ఎనిగ్మా - - పి. విక్టర్ విజయ్ కుమార్

ఎనిగ్మా

ఆదిలక్ష్మి మోసపోయేనాటికి తనకి 19 ఏళ్ళు. 18 వ ఏట ఇంటిని పోషించడానికి ప్రింటింగ్ ప్రెస్ లో పని చేయడం మొదలు పెట్టింది. నాన్న మునిసిపల్ వర్కర్. ఇల్లు అనంత పూర్ లో ఒక స్లం లొ ఒక రేకుల షెడ్డు. ఆ ఇల్లు ముఖ్యంగా వాళ్ళ నాన్న తాగి వచ్చాక పడుకోడానికి ఒక జాగా ఇస్తుంది.

ఆదిలక్ష్మికేం తెలుసు ? తాను ప్రేమించిన మనిషిని గాఢంగా ప్రేమించడం తెలుసు. బలిజోళ్ల పిల్లోడు పరిచయం అయ్యాడు. కలిసి నవ్వుకున్నారు. ఓరగా చూసుకున్నరు. తన బేక్ గ్రౌండ్ మర్చిపోయింది అతనితో ఉన్నంత సేపు. తన దైన్యం మర్చిపోయింది అతనితో గడుపున్నంత సేపు. ఒక రోజు ప్రింటింగ్ ప్రెస్ లో తన పేరు మీద ఒక డిజైన్ చేసి ఒక యే ఫోర్ పేపర్ ప్రింట్ చేసాడు. ఆది లక్ష్మి మురిసిపోయింది. ఇప్పటికి అది తన పెట్టెలో పెట్టుకునే ఉంది. ఎవరికన్నా బాధ కలిగితే పది మందికి చెప్పుకుని ఓదార్పు కోరుకునారు. కొన్ని బాధలు బాధ పెట్టిన వాళ్ళకే చెప్పుకునేలా మాత్రమే ఉంటాయి. వాళ్ళే తమ అందుబాటును స్వయంగా దూరం చేసినప్పుడూ మౌనం తో పోరాటం చేయాల్సిందే. కన్నీళ్ళతో దుఖాల పందిరి కట్టుకుని బతుకుంది ఈ రోజుల్లో ఆదిలక్ష్మి.

ఆ అబ్బాయికి 24 ఏళ్ళు. వాడు నవ్వితే కళగా ఉంటాడు. ఆదిలక్ష్మిని ఒక సారి ఒడిలో పెట్టుకుని పెదాలను వేళ్ళతో లాగి ముద్దు పెట్టుకున్నప్పుడు తెలిసింది , తాను అతన్ని ప్రేమించాల్సిన అవసరం చాలా ఉందని. ఒక్క సారి కూడా అమ్మ నాన్న ముద్దు ఎరుగదు. రెండు వందల వందల రుపాయలు పెట్టి తనకో డ్రస్ తెచ్చాడు ఒక రోజు. ఆదిలక్ష్మికి తెలుసు ఆ డబ్బు విలువ. ఆ పిల్లోడికి కూడా ఎవరు లేరు. ఇంట్లో ఏదో గొడవపడి టౌన్ కు వచ్చి బతికేస్తున్నాడు. ఏ బాదరబందీలు లేని జీవితాన్ని లాగిస్తున్నాడు. ఆది లక్ష్మి ప్రేమించేసింది. అప్పుడు తన పేదరికం గుర్తు రాలేదు. తన కులం గుర్తు రాలేదు. తన బాధ్యతలు కూడా గుర్తు తెచ్చుకునే పరిస్థితిలో లేకుండా ప్రేమించేసింది. ఇప్పుడెవర్ని అడుగుతుంది....ఎవర్కి చెప్పుకుంటుంది తనను హటాత్తుగా ఒక రాత్రి వదిలి వెళ్ళిపోయాడని ?!

