*కంటేనే కొడుకులా?!* - భాగవతుల భారతి

Than a son

" వేదవల్లిగారు పోయారటండీ"! చెప్తుంటే కళావతి గారి గొంతు భారం గా వుంది. "అయ్యో! రాత్రి బాగానే వున్నారు కదండీ. ఇంతలో ఏమయింది" నా గొంతులో నూ వణుకు. "ఎప్పటిలా లేస్తూనే సుగుణ వేదవల్లి గారి గదిలోకి వెళ్ళి చూస్తే, మనిషి ఎగ ఊపిరి, దిగ ఊపిరిగా వుందట. విషయం అర్ధమై, "తొందరగా అమ్మ గదికి రండి" అని సుగుణ వేసిన కేకకు పరుగు పరుగున వచ్చిన ఫరీదు చేతుల్లోనే ప్రాణం వదిలేసారట" "ఏ జన్మ బుుణమో!" అనుకుంటుంటే నిట్టూర్పు అదే వచ్చింది.

వేదవల్లి గారికి ఏడుపదుల వయస్సు. భర్త శ్రీనివాస్ శర్మ . అందరూ వాసన్ గారని పిలిచేవారు. డిప్యూటీ తహసీల్దారు చేసి రిటైరయ్యారు. నలుగురు కూతుళ్ళు. ఒక్కడే కొడుకు. అందరికీ పెళ్ళెళ్ళయిపోయాయి. కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం. భార్య,ఇద్దరుపిల్లలు. భార్య అమాయకురాలు. అతనేమో వ్యసనాలకు బానిస. లంచంతీసుకుండగా సస్పెండ్ అయ్యి, నానా చికాకు అయింది. చివరికి ఎయిడ్స్ సోకి పోయాడు. పుత్రశోకానికి వాసన్ గారికి మతి స్థిరం తప్పింది. కొంతకాలానికి ఆయనా పోయారు.

ఎప్పుడో కానీ తల్లితండ్రులను చూడ్డానికి రాని కూతుళ్ళు తండ్రి మరణవార్త విన్న వెంటనే మాత్రం వచ్చేరు. ఆయన దహనసంస్కారాల ఖర్చు కూతుళ్ళే భరించాల్సి వచ్చింది. దానికి కారణం ఉంది. కొడుకు వ్యసనాలతో ఇల్లు గుల్ల చేసాడు. కోడలికి వచ్చే పింఛనే ఆధారం. ఇది సాకుగా చూపి, తండ్రి సంపాదించిన ఇల్లు తమ పేర వ్రాయాలన్నారు. కోడలికి కొడుకు ఫించను వస్తుంది కాబట్టి ఆమెకు మెుండి చెయ్యి చూపినా తప్పు లేదన్నారు.‌ విధి లేక ఒప్పుకున్నారు వేదవల్లిగారు. వాసన్ గారి పన్నెండోరోజు కార్యక్రమం అయిపోగానే, కూతుళ్ళుఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

ఇంట్లో ఒక వాటా అద్దె కిచ్చి దాంతో బ్రతకమన్నారు. నెల, నెలా తలో కొంతా పంపుతామన్నారు. కోడలికి కోపంవచ్చి తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో అలా అద్దెకు దిగినవాడే ఫరీద్ ఖాద్రి . ఫరీద్, సుమతి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరిదీ అన్యోన్య దాంపత్యం. ఇద్దరాడపిల్లలు హఫీజా, హంసలేఖ. దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. వేదవల్లి గారికి ఫరీదే దిక్కయ్యాడు.

‌ ఇంటందరితో పాటే పాలు,టీ లూ, ఫలహారాలు, భోజనాలు వేదవల్లి గారి బాధ్యతా సుగుణదే. పిల్లలకైతే వేదవల్లి గారు స్వంత మామ్మే. "నీ ఋణం తీరేది కాదు నాయనా! ఇంక ఇంటద్దె పుచ్చుకుని ఆ పాపం మూటకట్టుకోనా" అని, ఫరీద్ ని ఇంటద్దె ఇవ్వనివ్వలేదు వేదవల్లి గారు. పైగా పండుగలకీ, పబ్బాలకీ పిల్లలకి బట్టలూ, బొమ్మలూ లాంటివి కొనేవారు. ఫరీద్ గురించి ఇంకొంచెం చెప్పాలి. వినాయక చవితి ఉత్సవ సంఘానికి అధ్యక్షుడు ఫరీద్ అన్నే. నవరాత్రులు తొమ్మిదిరోజు లూ అతని కొలువు అక్కడే.

వినాయకుడి ధూపదీప నైవేద్యాల ఏర్పాటు నుండీ, లడ్డూ వేలంపాట వరకూ ఫరీదన్నే . అలాగే దసరా ఉత్సవాలకి అమ్మవారిని కొలువు దీర్చడం మొదలు చీరెల వేలంపాట వరకూ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ప్రసాదం తయారుచేయించడం, పూజారిని ఏర్పాటు చేసి పూజాదికాలు జరిపించడం, అన్న భుజస్కంధాలపైనే. వినాయకుడి,అమ్మవార్ల ఊరేగింపు అన్న ఇంటిముందుఆగినప్పుడుఅక్కడ 'తీన్మార్' జరగాల్సిందే. అలాగే, సుగుణ రంజాన్, మెుహర్రం బ్రహ్మాండంగా చేస్తుంది.

రంజాన్ 'ఇఫ్తార్' విందుకు బజారంతా తరలివెళ్ళాల్సిందే. అలాంటి ఫరీద్, సుగుణా వేదవల్లి గారికి ఆసరాగా వుండడంలో వింతేముంది! ఏదైనా ఊరు వెళ్ళాల్సివస్తే మామ్మగారు ఒక్కరే ఉంటారు భోజనం ఎలా? సుగుణ చెల్లెలు ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి, తోడుంచి వెళ్ళేవారు. ఆమధ్య ఫరీద్ బైపాస్ కి హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది. మరి మామ్మగారు? సుగుణ తన తల్లిని పిలిపించి, ఇంటికీ, వేదవల్లి గారికీ తోడుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చారు. కబురు అందిన కూతుళ్ళు ఒక్కొక్కరూ చేరుకునేసరికి సమయం దాటింది.

ఈ రాత్రి శవజాగరం తప్పదని ఉస్సురుమన్నారు కూతుళ్ళూ, అల్లుళ్ళూ. "ఎవరు కొరివి పెట్టాలి? మావగారి కర్మ‌ నేను చేసాను. మళ్ళీ నేనేనా" పెద్దల్లుడు. "మా అత్త, మామలు బ్రతికే ఉన్నారు.‌ మావారు పనికిరారు" ఆఖరి కూతురు. "సరే. నేనో, వాసుదేవరావో పూనుకుంటాం. ఖర్చుల మాటేమిటి? పోయిన సారంటే ఇల్లొస్తుందన్న ఆశేనావుండేది? ఇప్పుడేముంది. అంతా చేతి చమురే" రెండో అల్లుడు, తన తరఫునా,మూడో అల్లుడి తరఫునా. వింటున్న ఫరీద్ కి మనసు వికలమైంది. సుగుణకు కన్నీరొక్కటే తక్కువ.

"నేనో మాట చెప్పొచ్చా?" సందేహం గానే అడిగాడు ఫరీద్. "మధ్య లో నీ గొడవేమిటి? సరే చెప్పు" అన్నాడు పెద్దల్లుడు విసుగు దాచుకోకుండా. "అయ్యా! నామాట కాదనకండి. దయచేసి అమ్మకు చేయవలసినవన్నీ మీరెవరైనా చేయండి. ఖర్చులు గురించి ఆలోచించకండి. ఎంతయినా నేను భరిస్తాను. ఆయమ్మ నాకూ అమ్మే" చెప్పేడు ఫరీద్. కూతుళ్ళ కి చెంప చెళ్ళు మనిపించి నట్టయింది. అల్లుళ్ళు అవాక్కయ్యారు.

ముందుగా తేరుకున్న పెద్దల్లుడేదో ఏదో అనబోయాడు. ఫరీద్ "అయ్యా! నన్ను పూర్తిగా చెప్పనియ్యండి. ఇది నా డబ్బు కాదు. అమ్మదే. అమ్మ ఏనాడూ ఇంటద్దె ఇవ్వనివ్వలేదు. ఆ డబ్బే మీకిస్తాను." గొంతు వణుకుతుంటే, కన్నీరు ఉబుకుతుంటే, ఎలాగో ముగించాడు. ముఖముఖాలు చూసుకున్నారు. కూతుళ్ళూ, అల్లుళ్ళూ. "ఇల్లు వ్రాయించుకున్నా" ఈ బుద్ధి పుట్టలేదు" అని సిగ్గు పడ్డారు అల్లుళ్ళు. "కన్నతల్లన్న కనికరమైనా లేకపోయింది" అని మనసులోనే లెంపలేసుకున్నారు కూతుళ్ళు. "తాము చేతులు దులిపేసుకున్నా, ఇన్నాళ్లూ అమ్మ, అత్త సుఖంగా బ్రతికిందంటే ఇతని చలవే

" కూతుళ్ళు, అల్లుళ్ళకు ఎవరో వెన్ను చరిచినట్ఠయింది. బొంగురు పోయిన గొంతుకతో పెద్దల్లుడు అనగలిగాడు "అలా కాదులే ఫరీదు. ఖర్చులు మాకొదిలేసి, మిగతా కార్యక్రమం మట్టుకు నువ్వు జరిపించు". "కాదనకన్నా" ఆఖరి కూతురు. ఇంక ఏడుపు ఆపుకోవడం ఫరీద్ వల్ల కాలేదు.

మరిన్ని కథలు

Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం