స్పెషల్, అంటూ నవ్వుతూ రోహిణి ని గట్టిగా వాటేసుకుని నన్ను క్షమించు రోహిణి నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు ఈ క్షణం నుండి నీ సంతోషమే నా సంతోషం అంటూ మాట ఇస్తున్న తన భర్త వైపు చూస్తూ మురిసిపోయింది రోహిణీ. తన చిన్న చిన్న కోర్కెలు తీరుతునందుకు తనని తన భర్త అర్ధం చేసుకునందుకు రోహిణి చాలా సంతోషించింది. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ఇరువురి మనసులు కలవాలి అనుకున్న తన మాట నెరవేరింది. కొత్త జీవితానికి శ్రీకారం దిద్దిన తన డైరీని మనసులో తలచుకుంది రోహిణి.

మరిన్ని కథలు

Nagisheela chetikarra
నగిషీల చేతికర్ర
- కందర్ప మూర్తి
Bratuku bali cheyaku
బ్రతుకు బలిచేయకు
- చెన్నూరి సుదర్శన్
Aa kondari valana
ఆ కొందరి వలన
- గంగాధర్ వడ్లమన్నాటి
Chilipi Malathi
చిలిపి మాలతి
- అమ్జద్.
Vammu kaani nammakam
వమ్ముకాని నమ్మకం
- బుద్ధవరపు కామేశ్వరరావు
Kotula naduma
కోతులనడుమ (కామెడీ కథ)
- చెన్నూరి సుదర్శన్
Tandri korke teerchina tanayudu
తండ్రి కోర్కె తీర్చిన తనయుడు
- కొత్తపల్లి ఉదయబాబు