సరే నా తప్పేమన్నా ఉంటే చెప్పు అని అడుగుదామనుకుంటే ఎక్కడున్నాడో తెలీదు. పోనీ అలాగని తప్పు ఏదైనా సరే కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుందాం అంటే ఆ అవకాశం ఇవ్వకుండా ఎక్కడికెళ్ళాడో కూడా తెలీదు. తన బాధను చెప్పుకుందామనుకున్న మనిషి, తనకు బాధను కలగజేసిన మనిషి తనకు అందుబాటు లో లేకుండ మౌనం కూడా చేరని ప్రదేశం లో ఉంటే తాను మాత్రం ఏం చేయగలదు ?! ఒంటరిగా రోదించడం ఎలానో తెలుసుకోవాని ప్రయత్నం చేస్తుంది. మొదటి సారి అతను కళ్ళల్లో కళ్ళు పెట్టి పెళ్ళి చేసుకుందామన్నప్పుడు , తన జీవితానికి ఒక తోడు దొరికింది అనుకుంది. అయితే ఏదో టౌన్ లో పని చేసుకుంటా బతుక్కుంటున్నాడని అన్నాళ్ళు అబ్బాయిని పట్టించుకోని వాళ్ళ తల్లి తండ్రులు ఒకే సారి పెళ్ళికి సిద్ధమౌతున్నాడు అని తెలిసినప్పుడు హడావిడి చేసారు. ప్రింటింగ్ ప్రెస్ దగ్గర గొడవ పడి లాక్కుని వెళ్ళాలని చూసారు. ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ పెద్ద మనిషి ఒకరు కలుగ జేసుకుని, ఇద్దరిని తీసుకెళ్ళి పోలీసు స్టేషన్ లో పెళ్ళి చేయించాడు. మరుసటి రోజు అన్ని పత్రికల్లో స్టేషన్ ఇన్స్పెక్టర్ గర్వంగా దిగిన ఫోటొతో, ఎస్పీ కులాంతర వివాహం జరిపినందుకు అభినందిస్తున్న ఫొటొతో ప్రచురించబడింది. ఇంకా ఫొటో ఫ్రేం చేసి గోడకు కట్టించుకుని ఉంది . తాను చేసింది సాహసమా ? అని తనను తానే ఎండి పోయిన చెంపల తో ప్రశ్నించుకుంటుంది

ఆది లక్ష్మికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు. పెళ్ళి చేసుకుని అలా ఎలా వదిలి పోతాడు ? తనతో మూడు నెలలు ఒక రూం తీసుకుని కాపురం కూడా పెట్టాడు. ఆదిలక్ష్మి పెళ్ళయ్యాక పని మానేసి ఇంటి పట్టునే కుట్టు పని చేసుకుంటా ఇంటి పని చేసుకుంటా ఉండింది. మూడు నెలలు కాపురం చేసాక హఠాత్తుగా మాయం కావాల్సిన అవరం ఏమొచ్చింది ? అదేదో మొదటి రోజే వెళ్ళిపోవచ్చు కదా ? ఆదిలక్ష్మికి అంతుపట్టటం లేదు. భర్త తోటి వర్కర్స్ ను కనుక్కుంటే ముందు రోజు రాత్రి ఏదో పని ఉంటే ప్రెస్ లో లేట్ గా పని చేసి పది గంటలకు బయట పడ్డాడు . తర్వాత ఎక్కడున్నాడో తెలీదు అని చెప్పడం తో సందేహం వచ్చి వర్కర్స్ వద్ద ఎంక్వైరీ మొదలు పెట్టింది. తన భర్త ఇంటి నుండి పారిపోయి వచ్చాక, ప్రెస్ లో పనికి కుదిర్చిన ఆ అబ్బాయి ఫ్రెండ్ ను కలిసి గోడు వెళ్ళబోసుకుంది. ఆతను వాకబు చేసి తమ ఊరికి వెళ్ళలేదని నిర్ధారిస్తే మరి ఏమయ్యిందో అని బాగా గాభరా పడింది.

ఒక రోజు భర్త ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మేనత్త ఊరు మడకశిర లో ఉన్నడని తెలిపే సరికి ఆదిలక్ష్మి మరింత కంగారు పడింది. తనను పెళ్ళి చేస్కునే ముందు వాళ్ళే గొడవ చేసింది. మేనత్త కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలని ప్రయత్నం లో ఉంటే , ఆమె భర్త ప్రేమ దోమ అంటూ ఆది లక్ష్మిని పెళ్ళి చేసేసుకున్నాడని గొడవ చేసారు. అప్పటికి కొంచెం అర్థం అయ్యింది ఆది లక్ష్మికి. చార్జీకి డబ్బులు కూడా బెట్టుకుని మడక శిరకు వెళ్ళి ఎంక్వైరీ చేసింది. ఆ అబ్బాయి వాళ్ళ అత్త , తామే కిడ్నాప్ చేసామని తన దగ్గరే ఉన్నాడు పిల్లోడు, కాని కలవడానికి వీలు లేదని తెగేసి చెప్పింది. నోట్లో తమలపాకు ఆదిలక్ష్మి కాళ్ళ మీద చిట్లేలా తుప్పున ఊసేసింది. ఆది లక్ష్మి ఒక్క సారి కలపమని కళ్ళ నీళ్ళ ప్రాధేయ పడినా వాళ్ళ అత్త ఒప్పుకోలేదు. చివరికి ఆ అబ్బాయిని తలుపు వెనకాల నిలబెట్టి మాట్లాడించారు . ఏమంటే " నాకు నీ మొహం చూడాలని లేదు. నీవంటే ఇష్టం లేదు " అని మొహం చూడకుండా వెనుక నుండే చెప్పాడు. ఆది లక్ష్మి ఎంత అడిగినా " నాకిష్టం లేదు నీవంటే " అని మరీ మరీ చెప్పాడు.ఆ అబ్బాయి వాళ్ల మేనత్త " నీకు అంత కావాలంటే వాళ్ళ ఊరిలో పంచాయితీ పెడతాం. బత్తలపల్లికి వచ్చి తేల్చుకో " అంది.ఆదిలక్ష్మికి ఏమి పాలు పోక అనంతపూర్ తిరిగి వచ్చేసింది. బస్సు ఎక్కే ముందు ఆ ఊరి బొడ్రాయి దగ్గర కొళాయి ఉంటే అక్కడ కాళ్ళు కడుక్కుంది.

ఇప్పుడు కాపురం చేసిన గదిలో తనొక్కతే ఆ కుట్టు పరికరాలు వేసుకుని గడుపుతుంది. తన భర్త తనతో ఉన్నన్ని నాళ్ళు ఏం చేసాడో తల్చుకుని అంత బాధలో కూడా అప్పు డప్పుడు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గడుపుతుంది. జీవితం పొడవు చాలా పెద్దది. కాని కొన్ని గతుకులు కూడా పెద్ద లోయల్లా అనిపిస్తాయి. అందులోనే జీవితం గడిచి పోయిన అనుభూతి ఒక్కో సారి మన దారి ఎక్కడుందో తెలీనీయదు.

ఆది లక్ష్మి తన భర్త స్నేహితుని ద్వారా పంచాయితీకి రెడీ అని కబురంపింది. తాను ఇంటర్ చదువుతున్న రోజుల్లోఉన్న తన ఫ్రెండ్స్ విద్యార్థి సంఘాల్లో పని చేస్తుంటే వాళ్ళను అడిగి తోడు రమ్మంది. వాళ్ళు తన మితృరాలు అందునా బాధితురాలు అవ్వడం తో ఖచ్చితంగా వెల్దామని డిసైడ్ అయ్యారు.

ఆ రోజు రానే వచ్చింది. అందరు ఆ అబ్బాయి ఊరు బత్తలపల్లికి వెళ్ళారు. వెళ్తానే ఆ ఊరి రెడ్డి ఇంటికెళ్ళారు. ఫ్రెష్ గా ఉన్నాడు. సిల్క్ లుంగీ, చేతి నిండా ఉంగరాలతో ఉన్నాడు. చూసి చూడనట్టు కొత్త ఇల్లు కట్టించుకునే పనిలో మేస్త్రీతో మాట్లాడుతున్నాడు. మధ్యలో కూలీలు ఆగి చెప్పులు చేతిలో పట్టుకుని వంగి దండం పెట్టి వెల్తున్నారు. ఆ ఊరి రెడ్డి అవేమీ పట్టించుకోకుండా సిమెంట్ అనంత పూర్ నుండి ఇంకా ఎంత తెప్పీవాలో లెక్కలు వేస్తున్నాడు. ఆది లక్ష్మి ఆమె ఇంకో ముగ్గురు పిల్లల్తో కలిసి ఆ ఎండలో అట్లాగే నిలబడిఉంది. అతని జవాబు కోసం కాళ్ళు కాలిపోతున్నాయి. ఫొద్దున బస్సు దిగినప్పటి నుండి ఎవరూ అన్నం తినలేదు. కడుపులో ఆకలి మంటలు. వీళ్ళు ఉన్నట్టొ లేనట్టో కూడ రెడ్డి చూట్టం లేదు. మేస్త్రీని పంపాక నెమ్మదిగా రెడ్డి వీళ్ళ వేపు చూసి " ఈ రోజు నాలుగ్గంటలకి రండి. పంచాయితీలో మాట్లాడుదాం " అని చెప్పాడు.

అటు ఇటు తిరిగి బస్ స్టాప్ బంకులొ టీ తాగి కడుపులో వేసుకుని రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే మొత్తం పిల్లోడి కులపోల్లు మొత్తం చేరుకున్నారు. ఒక నలభై మంది గుమి గూడి ఉంటారు. ఆదిలక్ష్మి ముగ్గురు ఫ్రెండ్స్ ఒక వేపు నిల్చున్నారు. రెడ్డి కొంచెం కునుకు పట్టి వచ్చినట్టున్నాడు. ఫ్రెష్ గా మొహం కడుక్కుని, పౌడర్ వేసుకుని మొక్కలకు నీళ్ళు పడతా “ ఏం చెప్పమ్మా “ అని ఆది లక్ష్మిని అడిగితే ఆదిలక్ష్మి మొత్తం గట గట చెప్పింది. అటు పక్క గుంపులో రెండో వరుసలో ఆది లక్ష్మి భర్త ఉన్నాడు. ఆదిలక్ష్మి మొహం కూడా చూట్టం లేదు. ఆర్ధం మొహం మాత్రమే చూపిస్తున్నాడు అందరికి. “ ఏమి రా ఏమి చెప్తావ్ ఆ పాప అన్న దానికి “ అన్నాడు. “ రెడ్డి, మా ప్రెస్ లో మా ఫ్రెండ్ పనిచేస్తాడు. వానితో ఆ పిల్ల పడుకుంది “ అన్నాడు. ఓక్క సారి ఆదిలక్ష్మి గుండెలదిరేలా అరిచింది. “ రేయ్ బాడ్ కోవ్, వచ్చి నా పక్కలో పండుకుని నా లంగ ఇప్పే తప్పుడు తెల్య్య లేదురా నీకివి ?! “ అని. గొంతు జీర పోయింది. రెడ్డి కి విపరీతంగా కోపమొచ్చింది. “ ఏయ్, నా ముందు అరవద్దు. నేనున్నాను చూసుకోడానికి “ అని హుంకరించాడు. మిగతా పిల్లలు నోరు తెరుస్తుంటే ఉరిమి ఉరిమి చూసాడు. రెడ్డి పంచాయితీ వాయిదా వేసాడు. ఆదిలక్ష్మి అంత మంది గుంపులో తనకు ఇంకెవరికో సంబంధం అంటగట్టడం తట్టుకోలేకపోయింది. బస్ స్టాప్ లో, బస్ ఎక్కుతున్నంత సేపు , బస్ లో ఆనంత పూర్ చేరేంత వరకు ఏడుస్తూనె ఉంది. కండక్టర్కు చేతిలో తడిచిపోయిన పది రుపాయల నోటు చూసి ఏమనాలో తెలీలేదు.

పిల్లలందరు బస్ లోనే ప్లాన్ వేసారు. మరుసటి రోజు పాంప్లెట్స్ వేసి, ఎల్లుండి కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వచ్చిన పిల్లల్లో సీనియర్ ఆదిలక్ష్మిని అడిగితే తాను కచ్చగా “ నాకు పాంప్లెట్ రాసీయండి నేనే బోర్డ్ తయారు చేసి ప్రింట్ చేయిస్తా “ అని అన్నది. ఆనంతపూర్ కెల్లగానే పిల్లలు అన్ని సంఘాల పెద్దలను కలిసారు. ఆదిలక్ష్మికళ్ళ నీళ్ళు పెట్టుకునే తనకు జరిగిన అన్యాయాన్ని పాంప్లెట్ బోర్డుగా తయారు చేసింది. ఆ బోర్డు మీద ‘ దోషిని కఠినంగా శిక్షించాలి ‘ అని పూర్తి చేసింది. తనకు అన్నం పెట్టిన ప్రింటింగ్ ప్రెస్ ఈ రోజు తన మానం కాపాడ్డానికి వాడుకుంటుంది. తనలో ప్రేమను పెంచి పోషించిన ప్రింటింగ్ ప్రెస్ బోర్డ్ ను తాను కక్ష తీర్చుకోడానికి వాడుకుంటుంది. తాను ప్రేమించింది న్యాయం కోసమా ? తన కోసమా ? ఆదిలక్ష్మి మనసు సమాధానం వెతికే ప్రశ్నలు ఇవి.

కలెక్టర్ ఆఫీసు ముందు టెంట్ ఆర్డర్ చేసారు. పోలీసు పర్మిషన్ తీసుకున్నారు. అందరికి అహ్వానాలు పంపారు. ఈ రాత్రి ఆదిలక్ష్మి కడుపులో తిప్పుతున్నట్టు ఉంది. పిల్లలు రాత్రి నిద్ర పోకుండా రాత్రంతా ధర్నా ప్రొగ్రాం ప్లాన్ చేస్తున్నారు. ఎవరెవరు పాటలు పాడాలి, ఎవరెవరు స్పీచ్ లు ఇవ్వాలి అని అలోచనలు చేస్తున్నారు.

పొద్దున్నే ఆదిలక్ష్మి వాళ్ళ అమ్మ ఇంటి ముందు నీళ్ళు చల్లుతుంది. ఒక మూల ఆదిలక్ష్మి ఎర్రటి కళ్లతో కూర్చుని ఉంది. పిల్లలు వచ్చి “ ఆదిలక్ష్మి పోదాం పా కలెక్టర్ ఆఫీసుకి “ అన్నారు. ఆది లక్ష్మి నేల చూస్తూ వాళ్ళతో నెమ్మదిగా అనింది “ వాడు చానా మంచోడు. కానీ వాడు ఎందుకో అట్ల ఐనాడు. “ .

ఆదిలక్ష్మి వాళ్ళ అమ్మ విద్యార్థి సంఘాల పిల్లల వంక పని ఆపి చూసింది . ఆది లక్ష్మి మనస్సు అందరికి అర్థమయ్యింది. అయితే ప్రేమ అనే కాన్సెప్ట్ అర్థం అయ్యి అర్థం కాక వాళ్ళ మొహాల్లో ఒక ‘ ఎనిగ్మా ‘ కనిపిస్తుంది.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు