క్రమశిక్షణ లో శిక్ష - కందర్ప మూర్తి

Punishment in discipline

మిలిటరీ రిటైర్డ్ కల్నల్ రంగనాథ్ గారి బంగళా అది.

ఆయన మిలిటరీ నుంచి రిటైర్ అయినా అదే క్రమ శిక్షణ పాటిస్తారు. చైనా, పాకిస్థాన్ తో ఇండియా కు జరిగిన యుద్ధాల్లో పాల్గొని అనేక సాహస మెడల్సు పొందారు.భారీ ఎత్తైన శరీరం గుబురు మీసాలతో ఠీవిగా కనబడతారు. కల్నల్ గారి బంగళాలో పని చేసే నౌకర్లు , కారు డ్రైవరు , సెక్యూరిటీ నేపాలీ గూర్ఖా బహదుర్ అందరూ ఆయన క్రమశిక్షణకు భయపడుతూ విధులు నిర్వర్తిస్తున్నా వారి ఉదార గుణాన్ని మెచ్చుకుంటారు.పండగలు, పుట్టిన రోజులు, దేశ జాతీయ పర్వ దినాలప్పుడు స్టాఫ్ అందరికీ నగదు బహుమతులు,మిఠాయిలూ , నూతన వస్త్రాలు పంచి పెడతారు.ఎవరైన విధినిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం సహించరు. కల్నల్ మిలిటరీ సర్వీసు చేసి రిటైరైనా ఆధ్యాత్మిక సనాతన సంప్ర దాయాల్ని పాటిస్తూంటారు.

వాస్తు జ్యోతిష్య విషయాలకు ప్రాధాన్య మిస్తారు. పర్యావరణ పరిసరాల శుభ్రత కోరుకుంటారు.బంగళాలో రకరకాల పూలమొక్కలు ,ఫలవృక్షాలు పెంచి పక్షుల కోసం గూళ్లు, తినడానికి తిండి గింజలు వేయిస్తారు.అందువల్ల రకరకాల పక్షుల కిరకిలా రావాలతో బంగళా పరిసరాలు సందడిగా కనబడతాయి. ఆయన దినచర్య ప్రకారం తెల్లవారుజామున లేచి కాలకృత్యాల అనంతరం యోగ ధ్యానం తర్వాత తెల్లని టి షర్టు, తెల్లని ఫ్యాంటు ఇన్షర్టు చేసి వైట్ సాక్సు స్పోట్సు షూ తో చేతిలో స్టిక్ పట్టుకుని ఆల్సేషియన్ డాగ్ జిమ్మీ వెంట రాగా మోర్నింగ్ వాక్ మొదలెడతారు.

దారిలో రోడ్డు మీద ఎక్కడైన చెత్తా చెదారం కనబడితే మున్సిపల్ వర్కర్ల చేత శుభ్రం చేయిస్తారు. గేరేజిలో తన కారును తనే నీటి గొట్టంతో కడుగుతారు.మన పని మనం చేసుకోడానికి సిగ్గు పడకూడ దంటారు.నీటిని వ్యర్థం చెయ్యకుండ పొదుపుగా వాడుకోవాలని, వాన నీటి కోసం భూమిలో కుంటలు తవ్వించి ఆ నీటిని గార్డెన్ కి ఉపయోగిస్తూంటారు. రంగనాథ్ గారి ఏకైక పుత్రుడు పైలట్ ఆఫీసర్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్సులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒకరోజు ఆర్మీ హెడ్ క్వార్టర్సు నుంచి మాజీ సైనికోద్యోగుల సమ్మేళణానికి డిల్లీకి రావల్సిందిగా సమాచారం వచ్చింది.మర్నాడు ఉదయం డిల్లీ ఫ్లైటుకి టికెట్ బుక్కయింది.

అనుకున్న ప్రకారం మర్నాడు ఉదయం గేరేజి నుంచి డ్రైవర్ కారు తీసుకు రాగా,కల్నల్ గారు వెనక సీట్లో కూర్చొని ఆరోజు ఇంగ్లీషు పేపరు చూస్తున్నారు. కారు మైన్ గేటు దగ్గరకు రాగానే నైట్ వాచ్ మేన్ గూర్ఖా నరబహదుర్ నిలబడి సెల్యూట్ చేసి కారు డ్రైవర్ని ఆపమని చేత్తో సంజ్ఞ చేసాడు.కారు ఆగిపోయింది. కారు అద్దాలు కిందకు దించి ఏమిటి విషయమని కల్నల్ గారు అడిగారు.

