మీమాంస - అనంత పద్మనాభరావు మోచర్ల

meemamsa

“గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధూ కావేరి జలస్మిన్ సన్నిధిం కురు”... రెండు చెంబుల చన్నీళ్ళు నెత్తిమీద కుమ్మరించుకున్నాడు నరహరి. అలవాటులేని చన్నీళ్ళస్నానానికి చలి నరాల్లోకి ప్రాకి వెన్నులో వణుకు పుట్టింది. కార్తీకమాసం మొదటి సోమవారం పూజక్కావాల్సిన ఏర్పాట్లు చేసింది సుమతి. వణుకుతూనే పూజ అయ్యిందనిపించాడు నరహరి. సుమతికి పెళ్లై నాలుగేళ్ళయినా పిల్లలు లేకపోయేసరికి ఒక్క దేవుడైనా కనికరించక పోతాడాఅని దేవుళ్ళందరికీ పూజలు చేస్తోంది, నరహరి చేత కూడా చేయిస్తోంది. భార్యకున్నంత భక్తి లేకపోయినా ఆమె తృప్తి కోసం నరహరి ఏమైనా చేస్తాడు.

కార్తీక పురాణ శ్రవణానికి శంకరమఠం బయల్దేరారు. భక్త జనంతో శంకరమఠం గోలగోలగా వుంది. “మీరు స్కూటర్ పార్క్ చేసిరండి” అంటూ సుమతి లోపలి కెళ్ళింది. పోలీసులు కంట పడకుండా రోడ్డు పక్కన పార్క్ చేసొచ్చి సుమతికోసం చూసాడు. లోపల జనంతో నించోడానికి కూడా చోటులేనట్టుగా ఉంది. గేటు దగ్గరేనిల్చుని సుమతి కోసం చూస్తున్నాడు నరహరి.

“న కార్తికసమో మాస, న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం, న తీర్థం గంగయా సమమ్” స్కందపురాణం ఏం చెపుతోందంటే, కార్తీకమాసానికి సమానమైన మాసము, సత్యయుగంతో సమానమైన యుగము, వేదములతో సమానమైన శాస్త్రము, గంగతో సమమైన తీర్థము లేనే లేవు”... శాస్త్రిగారు గంభీరమైన గొంతుతో కార్తీక పురాణ ప్రవచనం చేస్తున్నారు.

“ఏమోయ్ సుందరం!! ఎలా వుంది రిటైర్డ్ లైఫ్?” గేటు దగ్గరనుంచుని ఓ పెద్దాయన అరుస్తూ సదరు సుందరం అనబడే ఆయన్నిఅడుగుతున్నాడు.

“ఏం చెప్పమంటారు సార్? ఈ మధ్య మా ఆవిడకి ఒంట్లో బాలేదు. కూతురేమో పురిటికొచ్చింది...” సినిమా కష్టాల్లా చెప్తూనే ఉన్నాడా సుందరం గారు...

“చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం”... పురాణం శాస్త్రి గారు కంఠం చించుకుని మరీ చెప్తున్నారు భక్తులకు బాగా వినపడాలని. “అభిషేక ప్రియః శివః” శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగ చేస్తుంది”...పురాణమైతే బాగానే జరగుతోంది. ఎవరి గొడవల్లో వాళ్ళుంటే శ్రవణమే సరిగ్గా జరగడం లేదు. అరగంట నుంచి సుమతి కోసం వెతుకుతున్నాడు నరహరి. విసుగ్గా వుంది. జనం గోలలో శాస్త్రి గారు చెప్పేది చెవిన పడడంలేదు.

“అయ్యో ఖర్మ!! ఇటుకేసి చూడకుండా అటు ఎటో చూస్తారేంటి అడవిమాలోకం?... మిమ్మల్నే ఇలారండి”...చేతులూపుతూ మొగుణ్ణి పిలవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది సుమతి. ఇక లాభం లేదన్నట్టుగా బ్యాగ్ లోంచి మొబైల్ తీసి రింగ్ చేసింది.

“హమ్మయ్యా!! ఏమిటీ! ఇందాకటి నుంచి రకరకాల మిమిక్రిలు, డ్యాన్సులు చేస్తూంటే కనబడడంలేదా? ఎదో పోగొట్టుకున్నట్లు వెతుకుతారేంటి?...ఇప్పటికైనా ఇటుచూసి చావండి!! ఇటు...ఇటు... అబ్బబ్బా! ఇటంటే ఎటో చూస్తారేం?”

“ఇటంటే ఎటే? ఇటు ఇటు అంటే ఎటువైపు చూడాలి? ఎక్కడున్నావు?”

“ఇదిగో! ఇక్కడే!.. మీ కుడివైపు వెనక్కి చూడండి. చెయ్యి ... ఆ చెయ్యి ఉపుతున్నా... ఆ... కనిపించనా! హమ్మయ్యా!! రండి”..

సతీసుమతి భర్తను రక్షించుకునేందుకు ఎంత కష్టపడిందో మనకైతే తెలీదుగాని, ఈ సుమతి మొగుణ్ణి దగ్గరకు రప్పించుకోడానికి చాలానే అవస్థ పడింది.

“కొంచెం జరుగుతారా? భర్తని కుర్చోపెట్టడానికి ప్రక్కవారిని అడుగుతోంది.

“ఇందాకటినుంచి నన్ను గమనించకుండా ఎటువేపో చూస్తూ పరధ్యానంగా ఉంటారేంటి? సరిగ్గా కూర్చోండి. కొంచెం అటు జరగండి. మీరు నాకేసి చూడరు... వీళ్ళేమో... ప్రక్కన కూర్చున్న ఇద్దరాడ వాళ్ళను చూపిస్తూ, నన్ను పురాణం విననీకుండా ఒకటే కబుర్లు...” నరహరి కూర్చున్నాడన్న మాటే కాని, స్థిమితంగా పురాణం వినలేక పోతున్నాడు. వెనక్కితిరిగి చూసాడు. ఆ ఇద్దరాడవాళ్ళు వాళ్ళ ధోరణిలో కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. “నెల రోజుల తర్వాత నిన్న గ్యాసు బండ వచ్చింది. ఎనిమది వందల యాభై రూపాయ లిమ్మన్నాడు. నా గుండాగి పోయినంత పనైంది. అదేంటయ్యా అంతెందుకూ అంటే, గవర్నమెంట్ కొత్త రూలు ప్రకారం సంవత్సరానికి ఆరు బండలే ఇస్తాం, ఆ తర్వాత ప్రతీ బండకి అంత సొమ్మివ్వాల్సిందే అన్నాడు!! మాకు ఆరు బండలెప్పుడయ్యాయో లెక్క పెట్టుకోనేలేదు. ఆ మధ్య వేసంకాలం కరెంటు సరిగ్గా ఇచ్చి చావలేదుగా. వేసంకాలమే కదానని చన్నీళ్ళు పోసుకుంటారా? ఇంటిల్లిపాదికి వేన్నీళ్ళు కావాలి. అన్ని నీళ్ళు కాచి పొసేసరికి అన్ని బండలయినట్లున్నాయి. ఏం చెయ్యను? ఆయనకి చెప్తే తిట్టిపోసి కాస్త పొదుపుగా వాడుకో అంటో ఓ సలహా పడేసారు”...వంద నిట్టూర్పులతో బాధనంతా వెళ్ళ గ్రక్కింది. అప్పటితో ఆ సంభాషణ ఆగుతుందేమో ననుకుంటే ఇంకోఆవిడ “వాళ్లకేం పట్టిందండీ ఈ గొడవలన్నీ? అంత సంపాదిస్తారు, ఇంత మన మొహాన్ని కొడతారు. ఇచ్చిన దాన్లోనే కొంపక్కావల్సినవన్ని తేవాలి. నలభై రూపాయల్లేందే కేజీ కూరముక్క రావడంలేదు. తిండిలో ఏమాత్రం లోటొచ్చినా పీకి పందిరేస్తారు. మొన్నటికిమొన్న కరెంటు బిల్లు చూస్తే షాక్కొట్టినంత పనైంది. ప్రతీనెలా వెయ్యి, పదకొండు వందలొచ్చే బిల్లు ఈ నెల రెండువేల పైచిలుకొచ్చేసరికి శివాలెత్తి పోయారీయన... ఆ మొగ మహారాజు మాత్రం ఎక్కడినుంచి తెస్తాడండీ?”...ఒక ప్రక్కన విసుక్కొంటోనే, మొగుడి మీద జాలి కురిపించింది. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా? అన్నట్లుగా వుంది. మరి తను చేస్తోందేమిటి? పక్కవాళ్ళ సమస్యలు వింటున్నాడు.

ఈ సమస్యలకు ఏ పురాణ శ్రవణం సాంత్వన నిస్తుంది, ఏ దేవుడు పరిష్కరిస్తాడు?.. అటుఇటూ చూసాడు నరహరి. అందరి మొహాల్లో కాకపోయినా కొందరిలో దైన్యం ఆ చీకటివెలుగుల మధ్య ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమస్యల వలయాల్లోంచి కాసేపైనా తప్పించుకోడానికి రక్షణాత్మకంగా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నారా? కామోసు! ఓ సమస్య తీరిందనుకునే లోపలే ఇంకో సమస్య గుమ్మంలో వ్రేలాడుతూనే వుంటుంది. కలియుగంలో ఈ సమస్యలు తీర్చాలంటే ఎంతమంది శివుళ్ళు, ఎంతమంది దేవుళ్ళు రావాలో?... మధ్యతరగతి జీవుల సమస్యలు సమర నాదాలు. కనిపించకుండా వినిపిస్తోనే వుంటాయి కడవరకూ! అసలు ఈ సమస్యల సృష్టికర్త ఎవరు? మనిషా? భగవంతుడా? ఎవరు చెప్పగలరు? కాని ఒక్కటి మాత్రం నిజం. ఏ కష్టమొచ్చినా ఎవరితో ఒకరితో మొర పెట్టుకోడం మానవ సహజం. అందరికి దిక్కు ఆ దేవుడే అనే నమ్మకంతో సమస్యల నుంచి పారిపోయి కాసేపు దైవ సన్నిధిలో ఊరట చెందుదామన్నఆశ. మరి వారు కోరుకున్నది లభిస్తోందా? ప్రశ్నచిన్నదే, సమాధానమే అనుమానస్పదం!! నరహరి ఆలోచన్లకు అంతం లేకుండా వుంది.

“ఏమిటీ ఈ మీమాంస? విపరీతంగా అలోచిస్తున్నా నేమో?” నరహరికి తల నొప్పిగా అనిపించింది. పురాణం ఎలాగూ బుర్రకెక్కడం లేదు. ఇంటికెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఎనిమిదిన్నరయ్యింది టైము. వెళ్దాం పదన్నట్టుగా సుమతిని లేవదీసాడు. జనాల్ని తప్పించుకుని గేటు దాటి బయటకొచ్చారు.

“సుమతి అసలు దేవుడున్నాడా? ఉంటే ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు. అన్నీ మనుషులకే ఎందుకు?

“ఏంటండీ ఆ మాటలు? ముందు లెంపలేసుకోండి. దేవుడు లేకపోతే ఈ సృష్టి, లయ, సరే అంతంత పెద్ద మాటలెందుకు లెండి, అసలు మనం ఎలా ఉంటామండీ? మనకు తెలీని మాటలు మాట్లాడుకోకపోవడం మంచిది.”

“అలాగన్నమాట!! అవున్లే సమస్యలున్న వాళ్ళు, ఏ సమస్యలు లేని నాలాంటి వాళ్ళు కూడా దేవుణ్ణి విసిగిస్తూ ఆయనకు తీరికలేకుండా చేస్తూంటే, ఆయన ఉన్నా లేనట్లుగానే ఉంటాడు.”

“మీకు వేరే సమస్యలేన్టండి? మనకున్నవి చాలవా? వేరే లేవని అనుకోనక్కర్లేదు. ఆయన ఉన్నాడని నిరూపించుకోనక్కర్లేదు. మీ మీమాంస తీర్చడానికి ఆయనే ప్రత్యక్షమవ్వక్కర్లేదు. ఎలాగోలాగ, ఏదో రకంగా...” సుమతి మాటలు వినబడలేదు నరహరికి. కళ్ళ ముందునుంచి వెళ్తోన్న పోలీస్ టోవింగ్ వ్యానులో మూడు బైకులతో పాటు తన స్కూటర్ కనిపించేసరికి “భగవంతుడా!! సమస్యల్లేవన్నంత మాత్రాన వెంటనే సృష్టిస్తావా? ఈ రకంగా నువ్వున్నట్లు నిరూపించుకున్నావా తండ్రీ?.. మీమాంస తీరినట్లుగా అనిపించింది నరహరికి.

మరిన్ని కథలు

Markatapuram-Story picture
మర్కటపురం
- యు.విజయశేఖర రెడ్డి
Daridrudu
దరిద్రుడు
- mahesh amaraneni
Giligadi vachche puligadu chachche
గిలిగాడు వచ్చె-పులిగాడు చచ్చె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kotta jeevitam
కొత్త జీవితం
- చచెన్నూరి సుదర్శన్
Yachakulu kaanidi evaru
యాచకులు కానిది ఎవరు?
- యాచకులు కానిది ఎవరు?.
Vimukti eppudo
విముక్తి ఎప్పుడో!
- రాము కోలా.దెందుకూరు.
Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.