" సాబ్, ఈరోజు మీ విమాన ప్రయాణం కేన్సిల్ చేసుకోండి,మీరు ప్రయాణం చేయబోయే విమానం ప్రమాదానికి గురవుతుంది " అని హిందీలో చెప్పాడు . అసలే సనాతన సంప్రదాయాల పట్ల నమ్మక మున్న కల్నల్ గారు అశుభ సూచకమని తలిచి కారును వెనక్కి తిప్పమని డ్రైవరుకి చెప్పి కారు దిగి హాల్లో సోఫాలో కూర్చున్నారు. ప్రయాణం మానుకుని వెనక్కి తిరిగి వచ్చి హాల్లో కూర్చున్న కల్నల్ గార్ని ఆశ్చర్యంగా చూస్తున్న భార్యకు జరిగిన విషయం చెప్పారు.

ఇంతలో టీ.వి.లో వార్తలు చూస్తున్న కల్నల్ గారికి బ్రేకింగ్ న్యూస్ అని ' హైదరాబాదు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు డిల్లీ బయలు దేరిన జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ గ్రౌండు నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే సాంకేతిక లోపం వల్ల క్రాషయి అందులోని ప్రయాణీకు లందరూ చనిపోయి ఉంటారని సమాచారం , సహాయక చర్యలు కొనసాగుతున్నాయి 'అంటూ వార్తలు సాగుతున్నాయి.

టీ.వీ.లో వచ్చిన విషాద వార్త విని కల్నల గారు నిర్ఘాంత పోయారు. వెంటనే నౌకర్ని పిలిచి మైన్ గేటు దగ్గర ఉండమని చెప్పి నైట్ వాచ్ మేన్ గూర్ఖా నరబహదుర్ ని పిలిపించి " నీకు ఈ ఉదయం ఫ్లైటు క్రాష్ అవు తుందని ఎలా తెల్సింది " అని నిలదీసారు. కల్నల్ గారి క్రమశిక్షణ గురించి తెలిసిన బహదుర్ భయపడుతూ " తను నేపాలీ లామా దేవత ఉపాసకుడినని, ఆదేవత అనుగ్రహంవల్ల తనకు దగ్గరలో జరగబోయే దుస్సంఘటనలు కలలో కొస్తాయని , జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుందనీ గతంలో వచ్చిన కొన్ని కలలు నిజమయాయనీ చెబుతూ ఈరోజు మీరు డిల్లీకి వెళ్లే ఫ్లైటుకి ప్రమాదం జరుగుతుందని నిద్రలో పీడకల వచ్చింది.

అందుకే మిమ్మల్ని ప్రయాణం మానుకో మన్నాను."అంటూ రాత్రి నిద్రలో వచ్చిన కల వృత్తాంతం హిందీలో వివరించి చెప్పాడు. కల్నల్ గారు ఒకవైపు పెద్ద ప్రాణాపాయం నుంచి బయట పడ్డానని ఆనంద పడుతూనే " దీన్ని బట్టి నువ్వు నైట్ డ్యూటీలో పడుకున్నావని తెలుస్తోంది.నైట్ డ్యూటీ అంటే చాలా ఎలర్టుగా ఉండాలి.దేశ సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద నైట్ డ్యూటీ చేసే సెంట్రీ మీద అక్కడ బంకర్లలో సేదతీరుతున్న సైనికుల ప్రాణాలు రక్షింప బడతాయి. నైట్ డ్యూటీలో ఏమాత్రం అలసత్వం కనబరిచినా శత్రు సైనికుల వల్ల ఎన్నో అనర్దాలు జరిగే అవకాశముంది. నువ్వు నన్ను విమాన ప్రమాదం నుంచి రక్షించావు కాని రాత్రి డ్యూటీ సమయంలో నిద్రపోయి విధుల్లోఅలక్ష్యం చేసావు కనుక నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను.

నీకు బహుమతి గా కొంత డబ్బు ఇస్తున్నాను. ఏ తప్పు జరిగినా సహిస్తాను కానీ విధుల్లో నిర్లక్ష్యం ,దొంగతనం మాత్రం సహించను "అని తన మిలిటరీ క్రమశిక్షణ అమలు పరిచారు కల్నల్ రామనాథ్.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి